1
పాజిటివ్ కేసులు ఎక్కువగా వచ్చిన మండలాల్లో కరోనా పరీక్షలు ఎక్కువ చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. గురువారం అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాజిటివ్ కేసులు ఎక్కువగా వచ్చిన మండలాల్లో పరీక్షలు ఎక్కువ చేయాలని పేర్కొంటూ ఆమదాలవలస, పలాస, వజ్రపుకొత్తూరు తదితర మండలాల్లో బుధవారం ఎక్కువగా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. జిల్లాలో ఫీవర్ సర్వే త్వరితగతిన నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంకా సర్వే చేయాల్సిన ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ హోమ్ ఐసోలేషన్, హోమ్ క్వారంటీన్ కేసులను తప్పక పరిశీలించాలని ఆదేశించారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి మెడికల్ కిట్ లను అందజేసి యాప్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఇప్పటికీ హోమ్ క్వారంటీన్ లో దాదాపు 2300 మందిని సందర్శించనట్లు నివేదికలు చూపిస్తున్నాయని ఆయన పేర్కొంటూ తక్షణం సందర్శించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. హొమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి ఆక్సిజన్ స్థాయి, పల్స్ స్థాయి పరిశీలించాలని పేర్కొన్నారు. హొమ్ క్వారంటీన్ లో ఉన్న వారికి కనీసం మూడు రోజులకు ఒకసారి సందర్శించాలని ఆయన అన్నారు. పలాస, సింగుపురం, మాకివలస, రావాడ తదితర ప్రాంతాల్లో ఎక్కువ మంది హోమ్ క్వారంటీన్ లో ఉన్నట్లు ఆయన చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం పక్కాగా నిర్వహించాలని ఆయన అన్నారు. జిల్లాలో ప్రస్తుతం కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ మాత్రమే జరుగుతుందని ఆయన చెప్పారు. మొదటి డోసు కోవిషీల్డ్ వేసుకున్న తర్వాత కనీసం నలభై రెండు రోజుల తరువాత మాత్రమే కోవిషీల్డ్ వాక్సినేషన్ వేయాలని ఆయన ఆదేశించారు. 56 రోజుల తర్వాత కూడా కోవిషీల్డ్ వేసుకునే అవకాశం ఉందని గమనించాలని చెప్పారు. కోవ్యాక్సిన్ జిల్లాకు త్వరలో వచ్చే అవకాశం ఉందని, మొదటి డోసు వేసుకుని కనీసం 28 రోజులు పూర్తి చేసుకున్నవారు అర్హులని తెలిపారు. కోవాక్సిన్ 42 రోజుల వరకు వేసుకోవచ్చని ఆయన సూచించారు.
ఈ టెలీ కాన్ఫరెన్స్ లో సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గరోడా, రెవిన్యూ డివిజనల్ అధికారులు ఐ.కిషోర్, టి.వి.ఎస్.జి కుమార్, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మూడవ సంవత్సరం మొదటి విడత కార్యక్రమము గురువారం జరుగుతుందని వ్యవసాయ శాఖ ఇన్ ఛార్జ్ సంయుక్త సంచాలకులు కె.రాబర్ట్ పాల్ తెలిపారు. బుధవారం ఒక ప్రకటన జారీ చేస్తూ "వై.యస్.ఆర్ రైతు భరోసా - పి.ఎం.కిసాన్ పథకం" కింద అర్హులైన రైతులకు, అర్హులైన సాగుదార్లకు, కౌలు రైతులకు ప్రతి సంవత్సరం రూ.13,500 చొప్పున, అయిదేళ్లలో రూ. 67,500 అందించడం జరుగుతోందని చెప్పారు. రాష్ట్రములో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు, దేవాదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసాగా సహాయాన్ని అందించడం జరుగుతోందని వివరించారు. రైతు భరోసా సొమ్మును "వై.యస్.ఆర్ రైతు భరోసా పి.ఎం.కిసాన్ పథకం" క్రింద మొదట విడతగా ఖరీప్ పంట వేసి ముందు మే నెలలో రూ.7,500, రెండో విడతగా- అక్టోబరులో ఖరీఫ్ పంట కోతకు లేదా రబీ అవసరాలకు రూ.4000; మూడో విడతగా ధాన్యం ఇంటికి చేరే వేళ, సంక్రాంతి పండగ సందర్భముగా రూ. 2,000 అందించడం జరుగుతోందని చెప్పారు. 2021-22 సంవత్సరం (మూడవ సంవత్సరం మొదటి విడత)లో పథకం క్రింద మొదటి విడతగా శ్రీకాకుళం జిల్లాలో 3,90,988 రైతు కుటుంబాలకు రూ. 293.24 కోట్ల మొత్తాన్ని జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇందులో రూ.216.87 కోట్లు వై.యస్.ఆర్ రైతు భరోసా కింద, రూ 76.37 కోట్లు పి. ఎం. కిసాన్ పథకం కింద జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ పధకం కింద గత 2 సంవత్సరాలలో శ్రీకాకుళం జిల్లాలో 2019-20 సంవత్సరములో 3.34 లక్షల రైతు కుటుంబాలకు రూ.450.98 కోట్లు ఆర్ధిక సహాయంగా అందిచడం జరిగిందని, 2020 - 21 సంవత్సరంలో 3.81 లక్షల రైతు కుటుంబాలకు రూ.509 కోట్లు ఆర్ధిక సహాయం అందిచడం జరిగిందని ఆయన వివరించారు.