రైతులు ఖరీఫ్, రబీ పంటలను సకాలంలో పూర్తి చేసి 50 శాతం విస్తీర్ణంలో 3వ పంటగా పప్పు ధాన్యాలు, పచ్చి రొట్టపైర్ల సాగును, బోర్ల క్రింద వరికి బదులు లాభదాయకమైన ఆరుతడి పంటలను చేపట్టేలా ప్రోత్సహించాలని తూర్పు గోదావరి జిల్లా వ్యవసాయ సలహా మండలి తీర్మానించింది. శుక్రవారం జడ్పి సమావేశ మందిరంలో నూతనంగా ఏర్పాటైన తూర్పు గోదావరి జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం మండలి చైర్ పర్సన్ మోటూరు సాయి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీతా ముఖ్య అతిధులుగా హాజరైయ్యారు. జ్యోతి ప్రజ్వలన, ప్రార్థనాగీతాలతో సమావేశం ప్రారంభం కాగా నూతనంగా ఏర్పాటైన జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్, సభ్యులకు అతిధులు అభినందనలు తెలియజేశారు. అనంతరం మండలి కన్వీనర్, జాయింట్ కలెక్టర్ డా.జి.లక్ష్మీశ రాష్ట్ర ప్రభుత్వం జిఓ ఎంఎస్ నెం.70 ద్వారా ఏర్పాటు చేసిన జిల్లా, మండల, ఆర్.బి.కె. స్థాయి వ్యవసాయ సలహా మండళ్ల మౌళిక లక్ష్యాలను సభ్యులకు వివరించారు.
వ్యవసాయ, ఉద్యాన, అనుబంద రంగాలలో మార్కెట్ డిమాండు, ఆగ్రో-క్లైమాటిక్ జోన్ల్ ల కనుగుణంగా లాభదాయకమైన పంటల వైవిద్యాలను రైతులలో ప్రోత్సహించేలా సపోర్ట్ ప్యాకేజిల అమలుకు ప్రభుత్వానికి సూచనలు చేయడం, నికర వ్యావసాయిక ఆదాయలను పెంచే ఉత్తమ విధానాలపై వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా రైతులకు అవగాహన కల్పించడం, నీటి వనరుల సమర్థ వినియోగం, వ్యవసాయ ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలను విస్తరించడం, ప్రజల ఆహార బధ్రత, పౌష్టికత పెంచే పంటల సాగు ద్వారా రైతుల ఆర్థికంగా బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తుల డిమాండు, సప్లయి మద్య లోపాల సవరణ తదితర రైతు సంక్షేమ అంశాలపై జిల్లా వ్యవసాయ సలహా మండలి చర్చించి, రాష్ట్ర మండలి ద్వారా ప్రభుత్వానికి సూచనలు చేస్తుందని ఆయన తెలిపారు. జిల్లా ఇన్చార్జి మంత్రి గౌరవ చైర్మన్ గాను, రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ఆభ్యుదయ రైతు మోటూరు సాయి చైర్ పర్సన్ గాను, జిల్లా కలెక్టర్ వైస్ చైర్మన్ గాను అన్ని నియోజక వర్గాల నుండి ప్రోగ్రెసీవ్ ఫార్మర్లు 17 మందితో పాటు, జిల్లా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, జడ్పి, డిసిసిబి, డిసిఎంఎస్, వాటర్ యూజర్స్ అసోసియేషన్ల చైర్మన్లు, వ్యవసాయ, అనుబంధ రంగ శాఖల జిల్లా అధికారులుగా జిల్లా సలహా మండలి ఏర్పాటైందని ఆయన వివరించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ రైతు పక్షపాతిగా, రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి వినూత్నమైన ఆలోచనతో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ వేలాది మంది రైతులు సభ్యులుగా వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేసారన్నారు. రైతు భాగస్వామ్యంతోనే వ్యవవసాయ రంగంలో మంచి ఫలితాలు చేకూరతాయని, నిర్ణయాలను పై స్థాయి నుండి రైతులపై రుద్దడం కాకుండా, తమకు అనువైన, ప్రయోజనకరమైన విధానాలను రైతులే నిర్ణయించుకునేలా వారి నుండి సూచనలు ఈ మండళ్ల ద్వారా స్వీకరించి ప్రభుత్వం విధాన రూపకల్పన చేస్తుందన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఉచిత పంటల భీమా, వడ్డీలేని రుణాలు, ఆర్ బి కెలు, ఇంటిగ్రేటెడ్ లాబ్ లు వంటి కార్యక్రమాల్లాగే వ్యవసాయ సలహా మండళ్లు కూడా చారిత్రాత్మకం నిలువనున్నాయన్నారు. ఈ క్రాప్ బుకింగ్ తప్పని సరి చేయడం ద్వారా ఏ పంట, ఎక్కడ, ఎంత ఉత్పత్తి ఉందో ఖచ్చితంగా నిర్థారించి వ్యవసాయ ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ ద్వారా రైతులకు అధిక ఆదాయం కల్పిస్తున్నామన్నారు. నూతనంగా ఏర్పాటైన వ్యవసాయ సలహా మండలి సభ్యులు తమ ప్రాంత రైతుల సమస్యలు, అవసరాలను ప్రభుత్వం దృష్టికి తేవాలని మంత్రి కన్నబాబు కోరారు.
రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ నిరాశా, నిస్పృహలతో వ్యవసాయం పట్ల రైతులల్లో పెరుతున్న అనాశక్తికి కారణాలను విశ్లేషించి, రైతులు విశ్వాసం, సంతోషాలతో సాగుచేపట్టేలా తిరిగి ఆకర్షితులను చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేపడుతున్న ఆదర్శ వ్యవసాయ సంస్కరణలలో భాగాంగా వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశారన్నారు. పంట వేయడానికి, వేసాక దాన్ని పండించేందుకు, పండిని పంటను అమ్ముకోవడానికి రైతులు పడుతున్న ఇక్కట్లకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు శాశ్వత ముగింపు పలుకుతాయన్నారు. జిల్లాలో డ్రయిన్లు ప్రధాన సమస్యగా ఉన్నాయని, బోదెలు, పిల్లకాల్వల స్థాయి డ్రెయిన్ల నిర్వహణ ఆర్బికేల ద్వారా చేపట్టాలని ఆయన సూచించారు. కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీత మాట్లాడుతూ వ్యవసాయం దేశానికి వెన్నెముకని, రైతును రాజుగా చూడాలనే స్వర్గీయ డా.వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాన్ని తనయుడుగా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సాకారం చేస్తున్నారన్నారు. సాంకేతికంగా వచ్చిన అభివృద్ది వ్యవసాయ రంగ పురోగతికి తోడ్పడేలా లాబ్ లలో జరిగిన పరిశోధనలు క్షేత్రాలలో ప్రయోజనాలుగా వికసించాలన్నారు. కరోనా కాలంలో మిగిలిన అన్ని రంగాలు ఆగినా రైతులు అన్నం పెట్టే పంటల సాగును వీడలేదని, ఈ కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం రైతులు అండగా నిలిచి ఆదుకున్నాయన్నారు. సమావేశంలో విశిష్ట అతిధులుగా పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే డా.సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పంట వచ్చేందు 15 రోజుల ముందే ప్రారంభించాలని, డిమాండు, స్థానిక వినియోగం లేని బొండాలు వంటి రకాలను రైతులు చేపట్టకుండా అవగాహన కల్పించాలని సూచించారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ జిల్లాలో నీటి వినియోగం ఎక్కవగా ఉండే వరి సాగునే రైతులు ఎక్కవగా ఎంచుకుంటున్నందున, నీటి సరఫరాలో ఒడిదుకులు రాకుండా గోదావరి, ఏలేరు వ్యవస్థలలో సమర్థమైన నీటి యాజమాన్యం ఉండాలని సూచించారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్ పర్సన్ మోటూరి సాయి మాట్లాడుతూ రైతు బావుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. రైతు సంక్షేమం కొరకు జగన్మోహనరెడ్డి చేపట్టినన్ని పధకాలు మరెక్కడా లేవని, రైతాంగంలో క్రొత్త ఆశలు, ఆకాంక్షలను నింపుతున్నాయన్నారు.
జిల్లాలో గతంలోలా రైతులు 3 పంటలు పండించేలా ఖరీఫ్ పంటల సాగును జూలై మాసాంతంలోపున, రబీ పంటలను డిశంబరు 31 లోపున ఊడ్పులు పూర్తి చేసేలా పంట కాలాలను సవరించించుకుని మూడో పంటగా కనీసం 50 శాతం విస్తీర్ణంలో పప్పు ధాన్యాలు, పచ్చి రొట్ట పైర్లను వేయాలని కమిటీ సూచించింది. ఇందుకు ప్రస్తుత సీజనలు కోల్పయిన 15 రోజుల పంటకాలాన్ని వెదజల్లే విధానం, డ్రమ్ సీడింగ్ విధానాల ద్వారా తగ్గించే రైతులను వ్యవసాయ శాఖ అధికారులు ప్రోత్సహించాలని మంత్రి కన్నబాబు ఆదేశించారు. బోర్ల క్రింద పంటల మార్పిడి క్రింద అపరాలు, చిరిధాన్యాల సాగు ప్రోత్సాహః - జిల్లాలోని 11 మెట్ట మండలాల్లోని సుమారు 21వేల హెక్టార్లలో బోర్ల క్రింద వరి సాగు జరుగుతోదని, ఈ విస్తీర్ణాన్ని పంట మార్పిడి క్రింద దశల వారీగా వరి నుంచి తక్కవ నీటితో ఎక్కవ ఆదాయం ఇచ్చే పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, చిరిధాన్యాలు, ఆయిల్ పామ్ వంటి పంటల సాగులోకి మార్చాలన మండలి సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వ్యవసాయ విద్యుత్ గా ఎకరాకు ఏడాదికి 49 వేలు సబ్సిడీ ఇస్తోందని, దీని లాభదాయకం కాని వరి సాగుకు వాడటం సముచితం కాదని, రైతులు తక్కవ నీటితో ఆధిక దిగుబడులు, ఆదాయం అందించే ఆరతడి పంటలను చేపట్టాలని మంత్రి కన్నబాబు కోరారు. ఈ మండలాల్లో ఈ ఏడాది 25 శాతం, వచ్చే ఏడాది 40 శాతం, తదుపరి ఏడాదికి 100 శాతం బోర్ల క్రింది విస్తీర్ణాన్ని ఆరుతడి పంటల క్రింది తేవాలని, ఇందుకు అవసరమైన రాయితీలు అందిస్తామన్నారు. మైక్రో ఇరిగేషన్ క్రింద డ్రిప్, స్ప్రింక్లర్ లకు రాయితీలు తిరిగ కల్పిస్తామని, అయితే అవి దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు.
జిల్లాలో రైతులు ఎక్కవగా పండిస్తున్న బొండాలు రకానికి స్థానిక వినియోగం లేకపోవడం, కేరళలో డిమాండు తగ్గిపోవడం వల్ల ఈ రకం ధాన్యానికి రైతులు సరైన ధర పొందలేకపోతున్నారని, ఇటువంటి డిముం లేని రకాల స్థానంలో జిల్లా రైతులు అధిక డిమాండు, ధర పలుకుతున్న స్వర్ణ, సాంబమసూరి, శ్రీకాకుళం సన్నాలు వంటి రకాల సాగు చేపట్టేలా ఆర్బికేలు, వ్యవసాయ క్షేత్రాధికారులు రైతులను ప్రోత్సహించాలని మంత్రి కన్నబాబు సూచించారు. పొలం గట్లపై కంది పంటల సాగు, సమీకృత వ్యవసాయానికి ప్రోత్సాహం - జిల్లాలో 50 వేల ఎకరాల రైతుల పొలం గట్లపై కంది పంటను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిపాదించగా, విస్తీర్ణాన్ని కనీసం 100 ఎకరాల పొలం గట్లకు పెంచాలని మంత్రి కన్నబాబు ఆదేశించారు. అలాగే రైతులకు బహుళ ఆదాయాలను ఇచ్చే సమీకృత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు.
డ్రెయిన్లలో గుర్రపు డెక్క, తూడు పూడిక సమస్య పరిష్కారానికి వాటి తొలగింపు ప్రక్రియను యాన్యూవల్ మెయింటినెన్స్ (వార్షిక నిర్వహణ) కి అప్పగించి, ఎప్పటికప్పడు తొలగించే ప్రతిపాదనను ఇరిగేషన్ శాఖతో చర్చించి తగు నిర్ణయం గైకొంటామని మంత్రి కన్నబాబు తెలిపారు. ఆలాగే బోదెలు, చిన్న కాల్వల నిర్వహణను ఆర్బికే ల క్రిందకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఈ సమావేశంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, వ్యవసాయ శాఖ జేడి ఎన్.విజయకుమార్, డిడిలు వి.టి.రామారావు, ఎస్.మాధవరావు, ఉద్యాన వన శాఖ డిడి ఎస్.రామ్మెహన్, పశుసంవర్థక శాఖ జెడి డా. సూర్యప్రకాషరావు, అనుబంధ శాఖల అధికారులు, మండలి సభ్యులు పాల్గొన్నారు.