మద్య విమోచన ప్రచార కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నవంబర్ 1వ తేదీ నుండి డ్రగ్స్,మత్తు పానీయాల పై కళాజాత నిర్వహిస్తామని మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. యువత,విద్యార్థులలో డ్రగ్స్,మత్తు పానీయాల దుష్ఫలితాల పై సాంస్కృతిక కార్యక్రమాలను నవంబర్ 1వ తేదీన కర్నూల్ నుండి ప్రారంభించి 13 జిల్లాలలో పై కళాజాత నిర్వహించి లక్షలాది విద్యార్థిని, విద్యార్థులను చైతన్యవంతులను చేస్తామన్నారు. తన పదవీ కాలాన్ని మరొక ఏడాది పాటు పొడిగించిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి లక్ష్మణరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.రోటరీ క్లబ్ మాజీ గవర్నర్,గుంటూరు రెడ్ క్రాస్ చైర్మన్ వడ్లమాని రవి ప్రసంగిస్తూ లక్ష్మణరెడ్డి గత నలభై సంవత్సరాలుగా సామాజిక రుగ్మతలపై నిరంతరం పోరాడుతున్నారని,1990 వ దశాబ్దంలో సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం,మద్య నియంత్రణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారన్నారు. మద్య నియంత్రణ ఉద్యమంలో రోటరీ క్లబ్ భాగస్వామ్యమౌవుతుందని పేర్కొన్నారు. గుంటూరు రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులు పి.రామచంద్రరాజు ప్రసంగిస్తూ లక్ష్మణరెడ్డి రక్తదాన ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారని,రక్తదాన శిబిరాలు నిర్వహించడం ద్వారా రక్తం కొరత ను తీర్చడానికి తన వంతు బాధ్యత గా కృషి చేస్తూ రెడ్ క్రాస్ కు తోడ్పాటును అందిస్తున్నారని,తన స్వగ్రామమైన కారుమంచి గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ జన్మభూమి రుణం తీర్చుకుంటున్నారని అన్నారు. అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి ప్రసంగిస్తూ లక్ష్మణరెడ్డి తో గత నలభై సంవత్సరాలుగా సాన్నిహిత్యం ఉందని ప్రజా చైతన్య వేదిక,జనవిజ్ఞాన వేదిక,భారత జ్ఞాన విజ్ఞాన సమితి,జనచైతన్యవేదిక ల ద్వారా సదస్సులు,చర్చాగోష్టు లు,కళాజాత లను నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారని తెలిపారు.మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ గా గత రెండు సంవత్సరాలుగా కళా బృందాల ద్వారా ఇంజనీరింగ్,యూనివర్సిటీ ప్రాంగణాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థినీ,విద్యార్థులను జాగృతలను చేస్తున్నారని తెలిపారు. జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం మాలిక్,రంగం కళా బృందం కార్యదర్శి రాజేష్, అవగాహన సంస్థ నేతలు శేఖర్,కృష్ణ,రెడ్ క్రాస్ సంస్థ నేతలు రావి శ్రీనివాసరావు,సుబ్బారావులు తదితరులు పాల్గొన్నారు.