విశాఖను మురికివాడలు లేని విశాఖగా రూపు దిద్దడమే ప్రధాన కర్తవ్యం అని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు. శుక్రవారం ఆమె గురజాడ కలాక్షేత్రంలో మురికి వాడల అభివృద్ధిపై వార్డు సచివాలయ కార్యదర్శుల శిక్షణా కార్యక్రమంలో జివిఎంసి కమిషనర్ డా. జి. సృజనతో కలసి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, విశాఖ త్వరలో పరిపాలనా రాజధాని అవుతున్న తరుణంలో జిల్లా అభివృద్ధిపై రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి నగారాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, అందుకు వారికి ధన్యావాదాలు తెలియ జేస్తున్నామని, జివిఎంసి పరిధిలో 793 మురికివాడలు గుర్తంచబడ్డాయని, మురికి వాడలలో కనీస మౌళిక వసతులైన రోడ్లు, డ్రైన్లు, కమ్యునిటీ హాల్స్, కళ్యాణ మండపాలు, విద్యుత్, త్రాగు నీరు లాంటి వసతుల కల్పనకు ఈ ఆదివారం ప్రతీ ఒక్క సచివాలయ కార్యదర్శి సచివాల పరిధిలో ఉన్న కుటుంబాల వివరాలు సేకరించడం కొరకు ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుందని, ఒకే గృహంలో ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయో లేదా అద్దెకి ఉన్న వారితో సహా సర్వే చేయాలని ఈ సర్వే పారదర్శకంగా, నిక్కచ్చిగా జరగాలని అప్పుడే ప్రజలకు అవసరమైన మౌళిక వసతులు కల్పించడానికి వీలవుతుందని కార్యదర్శులకు పిలుపునిచ్చారు.
అనంతరం, జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన మాట్లాడుతూ మురికివాడల అభివృద్ధిపై వార్డు సచివాలయ కార్యదర్శులకు జివిఎంసి పరిధిలో ఉన్న మురికివాడల వివరాలు అక్కడ జనాభా, వారికి కల్పించవలసిన మౌళిక వసతులు, తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా జివిఎంసి పరిధిలో మొత్తం 793 మురికివాడలు గుర్తించబడ్డాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి మురికివాడల అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. ముఖ్యంగా ఈ సర్వేలో మురికివాడల్లో నివసిస్తున్న ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థలాల్లో లేదా ప్రైవేటు వ్యక్తుల స్థలాల్లో నివసిస్తున్నారో వాటి వివరాలు, ఆయా మురికివాడల పరిధి, సరిహద్దులు, ఎన్ని కుటుంబాలు వారు నివసిస్తున్నారు, అక్కడ జనాభా ఎంత, వారికి కావలసిన మౌళిక వసతులు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ సర్వే ఈ ఆదివారం ప్రతి ఇంటికి కార్యదర్శులు వెళ్లి యాప్ ద్వారా వివరాలను పొందుపరచడం జరుగుతుందని, దీనికి వార్డు కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఆర్.డబ్ల్యూ.ఎస్ సంఘాల వారు, ప్రజలు సహకరించి ఈ సర్వేను విజయవంతం చేయాలని కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఇంజినీరు రామ కృష్ణంరాజు, చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత, యుసిడి (పి.డి.) వై. శ్రీనివాస రావు తదితరులు మురికివాడల అభివృద్ధి పై సచివాలయ సిబ్బందికి శిక్షణ తో పాటు కొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఎ.వి.రమణి, అందరు జోనల్ కమిషనర్లు, పర్యవేక్షక ఇంజినీరులు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, యుసిడి సిబ్బంది, వార్డు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.