యువజన సంఘాలను ఏర్పాటు చేయడం ద్వారా సమాజాభివృద్దిలో యువతను భాగస్వా ములను చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లోని యువతను ఏకం చేసి, వారి ఆసక్తి, అర్హతలు, సమాజ అవసరాలకు అనుగుణంగా ఏకీకృత నైపుణ్య శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించాలని ఆదేశించారు. జిల్లా స్థాయి యువజన కార్యక్రమాలపై శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ గ్రామ, వార్డు స్థాయిల్లో యువజన సంఘాలను ఏర్పాటు చేయడానికి తక్షణమే చర్యలు ప్రారంభించాలని సూచించారు. దీనికోసం సమగ్ర కార్యాచరణను అమలు చేయాలన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలు, నైపుణ్యం ఆధారంగా, ఎటువంటి నైపుణ్యం లేని సాధారణ వ్యక్తులను వేర్వురు విభాగాలుగా గుర్తించి, వారిచేత సంఘాలను ఏర్పాటు చేయించాలన్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా, అన్ని శాఖల సమన్వయంతో వారికి అవసరమైన నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు. దీనికి ముందుగా ప్రతీ గ్రామం నుంచి, పట్టణాల్లోని వార్డు నుంచి అర్హత గల యువత వివరాలను సేకరించాలని ఆదేశించారు. ఈ యువజన సంఘాలను ఏర్పాటు చేసి, ఎవెన్యూ ప్లాంటేషన్, వన సంరక్షణ, పరిశుభ్రత, పచ్చతోరణం లాంటి ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని సూచించారు.
అలాగే జిల్లాలోని ప్రసిద్ది పొందిన బొబ్బిలి వీణలు తదితర వాటిని ఈ సంఘాల ద్వారా తయారు చేయించి, దేశ విదేశాల్లో మార్కెటింగ్ చేయించవచ్చని అన్నారు. యువతకు ఉద్యోగ కల్పన కంటే, స్వయం ఉపాధి కల్పించడంవల్ల అధిక ప్రయోజనం ఉంటుందని చెప్పారు. జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు మాట్లాడుతూ, యువతలోని ఆసక్తి, నైపుణ్యంతో బాటుగా, స్థానిక అవసరాలకు తగ్గట్టుగా వారికి నైపుణ్య శిక్షణ ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం భారీ ఎత్తున జరుగుతున్న గృహ నిర్మాణ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని, తాపీమేస్త్రి, రాడ్ బెండింగ్, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం వల్ల వారికి ఉపాధి దొరకడంతోపాటుగా, సమాజ అవసరాలు కూడా తీర్చవచ్చునని సూచించారు.
జిల్లా యువజన సమన్వయాధికారి విక్రమాధిత్య మాట్లాడుతూ, జిల్లాలో యువజన సంఘాల పాత్ర, వాటి కార్యక్రమాలను వివరించారు. యువజన సంఘాలకు ప్రభుత్వం ఇస్తున్న సహకారం, అమలు చేస్తున్న కౌసల్ వికాశ్ యోజన, సంకల్ప్ తదితర పథకాలు గురించి తెలిపారు. జనశిక్షణ సంస్థాన్ ద్వారా ఇస్తున్న నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను వివరించారు. క్షేత్రస్థాయిలో యువతలోని ప్రతిభను గుర్తించి, దానిని వెలికి తీసేందుకు యువజన సంఘాలు దోహదపడతాయని చెప్పారు. ఈ సమావేశంలో సిపిఓ జె.విజయలక్ష్మి, జెడ్‌పి సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, డిపిఓ సుభాషిణి, జిఎం డిఐసి ప్రసాదరావు, మెప్మా పిడి సుధాకరరావు, సెట్విజ్ సిఇఓ విజయకుమార్, నాబార్డ్ ఏజిఎం హరీష్, డిఎల్‌డిఓ రామచంద్రరావు, వివిధ శాఖలు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదర్శ పారిశ్రామికవేత్త ధరణి, తమ సంస్థ ద్వారా చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు.