రైతులకు లాభదాయకంగా ఉండే పంటలపై శాస్త్రీయమైన సూచనలు, సలహాలను రైతులకు అందించాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.జి.లక్ష్మీషా జిల్లా, మండల వ్యవసాయ సలహా మండళ్లలను కోరారు. గురువారం ఉదయం స్థానిక బోట్ కబ్ల్ సమీపంలోని కృషి భవన్ లో వ్యవసాయ, అనుబంధ శాఖల ఆద్వర్యంలో జిల్లా, మండల వ్యవసాయ సలహా మండళ్ల చైర్మన్ లకు ప్రత్యేక అవగాహనా సదస్సు నిర్వహించారు. సదస్సుకు జాయింట్ కలెక్టర్ (ఆర్) లక్ష్మీశ ముఖ్య అతిధిగా హాజరై వినూత్న వ్యవసాయ సంస్కరణగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండళ్ల లక్ష్యం, రైతుల సంక్షేమం కొరకు సలహాలు, సూచనలు అందించాల్సిన అంశాలు, అవగాహనా కార్యక్రమాలు, అభ్యుదయ కార్యాచరణలు తదితర అంశాలను వివరించారు. రైతు భాగస్వామ్యంతో రైతులకు లాభదాయకమైన వ్యవసాయ విధానాలను రైతులే నిర్ణయించుకోవడమే వ్యవసాయ సలహా మండళ్ల ఏర్పాటు మౌళిక ఆశయమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన, అనుబంద రంగాలలో మార్కెట్ డిమాండు, స్థానిక బౌగోళిక, వాతావరణ పరిస్థితుల కనుగుణంగా లాభదాయకమైన, వైవిద్యమైన పంటలు చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని, తదనుగుణమైన విధాన రూపకల్పనకు ప్రభుత్వానికి సూచనలు చేయాలని వ్యవసాయ సలహా మండళ్లను కోరారు. రైతు ఆదాయలను పెంచే ఉత్తమ విధానాలపై వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా రైతులకు అవగాహన కల్పించడం, నీటి వనరుల సమర్థ వినియోగం, వ్యవసాయ ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలను విస్తరించడం, ప్రజల ఆహార బధ్రత, పౌష్టికత పెంచే పంటల సాగు ద్వారా రైతుల ఆర్థికంగా బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తుల డిమాండు, సప్లయి మద్య లోపాల సవరణ తదితర రైతు సంక్షేమ అంశాలు కార్యాచరణగా సలహా మండళ్లు తమ సలహాలను, సూచనలను ప్రభుత్వానికి అందించాలని కోరారు.
జిల్లాలో మూడు పంటల ప్రణాళిక ద్వారా రైతులు ఆర్థికంగా మరింత ప్రయోజనం పొందవచ్చునని, ఈ మేరకు ఖరీఫ్, రబీ పంటలను సకాలంలో పూర్తిచేసుకుని మూడవ పంటగా అపరాలు, పచ్చి రొట్ట పైర్లు చేపట్టేలా సలహా మండళ్లు రైతులకు సూచించాలని కోరారు. ఇందుకు పంటకాల వ్యవధిని తగ్గించే నేరుగా విత్తన నాట్లు, డ్రమ్ సీడింగ్, లైన్ నాటింగ్, మెషిన్ ద్వారా నాటే పద్దతులను పాటించేలా రైతుల్లో ప్రోత్సహించాలన్నారు. అలాగే జిల్లాలోని మెట్ట మండలాల్లో బోర్లు బావుల క్రింద వరి సాగు చేస్తున్న రైతులకు తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం ఇచ్చే పంటల వల్ల ప్రయోజనాలను వివరించి, ఆరుతడి పంటల సాగుకు మారేట్లు అవగాహన కల్పించాలన్నారు. మార్కెట్ డిమాండు లేని, ఎక్కువ విరుగుదల, మచ్చలతో నాణ్యత తక్కవగా ఉండే యంటియు-3626, యంటియు-1010, 1001, 1153, 1156, యంసి13 వంటి సాధారణ బొండాల రకాల సాగును రైతులు విడనాడి, స్థిరమైన డిమాండుతో అధిక దిగుబడి, ఆదాయం ఇచ్చే స్వర్ణ, సాంబమసూరి, శ్రీకాకుళం సన్నాలు వంటి వరి వంగడాల సాగు రైతులు చేపట్టేలా సూచించాలని కోరారు. నికర వ్యవసాయ ఆదాయం పెంచే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ను రైతుల్లో ప్రోత్సహించాలన్నారు. ఈ-క్రాపింగ్ నమోదు ద్వారా పంటనష్టాలకు పరిహారం, భీమా పరిహారం, రైతు భరోసా సహాయం, సున్నా వడ్డీ రుణాలు వంటి అంశాల ద్వారా రైతులకు ఒనగూడే ప్రయోజనాలను వివరించి రైతులు పంట వివరాలను తప్పని సరిగా నమోదు చేసుకునేట్లు అవగాహన కల్పించాలన్నారు. అధిక ఆదాయప్రదమైన పంటలతో రైతులు, నాణ్యమైన ఆహార ఉత్పత్తులతో వినియోగదారులు ప్రయోజనం పొందేలా ఉభయతారకమైన విధానాలను రైతులకు, ప్రభుత్వానికి సూచించాలని జాయింట్ కలెక్టర్ వ్యవసాయ సలహా మండళ్లను కోరారు.
వ్యవసాయ శాఖ జాయిట్ డైరెక్టర్ ఎన్.విజయకుమార్ మార్కెట్ ఇంటిలిజెన్స్ కనుగుణంగా ఏఏ పంటలు ఏఏ ప్రాంతాలలో సాగుచేస్తే లాభదాయకంగా ఉంటుందనే అంశాలను వివరించారు. ఉపసంచాలకులు ఎస్.మాధవరావు రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులో వ్యవసాయ ఉపకరణాలు, సేవలు గురించి వివరించారు. జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ మోటూరి సాయి మాట్లాడుతూ రైతులు పొలం గట్లపై కంది పంట సాగును చేపట్టేలా రైతులను సమాయత్తం చేయాలన్నారు.
ఈ సదస్సులో మండల వ్యవసాయ సలహా మండళ్ల చైర్మన్ లు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ అనుబంధ రంగ శాఖల అధికారులు పాల్గొన్నారు.