1 ENS Live Breaking News

జెమ్స్ లో ఉచిత గుండె వైద్యసేవలు..

శ్రీకాకుళం జిల్లా రాగోలు జెమ్స్ ఆసుపత్రిలో ఆదివారం నుండి గుండె వ్యాధుల ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.  కోవిడ్ నుండి కోలుకున్న అనంతరం  గుండె వ్యాధులతో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని తెలుస్తుందని అన్నారు. దీని నివారణలో భాగంగా జిల్లా కలెక్టర్ మే 30 నుండి జూన్ 30వ తేదీ వరకు గుండెకు సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ వైద్య సేవలలో రక్త పరీక్షలు, 2డి ఇకో, ఇసిజి, టి.ఎమ్.టి. మొదలగు పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు అందరు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్   కోరారు. అందుబాటులో ఉన్న గుండె వ్యాధుల వైద్య నిపుణులు డా. అరుణ్ కుమార్, డా.విజయ్, డా.నాగచైతన్య, గుండె శస్త్ర చికిత్సల నిపుణులు డా.రవి కిరణ్, డా.అనిరుధ్ అందుబాటులో ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు, బాధ్యత గల డా.ప్రవీణ్ కుమార్ నంబర్లను తెలిపారు. 7680945332/ 47, 6309990628/ 29 జిల్లా ప్రజలు తక్షణం ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని, ఎటువంటి గుండె రుగ్మతలకు లోనుకావద్దని ఆయన విజ్ఞప్తి చేసారు.

Srikakulam

2021-05-30 12:10:12

బాపట్ల మెడికల్ కాలేజీ చరిత్రలో నిలిచిపోతుంది..

గుంటూరు జిల్లాలో బాపట్లకు మెడికల్ కళాశాల తలమానికంగా ఉంటుందని రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి కోన రఘుపతి పేర్కొన్నారు. బాపట్లలో మెడికల్ కళాశాల భవనాలకు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను ఆదివారం రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి కోన రఘుపతి, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్తో కలిసి పరిశీలించారు. మెడికల్ కళాశాల కోసం కేటాయించిన స్థలంను, మెడికల్ కశాశాల భవనం, ఆస్పత్రి భవనాల మ్యాప్లను  పరిశీలించారు. ప్రారంభోత్సవం సంధర్భంగా చేస్తున్న ఏర్పాట్ల పై డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులకు సూచనలు ఇచ్చారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, వర్చువల్ పద్దతిలో ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేస్తున్నందున  ఇంటర్ నెట్ బ్యాండ్ విడ్త్ సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ముఖ్య అతిధులకు, ఆహ్వానితులకు సీటింగ్ ఎరేంజ్ మెంట్ చేయాలన్నారు. ఈ సంధర్భంగా రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి కోన రఘుపతి మాట్లాడుతూ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు, 20 కీమీ పరిధిలోని ప్రజలకు మెడికల్ కళాశాలలో భాగంగా ఏర్పాటు చేస్తున్న  500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి  ద్వారా మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపిన విధంగా మెడికల్ కళాశాల ఏర్పాటుతో బాపట్ల మెడికల్ హబ్గా మారిపోతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం జిల్లాగా ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించినందున త్వరలో జిల్లా కేంద్రంగా మారనున్న బాపట్లలో మెడికల్ కళాశాల ఏర్పాటుతో వైద్యసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. కోవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే ముఖ్యులను ఆహ్వానించటం జరుగుతుందని, కార్యక్రమం మొత్తం లైవ్ టెలికాస్ట్ చేయటం జరుగుతున్నందున ప్రజలు సహకరించాలని కోరారు.

జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో బాపట్ల, పిడుగురాళ్ళలో మెడికల్ కళాశాల భవనాల నిర్మాణానికి  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ పద్దతిలో శంకుస్థాపన కార్యక్రమంకు అవసరమైన ఏర్పాట్లును కోవిడ్ ముందస్తు జాగ్రత్త చర్యలు పాటిస్తూ  సిద్దం చేయటం జరిగిందన్నారు. బాపట్లలో మెడికల్ కళాశాల ఏర్పాటు ఈ ప్రాంత ప్రజలకు వరంలాంటిదన్నారు. కోవిడ్ మహమ్మారితో  ప్రజలకు వైద్యసౌకర్యం ఎంతో ముఖ్యమో ప్రపంచానికి తెలిసిందన్నారు. కోవిడ్ నేపథ్యంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయటం ఎంతో హర్షించదగ్గ అంశం అన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్, బాపట్ల మున్సిపల్ కమిషనర్ బాను ప్రకాష్, తహశీల్దారు శ్రీనివాసరావు, ఏపీఎంఐడీసీ అధికారులు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Bapatla

2021-05-30 12:03:27

జనరంజక పాలనే YSRCP ప్రభుత్వ లక్ష్యం..

అందరికీ సమన్యాయం చేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. సంక్షేమ పాలనకు రెండేళ్లు సందర్భంగా ఆదివారం కాకినాడ రమణయ్యపేటలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి కురసాల కన్నబాబు మీడియా సమావేశంలో రెండేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాల వివ‌రాల‌ను వెల్ల‌డించారు. రెండేళ్ల కాలంలో సంచలనాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.83 వేల కోట్లను రైతులకు నేరుగా అందించి, రికార్డు సృష్టించిందన్నారు. పథకాల ఫలాలు పొందడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా వాలంటీర్; గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల‌ ద్వారా ప్రజలకు ఇంటివద్దకే సంక్షేమ పాలన అందుతోందని పేర్కొన్నారు. వివిధ పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా రూ.1,25,000 కోట్లకు పైగా జమచేయగా.. ఎక్కడా రూపాయి అవినీతి అనేది జరగలేదన్నారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను పోగొట్టుకున్న చిన్నారులకు రూ.10 లక్షల డిపాజిట్ చేసే కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించగా.. ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని కేంద్రం కూడా చిన్నారుల సంక్షేమానికి విధానాలు ప్రకటించిందని తెలిపారు. పూర్తి పారదర్శకత, జవాబుదారీతనంతో సంక్షేమ పథకాలను అమలుచేస్తూ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పడానికి ఇదో ఉదాహరణ అని పేర్కొన్నారు. 

 సోమవారం రాష్ట్రంలో 16 మెడికల్ కళాశాలలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారని, ఈ కాలేజీలు అందుబాటులోకి వస్తే వైద్య సిబ్బందికి కొరత అనే మాట ఉండదని మంత్రి పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లకాలంలో రూ.14 వేల కోట్ల ఖర్చుతో వ్యవసాయ రంగానికి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు. గ్రామాల్లో గోదాములు, కోల్డ్ స్టోరేజ్‌లు, బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలు, కస్టమ్ హైరింగ్ కేంద్రాలు వంటివి అందుబాటులోకి వస్తాయన్నారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో ఉప్పలంక వద్ద ఫిష్ ల్యాండింగ్ కేంద్రం రానుందని ప్రకటించారు. నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి మండలంలోనూ రెండు పీహెచ్‌సీలు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల (సీహెచ్‌సీ)ను కూడా బలోపేతం చేసేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించి, అమ‌లుచేస్తోంద‌న్నారు. ఈ విధంగా విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలతో పాటు సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తూ ప్రభుత్వం పాలన సాగిస్తోందని స్పష్టం చేశారు. అభివృద్ధి అంటే కేవలం నిర్మాణాలు కాదని.. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడం అభివృద్ధి అని భావించి ప్రభుత్వం వివిధ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లుచేస్తోంద‌ని వివ‌రించారు. ఇదంతా గౌరవ ముఖ్యమంత్రి దార్శనికతకు నిదర్శనమని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు ప్రతి దాంట్లోనూ అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పి, ప్రతి రంగంలోనూ అద్భుతమైన పనితీరుతో ప్రభుత్వం రాష్ట్రాన్ని ముందువరుసలో నిలిచేలా చేసిందని మంత్రి వెల్లడించారు.

నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం కింద 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందించి, తొలిదశలో 15 లక్షల ఇళ్లను మంజూరు చేసి.. ప్రతి పేదవానికి సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయలు వెచ్చించి, ప్రైవేటు స్థలాలను సైతం సేకరించి ఎక్కడా ఎలాంటి సాంకేతికపరమైన సమస్యలు లేకుండా ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. ఇంకా అర్హత ఉన్నవారు ఎవరైనా ఉంటే సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లోనే పట్టా మంజూరవుతుందన్నారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో కరప, కాకినాడ గ్రామీణ మండలాల్లో సంక్షేమ పథకాల ద్వారా రెండు లక్షలకు పైగా కుటుంబాలకు రూ.146.44 కోట్ల మేర లబ్ధి చేకూరినట్లు తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గంలో రూ.190 కోట్లకు పైగా ఖ‌ర్చుతో అభివృద్ధి పనులు చేప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు. కోవిడ్ విపత్తు సమయంలోనూ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా, లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చుతున్నట్లు మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. మున్ముందు ఇలానే పనిచేస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం  కృషిచేయనున్నట్లు తెలిపారు.

ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శం: ఎంపీ వంగా గీత‌
కాకినాడ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. పథకాలు ప్రారంభించడమే కాకుండా.. ఆ పథకాలను అమలుచేస్తున్న తీరు ఇతర రాష్ట్రాల ప్రజలను సైతం  ఆకట్టుకుంటోందన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను పటిష్టం చేయడంతో పాటు పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేందుకు ప్రత్యేకంగా వాలంటీర్, గ్రామ సచివాలయ వ్యవస్థలను ప్రవేశపెట్టారన్నారు. వైద్య శాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు ఎంపీ వంగా గీత పేర్కొన్నారు.

విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు కృషి: ఎమ్మెల్సీ పండుల ర‌వీంద్ర‌బాబు
ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండటం గొప్ప అదృష్టమని పేర్కొన్నారు. కోవిడ్ విపత్తు సమయంలో మనం సురక్షితంగా ఉండగలుగుతున్నామంటే ఆయన ఉన్నార‌నే భ‌రోసానే కార‌ణ‌మ‌ని వ్యాఖ్యానించారు. విద్య, ఆరోగ్యం ప్రాధాన్యతను గుర్తించి, ఈ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం కృషిచేసిందన్నారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థ ఉండటంల వల్ల కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నామని ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు పేర్కొన్నారు.

Kakinada

2021-05-30 10:47:05

రెండేళ్ల పాలనపై పుస్తకం విడుదల..

అందరి సహకారంతో రెండేళ్ల పాలన పూర్తి చేసుకోగలిగామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ,  86 శాతం ప్రజలకు ఏదో ఒక సంక్షేమ పథకం చేరిందన్నారు. ప్రజలకు నేరుగా రూ.95,528 కోట్లు.. ఇతర పథకాల ద్వారా మరో రూ.36,197 కోట్లు.. మొత్తంగా రూ.1.31 లక్షల కోట్లు అందించగలిగామని తెలిపారు. ప్రతి గ్రామ సచివాలయం వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి సిబ్బందికి సీఎం వైఎస్‌ జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరి సహకారంతోనే సుపరిపాలన అందించగలిగాం. రెండేళ్లలోనే 94.5 శాతం హామీలను పూర్తి చేశాం. రెండేళ్ల పాలనలో అందరికి మంచి చేశానన్న నమ్మకం ఉంది. రాబోయే కాలంలో ఇంకా మంచి చేసేందుకు శక్తి ఇవ్వాలని దేవున్ని కోరుతున్నానని’’ సీఎం జగన్ అన్నారు.

Tadepalle

2021-05-30 10:44:23

సీఎం వైఎస్ జగన్ పాలన ఒక మైలురాయి..

రాష్ట్ర అభివృద్ధి తో సమాంతరంగా విశాఖ అభివృద్ధికి కంకణం కట్టుకున్న ఏకైక సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి మాత్రమేనని విశాఖ వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు సీహెచ్ వంశీ క్రిష్ణ శ్రీనివాస్ అన్నారు. వైఎస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర అభివ్రుద్ధిలో భాగంగా విశాఖను పరిపాలన రాజధానిగా మార్చి ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు వచ్చేలా చేశారన్నారు. అధికారంలో వున్న సమయలో 100 మీటింగులు పెట్టిన చంద్రబాబు ఒక్క శాస్వత అభివ్రుద్ధి పని చేపట్టలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి చేసిన అభివ్రుద్ధిని తన ఖాతాలో వేసుకొని ప్రచారం చేసుకున్న చేత గాని వ్యక్తిగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని.. దేశంలో ఎవరూ చేయని సంక్షేమ అభివృద్ధి పథకాలను ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టి ప్రజల మనసులు గెలుచుకున్నారని వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ టెక్నాలజీ విభాగం నాయకులు శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మద్దెలపాలెం

2021-05-30 08:53:08

జూన్ 1 నుంచి అప్పన్న లడ్డూ విక్రయాలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలో  జూన్ 1 నుంచి సింహాద్రి అప్పన్న లడ్డూ ప్రసాద విక్రయాలు ప్రారంభించనున్నట్టు ఆలయ ఈఓ ఎంవీ సూర్య కళ తెలియజేశారు. ఆదివారం ఈ మేరకు ఆమె దేవస్థానంలో మీడియాతో మాట్లాడారు. కోవిడ్-19 వల్ల కొన్ని రోజులుగా ప్రసాదం, లడ్డూల విక్రయం నిలిపివేశామని, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వాటిని తయారు చేసి మళ్లీ  భక్తులకు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలియజేశారు.  క్యూ లైన్లలో  జాగ్రత్తలు తీసుకుని  ఆలయం తెరిచి ఉన్న సమయంలో వాటిని భక్తులకు అందుబాటులో ఉంచుతామన్నారు. సింహాద్రి అప్పన్న ప్రసాదాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారని అలాంటిది కోవిడ్ వల్ల దానికి నోచుకోలేకపోతున్నామని భక్తులు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. లడ్డూ కౌంటర్ దగ్గర కూడా కోవిడ్ నిబంధనలు అమలు చేస్తామన్నారు. మాస్కులేని వారికి ప్రసాదాలు విక్రయించేది లేదని ఈఓ తెలియజేశారు.

Simhachalam

2021-05-30 08:32:31

కోవిడ్ లక్షణాలతో ఉన్నవారిని గుర్తించండి..

శ్రీకాకుళం  జిల్లాలో కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించుటకు ప్రత్యేక డ్రైవ్ ను సోమవారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశించారు. ఆదివారం మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులు, వైద్య అధికారులతో నిర్వహించిన టేలి కాన్ఫరెన్స్ లో కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించడంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లక్షణాలతో ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించాలని, ఈ మేరకు వాలంటీర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, క్షేత్ర సహాయకులు తదితర గ్రామస్థాయి నిర్వాహకులతో సమావేశం నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ప్రాధాన్యత క్రమంలో దీన్ని చేపట్టి జిల్లాలో తగ్గుముఖం పడుతున్నా కరోనా కేసులను పూర్తిగా రూపుమాపేందుకు సహకరించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని జిల్లాను ఆరోగ్య దిశగా తీసుకు వెళ్లాలని అన్నారు. ప్రజల్లో అవగాహన వచ్చిందని, మరింత అవగాహన పెంచాలని ఆయన సూచించారు. గత నాలుగు రోజులుగా జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారని పేర్కొంటూ ఇందుకు కృషి చేసిన మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులు, వైద్య అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో కరోనాను పారద్రోలాలని ఆయన కోరారు. ప్రస్తుత వివాహ వేడుకల సీజన్లో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న వివాహ వేడుకలను అధికారులు తనిఖీ చేసి చర్యలు చేపడుతున్నారని ఆయన అభినందించారు. పాతపట్నం మండలంలో ఒక వివాహ వేడుకను తనిఖీ చేసి అపరాధ రుసుము విధించడం పట్ల పాతపట్నం తాసిల్దార్ కాళీ ప్రసాద్ కు, పాలకొండ రెవిన్యూ డివిజనల్ అధికారి కుమార్ కు ఆయన అభినందించారు. వేడుకలలో ఎక్కువ మంది పాల్గొనడం వలన కరోనా వ్యాప్తి జరుగుతుందని ప్రజలు గుర్తించాలని ఆయన అన్నారు.

 ఆలయాల్లో కేవలం అర్చకులు మాత్రమే నిత్య పూజాది కార్యక్రమాలు నిర్వహించాలని,  భక్తులకు ప్రవేశం లేదని ఆయన స్పష్టం చేస్తూ వివిధ ఆలయాలను పరిశీలించాలని అన్నారు.  గ్రామాల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పేర్కొంటూ జిల్లాలో ఇప్పటి వరకు 1049 కేంద్రాలను గుర్తించి 733 పడకలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం 38 మంది కరోనా బాధితులు గ్రామ కేంద్రాల్లో సేవలు పొందుతున్నారని ఆయన చెప్పారు. ఈ కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులు, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-30 08:06:32

అప్పన్న దర్శన సమయం 2 గంటలు పెంపు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలో  జూన్ 1 నుంచి సింహాద్రి అప్పన్న దర్శన సమయాన్ని మరో రెండుగంటలు పెంచుతున్నట్టు ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. ఆదివారం ఈమేరకు ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. భక్తుల సౌకర్యర్ధం ఉదయం 7:30 గంటల నుంచి 11:30 వరకూ సమయాన్ని పెంచినట్టు వివరించారు. ఆ నాలుగు గంటలసమయంలో భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవచ్చని  ఈఓ  తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ తప్పక ధరించాలని, హ్యాండ్ శానిటైజేషన్ తప్పనిసరని, భౌతిక దూరం పాటిస్తూ స్వామిని దర్శించుకోవాలన్నారు.   టికెట్ కౌంటర్ల దగ్గర- క్యూ లైన్లలో భక్తులకు ఎలాటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఈఓ వివరించారు.

Simhachalam

2021-05-30 07:59:47

అప్పన్న ఆయలంలో క్లీన్ డ్రైవ్ తో మెరుపులు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి దేవస్థానంలో ఆదివారం స్వామివారి ఆలయంలో ప్రత్యేక శుభ్రత కార్యక్రం చేపట్టారు. చాలా కాలం నుంచి శుభ్రపరచి ఆలయంలోని ఇత్తడి, రాగి గ్రిల్స్ ను నేడు ప్రత్యేకంగా శుభ్రపరిచారు. అంతేకాకుండా కళ్యాణ మండపంలోని అన్ని గ్రిల్స్ ను పాలిష్ చేశారు. దీనితో స్వామివారి ఆలయంలోపల అన్ని గ్రిల్స్ కొత్తవాటిలా తళ తళ మెరుస్తూ కనిపించాయి. ఆలయంలోకి వచ్చే భక్తులకు లోపలి వాతావరణం అంతా చాల పరిశుభ్రంగా కనిపించాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేక క్లీన్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టినట్టు ఆలయ ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఇకపై ఎప్పటికప్పుడు చేపట్టి భక్తులకు ఆలయంలో సరికొత్త అనుభూతి కలిగించే ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. 

Simhachalam

2021-05-30 07:46:51

సత్వరమే కాలువలు శుభ్రం చేయాలి..

అనంతపురం నగరంలో ప్రధాన కాలువల్లో మరువంతక పూడికతీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నగర మేయర్ వసీం శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. నగరంలోని హౌసింగ్ బోర్డు ధరణి కేఫ్ నుంచి అశోక్ నగర్ బ్రిడ్జి వరకు చేపడుతున్న పూడికతీత పనులను శనివారం మేయర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంను  దృష్టిలో ఉంచుకుని కాలువల్లో చెత్తా చెదారం పేరుకుపోయి వర్షం నీరు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందని త్వరితగతిన పనులు వేగవంతంగా చేపట్టాలని సూచించారు. అంతేకాకుండా మరువ వంక చివరి వరకు పూడికతీత పనులు చేపట్టాలని తద్వారా వర్షపునీరు ముందుకు వెళ్లేందుకు ఆటంకం లేకుండా ఉంటుందని సూచించారు. కేవలం మరువ వంకలోనే కాకుండా చిన్న కాలువల్లో కూడా పూడికతీత చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ లు సోని రమణ, నరసింహులు, డి ఈ రాంప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-05-29 16:00:25

శంఖుస్థాపన మహోత్సవంలా జరగాలి..

కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో జూన్ 1 నుండి 7వ తేదీ వరకూ జగనన్న కాలనీల శంఖుస్థాపన మహోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార,మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు హౌసింగ్ అధికారులను ఆదేశించారు.  శనివారం మంత్రి కన్నబాబు తమ క్యాంపు కార్యాలయంలో  హౌసింగ్ అధికారులతో  సమావేశమై కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల నిర్మాణ పధకం మొదటి దశ క్రింద ఎంపికైన  13585 మంది లబ్ధిదారులతో జూన్1నుంచి7వరకు నిర్వహించనున్న జగనన్న కోలనీల శంఖుస్థాపన మహోత్సవాల కార్యక్రమాల్లో ఇళ్ల నిర్మాణానికి   గ్రౌండింగ్ కు చేపట్ట వలసిన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన ఫిల్టర్ పాయింట్లు, బోర్ వెల్ లు, విద్యుత్ సరఫరా వంటి మౌళిక సదుపాయాలను నియోజకవర్గ పరిధిలోని 49 లేఅవుట్ లలో వెంటనే కల్పించాలని అయన అధికారులను ఆదేశించారు. అలాగే లబ్ధిదారులకు అవసరమైన నిర్మాణ సామాగ్రి  అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. అలాగే  నియోజకవర్గంలో రెండవ దశ గృహాల నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టులు సమర్పించాలని మంత్రి హౌసింగ్ ఇంజనీర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో కాకినాడ రూరల్ హౌసింగ్ డిఈఈ కెవిఆర్ గుప్తా, ఏఈ ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు.

Kakinada

2021-05-29 14:40:56

రేపు విశాఖలో కోవిడ్ వేక్సినేషన్ లేదు..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ వేక్సిన్ ఆదివారం జరపడం లేదని జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన తెలియజేశారు. ఈమేరకు శనివారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. నగరంలోని  ఆరిలోవ, మల్కాపురం ఎఫ్.ఆర్.యు. సెంటర్లలో వ్యాక్షినేషన్ చేయడం లేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మళ్లీ  వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎప్పుడు చేస్తున్నారనే విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేస్తామని  కమిషనర్ తెలిపారు. ఈ విషయాన్ని నగర ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. అంతేకాకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ ఇంటి పట్టునే ఉండాలని కోరారు. కరోనా నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు.

GVMC office

2021-05-29 14:07:35

ప్రతీ రోజు త్రాగునీరు సరఫరా కావాలి..

మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయాలు లేకుండా చూస్తూ నిత్యం మంచినీరు సరఫరా చేయాలని జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన అధికారులను ఆదేశించారు.  శనివారం గాజువాక జోన్ 65వ వార్డు పరిధిలోని సుందరయ్య కోలనీలో  కమిషనర్  పర్యటించారు. సుందరయ్య కోలనీలో మంచినీరు ప్రతి రోజు ఇవ్వడం లేదని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆమె సుందరయ్య కోలనీలోని పంపు హౌస్ ను సందర్శించి మంచినీరు ప్రతీ రోజు ఇవ్వకపోవడం పై గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని మోటార్లు పని చేయడం లేదని, అందువలన ప్రతీ రోజు మంచినీరు అందించడంలో ఇబ్బందులు తలెత్తాయని పర్యవేక్షక ఇంజినీరు బదులిచ్చారు. మోటారులను వెంటనే రిపేరు చేయించాలని అంతవరకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా మంచి నీరు అందించాలని పర్యవేక్షక ఇంజినీరును ఆదేశించారు.  ఈ పర్యటనలో పర్యవేక్షక ఇంజినీరు కె.వి.ఎన్.రవి, కార్యనిర్వాహక ఇంజినీరు   పి. వెంకటరావు, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు (ఎలక్ట్రికల్) లక్ష్మోజీ తదితరులు పాల్గొన్నారు.    

Gajuwaka

2021-05-29 14:01:10