వైద్యులు కోవిడ్ పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా మాత్యులు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) వైద్యులకు దిశా నిర్దేశం చేశారు. కె.జి.హెచ్.లోని కోవిడ్ పేషెంట్లకు అందిస్తున్న సేవలు, అడ్మిషన్లు, పడకలు, ఆక్సిజన్ సరఫరా, ప్రస్తుతం వున్న వైద్యులు, తదితర సిబ్బంది, మందులు, తదితర అంశాలపై ఆయన జిల్లా ఇన్ చార్జ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రత్యేక అధికారి జి. సాయి ప్రసాద్, జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎం. వేణు గోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, కె.జి.హెచ్. వైద్యులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పడకలు, ఆక్సిజన్ మేనేజ్ మెంట్ కు ఒక్కొక్క నోడల్ అధికారి ఉండాలన్నారు. ఆసుపత్రిలో అవసరమైన ప్రతీ పేషెంట్ కు ఆక్సిజన్ సరఫరా ఖచ్చితంగా జరగాలని ఆయన ఆదేశించారు. వైద్యులు, నర్సులు పేషెంట్ల బాగోగులు తెలుసుకొని ధైర్యం చెప్పాలన్నారు. వారి సేవలు సి.సి. కెమేరాల్లో కె.జి.హెచ్. పర్యవేక్షకులు డా. మైథిలి పరిశీలించాలని ఆదేశించారు. ఆక్సిజన్ సరఫరా ఆగకుండా నిరంతరాయంగా జరగాలని, సరఫరా స్థాయిని గమనించి మరో ట్యాంకర్ రప్పించాలన్నారు. ఆక్సిజన్ వృధా కాకుండా, వాడకంపై పేషెంట్లకు కూడా అవగాహన కల్పించాలన్నారు. ఆక్సిజన్ సరఫరాకు అవసరమైన సాంకేతిక సిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆహారం నాణ్యతను మరింత పెంచాలన్నారు. వైద్యులు మరింత శ్రమించి మానవతా దృక్పదంతో సేవ చేయాలన్నారు.. డ్యూటీలో ఉన్న వైద్యులు, సిబ్బంది భోజనాలకు ఇళ్లకు వెలితే సమయం వృదా అవుతుందని, పేషెంట్లకు ఇచ్చే భోజనాలనే చేయాలని చెప్పారు. ఆసుపత్రుల వారీగా ఆక్సిజన్ మేనేజ్ మెంట్, తదితర అంశాలపైన వివరాలు తెలిపాలన్నారు. కోవిడ్ విధుల్లో ఏ ఒక్కరూ నిర్లక్ష్యం, అలసత్వం కూడదన్నారు. కోవిడ్ తో కెజిహెచ్ కు వచ్చే ఏ పేషెంటుని వేచి ఉంచ వద్దని, అడ్మిషన్ చేయించుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో సంబంధిత అటెండెంట్ కు పేషెంటు యొక్క సమాచారంను హెల్ప్ డెస్క్ అందించాలన్నారు. రెమిడెసివర్ పేషెంట్లకు అందేలా చూడాలని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల నుండి కెజిహెచ్ కు మెరుగైన వైద్యం కోసం వస్తారని, వైద్యులు మరింత అంకిత భావంతో పనిచేసి, ప్రతి ఒక్క పేషెంటుకు పూర్తిగా వైద్య సేవలు అందించి పూర్తి ఆరోగ్యంగా కోలుకొని ఇంటికి పంపాల్సిన బాధ్యతను వైద్యులు తీసుకొని కెజిహెచ్ కు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. నోడల్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి గతంలో ఉన్న సమస్యలు తిరిగి పునరావృతం కాకుండా చూడాలన్నారు. కెజిహెచ్, విమ్స్, చెస్ట్, ఇ.ఎన్.టి. ఆసుపత్రులు వారీగా పడకలు, ఆక్సిజన్ సరఫరా, వైద్యులు, సిబ్బంది, తదితర అంశాలపై ఆయన సమీక్షించి ఆసుపత్రుల్లో ఉన్న సమస్యలను గూర్చి అడిగి తెలుసుకున్నారు.
జిల్లా ఇన్ చార్జ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ జ్ఞానాపురంలో ఉన్న అంత్యక్రియల షెడ్లు మరిన్ని తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసేందుకు జివిఎంసి కమీషనర్ తో మాట్లాడి పెంచాలని జెసిలకు సూచించారు. మరణించిన తర్వాత అంత్యక్రియలకు ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు. ఆసుపత్రుల్లో ఉన్న పేషెంట్ల సమాచారం బందువులకు తెలియజేయాలని ఆదేశించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ కెజిహెచ్ లో సూపరింటెండెంట్ కు సహాయంగా మరొకరిని నియమించాలని ప్రత్యేక అధికారి జి. సాయి ప్రసాద్ కు సూచించారు. శానిటేషన్ సిబ్బందికి జీతాలు విషయమై మంత్రి దృష్టికి తీసుకురాగా ఇప్పటికే ఈ సమస్యను పరిష్కరించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.
కోవిడ్ ప్రత్యేక అధికారి జి. సాయి ప్రసాద్ మాట్లాడుతూ బెడ్ మేనేజ్ మెంట్, అడ్మిషన్లకు వచ్చే పేషెంట్లకు సమాధానం చెప్పేందుకు ఒక ప్రొఫెసర్ ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి ఇపిడిసియల్ సిఎండి నాగలక్ష్మిని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆక్సిజన్ మేనేజ్ మెంట్, ఆక్సిజన్ వృధాగా కాకుండా ఎఎంసి ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్, ఎపిఎంఎస్ఐడిసి ఇఇ డి.ఎ.నాయుడు లు చూస్తారని తెలిపారు. పేషెంట్లతో ఇంటరాక్షన్, తదితర విషయాలపై ఆయన మాట్లాడారు. అంతకు ముందు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ పేషెంట్లకు అందిస్తున్న వైద్య సేవలు, పడకలు, ఆక్సిజన్ సరఫరా, తదితర విషయాలపై వివరించారు.
ఈ సమావేశంలో ఎ.పి.ఇ.పి.డి.సి.ఎల్. సిఎండి నాగలక్ష్మి, ఐటిడిఎ పి.ఓ. ఎస్. వెంకటేశ్వర్, ఎఎంసి ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్, కె.జి.హెచ్ సూపరింటెండెంట్ డా. మైథిలి, డిఎంహెచ్ఒ సూర్యనారాయణ, డిఆర్డిఎ పిడి వి. విశ్వేశ్వరరావు, విమ్స్ డైరక్టర్ రాంబాబు, చెస్ట్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్, ఇఎన్ టి సూపరింటెండెంట్, తదితర వైద్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) విలేఖరులతో మాట్లాడుతూ కెజిహెచ్ లో మొత్తం 840 పడకలు ఉన్నాయని, 1500 మంది వరకు వివిధ సిబ్బంది సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. కోవిడ్ నివారణకు సిబ్బంది కొరత ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో తగు చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. కెజిహెచ్ వరకు 18 టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం వంటి జిల్లాల నుండి వివిధ వైద్య సేవలు నిమిత్తం కెజిహెచ్ కు వస్తారని అలాంటి వారికి వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసుపత్రికి తగినన్ని నిధులు ముఖ్యమంత్రి కేటాయించినట్లు ఆయన వివరించారు. పడకల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. అంత్యక్రియల ప్లాట్ ఫారంలు పెంచమని తెలియజేసినట్లు పేర్కొన్నారు.