కోవిడ్ కర్ఫ్యూ నిబంధనలు, 144 సెక్షన్ ఉల్లంఘించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుం టామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. కోవిడ్ నివారణా చర్యలపై గురువారం స్థానిక ప్రకాశం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పబ్లిక్ స్థలాల్లో మాస్కు ధరించకుండా సంచరించే వారికి రూ. 100 రూపాయలు జరిమాన విధించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ. నెం: 370, 371 విడుదల చేసిందన్నారు. వైరస్ వ్యాప్తని అరికట్టడంలో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కఠినంగా అమలు చేస్తామన్నారు. వాణిజ్య సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాలలోకి మాస్కు లేనివారిని అనుమతిస్తే రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు జరిమాన విధిస్తామన్నారు. మూడు రోజుల వరకు దుకాణాలు వాణిజ్య సముదాయాలను సైతం మూత వేస్తామన్నారు. రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఆరు గంటల వరకు కోవిడ్ కర్ఫ్యూ, 144 సెక్షన్ ఈనెల 21వ తేదీ వరకు అమలులో ఉంటుందన్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో 3.5 శాతం కోవిడ్ కేసులు
నమోదవుతున్నాయని చెప్పారు. వైరస్ వ్యాప్తి అరికట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జి.ఓ. విడుదల చేసిందన్నారు.
నూతన ఉత్తర్వుల ప్రకారం జరిమాన విధించే అధికారాలను పోలీసులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిందని కలెక్టర్ తెలిపారు. రెవిన్యూ, మున్సిపాలిటీ, పోలీసులు బృందాలుగా ఏర్పడి జి.ఓ.ను అమలు చేస్తారన్నారు. గడిచిన మూడు రోజుల్లో 149 గ్రామ పంచాయతీలలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారి పై 750 కేసులు నమోదు చేశామన్నారు. వారికి రూ. 65 వేలు జరిమానా విధించామన్నారు. కోవిడ్ కేసుల నమోదు తగ్గక పోవడంపై ప్రతిరోజు సమీక్షిస్తున్నామని ఆయన వివరించారు. వివాహాలు, శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాల నిర్వహణలో కోవిడ్ నిబంధనలు ప్రజలు పాటించడం లేదన్నారు. క్వారీలు, మార్కెట్ సముదాయాల వద్ద కూలీలు సమూహంగా పనులకు వెళ్లే పరిస్థితులలో వైరస్ వ్యాప్తి జరుగుతోందన్నారు. వైద్యశాలలను సిద్ధ పరిచామని, ఐ.సి.యు. బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు, వైద్య పరికరాలు, ఔషధాలు సిద్ధంచేస్తున్నామని ఆయన వివరించారు. ఇందుకోసం సమగ్ర ప్రణాళికతో యంత్రాంగం ముందుకు వెళ్తుందని ఆయన చెప్పారు.
కోవిడ్ మూడవ దశ రాకుండా జిల్లా యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా జాగ్రత్త చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు. కోవిడ్ నివారణ టీకా పొందడానికి హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్స్, ఐదేళ్ల లోపు పిల్లలున్న తల్లులు, 45 సంవత్సరాలు దాటిన వారంతా అర్హులన్నారు. 11 లక్షల 55 వేల 580 మందికి టీకా వేయాలనే లక్ష్యం కాగా ప్రస్తుతం 9 లక్షల 81 వేల 666 మందికి టీకా మొదటి డోసు వేశామన్నారు. 85.5 శాతం లక్ష్యానికి చేరుకున్నామని మిగిలిన వారికి టీకా వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. ప్రస్తుతం 1,046 గ్రామ పంచాయతీలలో ప్రతిరోజు 10 వేలకు తగ్గకుండా కోవిడ్ పరీక్షలు చేస్తున్నామని, గడిచిన 14 రోజులలో 1,34,051 మందికి పరీక్షలు చేశామన్నారు. ప్రస్తుతం 20 మండలాలలోని 20 పి. హెచ్.సి.ల పరిధిలో ఐదు శాతానికి మించి కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని వివరించారు. ఈ నేపధ్యంలో కోవిడ్ నిబంధనలపై రూపొందించిన గోడపత్రాలు, కరపత్రాలను 7.22 లక్షల గృహాలలో అందజేశామన్నారు. గడిచిన రెండు రోజుల్లో 46 వేల మందిని చైతన్య పరిచామన్నారు. అన్ని గ్రామ పంచాయతీలలో ప్రచార బోర్డులు, సచివాలయాల వద్ద గోడ పత్రాలు ఉంచామన్నారు. కోవిడ్ మూడవ దశ రాకుండా జిల్లా ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జి.ఓ.ను కఠినంగా అమలు చేస్తామని నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్.పి. మాలికా గార్గ్ చెప్పారు. వైరస్ సోకిన కేసుల నమోదులో ప్రకాశం జిల్లా ఐదో స్థానంలో ఉందన్నారు. జిల్లాలో కోవిడ్ నివారణపై రెవిన్యూ, పోలీస్ శాఖలు సమస్వయంతో ఉద్యమంలా పనిచేస్తామని ఆమె తెలిపారు. కోవిడ్ నివారణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, వ్యాప్తి అరికట్టడానికి సమర్థంగా చర్యలు తీసుకుంటమని ఆమె చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) టి.ఎస్. చేతన్, కోవిడ్ కంట్రోల్ రూమ్ నోడల్ అధికారి డాక్టర్ తిరుమల రావు, తదితరులు పాల్గొన్నారు.