ఇసుక కొరత రానివ్వకుండా కొత్త ఓపెన్ రీచ్ ల గుర్తింపు పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సి.హరికిరణ్ జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.జి.లక్ష్మీశ, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఇలాక్కియా తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరికిరణ్ జిల్లాలో ఇసుక లభ్యత, ఇతర అంశాలపై మైన్స్, రెవెన్యూ, పంచాయితీ రాజ్, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, ఆర్ డబ్ల్యూఎస్, ఇతర ఇంజనీరింగ్ అధికారులతో క్షుణ్ణంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు ఉన్న 31 ఇసుక ఓపెన్ రీచ్ లను 2021, నవంబర్ 30 నాటికి పర్యావరణ అనుమతులు గడువు పూర్తవుతున్నందున కొత్త రీచ్ ల గుర్తింపు పై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. కొత్త రీచ్ గుర్తింపునకు సంబంధించి మైన్స్, గ్రౌండ్ వాటర్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 31 ఓపెన్ రీచ్ లలో ఇసుక ఉన్నప్పటికీ వరదల కారణంగా ప్రస్తుతానికి ప్రజలు, ప్రభుత్వ నిర్మాణ పనులకు అవసరమైన ఇసుకను జిల్లాలో ఉన్న వివిధ స్టాక్ యార్డుల నుంచే ఇసుక సరఫరా జరుగుతుందన్నారు. జిల్లాలో 6 లక్షల 20 వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉందన్నారు. బేథమేట్రీక్ సర్వే ద్వారా 91లక్షల 56వేల 621 క్యూబిక్ మీటర్ల ఇసుక ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, ఇతర ప్రభుత్వ భవన నిర్మాణ పనులకు ఇసుక కొరత రానివ్వకుండా మంగళవారం, శుక్రవారం రెండు రోజులపాటు ఇసుక సరఫరా చేయాలని జయప్రకాశ్ పవర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ గీతాంజలి శర్మ, కాకినాడ, అమలాపురం ఆర్డీవోలు ఎజీ చిన్ని కృష్ణ,వసంతరాయుడు, డీపీవో ఎస్ వి నాగేశ్వరనాయక్, ఇంచార్జ్ మైన్స్ డీడీ ఈ. నరసింహారెడ్డి,ఏడీ రాజమహేంద్రవరం డివిఆర్.కుమార్ , ధవలేశ్వరం ఈఈ జి.శ్రీనివాసరావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ రామ్మోహన్ నాయుడు, ఇంచార్జి ఆర్టీవో జివివికే. రాజు, గ్రౌండ్ వాటర్,ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులు, జేపీ పవర్ వెంచర్స్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.