సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడే మీడియా సమాజంలో కీలక పాత్రను పోషిస్తుందని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో సామాజిక కార్యకర్త సూర శ్రీనివాసరావు నిర్వహించిన జర్నలిస్టు యోధులకు చేయూత కార్యక్రమం జర్నలిస్టుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో జరిగిన మంచిని అభినందిస్తూ, చెడును విమర్శించేది మీడియా మాత్రమేనని అన్నారు. సమాజంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని, అటువంటి మీడియాకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం శుభదాయకమని అన్నారు. గతంలో పత్రికా రంగంలో పనిచేసిన దాత సూర శ్రీనివాసరావు జర్నలిస్టుల సమస్యలను గుర్తించి వారికి సేవలు అందించడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో కోవిడ్ ఫస్ట్ వేవ్ మరియు సెకెండ్ వేవ్ పట్ల ప్రతీ పల్లె, వీధి, పట్టణ ప్రజల్లో చైతన్యం వచ్చేందుకు ముఖ్యకారణం మీడియానే అని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. మీడియా ద్వారా ప్రజలకు ఎప్పటికపుడు సమాచారాన్ని చేరవేస్తూ, వారిని అప్రమత్తం చేసేంది కూడా మీడియానే అని స్పష్టం చేసారు.
సూర శ్రీనివాసరావు పత్రికా రంగంతో ప్రారంభించి , నేడు పారిశ్రామిక వేత్తగా ఎదిగారన్నారు. సూర శ్రీను గతంలో చేసిన రంగంలో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని మీడియాకు సేవలు అందించడం స్పూర్తిదాయకమని అన్నారు. ఆయన సేవలు చిరస్థాయిగా ఉంటాయని, ఇటువంటి కార్యక్రమాల వలన పుణ్యం, సంతృప్తి లభిస్తుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఇస్తున్నవాళ్లు ఇస్తుండాలి.. తీసుకుంటున్న వాళ్లు తీసుకుంటుండాలి... తీసుకుంటున్న వాళ్లు ఇచ్చే స్ధాయికి ఎదగాలనే మరాఠీ సామెతను కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తుచేసారు. సూర శ్రీనివాసరావు సేవలను అభినందించిన ఆయన జిల్లా యంత్రాంగం తరపున సహాయసహకారాలు అందించేందుకు సిద్దమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి యల్.రమేష్ మాట్లాడుతూ జిల్లాలో చాలా మంది పాత్రికేయులు జీతం కోసం కాకుండా, ఆ వృత్తిపై ఉండే మక్కువతో పనిచేస్తున్నారని కలెక్టర్ కు వివరించారు. కోవిడ్ సమయంలో జీతభత్యాలకు ఆశించకుండా సామాజిక సేవాధృక్పధంతో మీడియా ప్రతినిధులు పనిచేసారని, కోవిడ్ ఫస్ట్ వేవ్ మరియు సెకెండ్ వేవ్ సమయంలో తమ ప్రాణాలకు లెక్కచేయకుండా ఫ్రంట్ లైన్ వారియర్లుగా మీడియా విధులు నిర్వహించిందని కితాబు ఇచ్చారు. తుఫాను, వడదెబ్బల సమయంలో మీడియా ముందుండి ప్రజలను చైత్యన్యపరిచిన సంగతిని ఆయన గుర్తుచేసారు. సుమారు లక్ష మంది వరకు వలస కార్మికులు జిల్లాకు చేరుకున్నారని, వారందరికి అవసరమైన భోజనం, ఇతరత్రా ఏర్పాటు విషయంలో మీడియా గణనీయమైన పాత్రను పోషించిందని అన్నారు. సూర శ్రీనివాసరావు ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి పారిశ్రామిక వేత్తగా ఎదిగినప్పటికీ ప్రజలకు మంచి చేయాలనే సదుద్దేశ్యంతో గత 45 రోజులుగా ఆసుపత్రులలోని కోవిడ్ రోగులకు, రిక్షా, ఆటో కార్మికులకు, వలస కార్మికులకు, బిచ్చగాళ్లకు భోజన వసతితో పాటు ఇతరత్రా ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. సూర శ్రీను భవిష్యత్తులో మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా సూర శ్రీనివాసరావు దంపతులకు కలెక్టర్ దుశ్శాలువ, జ్ఞాపిక, పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. అనంతరం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసకుమార్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, ఫిజికల్ డైరక్టర్ మోహనరావు, జర్నలిస్టుల ఐక్యవేదిక నిర్వాహకులు కొంక్యాణ వేణుగోపాలరావు, శాసపు జోగినాయుడు, ప్రతినిధులు సూర చంద్రశేఖరరావు, డోల అప్పన్న, యం.ఎ.వి.సత్యనారాయణ, సీనియర్ పాత్రికేయులు సిహెచ్.లక్ష్మణరావు, స్టార్ వాకర్స్ మహిళా క్లబ్ అధ్యక్షురాలు అంధవరపు జ్యోతిర్మయి, రోటరీ కైలాసభూమి నిర్వాహకులు బి.శ్రీనివాసరావు, స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్.సూర్యారావు, ఎ.వి.రమణ, మాజీ గవర్నర్లు జి.ఇందిరాప్రసాద్, కె.వి.ఆర్.మూర్తి, డాడీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జి.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.