రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం 10,788 రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బీకే)లను నిర్మిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ రమణయ్యపేట క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తదితరాల సరఫరాతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ఫలాలను రైతులకు 100 % అందించడంలో ఆర్‌బీకేలు కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. అదే విధంగా ఆర్‌బీకేలు విజ్ఞాన కేంద్రాలుగా మారాయని, వాటిని కొనుగోలు కేంద్రాలుగా కూడా ప్రభుత్వం ప్రకటించినట్లు వెల్లడించారు. ప్రతి గ్రామంలోనూ వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశుసంవర్థక సహాయకులను నియమించి, రైతులకు వ్యవసాయ, అనుబంధ రంగాల సేవలను అందిస్తున్నట్లు వివరించారు. ఆర్‌బీకేల ద్వారా అందుతున్న సేవలతో ప్రస్తుతం దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసే పరిస్థితి వచ్చిందన్నారు. రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని, అదే విధంగా రూ.2,000 కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధిని ప్రభుత్వం ఏర్పాటుచేసిందని వివరించారు. కలలోకూడా ఊహించని విధంగా నేడు రాష్ట్రంలో రైతు భరోసా-పీఎం కిసాన్, వైఎస్సార్ ఉచిత పంటల బీమా తదితర పథకాలు రైతులకు అందుతున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా అరటి, పసుపు, బత్తాయి, ఉల్లి తదితర ఏడు పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)లను ప్రకటించిందని, రైతుల సంక్షేమంపై ప్రభుత్వానికికున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. పొగాకు రైతులు నష్టపోతున్న పరిస్థితిని చూసి రాష్ట్ర ప్రభుత్వమే జోక్యం చేసుకొని మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిపారు. గతంలో మాదిరి కాకుండా ప్రభుత్వ సిబ్బందే నేరుగా రైతులు దగ్గరకు వెళ్లి ఈ-క్రాప్ బుకింగ్ చేస్తున్నారని, ఈ సమాచారం వివిధ పథకాలను పారదర్శకంగా, జవాబుదారీతనంతో అమలుచేసేందుకు ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా నేరుగా సంక్షేమ ఫలాలను ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా రైతులకు అందిస్తోందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదని, బఫర్ స్టాక్‌ను సైతం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులకు పగటిపూట తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తోందని, రూ.1700 కోట్లను ఫీడర్ల ఆధునికీకరణకు కేటాయించినట్లు మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.
ఇన్‌పుట్ రాయితీకి సంబంధించి గత బకాయిలను కూడా చెల్లించడమే కాకుండా ప్రస్తుత ప్రభుత్వం ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్‌లో ఆర్థిక సహాయం అందిస్తోందని వివరించారు. రైతులు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతి ఆర్‌బీకేలోనూ బిజినెస్ కరస్పాండెంట్ల సేవలను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. కౌలు రైతులకు కూడా లబ్ధి చేకూర్చేందుకు 4,93,000 క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్స్ (సీసీఆర్‌సీ కార్డులు)ను అందించామని, వారికి కూడా రైతు భరోసాను ఇస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో రూ.1300 కోట్లతో పెద్ద ఎత్తున డ్రిప్ ఇరిగేషన్‌కు ఊతమివ్వనున్నట్లు తెలిపారు. రైతులు వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా ప్రయోజనం పొందేందుకు వీలుగా ఆర్‌బీకే పరిధిలో కస్టమ్ హైరింగ్ కేంద్రాల (సీహెచ్‌సీ)ను రైతు బృందాలతో ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు మాత్రమే అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నియోజకవర్గాల స్థాయిలో ఇంటిగ్రేటెడ్ అగ్రీ టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తోందని, ఇప్పటికే తొలిదశలో 60 ల్యాబ్‌లను ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలు లక్ష్యంగా ఆన్‌లైన్ మార్కెటింగ్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోందన్నారు. అదే విధంగా తొలిదశలో రూ.212 కోట్లతో మార్కెట్‌యార్డులను నాడు-నేడు నమూనాలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ క్లిష్ట సమయంలోనూ చెప్పిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంక్షేమ పథకాలు అందించినట్లు మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు.