వైద్య వసతులలో వెనకబడి ఉన్న అనంతలో విశాఖ లాంటి మెట్రో నగరాలు ఉన్న జిల్లాలతో సమానంగా మౌలిక వసతులు ఏర్పాటు చేసుకున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద నిర్మిస్తున్న 300 పడకల తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఆక్సిజన్ పడకలు కావాలని రేయింబవళ్లు ఫోన్లు, మెసేజులు వచ్చేవన్నారు. వైద్యాధికారుల ద్వారా కొందరికి పడకలు అందించగలిగినా అందరికీ సరిపోని పరిస్థితి ఉండేదన్నారు. అలాంటి స్థితిలో మార్పు తెచ్చి అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా మౌలిక వసతులను పెంచేందుకు తాత్కాలిక ఆసుపత్రుల నిర్మాణ పనులను మొదలు పెట్టామన్నారు. తాడిపత్రిలో 500 ఆక్సిజన్ పడకలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద 300 ఆక్సిజన్ పడకలతో తాత్కాలిక ఆసుపత్రులను నిర్మించామన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఇంచార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా మంత్రి శంకర నారాయణ మరియు ఇతర ప్రజా ప్రతినిధులు సహకారంతో కేవలం నిర్మాణం ప్రారంభించిన 20 రోజుల్లోనే సూపర్ స్పెషాలిటీ వద్దనున్న తాత్కాలిక ఆసుపత్రిలో వైద్యం అందించగలుగుతున్నామన్నారు. రేపో, మాపో తాడిపత్రి తాత్కాలిక ఆసుపత్రిని కూడా ప్రారంభిస్తామన్నారు.
కరోనాను ఎదుర్కోడానికి వసతులు లేవు, వసతులు సరిపోవు అని చేతులెత్తేయకుండా జిల్లా యంత్రాంగం నిర్మాణాత్మకంగా వ్యవహరించిందని గర్వంగా చెప్పగలనన్నారు.
విజయవాడ నుండి మంత్రి బొత్స నారాయణతో పాటు పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, గుంతకల్ ఎమ్మెల్యే వై. వి.వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ శమంతకమణి, పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి వర్చువల్ విధానంలో పాల్గొన్నారు . స్థానిక అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నందు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎం.శంకర్ నారాయణ, అనంతపురం పార్లమెంటు సభ్యులు టి. రంగయ్య, హిందూపురం పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్, స్థానిక శాసన సభ్యులు అనంత వెంకట్రామిరెడ్డి , జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, నగర మేయర్ మహమ్మద్ వసీం, జాయింట్ కలెక్టర్లు సిరి, నిశాంత్ కుమార్, డి.ఎమ్.హెచ్.ఓ కామేశ్వర్ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ మూర్తి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు .