నవరత్నాలు లో భాగంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కోసం రాష్ట్రంలో సుమారు 16వేల లేఅవుట్లను రూపొందించడం జరిగిందని, ఇవన్నీ భవిష్యత్తులో పట్టణాలుగా రూపొందుతాయని, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అన్ని లేఅవుట్లలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ఆయన చెప్పారు. అర్హులైన ప్రతీఒక్కరికీ ఇళ్లు మంజూరు చేయాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణితో కలిసి, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ మాట్లాడుతూ, జిల్లాలో 98,206 మందికి ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. ఈనెల 1,3,4 తేదీల్లో పెద్ద ఎత్తున శంకుస్థాపనా కార్యక్రమాన్ని నిర్వహించి, సుమారు 48,981 ఇళ్లను గ్రౌండింగ్ చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పేదలందరికీ సొంతింటి కలను నిజం చేసేందుకు జిల్లా యంత్రాంగం పనిచేస్తోందని చెప్పారు. జిల్లాలో మంజూరైన వివరాలు, లేఅవుట్లు, పనుల ప్రగతిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) మయూర్ అశోక్ వివరించారు.
అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ శాఖలవారీగా, అంశాలవారీగా సమీక్షించారు. సంబంధిత అధికారులనుంచి వివరాలు తెలుసుకున్నారు. ఎంఎల్ఏలను అడిగి క్షేత్రస్థాయిలో సమస్యలను, కార్యక్రమం ప్రగతిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, అర్హత ఉన్న ప్రతీపేదవాడికి ఇళ్లు మంజూరు చేయాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలో సుమారు 30లక్షల మందికి ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని, వీటిలో తొలివిడత 15లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. విజయనగరం జిల్లాలో తొలివిడతలోనే 90శాతం ఇళ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. మిగిలిన ఆరు మండలాల్లో కూడా త్వరలోనే ఇళ్లు మంజూరు చేస్తామని, ఈ మేరకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులోగా ప్రతీ నియోజకవర్గ ఎంఎల్ఏలతో సమావేశాన్నినిర్వహించి, గృహనిర్మాణ కార్యక్రమంలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకొని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని హౌసింగ్ జెసిని ఆదేశించారు. ఇప్పటికే రూపొందించిన లేఅవుట్లను మార్చడం కుదరదని, ఆ లేవుట్లలోనే కనీస మౌలిక వసతులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొత్త లేఅవుట్లను రూపొందించేటప్పుడు, ప్రభుత్వ భూములకే ప్రాధాన్యతనివ్వాలని, ప్రభుత్వ భూమి అందుబాటులో లేనప్పుడు మాత్రమే ప్రయివేటువి సేకరించాలని సూచించారు.
అన్ని లేఅవుట్లలో సిసి రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రేనేజి, అండర్ గ్రౌండ్ విద్యుత్ సదుపాయం, త్రాగునీరు, ఆసుపత్రి, ఫైబర్ నెట్ తదితర ఊరికి కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని, దీనికోసం సమగ్ర ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గృహనిర్మాణాలు సాగేందుకు వీలుగా ఈ నెలాఖరు నాటికి అన్ని లేఅవుట్లలో బోర్లు తవ్వించి, నీటి సదుపాయం కల్పించాలన్నారు. లబ్దదారులకు సిమ్మెంటు, ఐరన్ కొరత రాకుండా, మండలాల వారీగా గోదాములను ఏర్పాటు చేసి, తగినంత స్టాకు ఉంచాలని సూచించారు. జిల్లాలో ఎట్టి పరిస్థితిలోనూ ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, వారం రోజుల్లో మూడు ఇసుక స్టాకు పాయింట్లను అందుబాటులోకి తీసుకురావాలని గనులశాఖను ఆదేశించారు. జిల్లాలోని థర్డ్ ఆర్డర్ రీచ్ ల నుంచి గృహనిర్మాణ కార్యక్రమానికి ఉచితంగా, ఇతర సాధారణ నిర్మాణాలకు, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇసుకను అందజేయాలని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఎక్కడ ఇసుక తగినంత అందుబాటులో ఉన్నా, ఆ రీచ్‌కు అనుమతినివ్వాలని, అప్పుడే గృహనిర్మాణ కార్యక్రమం సజావుగా పూర్తవుతుందని మంత్రి స్పష్టం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో ఎంపి బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పి.సురేష్ బాబు, ఎంఎల్ఏలు కోలగట్ల వీరభద్రస్వామి, శంబంగి వెంకట చినప్పలనాయుడు, బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, అలజంగి జోగారావు, కడుబండి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్లు డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్, సబ్ కలెక్టర్ భావన, ఐటిడిఏ పిఓ ఆర్.కూర్మనాధ్, జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, డిఆర్ఓ ఎం.గణపతిరావు, హౌసింగ్ పిడి ఎస్‌వి రమణమూర్తి, మున్సిపల్ కమిషనర్లు, నియెజకవర్గ, మండల ప్రత్యేకాధికారులు, సంబంధిత శాఖల అధికారులు, హౌసింగ్ డిఇలు పాల్గొన్నారు.