ఇరువర్గాల రాజీమార్గం ద్వారా ఇంత వరకు పరిష్కరించబడని కేసులను సత్వరమే పరిష్కరించుకోవడానికే జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ స్పష్టం చేశారు. శనివారం జిల్లా కోర్టుల సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆద్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ తో కలిసి లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ రోజువారీ కూలిపనులు చేసుకునే సామాన్య ప్రజలకు చెందిన భూ తగాదాలు, ఇతర తగాదాల పరిష్కారానికి కోర్టులను ఆశ్రయించవలసి వస్తుందని, అటువంటి సందర్భంలో తమ దినసరి కూలీ పనులు మానుకొని కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం న్యాయవాదులకు, కోర్టు ఫీజులు మరియు రవాణా కోసం పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అయినప్పటికీ తగిన న్యాయం జరుగు తుందనే నమ్మకం ఉండదని, దిగువ కోర్టులో న్యాయం జరగకపోతే పైకోర్టులను ఆశ్రయించాల్సి ఉంటుందన్నారు. అటువంటి కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కని వేదిక అని కొనియాడారు. అదాలత్ నందు ఇరువర్గాల ఆమోదంతో కేసులు పరిష్కరించబడుతున్నందున ఇతర కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం ఉండబోదని, అదే రోజు కేసు పరిష్కరించబడుతుందని తెలిపారు. అంతేకాకుండా కోర్టు ఫీజులు వాపసు ఇవ్వబడు తుందని, ఫీజులు చెల్లించుకోలేని వారికి న్యాయవాదులను ఏర్పాటుచేయడం జరుగుతుందని ప్రధాన న్యాయమూర్తి వివరించారు.
న్యాయ,పోలీసు,రెవిన్యూ వ్యవస్థలు ప్రజలు కోసమే ఉన్నాయన్న సంగతిని ప్రజలు గుర్తించాలన్నారు. కోవిడ్ నేపథ్యంలో కోర్టులను ఆశ్రయించలేనివారి కోసం వర్చువల్ విధానంలో కేసులను పరిష్కరించడం జరుగు తుందని అన్నారు. కావున కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ కేసులను పరిష్కరించు కోవాలని ఆయన ఆకాంక్షించారు.జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ మాట్లాడుతూ కోర్టులలో చాలావరకు పలు కేసులు పెండింగులో ఉండిపోయాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు సుప్రీం కోర్టు వారు జాతీయ,రాష్ట్ర,జిల్లా స్థాయిలో న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పాటుచేసిందని చెప్పారు. దీనిద్వారా ప్రీలిగేంట్ కేసులు, పోలీస్ స్టేషనులో నమోదుకాని కేసులు, ఇంకా మోటార్ వాహనాల కేసులు వంటివి ఇరువర్గాల రాజీతో అక్కడికక్కడే పరిష్కరించు కోవచ్చని కలెక్టర్ సూచించారు. కక్షిదారులు ఏ ఇతర ఖర్చులు కూడా చేయనవసరం లేదని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు కల్పించిన ఈ సదవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకొని, పెండింగ్ లో ఉన్న తమ కేసులను సత్వరమే పరిష్కరించుకోవాలని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సెకెండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి టి.వెంకటేశ్వర్లు, థర్డ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి పి.అన్నపూర్ణ, పెర్మనంట్ లోక్ అదాలత్ చైర్మన్ గాయాత్రిదేవి, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి కె.నాగమణి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మి, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్. జయలక్ష్మి, స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ జడ్జి జె.కిషోర్ కుమార్, జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ జడ్జి జి.లెనిన్ బాబు, ఫస్ట్ అడిషనల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ కె.రాణి, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి.సోమశేఖర్,జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.రమేష్ ,కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.