ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలు, 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాలు, 13 మంది జిల్లా కలెక్టర్లు.. మరో 13 మంది గ్రామ సచివాలయ జాయింట్ కలెక్టర్లు.. వీరందరీకి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పదే పదే చెబుతున్నమాట ఒక్కటే ప్రతీ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గుమ్మం వద్దనే స్పందన కార్యక్రమం నిర్వహించమని. సచివాలయ వ్యవస్థ ఏర్పాటై అక్టోబరు 2 వస్తే సరిగ్గా రెండేళ్లు పూర్తవుతుంది. కానీ ఈ కాలంలో సచివాలయాల్లో పూర్తిస్థాయిలో స్పందన ఒక మంచి కార్యక్రమంగా ప్రజలకు చేరువ చేయలేకపోతున్నారంటే తప్పెవరది. సోమవారం వచ్చిందంటే చాలు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు స్పందన అర్జీదారులతో నిండిపోతున్నాయి. వందల సంఖ్యలో వివిధ సమస్యలపై దరఖాస్తులు అధికారుల ముందుకి చేరుతున్నాయి. వేల సంఖ్యలో గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పందన నిర్వహిస్తే ఈ పరిస్థితి వచ్చేదా అంటే కాదనే చెబుతారు సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి. ఎంతో ఉన్నత ఆశయంతో ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందించే సేవలన్నీ సచివాలయాల ద్వారానే అందించాలని సీఎం నెత్తీనోరూ కొట్టుకుంటుంటే జిల్లా కలెక్టర్లు, గ్రామ సచివాలయ జాయింట్ కలెక్టర్లు నిర్లక్ష్యమో తెలీదు గానీ మధ్యాహ్నం 2 నుంచి 5 వరకూ ఒక్క సచివాలయంలో కూడా స్పందన కానరావడం లేదు.
అన్నీ వున్నా అల్లుడినోట్లో శని అన్నట్టుగా తయారైంది ఇపుడు సచివాలయాల పరిస్థితి. ఒకప్పుడు గ్రామపంచాయతీలో ఒక కార్యదర్శి, పెద్ద పంచాయతీ అయితే ఒక జూనియర్ అసిస్టెంటు లేదా, ఒక బిల్ కలెక్టర్ ఉండేవారు. ఇపుడు అదే స్థానంలో గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటైన తరువాత సుమారు 14శాఖల సిబ్బంది అందుబాటులో వున్నా ప్రజలకు సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. ఇవేవో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ న్యూస్ యాప్, www.enslive.net కావాలని అంటున్న మాటలు కాదు. ప్రతీ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో మాత్రమే జరుగుతున్న స్పందన కార్యక్రమంలో నమోదవుతున్న అర్జీలు చెప్పే సంఖ్య. విచిత్రం ఏంటంటే అర్జీదారుడు ఇచ్చే దరఖాస్తుని జిల్లా కలెక్టర్ కి ఇచ్చినా.. సచివాలయంలోని పంచాయతీ కార్యదర్శికి ఇచ్చినా పరిష్కారం అయ్యేది స్థానికంగానే.. ఎందకనో స్పందన అంటే ప్రజలకు కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయమనే గుడ్డి నమ్మకం వచ్చేసింది. దానికి కారణాలు కూడా లేకపోలేదు. ప్రధానంగా రాష్ట్రంలోని మేజర్ పంచాయతీల్లో పనిచేసే గ్రేడ్1,2,3,4 కార్యదర్శిలంతా వారి రాజకీయ సామర్ధ్యాన్ని ఉపయోగించి రెండు మూడు పంచాయతీలకు డిప్యుటేషన్లు, ఇన్చార్జిలు వేయించుకోవడమే. ఇలా అదనపు పనులు తమపై వేసుకొని.. ఉన్న సచివాయాల్లో పూర్తిస్థాయిలో ఉండక, అటు ఇన్చార్జి పంచాయతీలు, సచివాలయాల్లో అందుబాటులో ఉండక స్పందన కార్యక్రమ నిర్వహణ కష్టంగా మారుతోంది. అందులోనూ ప్రస్తుత సచివాలయ ఉద్యోగులు మినహా గతంలో పంచాయతీల్లో పనిచేసే 70శాతం మంతి పంచాయతీ కార్యదర్శిలకు కనీసం కంప్యూటర్ వినియోగం కూడా తెలీదు. దీనితో ఇక్కడకి ఏ సమస్యపై పరిష్కారం కోసం వచ్చినా దరఖాస్తు దారుడు తెచ్చే అర్జీ ఆన్ లైన్ చేసే దిక్కుండేది కాదు. ఇపుడు ప్రతీ గ్రామ సచివాలయాలనికి డిజిటల్ అసిస్టెంట్ తోపాటు మరో 13ప్రభుత్వ శాఖల సిబ్బంది అందుబాటులో వున్నప్పటికీ స్పందన కార్యక్రమం మాత్రం సక్రమంగా జరగడం లేదు.
జిల్లా కలెక్టర్లు, జెసీల ఉత్తుత్తి పర్యటనలు..
సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్లు, జెసిలను తప్పనిసరిగా వారంలో 4 రోజులు సచివాలయాలను సందర్శించాలని ఆదేశించడంతో వారంతా సచివాలయ సందర్శనకు వెళుతున్నారు.. తప్పితే అక్కడ స్పందన జరుగుతున్న తీరుపై ద్రుష్టి పెట్టడం లేదనే విషయం కలెక్టర్ కార్యాలయాలకు వచ్చే అర్జీలే తేటతెల్లం చేస్తున్నాయి. వెళ్లిన ప్రతీసారీ ప్రభుత్వ లక్ష్యాన్ని వల్లెవేస్తున్నారు తప్పితే ఎందుకు స్పందన నిర్వహించడం లేదు.. ఎందుకు గ్రామాల నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి స్పందన దరఖాస్తులు అధికంగా వస్తున్నాయనే కోణంలో దర్యాప్తు చేయడం లేదనే విమర్శలున్నాయి. అందులోనూ కలెక్టర్లు, జెసిలు సచివాలయ సందర్శనకు వెళ్లే ప్రతీసారీ ముందుగా సమాచారం ఇచ్చిగానీ వెళ్లడం లేదు. అలా సమాచారం అందుకున్న సచివాలయ సిబ్బంది కలెక్టర్ వచ్చే సమయానికి అంతా సిద్దం చేసి పనిచేస్తున్నట్టుగా కలరిస్తున్నారు. దీనితో గ్రామాల్లో సచివాలయ సేవలు బాగా అందుతున్నాయని రికార్డు చేసుకొని వచ్చేస్తున్నారు కలెక్టర్లు జేసిలు. ఒక్కసారి అధికారులు మారు వేషంలో వస్తే తప్పా సచివాలయాల్లో ఏం జరుగుతుందనేది బాహ్య ప్రపంచానికి తెలుస్తుంది..
సచివాలయాల్లో అధికారాలు లేని గ్రేడ్-5 కార్యదర్శిలు..
ఒక పక్క సచివాలయాల్లో తెగ పనిచేసేయాలని ఆదేశాలు, ఆగ్రహాలు వ్యక్తం చేసే జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వం సచివాలయాల్లో నియమించిన గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు అధికారాలు ఇచ్చే విషయంలో నేటికీ ఒక నిర్ణయం తీసుకోలేకపోతుంది. జీఓనెంబరు 149 ఆధారంగా మేజర్ పంచాయతీల్లో విభజించిన సచివాలయ పరిధిలు ఆధారంగా అధికారాలు, విధులు, రికార్డులు, ఖజానా చిట్టా విభజించాల్సి వున్నా ప్రభుత్వం మాత్రం నేటికీ ఆపనిచేయలేదు. దీనితో చేతిలో అధికారం లేని గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు తమపరిధిలోనే వారు ఆడుతూ, పాడుతూ పనిచేయాల్సి వస్తుంది. అలాగని కాస్త గట్టిగా పనిచేయాలంటే అధికారాలన్నీ గ్రేడ్-1,2,3,4 కార్యదర్శిల చేతుల్లో ఉండిపోవడంతో తాము చేయడానికి ఏముందని వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రేడ్1 నుంచి గ్రేడ్-5 వరకూ అందరూ పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులమే అయినప్పటికీ కేవలం అధికారాలు మాత్రం గ్రేడ్-1,2,3,4 వాళ్లకు ఇచ్చి ఇతర కార్యాలయ పనులు మాత్రం మాతో చేయిస్తున్నారని వీరంతా ఆవేదన చెందుతున్నారు. చేతిలో అధికారం లేకపోవడంతో సచివాలయంలో పనిచేసే ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది కూడా మాట వినడం లేదని వాపోతున్నారు. ఏ చిన్న పనికోసమైనా సచివాలయం-1లో వుండే గ్రేడ్ 1,2,3,4 కార్యదర్శిల దగ్గరకే వెళ్లాల్సి వస్తుందని, అందులో వారికి డిప్యుటేషన్లు, రెండు మూడు పంచాయతీలు ఇన్చార్జిలు కేటాయింపు జరగడంతో సాధారణ పనులు కూడా పెండింగ్ లో ఉండిపోతున్నాయని అంటున్నారు. ఈ విషయమై ఇప్పటికే మండలంలోని ఎంపీడీఓ, డిపీఓ, జిల్లా కలెక్టర్, ఆఖరికి పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శికి వినతి పత్రాలు సమర్పించినా తమకు అధికార బదలాయింపులు చేయలేదని చెబుతున్నారు. తప్పులన్నీ ప్రభుత్వం దగ్గరే ఉంచుకొని పనిచేయలేదని, స్పందన నిర్వహించలేదని మమ్మల్ని ఎలా నిందిస్తారని గ్రేడ్-5 కార్యదర్శిలంతా ఒంటి కాలిపై లేస్తున్నారు.
ప్రభుత్వం ముందు గ్రామ సచివాలయాల్లోని గ్రేడ్-5 కార్యదర్శిలకు జీఓనెంబరు 149 ఆధారంగా అధికారాలు బదలాయిస్తే తప్పా.. వారి అధికారం వినియోగించి సచివాలయాల్లో స్పందన, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో నిర్వహించే పరిస్థి కనిపించడం లేదు. అటు ముఖ్యమంత్రి ఈ విషయంలో నిర్ణయం తీసుకొని, జిల్లా కలెక్టర్లు, సచివాలయ జాయింట్ కలెక్టర్లకు విశేష అధికారాలు కల్పిస్తే తప్పా ప్రభుత్వం అనుకున్న లక్ష్యం, ఇంటి ముంగిటే స్పందనతో సమస్యలకు పరిష్కారమనే ప్రధాన సమస్య పరిస్కారం అయ్యేట్టట్టు కనిపించడం లేదు. చూడాలి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో..!