అక్క చెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన, వారి జీవితాల్లో వెలుగు నింపడానికి చేయూత కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వై.ఎస్.ఆర్ చేయూత పథకం లో అర్హులైన మహిళల ఖాతాలలోనికి రెండవ సంవత్సరం ఒక్కొక్కరికి రూ.18,750 చొప్పున నగదు జమ చేసే కార్యక్రమం ముఖ్య మంత్రి మంగళ వారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు అమ్మఒడి, ఆసరా, సున్నావడ్డీ, పేదలందరికీ ఇళ్లు పథకాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 45-60 సంవత్సరాల మధ్య ఉన్న ఎస్.సి, ఎస్.టి, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ ల ద్వారా మంజూరు చేసిన రెండవ విడత నగదు లబ్ధిదారుల ఖాతాలలోకి జమ చేశారు. జగనన్న ప్రభుత్వం అందిస్తున్న కానుక వరసగా రెండో ఏడాది వైయస్సార్ చేయూత కార్యక్రమం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన దాదాపు 23,14,342 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు 4,339.39 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు.
ఈ సందర్భంగా విశాఖపట్నం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వై.ఎస్.ఆర్ చేయూత వివరాలు తెలియజేస్తూ జిల్లాలో 1,99,695 మంది లబ్దిదారులకు రూ.374,42,81,250 లు వారి ఖాతాలకు జమ అవుతుందన్నారు. జివియంసి పరిధిలో రూ.118,37,62,500లు నమోదవుతుందని చెప్పారు. ఎస్.సి. కార్పొరేషన్ ద్వారా 18,583 మంది లబ్దిదార్లకు, ఎస్.టి. కార్పొరేషన్ ద్వారా 28,811 బి.సి. కార్పొరేషన్ ద్వారా 1,48,810 మందికి, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 3,491 మందికి చేయూత పథకంలో లబ్ది చేకూరినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర మేయరు జి.వి.హరికుమారి, డిప్యూటి మేయరు బియ్యాని శ్రీధర్, జివియంసి కమిషనర్ డా.జి.సృజన, శాసన సభ్యులు గుడివాడ అమర్ నాథ్, కరణం ధర్మశ్రీ, మత్స్యకార అభివృద్ధి, సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ కోలా గురువులు, జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, డి.ఆర్.డి.ఎ. పి.డి. వి.విశ్వేశ్వరరావు, యు.సి.డి. పి.డి. శ్రీనివాస్, మెప్మా పి.డి. తదితరులు పాల్గొన్నారు.