1 ENS Live Breaking News

4వ విడత చందనం లభ్యత 27కిలోలు..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి వారికి 4వ విడత చందనం సమర్పించడానికి అరగత కార్యక్రమంలో భాగంగా తొలి ఈరోజు 27 కిలోల చందనాన్ని అరగదీశారని ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. ఈమేరకు ఆమె మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 24వ తేదీన స్వామివారికి తుదివిడత చందన సమర్పణ జరుతుందని అందులో పేర్కొన్నారు. నేటి నుంచి చందనం అరగదీత నాలుగైదు రోజులపాటు కొనసాగనుంది. స్వామివారికి భక్తులు చందనాన్ని సమర్పించడానికి ట్రస్టు సభ్యులు లేదా ప్రత్యేక ఆహ్వానితులు, దేవస్థాన అధికారులను సంప్రదించవచ్చునని దేవస్థాన అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు భక్తులు స్వామివారికి చందనాన్ని సమర్పించారు. స్వామివారికి చందనం సమర్పించే అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని దేవస్థాన ఈఓ ఆ ప్రకటనలో కోరుతున్నారు.

సింహాచలం

2021-07-18 16:55:27

అప్పన్నకు పోలీసులు ప్రత్యేక పూజలు..

సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని 1991వ బ్యాచ్ కు చెందిన పోలీసు అధికారుల బృందం అదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసింది. మొత్తం 25 మంది ఏసీపీలు, డీఎస్పీలు, సీఐలు స్వామిని దర్శించుకున్నావారిలో ఉన్నారు. 1991లో ఏపీ పోలీస్ అకాడమీలో శిక్షణపొందారు. ప్రతిఏటా ఒకరోజు ఏదో ఒక చోట ఈ అధికారులంతా  కలుస్తుంటారు. అయితే అనూహ్యంగా ఈ స్వామివారి దివ్య సన్నిధిలో కలిసే భాగ్యం దక్కిందని వారు ఆనందం వ్యక్తం చేశారు. తమకు మంచి దర్శనం ఏర్పాటుచేసిన దేవస్థానం ఈఓ సూర్యకళకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.  స్వామివారిని దర్శించేటప్పుడు అందరూ సంప్రదాయ డ్రెస్ కోడ్ పాటించారు. శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆశీస్సులతో విధులు సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నామని చెప్పారు.  దర్శనం అనంతరం సింహగిరులపైనే కాసేపు గడిపారు పోలీసు అధికారులంతా..వీరిలో గోపాలపట్నం ట్రాఫిక్ సీఐ శ్రీహరి రాజు కూడా ఉన్నారు. 

సింహాచలం

2021-07-18 14:56:06

శనివారం అన్ని పీహెచ్సీల్లో కరోనాటీకా శిబిరాలు..

తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలలో 45 ఏళ్ల వయస్సు దాటిన వారికి మొదటి డోసు, అలాగే మొదటి డోసు టీకా తీసుకుని 84 రోజుల వ్యవధి పూర్తయిన  వారికి రెండవ డోసు కోవీషీల్డ్ టీకా వేస్తారని జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో  కోవీషీల్డ్  రెండవ డోస్ టీకా తీసుకోవలసిన వారు ఇంకా దాదాపు 50,000 వరకూ ఉన్నారని వారందరూ శనివారం తప్పని సరిగా రెండవ డోస్ టీకా వేయించుకోవాలని ఆమె కోరారు. కోవిడ్ వైరస్ నియంత్రణలో ప్రతీ ఒక్కరూ భాగస్వామి కావాలన్నారు. తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని జెసి కోరారు.

Kakinada

2021-07-16 15:49:45

వైఎస్సార్ భీమా పథకం 95% నమోదు..

వైఎస్సార్ భీమా పథకానికి సంబంధించి 99.25 శాతం రైస్ కార్డ్ హోల్డర్ లను నమోదు చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ (ఆసరా&సంక్షేమం) జి.రాజకుమారి తెలిపారు.  శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో వైయస్సార్ బీమా పథకానికి సంబంధించి అమలాపుర, రామచంద్రాపురం, పెద్దాపురం ,కాకినాడ డివిజన్ ల గ్రామ వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్ లకు వైయస్సార్ బీమా క్లయిమ్ ఏవిధంగా చేయాలి దాని పై శిక్షణ కార్యక్రమాన్ని జూమ్  కాన్ఫరెన్స్ ద్వారా జేసీ రాజకుమారి సంబంధిత అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వై.ఎస్.ఆర్. బీమా పధకాని రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగాజూలై 1వ తేదీ న  ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పధకంలో సహజ మరణం పొందితే రూ.100000/-లు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.500000/- లు , పూర్తి అంగవైకల్యం కలిగితే రూ.500000/- మరియు పాక్షిక అంగవైకల్యం కలిగితే రూ.2,50,000/- లు
నేరుగా నామినీ ఖాతాలకు జమచేయడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో వై.ఎస్.ఆర్.బీమా పధకంలో 16,53,364 మంది రైస్ కార్డ్ హోల్టర్స్ నమోదు చేయవలసియుండగా ఇప్పటి వరకు 99.25 శాతం నమోదు చేయడం జరిగిందన్నారు . ఈ పధకంలో నమోదు అయిన వారు ఎవరైనా మరణిస్తే వారి క్లైమ్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, తక్షణ సహాయం (మట్టిఖర్చులు) రూ.10000/- లు  చెల్లించే విధానం పై  పలు అంశాలు ఈ సందర్భంగా వివరించారు.ఈ నేల 17న  రాజమహేంద్రవరం , గిరిజన ప్రాంతంలో ఉన్న 11 మండలంలో ఉన్న WEA &WDWS వారికి ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జేసీ జి.రాజకుమారి గారు తెలియజేసారు. ఈ జూమ్ కాన్పిరెన్స్ లో ప్రాజెక్టు డైరెక్టర్  వై.హరిహరనాథ్, అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ కె.శ్రీనివాసకుమార్, వై.ఎస్.ఆర్.బీమా ఇన్సూరెన్స్ విభాగం ఎస్.వేదకుమారి ఏపియం, డి.ఆర్.పి ఐ.టి పర్సన్స్ , నాలుగు డివిజన్ల గ్రామ వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్ లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Kakinada

2021-07-16 15:46:51

జగనన్న కాలనీలు త్వరగా పూర్తిచేయాలి..

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజక వర్గంలోని జగనన్న కాలనీల్లో చేపడుతున్నఇళ్ల నిర్మాణాలను  త్వరితగతిన పూర్తిచేయాలని, ఇల్లు నిర్మాణాల్లో ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండాలని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ ఆకాంక్షించారు. శుక్రవారం ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలంలో ఏర్పాటుచేసిన  పలు అభివృద్ధి పథకాలకు శాసన సభాపతి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపనలు చేశారు. తొలుత తోలాపి గ్రామంలోని జగనన్న కాలనీలో ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అలమాజీపేట గ్రామంలో సుమారు 13 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం జగనన్న పచ్చతోరణం - వనహారం  కార్యక్రమంలో భాగంగా రాపాక నుండి కుమ్మరి కాలననీ వరకు రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమంలోనూ, పొందూరు ఎంపీడీవో కార్యాలయంలో వికలాంగులకు ట్రై సైకిల్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొందూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద శాసన సభాపతి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తుందని చెప్పారు. ఇటువంటి పరిపాలన చరిత్రలో మునుపెన్నడూ లేదని గుర్తుచేసారు. ప్రతీ సంక్షేమ పథకం నేరుగా లబ్ధిదారునికే అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అందువలనే ప్రతి పథకం విజయవంతం అయిందని సభాపతి అభిప్రాయపడ్డారు. ఆమదాలవలస నియోజకవర్గంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను కోరిన ఆయన ఇళ్ల  నిర్మాణంలో ఆమదాలవలస నియోజకవర్గం రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

 ఉత్తరాంధ్ర వెనకబడిందని గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి  ఇరిగేషన్లో జిల్లాకు పెద్దపీట వేసారని చెప్పారు. మడ్డువలస ప్రోజెక్ట్ కోసం అక్కడి రైతులకు నష్టపరిహారం చెల్లించి సుమారు 30 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించబోతున్నారని తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా సుమారు 75 వేల ఎకరాలకు లబ్ధి చేకూరనుందని అన్నారు. నేరేడు బ్యారేజీకి సాంకేతికపరమైన అడ్డంకులు తొలగించుకుని పనులు ప్రారంభించబోతున్నామని,  అది పూర్తయితే జిల్లా సస్యశ్యామలం అవుతుందని సభాపతి ఆశాభావం వ్యక్తం చేసారు. మన ముఖ్యమంత్రి అపర భగీరధుడని అని శాసనసభాపతి ఈ సందర్భంగా కొనియాడారు. మునుపెన్నడు మన ఉత్తరాంధ్రని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, వెనుకబడిన జిల్లాగా విడిచి పెట్టారని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ను ఒక వరంలా నాటి ముఖ్యమంత్రి దివంగత వై.యస్.రాజశేఖర్ రెడ్డి అందిస్తే ఈ వేళ ఆ పోలవరాన్ని పూర్తి చేసి జగన్మోహన్రెడ్డి  అపర భగీరధుడు అయ్యారని గుర్తుచేసారు. ఈ కార్యక్రమంలో పొందూరు మండల తహశీల్ధారు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి,  కొంచాడ రమణమూర్తి , గాడు నాగరాజు, పప్పల వెంకటరమణ, జడ్పిటిసి అభ్యర్థి లోలుగు కాంతారావు, లోలుగు శ్రీరాములు నాయుడు, గంట్యాడ రమేష్, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-07-16 15:37:53

తిరుమలలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం..

తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్ర‌వారంనాడు సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. కోవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ ఉత్స‌వాన్ని నిర్వ‌హించారు.  ముందుగా ఉదయం 7 నుండి 9.30 గంటల వరకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీ విష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదించారు.   అనంతరం శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఈవో, అద‌న‌పు ఈవో ఇతర ఉన్నతాధికారులు వెంట వచ్చారు. నాలుగు పట్టు వస్త్రాలను మూలవిరాట్టుకు అలంకరించారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరించారు.

        తదనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రంతో ''పరివట్టం''(చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి  'నిత్యైశ్వర్యోభవ' అని స్వామివారిని ఆశీర్వదించారు. ఆ తరువాత అర్చకులు శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారికి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయంగారికి, టిటిడి తరఫున కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి గారికి 'లచ్చన' అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలించారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాలచెంత ఉంచ‌డంతో ఆణివార ఆస్థానం ముగిసింది. ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగ‌నాథ‌స్వామివారి ఆల‌య అధికారులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శుక్ర‌వారం ఉదయం శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మఠం నుండి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల ప్ర‌ద‌క్షిణ‌గా ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.  

వార్షిక లెక్కలు ప్రారంభించిన రోజు : టిటిడి ఈవో

        ఈ ఉత్స‌వం అనంత‌రం ఆల‌యం వెలుపల ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తార‌ని చెప్పారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు వ‌చ్చింద‌న్నారు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టిటిడి వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవ‌ని తెలిపారు. టిటిడి ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి - ఏప్రిల్‌ నెలలకు మార్చిన‌ట్టు వివ‌రించారు. సాయంత్రం పుష్ప‌ప‌ల్ల‌కీపై స్వామి, అమ్మ‌వారు నాలుగు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తార‌ని తెలిపారు.

          ఈ కార్య‌క్ర‌మంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ఎ.వి.ధ‌ర్మారెడ్డి, త‌మిళ‌నాడు దేవాదాయ శాఖ మంత్రి శేఖ‌ర్‌బాబు, దేవాదాయ శాఖ కార్య‌ద‌ర్శి  చంద్ర‌మోహ‌న్‌, క‌మిష‌న‌ర్  కుమ‌ర‌గురుభ‌ర‌న్‌, శ్రీ‌రంగం ఆల‌య జాయింట్ క‌మిష‌న‌ర్  మారిముత్తు, టిటిడి సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో ర‌మేష్‌బాబు, పేష్కార్  శ్రీ‌హ‌రి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-07-16 15:30:25

22లోగా అభ్యంతరాలు తెలియజేయండి..

విభిన్న ప్రతిభావంతుల స్పెషల్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ నకు సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను సంబంధిత వెబ్ సైట్ నందు ఉంచామని, వాటిపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 22లోగా తమ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలని విభిన్నప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కె.జీవనబాబు  పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీచేసారు. 2019-20 సం.నకు సంబంధించి విభిన్న ప్రతిభావంతుల స్పెషల్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ Class–IV(Other than DSC) బ్యాక్ లాగ్ పోస్టులు ఖాళీలను భర్తీచేయు ప్రక్రియలో భాగంగా పోస్టులవారీగా ప్రొవిజనల్ మెరిట్ జాబితాను www.dw2020backlogsklm.in మరియు srikakulam.ap.gov.in వెబ్ సైట్ నందు పొందుపరచినట్లు ఆయన చెప్పారు. ప్రొవిజనల్ మెరిట్ జాబితాపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నఎడల జూలై 22 లోగా లిఖిత పూర్వకంగా సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, శ్రీకాకుళం వారికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. జూలై 22 సాయంత్రం 05.00గం.ల తదుపరి వచ్చిన అభ్యంతరాలను పరిగణలోనికి తీసుకోబడవని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేసారు. 

Srikakulam

2021-07-16 15:25:55

జాబ్ మేళాలో 500 మందికి ఉద్యోగాలు..

విజ‌య‌న‌గ‌రం టిటిడిసి వ‌ద్ద డిఆర్‌డిఏ నిర్వ‌హించిన మెగా జాబ్‌మేళా విజ‌య‌వంత‌మ‌య్యింది. శుక్ర‌వారం నిర్వ‌హించిన ఈ మేళాలో జిల్లాకు చెందిన సుమారు 500 మంది ఉద్యోగాల‌కు ఎంపిక‌య్యారు. డిఆర్‌డిఏ ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాలో తిరుప‌తికి చెందిన‌ అమెరాన్ బ్యాట‌రీస్ సంస్థ‌, త‌మ సంస్థ‌లో ప‌నిచేసేందుకు 500 మందిని ఎంపిక చేసింది. ఐటిఐ ఉత్తీర్ణుల‌తోపాటుగా,  కేవ‌లం ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ అర్హ‌త ఉన్న‌వారిని కూడా ఉద్యోగాల‌కు తీసుకున్నారు. వీరికి ప్రారంభ వేత‌నం రూ.10,800గా నిర్ణ‌యించారు. వారి ప్ర‌తిభ‌ను బ‌ట్టి కొద్దికాలంలోనే వేత‌నాల‌ను పెంచుతారు. ఇపిఎఫ్‌, ఇఎస్ఐ సౌక‌ర్యంతోపాటుగా, స‌బ్సిడీపై భోజ‌నం, వ‌స‌తిని కూడా క‌ల్పించ‌నున్నారు. మేళాకు జిల్లా న‌లుమూల‌నుంచి 580 మంది రాగా, వీరిలో 86 శాతం మందికి పైగా ఉద్యోగాల‌ను సాధించ‌డం విశేషం. ఉద్యోగాల‌కు ఎంపికైన వారంతా క‌ష్ట‌ప‌డి ప‌నిచేసి, జిల్లాకు మంచి పేరు తేవాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా, సంక్షేమం) జె.వెంక‌ట‌రావు కోరారు. జాబ్‌మేళాను ప్రారంభించిన అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. ఎక్క‌డైనా క‌ష్ట‌ప‌డిన వారికే మంచి పేరుతోపాటు, అభివృద్దీ ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తాము కూడా చాలాక‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి చేరుకున్నామ‌ని చెప్పారు. అంకిత‌భావం, క్ర‌మ‌శిక్ష‌ణ అల‌వాటు చేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. జిల్లానుంచి ఇంత‌కుముందు కూడా చాలామంది ఈ కంపెనీకి ఇదేస్థాయిలో ఎంపికై, ప్ర‌స్తుతం ఉద్యోగాలు చేస్తూ, ఉన్న‌త స్థానానికి చేరుకున్నార‌ని, వారిని ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని జెసి కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో డిఆర్‌డిఏ పిడి కె.సునీల్ రాజ్‌కుమార్‌, ఏపిడి సావిత్రి, ఆర్‌సెట్ డైరెక్ట‌ర్ వేణుగోపాల్‌, జెడిఎం(జాబ్స్‌) బి.శ్రీ‌నివాస‌రావు, అమెరాన్ బేట‌రీస్ హెచ్ఆర్ మేనేజ‌ర్ క‌ల్యాణ్‌, వెలుగు, డిఆర్‌డిఏ ఏరియా కో-ఆర్డినేట‌ర్లు, ఎపిఎంలు, డిపిఎంలు పాల్గొన్నారు.

Vizianagaram

2021-07-16 14:58:08

అవార్డు వరించడం హర్షదాయకం..

గాంధేయవాది, స్వాతంత్ర సమరయోధురాలు, సంఘ సంస్కర్త ,అభ్యుదయవాది పద్మ విభూషణ్ డాక్టర్ దుర్గ భాయ్ దేశ్ ముఖ్ జయంతి సందర్భంగా ఆమె పేరిట ఏర్పాటు చేసిన అవార్డును ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకురాలు ఏచూరి కల్పకం న్యూఢిల్లీ వారికి ఇవ్వడం అభినందనీయమని జాయింట్ కలెక్టర్ వెల్ఫేర్ జి. రాజకుమారి పేర్కొన్నారు.   గురువారం కాకినాడ గాంధీ నగర్ పార్క్ లోని గ్రంథాలయంలో వర్చువల్ విధానంలో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ కాకి నాడ విభాగం వారు నిర్వహించారు. వర్చువల్ కాన్ఫరెన్స్ లో కల్పకం వారితో పాటు ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫెరెన్స్ అధ్యక్షురాలు  షీలా ఖక్కడె, ఉపాధ్యక్షురాలు చంద్రప్రభ జోష్ పాల్గొన్నారు.
   ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా విచ్చేసిన జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గాంధీజీ ఆశయాల కోసం పనిచేసిన దుర్గ భాయ్  దేశ్ ముఖ్ కాకినాడ చెందిన వారు కావడం ఆమె ప్రోద్బలంతో మొదటిసారిగా కాకినాడలో ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ కీలకంగా వ్యవహరించి వ్యవస్థాపక అధ్యక్షురాలు గా పనిచేస్తున్న కల్పకం వారికి  ఇస్తున్న అవార్డు ఆమె  సేవా స్ఫూర్తికి నిదర్శనంగా అభివర్ణించారు.
 మహిళ స్వావలంబనకు పని చేస్తూ నిరంతరం సౌర పునరుత్పాదక శక్తి పరిశోధనలు చేయడంతోపాటు సామాజిక సేవలో తమ సేవలను అందిస్తున్న కల్పకం సేవలను జెసి రాజకుమారి కొనియాడారు. ఈ సందర్భంగా వర్చువల్ విధానములో జెసి రాజకుమారి కల్పకం కు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత ఏచూరి కల్పకం  తనను ఎంతో అభిమానిస్తూ దుర్గాభాయి దేశముఖ్ అవార్డును ప్రధానం చేయడం పట్ల ఆల్ ఇండియా ఉమెన్స్ కాకినాడ విభాగానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ కాకినాడ విభాగం అధ్యక్షురాలు పలువురు సభ్యులు పాల్గొన్నారు.

Kakinada

2021-07-15 16:29:56

అన్నవరం చేరుకున్న అమాత్యులు..

తూర్పుగోదావరి జిల్లా అన్నవం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామి కొండపై నిర్మించిన పలు నూతన భవనాలను శుక్రవారం పలువురు మంత్రులు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సన్నిధికి  మాజీ టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్ చేరుకున్నారు. వారికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే  పర్వతప్రసాద్ స్వాగతం పలికారు. స్వామివారి ప్రత్యేక అతిథి గ్రుహంలో వారు రాత్రికి బసచేస్తారు. రేపు అన్నవరంలోని పలు అభివ్రుద్ధి కార్యక్రమాలు ప్రారంబోత్సవంతోపాటు, శంఖవరం మండంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను వీరు ప్రారంభించనున్నారు.

అన్నవరం

2021-07-15 16:24:10

20 వరకే ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలు..

శ్రీకాకుళం జిల్లాలో రబీ సీజనులో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన మద్ధతు ధరకు కొనుగోలు చేసేందుకు ఈ నెల 20 వరకే ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలు తెరచిఉంటాయని సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేసారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన జారీచేసారు. రబీలో పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్ధతు ధరకు కొనుగోలు చేసేందుకు గాను జిల్లాలో 57 ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను ఏర్పాటుచేయడం జరిగిందని జె.సి తెలిపారు. 2020 – 21 రబీలో పండించిన ధాన్యాన్ని రైతులు విక్రయించేందుకు వీలుగా         మే నెల 18న కొనుగోళ్ల కేంద్రాలను ప్రారంభించామని, నాటి నుండి రైతుల నుండి కొనుగోళ్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కొనుగోలు కేంద్రాలు ఈ నెల 20 వరకు తెరచి ఉంటాయని, కావున  రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని తమ సమీప కొనుగోలు కేంద్రం లేదా రైతు భరోసా కేంద్రానికి తీసుకువెళ్లి విక్రయించుకోవలసినదిగా ఆయన కోరారు.  జూలై 20లోగా రైతులు ఎవరూ ధాన్యం విక్రయించేందుకు ముందుకు రాకపోతే రైతుల వద్ద ధాన్యం నిల్వలు లేనట్లుగా భావించి కొనుగోలు కేంద్రాలను మూసివేయడం జరుగుతుందని వివరించారు.  కావున  జిల్లాలోని రైతులు ప్రభుత్వం కల్పించిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ వద్ద ఉన్న ధాన్యాన్ని ఈ నెల 20లోగా విక్రయించి గిట్టుబాటు ధరను పొందాలని జె.సి ఆకాంక్షించారు. 

Srikakulam

2021-07-15 16:19:16

అనంత ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం..

అనరంతపురం నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పూర్తిస్థాయిలో తోడ్పాటు అందిస్తామని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా కె ఎస్ ఆర్ జూనియర్ కాలేజీ,  చర్చి ముందర డివైడర్ బ్లాక్ లను గురువారం ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటు ప్రక్రియను నగర మేయర్ మహమ్మద్ వసీం సలీం, మున్సిపల్ కమిషనర్ పి వి వి ఎస్ మూర్తి, ట్రాఫిక్ డిఎస్పి ప్రసాద్ రెడ్డిలు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం  కార్పొరేషన్ తరపున పూర్తి సహకారం అందిస్తామని మేయర్ పేర్కొన్నారు. ఆక్రమణలు తొలగింపుతోనే ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లో కార్పొరేటర్లు బాలాంజినేయులు, అనిల్ కుమార్ రెడ్డి , సెక్రెటరీ సంగం శ్రీనివాసులు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలసుబ్రమణ్యం ట్రాఫిక్ ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం సిటీ

2021-07-15 16:17:40

దసరా నాటికి రోడ్లు నిర్మాణాలు పూర్తికావాలి..

జీవీఎంసీ, భీమిలీ రూరల్ నియోజకవర్గ అధికారులతో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సీతమ్మధారలోని  క్యాంప్ కార్యాలయం లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నగరంపాలెం, రేవులపాలెం రోడ్లను దసరా పండగకి పూర్తి చేయాలని ఆదేశించారు. భీమిలి నియోజకవర్గంలో మంచినీటి సమస్య లేకుండా.. స్వచ్ఛమైన నీరు అందించేలా చూడాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. కొమ్మాది, మధురవాడ ప్రాంతాల్లో ఆక్రమణలు జరుగకుండా.. ఉన్న ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. 6వ వార్డులో పవర్ కట్ లేకుండా చూడాలని అన్నారు. జీవీఎంసీకి సంబంధించి హార్టికల్చర్, పార్క్స్, ప్లాంటేషన్ పై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. పార్క్ సైట్స్ ఆక్రమణలకు గురి కాకుండా బయో ఫెన్సింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో జీవీఎంసీ చీఫ్ విప్, 6వ వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక,  ఇంజనీరింగ్ ఎస్ఈలు సామ్ సన్, రవి, రాజారామ్, భీమిలీ నియోజకవర్గ ఉడా ఎస్ఈ రామ్ మోహన్.. ఇతర అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-07-15 15:49:23

ప్రజల అర్జీలు సత్వరమే పరిష్కరించాలి..

గుంటూరు నగరంలోని స్ధానిక అమరావతి రోడ్డు  44వ డివిజన్ పరిధిలో  ఉన్న 137, 138, 180 వార్డు సచివాలయాలను గురువారం ఉదయం  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్  ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత 137, 138 సచివాలయాల్లో  సిబ్బంది వారి డెస్క్ వద్ధ పేరు,  హోదాలతో కూడిన స్టిక్కర్ ను   ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.  సచివాలయ ఉద్యోగుల హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్ మెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల క్యాలెండర్, ఎస్ఎల్ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పోస్టర్లు  ఏర్పాటు  చేసిన విధానాన్ని  జిల్లా కలెక్టర్  వివేక్ యాదవ్  పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. ఇప్పటివరకు సచివాలయానికి ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారు అనే వివరాలను సిచివాలయ సెక్రటరీల ద్వారా కంప్యూటర్ లో నమోదు చేసిన డేటా ప్రత్యక్షంగా పరిశీలన చేశారు. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల జాబితాను పరిశీలించి ఎంతమంది  రోగులు సచివాలయానికి వచ్చారు. ఎంతమందికి ఎక్కడికి రెఫర్ చేశారు వంటి వివరాలను వార్డు హెల్త్ సెక్రటరీని అడిగి తెలుసుకున్నారు. బియాండ్ ఎస్ ఎల్ ఏకి వెళ్లకుండా వచ్చిన అర్జీలను ప్రతీరోజు ప్రజా సమస్యలు/ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపు పరిష్కరించాలని సచివాలయ సిబ్బందికి జిల్లా కలెక్టర్  వివేక్ యాదవ్ ఆదేశించారు. వార్డు సచివాలయం పరిధిలో ఎంతమంది వ్యాక్సిన్ చేయించుకున్నారు, 45 సంవత్సరాల పైబడిన వారికి ఎంతమందికి వ్యాక్సిన్ వేశారు, ఫ్రంట్ లైన్ వర్కర్లు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి వ్యాక్సిన్ ఇచ్చారు, ఇంకా రెండవ డోస్ ఎంతమంది వేయించుకోవాలి వంటి వివరాలను జిల్లా కలెక్టర్  అడిగి తెలుసుకున్నారు. వైయస్సార్ బీమా, కాపు నేస్తం, నేతన్న నేస్తం పథకాలకు సంబంధించి సోషల్ ఆడిట్ కంప్లీట్ చేశారా లేదా అని అధికారులను ప్రశ్నించారు. వారి వివరాలను నోటీస్ బోర్డ్ లో ప్రదర్శించాలని వెల్ఫేర్ అసిస్టెంట్ లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

అనంతరం గోరంట్ల పరిధిలోని  సున్నం బట్టీల సెంటర్ 180 వ వార్డు సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వెల్ఫేర్ క్యాలెండర్ డిస్ ప్లే చేశారా అని  ఆరాతీశారు. సంక్షేమ పధకాలు అమలవుతున్న తీరుని అడిగి తెలుసుకొని,  వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. సచివాలయంలో మొత్తం ఎంతమంది విధులు  నిర్వహిస్తున్నారని ఆరా తీశారు. మొత్తం 10 మంది సిబ్బంధిలో ఎనిమిది మంది విధుల్లో ఉన్నట్లు గుర్తించారు. వార్డు రెవెన్యూ సెక్రటరీ, ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీలు విధుల్లో లేకపోవడంతో ఎందుకు విధులకు హాజరుకాలేదని  జిల్లా కలెక్టర్ ప్రశ్నించారు. వార్డు రెవెన్యూ సెక్రటరీ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారని జ్వరం రావడంతో తహాశీల్ధార్ కు ఫోన్ ద్వారా తన అనారోగ్య సమాచారాన్ని తెలిపినట్లు జిల్లా కలెక్టర్ కు వివరించారు. సెలవు పత్రాన్ని ఇవ్వకపోవడంతో అతనిపై చర్యలు తీసుకోవాలని  ఆదేశిస్తూ  రిజస్టర్ లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. వార్డు ఉమెన్ ఫ్రొటెక్షన్ సెక్రటరీ కార్యాలయంలో లేరు కానీ తన విధుల మూమెంట్ రిజిష్ట్రర్ లో నల్లపాడులో శిక్షణకు వెళుతున్నట్లు రాసిఉండటాన్ని జిల్లా కలెక్టర్ కు అధికారులు వివరించారు. ప్రజలకు అందించే సేవలు, ప్రభుత్వ సంక్షేమ పధకాల అమలు విషయంలో అలసత్వంగా ఉండవద్దని హితవు పలికారు.  ప్రభుత్వం జారీచేసిన నిర్ణీత సమయంలో ప్రజల సమస్యలను పరిష్కరించాలని, ఏ విభాగంలోనూ పనులు పెండింగ్ లో ఉండకూడదన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగరపాలక కమీషనర్ చల్లా అనురాధ, డిప్యూటి కమీషనర్ శ్రీనివాసరావు, వెంకట కృష్ణయ్య, 44 వ డివిజన్ కార్పోరేటర్ వి.హేమలత, సాంకేతిక వ్యవస్థ జిల్లా అధికారి కె.వి. రత్నం, వార్డు  సచివాలయాల సెక్రటరీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Amaravati

2021-07-15 15:32:50

స్వచ్ఛ విశాఖ అందరి లక్ష్యం కావాలి..

విశాఖను అత్యంత స్వచ్ఛంగా తీర్చిదిద్దడంలో మహావిశాఖ నగర పాలక సంస్థ ఉద్యోగులు శక్తివంచనలేకుండా శ్రమించాలని మేయర్ గొలగాని హరివెంకటకుమారి పిలుపునిచ్చారు. గురువారం జివిఎంసి సమావేశ మందిరంలో హెచ్.పి.ఎల్.సి. ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్వచ్ఛ భారత్ “ప్రతిజ్ఞ” కార్యక్రమం జివిఎంసి కమిషనర్ డా.జి. సృజన, హెచ్.పి.సి.ఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నదాస్ తో కలిసి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ, మహాత్మాగాంధీ స్వాతంత్ర సాధన తో పాటు పరిశుభ్రతకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారని వారి కలలను మనం నెరవేర్చాలని, అందుకు ప్రతి ఒక్కరూ సంవత్సరములో వంద రోజులు, ప్రతి వారంలో రెండు గంటలు శ్రమదానం చేసి, పరిసరాల పరిశుభ్రత పాటుపడాలని, ప్రతి ఒక్కరూ తమ ఇంటిని, తమ వీధిని పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని,  అప్పుడే మన సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని తెలిపారు. హెచ్.పి.సి.ఎల్ యాజమాన్యం వారు రూ.48లక్షలతో మల్కాపురం, శ్రీహరిపురం, గొల్లపాలెం, యారాడ ప్రాంతాలలో నిర్మించిన కంటైనర్లతో కూడిన ప్రజా మరుగుదొడ్లను మేయర్, కమిషనర్ కలసి ప్రారంభించారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు హెచ్.పి.సి.ఎల్ వారు చాలా సంవత్సరాల నుండి కొనసాగిస్తున్నారని అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ,  ఇక ముందు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని వారిని కోరారు. 

అనంతరం, జివిఎంసి కమిషనర్ డా. జి.సృజన మాట్లాడుతూ, స్వచ్ఛభారత్ మిషన్ లో హెచ్.పి.సి.ఎల్ వారు కొన్ని సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలు చేస్తున్నారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు “ప్రతిజ్ఞ” కార్యక్రమంను దాదాపు 18వేల మంది యాప్ ద్వారా వీక్షించి, “ప్రతిజ్ఞ”లో పాల్గొన్నారని తెలిపారు. పరిసరాలు శుభ్రంగా ఉంచాలని,  ఇందుకు ప్రజల్లో పరిసరాల  పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు ఎంతో కృషి చేయడం జరుగుతుందని, స్వచ్ఛభారత్ లో జివిఎంసికి ఎన్నో ర్యాంకులు సాధించి ఉన్నాయంటే ఆ ఘనత విశాఖ ప్రజలు,  వివిధ సంస్థలు, ఆర్.డబ్ల్యూ.ఎ.ఎస్., మహిళా సంఘాలు సహకారం వల్లనే సాధ్యమైనదని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధించి, గుడ్డ సంచులు ఉపయోగించాలని సూచించారు. ఎస్.ఎం.ఎస్, వాట్సాప్ ల ద్వారా, స్వచ్ఛ భారత్ పై సమాచారం పంపిన వారికి, నిమిషం పాటు ప్రసంగించిన స్కూలు పిల్లలకు, డ్రాయింగ్ తదితర కార్యక్రమాలను నిర్వహించి వారిలో పోటీతత్వం పెంపొందించి బహుమతులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. పరిశుభ్రతపై 8 ఆర్.టి.సి. బస్ డిపోలను పరిశీలించగా అందులో విశాఖపట్నం, వాల్తేరు, మధురవాడ, గాజువాక డిపోలను ఎంపిక చేసి బహుమతులు ఇవ్వడం జరిగినది. 

హెచ్.పి.సి.ఎల్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాట్లాడుతూ జివిఎంసి సౌజన్యంతో ప్రతి సంవత్సరము స్వచ్ఛభారత్ పక్వాడ నిర్వహించడం జరుగుతుందని, జివిఎంసి భాగస్వామితో స్వచ్ఛభారత్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, పలుచోట్ల ప్రజా మరుగుదొడ్లు నిర్మించడం జరిగిందని,   తడి-పొడి మరియు ప్రమాధకరమైన వ్యర్ధాలను వేరువేరుగా ప్రజలు ఇవ్వడం కొరకు 30 వేల మూడు రంగుల చెత్త బుట్టలను పంపిణీ చేయడం జరుగుతుందని, ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి చెప్పి ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులను వాడాలని ఉద్దేశ్యంతో వాటిని పంపిణీ చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరు స్వచ్ఛత పై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో జివిఎంసి అదనపు కమిషనర్లు ఎ.వి.రమణి,  డా. వి. సన్యాసిరావు, ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2021-07-15 15:06:56