వైద్య సేవలు, ఇతర చికిత్సలు అందించిన తర్వాత కరోనా రోగుల నుంచి నిబంధనల మేరకే ఫీజులు వసూలు చేయాలని, అలా కాకుండా అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని జేసీ ఆర్. మహేష్ కుమార్ హెచ్చరించారు. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెం.185లో పేర్కొన్న ప్రతి నిబంధనలను పాటించాలని, నియమావళిని అమలు చేయాలని ఆదేశించారు. కోవిడ్ సేవలు, ఫీజుల వసూలు, మందుల సరఫరా తదితర అంశాలపై సమీక్షించేందుకు జేసీ ఆర్. మహేష్ కుమార్ సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు. 185 జీవో ప్రకారం ఆరోగ్య శ్రీ సేవలకు, ప్రయివేటు సేవలకు ఎంతెంత ఫీజు వసూలు చేయాలో స్పష్టంగా పేర్కొనడమైనదని ఈ సందర్భంగా తెలిపారు. చికిత్స అనంతరం నాన్ మెడికల్ నోడల్ ఆఫీసర్ పరిశీలించి కౌంటర్ సంతకం చేసిన తర్వాతే బిల్లులు మంజూరవుతాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను, నిబంధనలను పాటించని ఆసుపత్రుల యాజమాన్యాలకు మూడు సార్లు జరిమానా విధిస్తామని.. తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో అందే చికిత్స, ఇతర సేవలపై నోడల్ ఆఫీసర్ల పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు. థర్డ్ పార్టీ బృందం బిల్లుల విషయంలో.. సేవల విషయంలో రోగులతో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకుంటుందని వివరించారు. అలాగే ఆసుపత్రుల్లో అందే సేవలపై, ఇతర ప్రక్రియలపై ఇంటిలిజెన్స్ నిఘా ఉంటుందని జేసీ వెంకటరావు అన్నారు. బిల్లు తయారు చేసేటప్పడు ఏక మొత్తం వేయరాదని, ఏ సేవకు ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో స్పష్టంగా పేర్కోవాలని సూచించారు. కరోనా రోగులను ఉదయం 8.00 గంటలకు ముందు, రాత్రి 10.00 గంటల తర్వాత డిశ్చార్జి చేయడానికి వీలులేదని చెప్పారు.
బ్లాక్ ఫంగస్ కేసులపై ప్రత్యేక దృష్టి..
బ్లాక్ ఫంగస్ కేసులను గుర్తించిన వెంటనే చికిత్స అందజేయాలని, ఆలస్యం చేయరాదని జేసీ మహేష్ కుమార్ సూచించారు. వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే డీసీహెచ్‌స్‌ను లేదా మిమ్స్ ఆసుపత్రిలో సంప్రదించాలని అక్కడ వ్యాధిని నిర్ధారించాక తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే కోవిడ్ రోగులకు గానీ, బ్లాక్ ఫంగస్ రోగులకు గానీ అవసరమైన మందుల ఇండెంట్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఎం.డి.ఎ.పి. యాప్ ద్వారానే పెట్టాలని సూచించారు. రోగులకు వైద్య పరమైన సేవలందిచటంలో నోడల్ ఆఫీసర్లు బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని పేర్కొన్నారు.
సమావేశంలో జేసీలు ఆర్. మహేష్ కుమార్, జె. వెంకటరావు, డీసీహెచ్ఎస్ నాగభూషణరావు, డీఎం&హెచ్‌వో రమణ కుమారి, ఆరోగ్య శ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ అప్పలరాజు, వైద్యాధికారులు, ప్రయివేటు ఆసుపత్రుల నిర్వాహకులు, ఆరోగ్య శ్రీ కార్యకర్తలు, ఫార్మసిస్టులు తదితరులు పాల్గొన్నారు.