1
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి పెనం పై నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది. అక్టోబరు 2వ స్తే సచివాలయాలు ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తవుతుంది. ప్రభుత్వ నిబంధన ప్రకారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 15వేల సచివాలయాల్లోని లక్షా 20 వేల మంది ఉద్యోగుల సర్వీసును ప్రభుత్వం రెగ్యులర్ చేయాల్సి వుంది. అయితే అదే సమయంలో ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ కావాలంటే క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీక్షను పెడతామని, అది పాసైతే ప్రొబేషన్ అన్న ప్రభుత్వం ఇపుడు అలాంటి పరీక్షలేవీ లేవని, పెట్టబోమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేక కార్యదర్శి అజయ్ కల్లాం ప్రకటించి ఇక్కడో మెలిక పెట్టారు. సిబీఏసి పరీక్ష అయితే ఉండదు గానీ.. ఆయా శాఖలకు చెందిన డిపార్ట్ మెంటల్ టెస్టులు పాసవ్వాల్సి వుంటుందని ఇపుడు ప్రకటించారు. వాస్తవానికి 16 ప్రభుత్వ శాఖల్లోని సచివాలయ ఉద్యోగులకు వీరి ఉద్యోగాలకు సంబంధించి శాఖల వారీగా అందరికీ జీఓలు గానీ, గెజిట్ పబ్లికేషన్లు గానీ ప్రచురించలేదు. అలా ఏశాఖ ఉద్యోగులకై గెజిట్ పబ్లికేషన్లు ప్రకటించారో, జీఓవో పలానా శాఖ డిపార్ట్ మెంటల్ టెస్టులు పాసవ్వాలని పెట్టారో ఆ మేరకు కొందరే పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. మరికొందరు తమ సర్వీసులు రెగ్యులర్ అయిన తరువాత పదోన్నతుల కోసం తర్వాత రాసుకుందామని వదిలేశారు. కాలక్రమంలో 2 నెలలు తక్కువ రెండేళ్లు గడిచిపోతున్నాయి. దీనంతో కధ మళ్లీ మొదటికి వచ్చింది. ఇపుడు తాజాగా ప్రభుత్వం సర్వీసు రెగ్యులర్ కావాలంటే సచివాలయ ఉద్యోగులకు నిర్ధేశించిన(ఇప్పటికీ కొందరు ఉద్యోగులకు జీఓలు విడుదలచేయకపోయినా) డిపార్ట్ మెంటల్ పరీక్షలు పాసవ్వాలనేది కొత్త నిబంధన పెట్టారు.వాస్తవానికి రాష్ట్రప్రభుత్వం ఏశాఖలో అయినా రెగ్యులర్ ఉద్యోగాలను భర్తీచేసే సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే ప్రత్యేక జీఓలు విడుదల చేసిన తరువాత వాటి ఆధారంగా భర్తీ కార్యక్రమం చేపడుతుంది. ఆపై గెజిట్ పబ్లికేషన్ చేపట్టి ఏ జీఓ ద్వారా అయితే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారో.. అందులోనే సర్వీసు రెగ్యులర్ కావడానికి ఏఏ డిపార్టమెంటల్ పరీక్షలు రాయాలో పొందుపరుస్తారు. దీనితో ఉద్యోగాల్లోకి చేరిన వారంతా వారి రెండేళ్ల ప్రొబేషన్ కాలంలో నాలుగు సార్లు నిర్వహించే డిపార్ట్ మెంటల్ పరీక్షలను పాసై తమ సర్వీసులను రెండేళ్లు పూర్తికాగానే రెగ్యులర్ చేయించుకుంటారు. కానీ గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని సుమారు 16 రకాల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసే సమయంలో కేవలం గ్రేడ్-5 కార్యదర్శి ఉద్యోగాలకు మాత్రమే గెజిట్ నోటిఫికేషన్(రాజముద్ర) పబ్లిష్ చేసి.. మిగిలిన శాఖ ఉద్యోగుల విషయంలో ఎలాంటి ఉత్తర్వు విడుదల చేయకుండా ఉండిపోయింది. అలా రాజముద్ర విడుదల చేయకపోతే ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా చట్ట బద్ధత ఉండదనేది ఒక అంశంగా చెబుతున్నారు విశ్లేషకులు. ఈ సమయంలోనే ప్రభుత్వం ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ కావాలంటే క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీక్షను పెట్టం కానీ సచివాలయ ఉద్యోగులు డిపార్ట్ మెంటల్ టెస్టులు పాస్ కావాలని చెప్పడంతో... సదరు ఉద్యోగులు డిపార్టమెంటల్ పరీక్షలు పాసైన వారు ఆనందం వ్యక్తం చేస్తుండగా, పరీక్ష రాయని వారు తాము ఆ.. పరీక్షలు పాసయ్యేంత వరకూ రూ.15వేలు జీతంతోనే కాలం వెల్లదీయాలా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు ద్వారా శాఖ పరమైన జీఓలు ఉద్యోగాలు భర్తీ చేసే సమయంలో విడుదల చేస్తాయి. ప్రభుత్వం ఏ నిబంధన ద్వారా అయితే జీలో విడుదల చేసి జిల్లాల్లో కలెక్టర్లకు పంపుతారో దానిని సదరు ప్రభుత్వ శాఖ జిల్లా అధికారులు ఎంపీడీఓ ద్వారా సచివాలయాల్లోని ఉద్యోగులకు జీఓలోని అంశం చేరేటట్టు తెలియజేయాలి. తద్వారా కొత్తగా విధుల్లోకి చేరిన ఉద్యోగాలకు ప్రభుత్వం తమ ఉద్యోగాలకు సంబంధించి ఏఏ నిబంధనలు పెట్టిందో సిబ్బందికి తెలుస్తుంది. కానీ గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల విషయంలో నేటికీ ఆవిధానం అమలు జరగడం లేదు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయలేదు. దీనితో ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఏ ఏ డిపార్ట్ మెంటల్ పరీక్షలు రాయాలో తెలియకుండా పోయింది. ఆ కారణంతోనే చాలా మంది ఉద్యోగులు డిపార్టమెంటల్ పరీక్షలు రాయలేదు. రెండేళ్ల పాటు ఆయా ప్రభుత్వ శాఖల ముఖ్యకార్యదర్శిలు, కమిషనర్లు ఈ విషయంలో లైట్ తీసుకోవడమే ఇపుడు ప్రధాన లోపంగా కనిపిస్తుంది. ఇపుడు 2 నెలల్లో సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ అవుతుందని తెలిసిన వేళ.. సదరు ప్రభుత్వ శాఖల్లో ఏఏ డిపార్టమెంటల్ పరీక్షలు పాసైతేనే మీ సర్వీసులు రెగ్యులర్ అవుతాయని చెప్పడంతో ఉద్యోగుల గుండెల్లో మళ్లీ రాయి పడినట్టు అయ్యింది. ఉద్యోగాల్లోకి చేరి దాదాపు రెండేళ్లు కావొస్తున్న సమయంలో ప్రభుత్వం ఇప్పుడా ఆ డిపార్టమెంట ల్ పరీక్షల కోసం మెలిక పెట్టడమా అని ఉద్యోగులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఖచ్చితంగా డిపార్టమెంటల్ టెస్టులు రెండేళ్ల ప్రొబేషన్ సమయంలోనే పాసవ్వాలనే నిభందన అమలు చేస్తే..ఈ విషయంలో ఆయా ప్రభుత్వశాఖల ముఖ్యకార్యదర్శిలు, జిల్లా కలెక్టర్లు, జిల్లాశాఖల అధికారులదే తప్పు అవుతుంది. కారణమేంటంటే ప్రభుత్వ శాఖలకు సంబంధించిన విధి విధానాలు ఏ జీఓ రూపంలో నేటికీ ప్రభుత్వం విడుదల చేయకపోవడమేనని ఉద్యోగులు బల్లగుద్ది చెబుతున్నారు. అప్పటికీ సమాచార హక్కుచట్టం దరఖాస్తు ద్వారా గ్రామ సంక్షేమ, విద్య సహాయకులు తమ పదోన్నతులు సంగతేంటని కోరినా.. రాష్ట్ర అధికారులే ఇంకా అలాంటి నిబంధనలు, ప్రత్యేక అంశాలు ఇప్పటి వరకూ ప్రభుత్వం ఏమీ పెట్టలేదని, ఒక వేళ పెడితే జిల్లా అధికారుల ద్వారా తెలియజేస్తామని, ఆ సమయంలో వారిని సంప్రదించాలని ఆ సమాచార హక్కుచట్టం దరఖాస్తులో జవాబుగా తెలియజేశారు కూడా. ఈ విషయం ఇప్పటిది కాదు 2020లో జరిగిన సంఘటన ఆ తరువాత కూడా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖల్లో ప్రస్తుత పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే పదోన్నతులు, డిపార్ట్ మెంటల్ టెస్టుల విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇద్దామనుకుంటే సమయం చాలానే ఉండేది. కరోనా సమయంలో కాలం రివ్వున తిరిగిపోయినా.. అధికారులు ఎలాంటి జీఓలు విడుదల చేయలేదు. ఇపుడు తాజాగా సర్వీసులు రెగ్యులర్ కావాలంటే కనీసం డిపార్ట్ మెంటల్ పరీక్షలు పాసవ్వాలని ఎలా చెబుతున్నారో తమకు అర్ధం కావడం లేదని.. జిల్లా శాఖల అధికారులు కూడా ఈ విషయం తమకు నోటీసుల ద్వారా కూడా చెప్పలేదని వాపోతున్నారు. సర్వీసు రెగ్యులర్ లో తమకు అన్యాయం జరిగితే ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం, తప్పులను కోర్టుకి విన్నవించి న్యాయపోరాటం చేస్తామంటున్నారు ఏ సమాచారం లేకుండా డిపార్ట్ మెంట్ పరీక్షలు రాయకుండా ఉండిపోయిన అభ్యర్ధులంతా. నిజంగా అదే జరిగితే అటు రాష్ట్ర స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రభుత్వశాఖల ముఖ్య కార్యదర్శిలు, కమిషనర్, జిల్లా స్థాయిలో కలెక్టర్, సదరు జిల్లా అధికారులు కోర్టుముందు సమాధానం చెప్పాల్సి వస్తుంది. చేసిన తప్పు ఒప్పుకోవాల్సి వస్తుంది. అలాకాకుండా ఇపుడు వారి సర్వీసులను రెగ్యులర్ చేసి.. ఆపై కొంత సమయం ఇస్తున్నట్టు ప్రకటన చేసి అప్పటి కూడా సచివాలయ ఉద్యోగులు డిపార్ట్ మెంటల్ పరీక్షలు పాస్ కాపోతే అపుడు తమపై చర్యలు తీసుకోవచ్చునని ఉద్యోగులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. అటు ఉద్యోగ సంఘాల నేతలు కూడా తమ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెగ్యులర్ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డికి వినతి పత్రాలు సమర్పించారు తప్పితే.. రాష్ట్ర అధికారులు చేసిన తప్పువలన నేటికీ చాలా మంది డిపార్టమెంటల్ పరీక్షలు రాయలేపోయారని, దానికి కారణం వివిధ శాఖల ఉద్యోగులకు నేటికీ పదోన్నతులు, డిపార్ట్ మెంటల్ పరీక్షలు, సర్వీసు రెగ్యులర్ కి సంబంధించి జీఓలు విడుదల చేయలేదని అడగక పోవడం విశేషం. దీనితో గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు మాదిరిగానే అన్ని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శాఖల వారీగా గెజిట్ నోటిఫికేషన్లు, జీఓలు విడుదల చేసి ఒక నిర్ధిష్ట్ ఉత్తర్వులు విడుదల చేస్తే తాము ఈ డిపార్టమెంటల్ పరీక్ష గందర గోళం విషయం నుంచి బయట పడతామని ఉద్యోగులంతా ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం చేసిన తప్పును ఒప్పుకుంటుందా.. నాలుగైదు ప్రభుత్వ శాఖలను కలిపి ఇంజనీరింగ్ అసిస్టెంట్లను, నాలుగు శాఖలను కలిపి విద్యా, సంక్షేమ సహాయకులను, రెండు శాఖలను కలిపి సర్వేయర్ల ఉద్యోగాలు స్రుష్టించడం వలనే ఇప్పటి వరకూ ఏ శాఖ తరపున జీఓలు, గెజిట్లు విడుదలచేయక వదిలేశామని ఒప్పుకుంటారో.. లేదంటే తాము చెప్పకపోయినా ప్రస్తుత ప్రభుత్వ శాఖల జిల్లా అధికారుల నుంచి ఎందుకు మీరు దాదాపు రెండేళ్ల సమయం పూర్తవుతున్నా తెలుసుకోలేకపోయారని ఉద్యోగులపైనే నెపం అంతా నెట్టేస్తుందో..చూడాలి..!