రాష్ట్ర ముఖ్య మంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి మహిళల ఆర్థిక స్వావలంబనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, మహిళా సంక్షమానికి నిరంతరం కృషి చేస్తున్నారని ఉప ముఖ్య మంత్రి పాముల పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. మంగళవారం జియ్యమ్మ వలస మండలంలో రెండవ విడత వై.ఎస్.ఆర్.ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, ఐ.టి.డి.ఏ ప్రోజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎం.పి.పి బొంగు సురేష్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మండలంలో జీవనోపాధికి, హౌసింగ్ బ్యాంక్ లింకేజిద్వారా 323 మంది మహిళలకు కోటి ముప్పది ఐదు లక్షలు రూపాయల విలువ గల చెక్కును, వై.ఎస్.ఆర్.ఆసరా రెండవ విడత క్రింద 1091 సంఘాలలో గల 12266 మంది సభ్యులకు 5.83 కోట్లు రూపాయలు చెక్కులను ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, ప్రోజెక్ట్ అధికారి స్వయం సహాయక సంఘాలు మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతు మహిళా సాధికారతే లక్ష్యంగా వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. నాలుగు విడతలుగా వై.ఎస్.ఆర్.ఆసరా అందజేయడం జరుగుతుందని మాటిచ్చిన ముఖ్యమంత్రి మొదటి విడతగా 630 కోట్లు మీ వ్యక్తిగత ఖాతాలు కమచేయడం జరిగింది. నేడు రెండవ విడతగా సుమారు 600 కోట్లు మీ ఖాతాలలో జమచేయడం జరుగుతుందన్నారు. ఇచ్చిన మాట తప్పక అమలు చేస్తూ మహిళలకు అండగా నిలిచిన ముఖ్య మంత్రి అన్నారు.
మహిళ ద్వారా కుటుంభానికి మంచి జరుగుతుందని గుర్తించిన ముఖ్య మంత్రి వై ఎస్ ఆర్ ఆసరా పథకం ప్రవేశ పెట్టారని మహిళల పై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆసరా సొమ్ముతో పిల్లల చదువులకు, జీవనోపాధి అభివృధికి వినియోగించుకొని ఆర్థికంగా మరింత అభివద్ధి చెందాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సంఘాల సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాలు పథకాలతో ఆర్థికంగా వారి కుటుంబాలు ఎలా అభివృధి చెందాయో సభ్యులు వివరిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మహిళల ఆర్థికాభివృదికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత మన ప్రియతమ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డిదే అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉప ముఖ్య మంత్రితో పాటు వివిధ మహిళా సంఘాల సభ్యులు ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలతో అభిషేకించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్ క్రాంతి పథం ఎ.పి.డి సత్యం నాయుడు, ఎం.పి.డి.ఓ, విజయ లక్ష్మి, తహసిల్దార్ శ్రీరామూర్తి, జెడ్.పి.టి.సి ముడడ్ల శశికళ, సర్పంచ్ రాములు, వైఎస్.ఆర్.సి.పి.నాయకులు, మండలంలో మహిళా సంఘాల సభ్యులు, రెవెన్యూ అధికారులు సిబ్బంది, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.