కరోనా వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రతీ పంచాయితీలో గ్రామ ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ చెప్పారు. కేంద్రాలను ఏర్పాటు చేయడానికి బుధవారం నాటికి జాబితాను సిద్దం చేయాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు, ఎంపిడిఓలు, తాశీల్దార్లు, ఇఓపిఆర్‌డిలతో మంగళవారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరి జవహర్ లాల్ మాట్లాడుతూ, ప్రస్తుతం నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో సుమారు 60శాతం గ్రామీణ ప్రాంతాలనుంచే వస్తున్నాయని అన్నారు. వ్యాధి ఒకరినుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, వ్యాధి గ్రస్తులను ఐసోలేట్ చేయాల్సి ఉందన్నారు. అయితే కొంతమంది ఇళ్లలో వ్యాధిగ్రస్తులు ఏకాంతంగా ఉండటానికి అవకాశం లేకపోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, వ్యాధి ఆ కుటుంబంలోని అందరికీ సోకే ప్రమాదం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని, ఆయా గ్రామాల్లోనే ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. కోవిడ్ కేర్ సెంటర్లు ఉన్నచోట మినహా, వ్యాధి ఎక్కువగా ఉన్న ప్రతీ గ్రామంలోనూ ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.
ఐసోలేషన్ కేంద్రాల కోసం ప్రభుత్వ పాఠశాల, కళాశాల లేదా సంక్షేమ వసతి గృహాలను ఎంపిక చేయాలన్నారు. ఆయా కేంద్రాల్లో వ్యాధిగ్రస్తులు ఉండటానికి అవసరమైన వసతులను ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని, గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఆశా, ఎఎన్ఎంలు ఈ కేంద్రాల బాధ్యతలు నిర్వహిస్తారని అన్నారు. కోవిడ్ పరీక్షల కోసం ఎదురు చూడకుండా, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే ఈ కేంద్రాలకు తరలించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కేంద్రాలను జెడ్‌పి సిఇఓ, డిపిఓ జిల్లా స్థాయిలో పర్యవేక్షిస్తారని, వైద్యారోగ్యశాఖ తగిన సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. గ్రామ ఐసోలేషన్ కేంద్రాల్లో పారిశుధ్యంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందన్నారు. త్రాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.
జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు మాట్లాడుతూ, ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను వివరించారు. వ్యాధి నియంత్రణకు ఈ కేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని, కాబట్టి మండల, గ్రామ స్థాయి అధికారులంతా, వీటి ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. తాశీల్దార్లు, ఎంపిడిఓలు, ఇఓపిఆర్‌డిలు ఆయా గ్రామాల్లోని భవనాలను తక్షణమే పరిశీలించి, బుధవారం నాటికి జాబితాలను సిద్దం చేయాలని ఆదేశించారు.
ఈ కాన్ఫరెన్స్‌లో పార్వతీపురం సబ్ కలెక్టర్ విదేహ్ ఖరే, జిల్లా పంచాయితీ అధికారి కె.సునీల్ రాజ్‌కుమార్, జిల్లా పరిషత్ సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, డిఇఓ జి.నాగమణి, డిడిఎల్ఓ రాజ్‌కుమార్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కో-ఆర్డినేటర్ చంద్రావతి, ఇతర అధికారులు మాట్లాడారు.