కరోనా లాంటి క్లిష్టపరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడడమే అంతిమంగా మనందరి లక్ష్యం కావాలని జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం నగరంలోని ఏడిసిసి బ్యాంక్ కార్యాలయం సమావేశ మందిరంలో రెండవ జిల్లా స్థాయి కోవిడ్ సమీక్షా కమిటీ సమావేశాన్ని జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న జిల్లా ఇంఛార్జి మంత్రి వర్యులు, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జూమ్ కాన్ఫరెన్స్ రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఉష శ్రీ చరణ్, జొన్నలగడ్డ పద్మావతి, సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏడిసిసి బ్యాంక్ కార్యాలయం సమావేశ మందిరం నుంచి జిల్లా స్థాయి కోవిడ్ సమీక్షా కమిటీ సమావేశంలో అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కరోనా కట్టడికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు.
2 నుంచి 6 రోజుల లోపల జిల్లాలో ఆక్సిజన్ పడకలను పెంచుతాం :
జిల్లాలో 2 నుంచి 6 రోజుల లోపల ఆక్సిజన్ పడకలను మరిన్ని పెంచుతామన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ బెడ్లతో పాటు తాడిపత్రి వద్ద 500 ఆక్సిజన్ పడకలతో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆస్పత్రిని మరో 6 రోజుల లోపల ప్రారంభించడం జరుగుతుందని, ఇందుకోసం అన్ని రకాల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అలాగే నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వద్ద తాత్కాలిక ఆస్పత్రిలో 100 ఆక్సిజన్ పడకలు సిద్ధం చేస్తున్నామని, వాటిని మరింత పెంచుతామన్నారు. అలాగే పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి లో ఏర్పాటుచేసిన ఆక్సిజన్ పడకలకు అవసరమైన ఆక్సిజన్ ను సరఫరా చేసి మరో 100 బెడ్లను పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో ఆక్సిజన్ పడకల సమస్య తీరే అవకాశముందన్నారు.
కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వైద్యం అందించాలి.. అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం :
జిల్లాలో కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వైద్యం అందించాలని, ఎవరైనా అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి బొత్స హెచ్చరించారు. పాజిటివ్ వచ్చిన వారిని ప్రైవేట్ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ కింద అర్హత ఉన్నా జాయిన్ చేసుకోకపోతే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని, ఈ విషయమై జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి), జిల్లా ఎస్పీ లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా చికిత్స కు ప్రభుత్వం నిర్ణయించిన ధరలనే వసూలు చేయాలని డిఎంఅండ్హెచ్ఓ, డి సి హెచ్ ఎస్ లు అన్ని ఆసుపత్రులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఈ విషయాలపై ఎన్ఫోర్స్మెంట్ టీమ్లు పర్యవేక్షణ చేయాలన్నారు.
హోమ్ ఐసోలేషన్ కిట్లను హోమ్ ఐసోలేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి అందజేయాలి :
జిల్లాలో పాజిటివ్ వచ్చే హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి తప్పనిసరిగా హోమ్ ఐసోలేషన్ కిట్లను ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి హోమ్ ఐసోలేషన్ కిట్లను మంగళవారం సాయంత్రంలోపు అందించాలన్నారు. జిల్లాలో అదనంగా 5 వేల హోమ్ ఐసోలేషన్ కిట్ల సిద్ధంగా ఉండేలా రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి కిట్లను తెప్పించుకోవాలని, కిట్లను సక్రమంగా వినియోగించుకునేలా చూడాలని డిఎంఅండ్హెచ్ఓ ను ఆదేశించారు. ఇందులో ఎలాంటి రాజీ పనికిరాదన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్ఈజీఎస్ కింద ఉపాధి పనులను ఆపొద్దు :
జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్ఈజీఎస్ కింద ఉపాధి పనులను ఆపొద్దని మంత్రి పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఉపాధి పనులు కల్పించకపోతే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే వీలుందని, ఎక్కడ ఉపాధి పనులు ఆపేందుకు వీలు లేదని, కరోనా కేసులు ఎక్కడైనా పెరిగితే ఆ ఊరి గ్రామ పెద్దలతో మాట్లాడి, వారికి అవగాహన కల్పించి ఏ గ్రూపు వారికైతే కేసులు వచ్చాయో ఆ గ్రూపు వారికి పనులను కొద్ది రోజులు వాయిదా వేసేలా చూడాలని, అంతేగాని ఎక్కడగానీ కరోనా వల్ల ఉపాధి పనులు ఆగకుండా చూడాలన్నారు.
కరోనా కట్టడికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయం చేసుకొని పని చేయాలి :
జిల్లాలో కరోనా కట్టడికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు. రాయలసీమలో అనంతపురం జిల్లా జనాభా చాలా ఎక్కువ ఉందని, ఏదైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని, పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
తాడిపత్రి వద్ద 500 ఆక్సిజన్ పడకలతో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆస్పత్రి పూర్తయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. అనంతపురం నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన 300 పడకల తాత్కాలిక ఆస్పత్రి పూర్తయితే ఆస్పత్రిని ప్రారంభించేందుకు తాను వచ్చే అవకాశం ఉందని లేదా మంత్రి శంకర నారాయణ, ఎంపి, ఎమ్మెల్యేలు ప్రారంభించాలని మంత్రి బొత్స సూచించారు.
కళ్యాణదుర్గం కోవిడ్ కేర్ సెంటర్ లో మరో ఐదు అదనపు ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. రైతులు ప్రస్తుతం క్రాప్ లోన్లు చెల్లిస్తున్నారని, రుణాల చెల్లింపుకు వారికి మరింత అదనంగా సమయం ఇచ్చేలా సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ ఉంది కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని, ఈ పాస్ తీసుకునే కర్ణాటక వెళ్లాల్సి ఉంటుంది అనేది తెలియజేయాలని పోలీసులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా అధికారులు, నోడల్ అధికారులు పాల్గొనగా, జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నగరపాలక సంస్థ మేయర్ వసీం, జిల్లాలోని అన్ని మండలాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.