అర్హులందరికీ జగనన్న తోడు పథకం ద్వారా లబ్ది చేకూర్చాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశించారు. వైఎస్ఆర్ బీమా నమోదును వేగవంతం చేయడం ద్వారా, పేదల జీవితాలకు భరోసా కల్పించాలని కోరారు. జగనన్న తోడు, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ పింఛన్ కానుక పథకాలపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా సోమవారం కలెక్టర్ సమీక్షించారు. అర్హులైన ప్రతీఒక్కరికి జగనన్న తోడు పథకం క్రింద రుణాలను మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీనికోసం వాలంటీర్ల ద్వారా దరఖాస్తలను సేకరించాలన్నారు. అలాగే గత ఆర్థిక సంవత్సరంలో తిరస్కరణకు గురైన దరఖాస్తులను పునఃపరిశీలించాలని, లబ్దిదారుల అభిప్రాయం తెలుసుకొని, వారి అంగీకారం మేరకు రుణాన్ని మంజూరు చేయాలని సూచించారు. ప్రస్తుత కరోనా కష్టకాలంలో తోడు పథకం చిరువ్యాపారులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కు వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి, అర్హులకు పింఛన్ మంజూరుకు సిఫార్సు చేయాలని ఆదేశించారు. దీనిపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఓలు ప్రత్యేక శ్రద్ద చూపాలని సూచించారు.
వైఎస్ఆర్ బీమా నమోదును వేగవంతం చేయాలన్నారు. గత ఏడాది జాబితాలను రెన్యువల్ చేయడంతోపాటుగా, ఈ ఏడాది కొత్తగా అర్హులను గుర్తించి, వారికి పథకాన్ని వర్తింపజేయాలన్నారు. గతేడాది పథకం నమోదులో విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో పనిచేసి, ఈ ఏడాది కూడా నమోదు ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. ఎస్‌బిఐ, ఎపిజివిబి, ఐఓబి బ్యాంకుల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు. బీమా నమోదుకు ప్రతిరోజూ ఉదయం 12 నుంచి 2 గంటలు వరకూ బ్యాంకులు సమయాన్ని కేటాయించాయని, ఆ సమయాన్ని వెలుగు సిబ్బంది వినియోగించుకోవాలని సూచించారు. వైఎస్ఆర్ చేయూత క్రింద, లబ్దిదారుల చేత స్వయం ఉపాధి యూనిట్లను త్వరగా ప్రారంభింపజేయాలని కోరారు. ఎంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్లు జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
అంతకుముందు డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ కె.సుబ్బారావు మాట్లాడుతూ, జిల్లాలో ఈ పథకాల ప్రస్తుత పరిస్థితిని వివరించారు. జిల్లాలో సుమారు 7,17,854 మంది తెల్లకార్డుదారులు ఉన్నారని, వీరిలో ఇప్పటివరకు 6,15,482 కార్డుల సర్వే పూర్తయ్యిందని చెప్పారు. వీరిలో 4,17,851 మంది పేర్లను నమోదు చేయడం జరిగిందన్నారు. జగనన్న తోడు పథకానికి సంబంధించి గత ఆర్థిక సంవత్సరంలో 16,146 దరఖాస్తులను తిరస్కరించడం జరిగిందని చెప్పారు. వీటిని పునఃపరిశీలించి, వారి అంగీకారం మేరకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. చేయూత లబ్దిదారులచేత యూనిట్ల స్థాపనకు కృషి చేయడం జరుగుతోందని వివరించారు.
ఈ టెలీకాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, జెడ్‌పి సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, ఎల్‌డిఎం కె.శ్రీనివాసరావు, పశుసంవర్థకశాఖ జెడి వైవి రమణ, వివిధ బ్యాంకుల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఓలు, డిఆర్‌డిఏ, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.