1 ENS Live Breaking News

ఉద్యోగులకు, జర్నలిస్టులకు ప్రత్యేక బెడ్లు..

కోవిడ్ సోకిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయ శాఖ అధికారులు, పోలీసులు, జర్నలిస్టులకు పడకలు కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు.   కరోనా బారిన పడిన అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయ శాఖ అధికారులు, పోలీసులు, జర్నలిస్టులకు అత్యవసర వైద్య చికిత్స అందించేందుకు బత్తలపల్లి ఆర్డీటీ, అనంతపురము సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో ఒక్కో ఆసుపత్రిలో 30 పడకల చొప్పున మొత్తం 60 పడకలు కేటాయించామన్నారు. సెకండ్ వేవ్ లో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, కోవిడ్ విధులు నిర్వహిస్తున్న వీరు కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతుండటంతో ఆసుపత్రులలో వీరికి కొన్ని పడకలు రిజర్వ్ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 
 

Anantapur

2021-05-12 15:51:45

తేరన్నపల్లి చిన్నారులకు సురక్షిత ఆశ్రయం..

కరోనా కేసులు రోజురోజుకూ  పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. తాడిపత్రి మండలం తేరన్నపల్లిలో తల్లిదండ్రులకు కరోనా సోకడంతో, ఇంట్లో ఒంటరిగా వున్న ముగ్గురు పిల్లల బాధ్యతను బాలల సంరక్షణ సమితికి అప్పగించామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. 12 ఏళ్ల వయసు గల బాలుడు, ఐదేళ్లు, మూడేళ్ల వయసుగల బాలికలను ప్రస్తుతం బుక్కరాయముద్రంలోని ఆర్డీటీ సంరక్షణ కేంద్రానికి తరలించామన్నారు. ముగ్గురు పిల్లలకు కరోనా సోకలేదని, సంరక్షణ కేంద్రంలో సురక్షితంగా ఉన్నారని తల్లిదండ్రులకు తెలిపామన్నారు. పిల్లలకు కరోనా సోకకుండా బాలల సంరక్షణ కేంద్రాలు (సిసిఐ) అన్ని జాగ్రత్తలు పాటించాలని ఐసీడీఎస్ పీడీ విజయలక్ష్మిని ఆదేశించారు. పిల్లలకు, సిబ్బందికి అవసరమైన మాస్కులు, శానిటైజర్లు, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. తల్లిదండ్రులు కోవిడ్ బారిన పడితే వారి పిల్లలను సంరక్షించేందుకు  ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అలాంటి బాధిత పిల్లలు ఉంటే 1098, 181 వంటి హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలన్నారు. బాల బాలికలకు వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేసి, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుని కరోనా రాకుండా పిల్లలను కాపాడుతున్నామని వివరించారు. 

కోవిడ్ 19 వైరస్ సోకి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న లేదా మరణించిన తల్లిదండ్రుల పిల్లలకు తాత్కాలిక వసతి కల్పించడం కోసం రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ,  బాలల సంక్షేమ శాఖ సూచనల మేరకు జిల్లా కలెక్టర్ అనుమతితో  బుక్కరాయ సముద్రం నందుగల ఆర్డీటీ పాఠశాలలో   బాలికలకు, బాలురకు ప్రత్యేకంగా అన్ని సౌకర్యాలతో కూడిన తాత్కాలిక  వసతిని ఏర్పాటు చేశామని ఐసీడీఎస్ పీడీ విజయలక్ష్మి తెలిపారు. 

 సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ నల్లాని రాజేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ చొరవతో బాల, బాలికలకు ప్రత్యేక సంరక్షణ  కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పిల్లల సంరక్షణపై సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఇప్పటికే తగిన ఆదేశాలిచ్చారన్నారు.

Tadipatri

2021-05-12 15:48:40

చోలపాదం నీటి సమస్యకు పరిష్కారం..

విజ‌య‌న‌గ‌రం జిల్లా కొమ‌రాడ మండ‌లం చోల‌పాదం గ్రామంలో త‌లెత్తిన తాగునీటి స‌మ‌స్య ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు జిల్లా గ్రామీణ నీటిపారుద‌ల శాఖ ఎస్‌.ఈ. ర‌వికుమార్ బుధ‌వారం తెలిపారు. గ్రామానికి నీటి స‌ర‌ఫ‌రా చేసే పంపుసెట్‌కు మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టామ‌ని, వ‌న‌ధార గ్రామ ప‌రిధిలో ఉన్న‌ పంపుసెట్‌కు ట్రయిల్ ర‌న్ కూడా వేయించామ‌ని చెప్పారు. ఇటీవ‌ల వివిధ ప‌త్రిక‌ల్లో గ్రామ తాగునీటి స‌మ‌స్య‌పై వ‌చ్చిన‌ వార్త‌లపై స్పందించి స్థానిక అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేసి స‌మ‌స్య‌ను త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించామ‌ని వివ‌రించారు. దీనిపై చోల‌పాదం గ్రామ ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నార‌ని పేర్కొన్నారు.

చోలపాదం

2021-05-12 15:46:28

కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాం..

రాష్ట్రంతో పాటు మొత్తం దేశాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న కోవిడ్ రెండో దశలో బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తున్నారని, దీన్ని కొనసాగిస్తూ విపత్తును ఎదుర్కొనేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన వర్చువల్ విధానంలో కోవిడ్‌పై ఏర్పాటైన జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ స‌మావేశానికి ఉప ముఖ్య‌మంత్రి శ్రీకాకుళం క్యాంపు కార్యాల‌యం నుంచి పాల్గొన్నారు. తొలుత కలెక్టర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి జిల్లాలో కోవిడ్ కట్టడితో పాటు రోగులకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. జిల్లాలోని అన్ని డివిజన్లలో గత వారం రోజుల్లో పాజిటివిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్టీపీసీఆర్, ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుల ద్వారా రోజుకు ఎనిమిది వేల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రధానంగా ఫోకస్డ్ టెస్టింగ్‌పై దృష్టిసారిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని ఆక్సిజన్ కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, జీజీహెచ్‌లో ఇటీవల 1.7 కేఎల్ పీఎస్ఏ యూనిట్‌ను ప్రారంభించామని, 10 కేఎల్ సామర్థ్యమున్న ఆక్సిజన్ ట్యాంకును ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించారు. పెద్దాపురంలో రోజుకు నాలుగు కిలోలీటర్ల ఉత్పత్తి సామర్థ్యమున్న ఆక్సిజన్ యూనిట్ పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నామని, ఆంధ్రా పేప‌ర్‌మిల్లులో 15 కేఎల్ సామర్థ్యమున్న ఆక్సిజన్ ప్లాంటు కార్యకలాపాలు రెండు రోజుల ముందు పునఃప్రారంభమైనట్లు తెలిపారు. రాజోలులో నేరుగా గాలి నుంచి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే పీఎస్ఏ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నామని.. మోరి, కపిలేశ్వరపురంలోనూ కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ లభ్యతతో వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే 6000 పడకల సామర్థ్యంతో సేవలందిస్తున్న బోడసకుర్రు, కాకినాడ జేఎన్టీయూ, బొమ్మూరు కోవిడ్ కేర్ కేంద్రాలతో పాటు ఎటపాక, రంప‌చోడ‌వ‌రం డివిజన్లలోనూ సీసీసీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అవసరం మేరకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందుబాటులో ఉంచుతామని, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సహాయం చేసేందుకు ఇప్పటికే కొన్ని సంస్థలు ముందుకొచ్చాయన్నారు. జిల్లాలో ఈ నెలాఖరుకు రెండో డోసు పెండింగ్ ఉన్నవారికి వ్యాక్సినేషన్ పూర్తిచేసేందుకు శాశ్వత టీకా కేంద్రాల్లో ఏర్పాట్లు చేశామని, వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు టోకెన్లు అందిస్తున్నామని కలెక్టర్ వివరించారు.

          అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ అందుబాటులో ఉన్న వనరులను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ బాధితులకు వైద్య, ఇతర సేవలు అందేలా చూడాలని, విపత్తును ఎదుర్కోవడమనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ‌న్‌రెడ్డి నిరంతరం కోవిడ్ నియంత్రణ, నివారణ చర్యలపై ఆలోచిస్తూ బాధితుల ప్రాణాలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. జిల్లాలో నమోదవుతున్న కేసులకు అనుగుణంగా ఆక్సిజన్ పడకలు, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ సరఫరా సామర్థ్యాన్ని పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి, సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుంటూ కోవిడ్ నియంత్రణ, నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విషయంలో ఇప్పటికే జిల్లా యంత్రాంగం పటిష్ట కార్యాచరణతో ముందుకెళ్తోందని, ఎప్పటికప్పుడు లోటుపాట్లను గుర్తించి, పరిష్కరిస్తూ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సూచించారు. 104 వ్య‌వ‌స్థ ద్వారా బాధితుల‌కు స‌కాలంలో సేవ‌లు అందేలా చూడాల‌ని సూచించారు. వ్యాక్సినేష‌న్‌పై ఎలాంటి అపోహ‌లు వ‌ద్ద‌ని, కేంద్రం నుంచి వ‌స్తున్న డోసులను బ‌ట్టి కార్య‌క్ర‌మం స‌జావుగా సాగుతుంద‌ని  తెలిపారు. కోవిడ్ కట్టడిలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో పాటు జిల్లాస్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కీలకంగా వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. కమిటీలో ప్రజాప్రతినిధులు అందించే విలువైన సూచనలను స్వీకరించి, అమలుచేసేందుకు కృషిచేయనున్నట్లు ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. రెమ్‌డెసివిర్‌పై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాల్సి ఉందని, స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం మాత్రమే ఈ ఔషధాన్ని అవసరం మేరకు వినియోగించాలే తప్ప ఇష్టమొచ్చినట్లు ఉపయోగించకూడదని బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. కలెక్టర్ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం 24X7 పనిచేస్తోందని, తాము కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలేవైనా ఉంటే గుర్తించి, పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. రంపచోడవరం, ఎటపాక డివిజన్లో బాధితుల అవసరాలు తీర్చేలా పీఎస్ఏ ఆక్సిజన్ యూనిట్లు ఏర్పాటుచేస్తే  బాగుంటుందని మంత్రి పేర్కొన్నారు.

      జిల్లాస్థాయిలో పరీక్షలు, బాధితులకు వైద్య సేవలు, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ వినియోగంపై నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ ఉండటంతో మంచి ఫలితాలు వస్తున్నాయని కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. ప్రైవేటు కోవిడ్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా మరింత మందికి సేవలు అందించాల్సి ఉందన్నారు. ప్రజల్లో కోవిడ్‌ను ఎదుర్కోవడంపై మరింత అవగాహన కల్పించాలని ఎంపీ సూచించారు. కోవిడ్ కేర్ కేంద్రాల్లో ఉన్నవారికి సరైన కౌన్సెలింగ్ ఇచ్చి, బాధితుల్లో ధైర్యం నింపి మహమ్మారి నుంచి బయటపడేలా చూడాలని అమలాపురం ఎంపీ చింతా అనూరాధ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో గ్రామ, వార్డు వాలంటీర్లు మరింత కీలకంగా వ్యహరించేలా చూడాలని సూచించారు. క్రిటికల్ కేర్ చికిత్స‌కు ఆక్సిజన్ ఆన్ వీల్స్ కార్యక్రమం సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాలని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భర‌త్‌రాం సూచించారు. ఇప్పటికే తాము జగనన్న ప్రాణవాయు రథచక్రాలు వ్యవస్థపై దృష్టిసారించామని తెలిపారు.   ఆధునికీకరణ చర్యల ద్వారా ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ వైద్య సేవలు, ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా, కాన్సంట్రేటర్ల అందుబాటు, అత్యవసర వినియోగ ఔషధాలు; పడకల పెంపు, టెస్టింగ్, వ్యాక్సినేషన్, చమురు సంస్థల సీఎస్ఆర్ కార్యకలాపాల పెంపు, భౌతికకాయాల తరలింపు, గౌరవప్రద అంతిమ సంస్కారాలు తదితరాలపై ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, కొత్తపేట ఎమ్మెల్యే చిర్లజగ్గిరెడ్డి, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, అనపర్తి ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణరెడ్డి, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, మండపేట ఎమ్మెల్యే  వి.జోగేశ్వరరావు పలు సూచనలు చేశారు. వీటిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ మురళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులతో పాటు జేసీ (ఆర్) డా. జి.లక్ష్మీశ, జేసీ (డీ) కీర్తి చేకూరి, జేసీ (డబ్ల్యూ) జి.రాజకుమారి, అమలాపురం స‌బ్‌క‌లెక్ట‌ర్ హిమాన్షు కౌశిక్, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి, ఐటీడీఏ పీవోలు, మునిసిపల్ కమిషనర్లు, వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-05-12 15:43:38

ఆక్సిజన్ ప్లాంట్ త్వరలో అందుబాటులోకి..

పెద్దాపురం మున్సిపాలిటీ పరిధిలో మూతబడిన ఆక్సీజన్ జనరేషన్ ప్లాంట్ ను పునరుధ్ధరించే విధంగా యుధ్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మిశ పేర్కొన్నారు. ఆక్సీజన్ జనరేషన్ ప్లాంట్ పునరుధ్ధరణ పనులపై జాయింట్ కలెక్టర్ లక్ష్మిశ, ఐటిడిఏ పిఓ ప్రవీణ్ ఆదిత్య, పెద్దాపురం ఆర్.డి.ఓ. ఎస్.మల్లిబాబు, ఎస్.ఇ., ఆర్.డబ్ల్యూ.ఎస్. టి.గాయత్రీ దేవి, ఎస్.ఇ., ఏ.పి.ఎస్.పి.ఇ.పి.డి.సి.ఎల్., వేదాంత, మేఘా ఇంజనీరింగ్ ప్రతినధులతో బుధవారం జూమ్ యాప్ ద్వారా వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ బాధితులకు అవసరమైన ఆక్సీజన్ సామర్ధ్యం పేంచే విధంగా పెద్దాపురంలో మూసివేసిన ఆక్సీజన్ జనరేటర్ ప్లాంట్ పునరుధ్ధరణ కోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన సహాయం వివిధ సంస్ధల నుండి తీసుకొనే విధంగా కార్యాచరణ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. 2014 నుండి మూసి వేయాబడిన ఆక్సీజన్ ప్లాంట్ ను పునరుధ్ధరించుకోవడంలో భాగంగా అవసరమైన సాంకేతిక పరికరాలను ఆయా సంస్ధల నుండి రప్పించే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా వేతాంద, మేఘా ఇంజనీరింగ్ సంస్ధల సహకారం తీసుకొంటున్నామన్నారు. ప్లాంట్ కు కావలసిన విద్యుత్, నీటి సరఫరాను ఆయా విభాగాల సూపరింటెండెంట్ ఇంజనీర్లు పర్యవేక్షించే విధంగా సూచించడం జరిగిందన్నారు. ఈ పనులు 2 రోజుల్లో పూర్తి చేయాలని ఎస్.ఇ., ఆర్.డబ్ల్యూ.ఎస్., ఎస్.ఇ., ఏపిఎస్.పి.డి.సి. ఇంజనీర్లకు జేసి సూచించారు. వేదాంత ప్రతినిధి ముత్తు కుమార్ స్వామి ప్లాంట్ పునరుధ్ధరణకు అవసరమైన సాంకేతిక నిపుణులను సప్లై చేస్తున్నట్లు జూమ్ విసి ద్వారా తెలిపారు. అదే విధంగా మేఘా ఇంజనీరింగ్ సంస్ధ ప్రతినిధి రాజేష్ మాట్లాడుతూ కిర్లోస్కర్ కంప్రెషన్ సాంకేతిక నిపుణులు అవసరమైన హెల్పర్లు ఏర్పాటు చేసి విధంగా సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపారు.  జిల్లాలో కోవిడ్ బాధితులకు ఆక్సీజన్ సరఫరా పూర్తి స్ధాయిలో అందించే విధంగా వివిధ శాఖలతో పాటు ఇతర రంగాలకు చెందిన వారి సమన్వయంతో పనులు పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పిఓ ఐటిడిఏ ప్రవీణ్ ఆదిత్య , పెద్దాపురం ఆర్.డి.ఓ. ఎస్.మల్లిబాబు, ప్లాంట్ పునరుధ్ధణ పనులు పర్యవేక్షిస్తున్నారని జేసి లక్ష్మిశ పేర్కొన్నారు. 

Peddapuram

2021-05-12 15:41:33

ప్లాంట్ ను నిత్యం పరిశీలించాలి..

ఆక్సిజన్ ట్యాంకు నుండి ఆయా వార్డులకు సరఫరా అవుతున్న ఆక్సిజన్ ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని కోవిడ్ ప్రత్యేక అధికారి జి. సాయి ప్రసాద్ కెజిహెచ్ సూపరింటెండెంట్ ను ఆదేశించారు. కెజిహెచ్ లో ఉన్న ఆక్సిజన్ ట్యాంకును జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి తో కలసి ఆయన బుధవారం పరిశీలించారు. ట్యాంకు నుండి ఆయా వార్డులకు సరఫరా అవుతున్నపుడు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఆక్సిజన్ అయిపోతున్న సమయానికి అందుబాటులో  ఉన్న మరో నిల్వ  ట్యాంకుకు అనుసంధానించాలని తెలిపారు. ఎప్పటికప్పుడు దానిని తిరిగి ఆక్సిజన్ తో నింపాలని చెప్పారు. పేషెంట్లకు ఆక్సిజన్ ఆగిపోకుండా నిరంతరం సరఫరా చేయాలన్నారు.   ఈ పరిశీలనలో కెజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మైథిలి, ఆర్. ఎం. ఓ. అంజిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-05-12 15:40:09

2వ డోసుగా కోవీషీల్డ్ వేక్సిన్ మాత్రమే..

విశాఖజిల్లాలో ఎంపిక చేసిన 37 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో రెండవ డోసుగా కోవిషీల్డు వ్యాక్సిన్ మాత్రమే అందిస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.పతివాడ సత్యసూర్యనారాయణ తెలియజేశారు. విశాఖలో బుధవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మొదటి డోసు వేసుకున్న వారికి మాత్రమే రెండవ డోసు వేస్తున్నట్టు చెప్పారు. ఎవరికీ మొదటి డోసు వేయడం లేదన్నారు. ఈ విషయాన్ని గమనించి కేవలం టోకెన్లు పొందిన లేదా మెసేజ్ వచ్చిన వారు రెండవ వేక్సిన్ వేయించుకోవడానికి మాత్రమే రావాలని ఆయన కోరారు. చాలా మంది మొదటి డోసు వేయమని కేంద్రాలకు వస్తున్నారని, కానీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రెండవ డోసు మాత్రమే వేస్తున్నట్టు డిఎంహెచ్ఓ తెలియజేశారు. 

Visakhapatnam

2021-05-12 15:38:52

నర్సుల సేవలు సమాజానికి అవసరం..

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్స్ ల సేవలతోనే కోవిడ్ రోగులకు పునర్జన్మ కలుగుతోందని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. బుధవారం విశాఖని విమ్స్ ఆసుపత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంజిలిన్ చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ, కోవిడ్ సమయంలో నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు సేవలు అందిస్తున్నారని అన్నారు. సమాజానికి నర్సులు సేవలు ఎంతో అవసరని అన్నారు.  స్టాఫ్ నర్సులు,నర్సింగ్ సిబ్బందికి మేయర్ శుభాకాంక్షలు తెలిపారు. కేకు కట్ చేసి మేయర్ స్వయంగా స్టాఫ్ నర్స్ లకు తినిపించారు. ఉత్తమ సేవలు అందిచిన నర్సులు కు ఘనంగా సన్మానం చేశారు.  విమ్స్  డైరెక్టర్ డా రాంబాబు మాట్లాడుతూ  నర్సుల దినోత్సవ విశిష్టత ను వివరించారు. కరోనా ప్రారంభం నుంచి నర్సులు అందిస్తున్న సేవలు అద్భుతమని వారిని గౌరవించాలని మేయర్ రావటం సత్కరించటం స్ఫూర్తి దాయకం అన్నారు. మేయర్ చేసిన ఈ సన్మాన కార్యక్రమం ద్వారా అనేక నెలలుగా నిస్సత్తువ తో వున్న నర్సింగ్ సిబ్బందికి నూతన ఉత్తేజం కలిగిందన్నారు. ఈ సందర్భంగా మేయర్  ఆలోచనలు కు, ఆమె అభిమానానికి  వైద్యులు, నర్సులు అభినందనలు కురిపించారు.  ఈ కార్యక్రమములో గొల గాని శ్రీనివాస్,అధిక సంఖ్యలో వైద్య సిబ్బంది నర్సులు పాల్గొన్నారు.

VIMS Hospital

2021-05-12 15:37:45

జిల్లాలో టీకా వేసే పీహెచ్సీలు ఇవే..

విశాఖజిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ గుర్తించిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే కోవిడ్ వేక్సిన్ 2వ డోసు వేస్తున్నట్టు డీఎంహెచ్ఓ డా.పతివాడ సత్యసూర్యనారాయణ తెలియజేశారు. కోవీషీల్డ్ రెండవ డోసు అందుబాటులో ఉండే పీహెచ్సీ/సామాజిక ఆరోగ్య కేంద్రాలు వివరాలను ఆయన తెలియజేశారు. అనందపురం, అనంతగిరి, అచ్చుతపురం,బుచ్చయ్యపేట,చీడికడ, చింతపల్లి, చౌడువాడ, జి.మాడుగుల, గోలుగొండ, గూడెంకొత్తవీధి, కెజె పురం, మాకవరపాలెం, మునగపాక, నాతవరం, పాయకరావుపేట, పేదబయలు,ఆర్.తల్లవలస,రాంబిల్లి,రావికమతం రేవిడి, సబ్బవరం, వేములపూడి,అరకు,దేవరపల్లి, డుంబ్రిగుడా,గవరవరం, గొడిచెర్ల, కశింకోట,క్రిష్ణదేవిపేట,కేవిపురం,ముంచింగ్ఫుట్,హుకుంపేట, పెనుగోళ్ళు,పాడేరు,రావికమతం పీహెచ్సీల పరిధిలోని ప్రజలు రెండవ డోసు కోసం పై పీహెచ్సీలను సంప్రదించాలన్నారు.

విశాఖ రూరల్

2021-05-12 15:36:00

42 రోజులు దాటిన వారికే రెండో డోసు..

కోవిషీల్డ్ మొదటి డోసు వేసుకొని 42 రోజులు దాటిన వారికి మాత్రమే రెండోడోసు వేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిబంధనలు ప్రకారం, కోవిషీల్డ్ మొదటి డోసు వేసిన ఆరు వారాలు లోపు వేక్సిన్ వేయడం జరగదని స్పష్టం చేశారు. అందువల్ల మొదటి డోసు వేసుకొని 42 రోజులు పూర్తి అయినవారు మాత్రమే గురువారం నుంచి వేక్సిన్ కేంద్రానికి వెళ్లాలని సూచించారు. వేక్సిన్ వేయాల్సిన వారికి ముందుగానే ఏఎన్ఎం ద్వారా సమాచారం అందుతుందని, ఒకవేళ సమాచారం రానప్పటికీ, 42 రోజులు పూర్తి అయినవారు, తమ ఆధార్ కార్డు తీసుకొని వెళ్లి వేక్సిన్ వేయించుకోవచ్చని తెలిపారు. ఇంతకుముందు మొదటి డోసు వేసుకున్న కేంద్రాలకు అనుబంధంగా, వాటికి సమీపంలోని పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలలో వేక్సిన్ వేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతానికి కోవెగ్జిన్ స్టాకు లేదని, వచ్చిన తరువాత, ప్రత్యేకంగా దీనికోసం ఏర్పాటు చేసిన ఆయా వేక్సిన్ కేంద్రాలలో 28 రోజులు దాటినవారికి రెండో డోసు వేయడం జరుగుతుందని ఒక ప్రకటన ద్వారా జేసీ తెలిపారు.

Vizianagaram

2021-05-12 15:34:49

జీవిఎంసీ పరిధిలో టీకా వేసే పీహెచ్సీలివే..

మహావిశాఖ నగర పరిధిలో వైద్య ఆరోగ్యశాఖ గుర్తించిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే కోవిడ్ వేక్సిన్ 2వ డోసు వేస్తున్నట్టు డీఎంహెచ్ఓ డా.పతివాడ సత్యసూర్యనారాయణ తెలియజేశారు. అల్లిపురం,బుచ్చిరాజుపాలెం, వన్ టౌన్,రామమూర్తి పంతులు పేట,సాగర్ నగర్,తగరపువలస,విద్యుత్ నగర్, గాజువాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (ద్రోణంరాజు కళ్యాణమండపం,డ్రైవర్స్ కాలనీ),మధురవాడ,.పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం.అనకాపల్లి..చినవాల్తేరు, స్వర్ణభారతి,అరిలోవ,శ్రీహరిపురం, పెందుర్తి పీహెచ్సీల పరిధిలోని ప్రజలు కేవలం టోకెన్లు పొందిన లేదా మెసేజ్ వచ్చిన వారు రెండవ వేక్సిన్ వేయించుకోవడానికి మాత్రమే రావాలని ఆయన కోరారు.

Visakhapatnam

2021-05-12 15:32:39

ఆక్సిజన్ ప్లాంట్ పనులు వేగవంతం..

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంటు పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు.  సర్వజన ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం పనులను జిల్లా కలెక్టర్ బుధవారం పరిశీలించారు. నాగార్జున అగ్రికమ్ సౌజన్యంతో ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఎన్. ఏ.సి.ఎల్ లో ప్రస్తుతం ఉన్న ప్లాంటుకు ప్రస్తుత అవసరాలకు తగిన విధంగా రూ.25 లక్షల ఖర్చుతో ఎన్. ఏ.సి.ఎల్ మార్పులు చేసింది. ఆ యూనిట్ ని సర్వజన ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిజిహెచ్ లో ప్లాంటు నిర్మాణ పనులను జాతీయ రహదారుల సంస్థకు అప్పగించారు. జిజిహెచ్ లో ప్లాంటుకు విద్యుద్దీకరణ, పైపులు అమర్చే పనులు జరుగుతున్నాయి. డ్యూయల్ లైట్ అనే అనుసంధాన (అబ్జార్వెంట్) పరికరం టాటా కెమికల్స్ నుండి తెప్పిస్తున్నారు. ఈ ప్లాంటు ద్వారా గంటకు 40 వేల లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ఆక్సిజన్ ప్లాంట్ త్వరిత గతిన నిర్మాణం చేపట్టే దిశగా కాంట్రాక్టర్ కి  సలహాలు సూచనలు ఇవ్వాలని ఎన్. ఏ.సి.ఎల్ ఉపాధ్యక్షులు సి.వి.రాజులును కోరారు. ఈ సందర్భంగా జిజిహెచ్ లో నావల్ డాక్ యార్డు ఆధ్వర్యంలో అమర్చిన పైపు లైన్లను,  ఆక్సిజన్ సరఫరా తీరును పనితీరును కలెక్టర్ నివాస్ పరిశీలించారు. ఆక్సిజన్ ప్లాంట్ సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని సిబ్బందికి  సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు  సుమిత్ కుమార్, ఆర్.శ్రీరాములు నాయుడు, ఏపిఈడబ్ల్యూఐసి ఇఇ కె.భాస్కరరావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సి.హెచ్.కృపావరం, సహాయ డిఎఫ్ఓ శ్రీను బాబు, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.ఏ.కృష్ణ మూర్తి, ఏపిఎంఐడీసీ డిఇ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-05-12 15:31:17

కరోనాలో నర్సులే అసలైన కుటుంబ సభ్యులు..

కరోనా సమయంలో నర్సులే రోగులందరికీ కుటుంబ సభ్యులై ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నారని జివిఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని బుధవారం  11వ వార్డు ఆరిలోవలోని ఎఫ్.ఆర్.యు. ఆసుపత్రి నర్సులు, సిబ్బంది చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రపంచ స్థాయిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో నర్సులు కోవిడ్ పేషంట్లకు చేస్తున్న సేవలకు ప్రణమిల్లాలని, ఇదే స్ఫూర్తితో మరింత మంది కోవిడ్ పేషంట్లకు సేవలు అందించాలని మేయర్ తెలిపారు. అనంతరం, వైద్యాధికారి డా. అనిత ఆధ్వర్యంలో నర్సులు, సిబ్బందికి సన్మానించారు. డా. అనిత, నర్సింగు సిబ్బంది మాట్లాడుతూ , వ్యాక్సినేషన్, కోవిడ్ సేవలతో నెలలు తరబడి అవిశ్రాంతంగా గడుపుతున్న తమ సిబ్బందికి మేయర్ సత్కరించడం, శుభాకాంక్షలు తెలుపడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరిలోవ ఎఫ్.ఆర్.యు. వైద్యాధికారి డా. అనిత, నర్సింగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.   

Visakhapatnam

2021-05-12 15:28:13

అందరి సహకారంతోనే దేవస్థానం అభివృద్ధి..

అందరి సహకారం, సమిష్టి కృషితోనే దేవాలయాల అభివృద్ధి సాధ్యమ వుతుందని సింహాచలం దేవస్థానం ఈవో ఎంవీ సూర్య కళ అన్నారు. బుధవారం సింహ గిరిపైన ఆనందనిలయంలో అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితుల పదవీ ప్రమాణ బాధ్యతలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో సూర్య కళ ప్రత్యేక ఆహ్వానితులు అందరికీ కూడా అభినందనలు తెలియజేశారు. చందనోత్సవం పర్వదినం  ముందు స్వామి ధర్మ కర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులు కావడం, ఉత్సవము ముందు బాధ్యతలు స్వీకరించడం అంతా స్వామి వారి కృప గా పేర్కొన్నారు. భవిష్యత్తులో అందరం కలిసి ఆలయ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేద్దామని ఈఓ పిలుపునిచ్చారు. సింహాద్రి నాధుడు ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు, మేడిది మురళీకృష్ణ, యండమూరి విజయ, డి.మాణిక్యాలరావు ఎస్ ఎన్ రత్నం, లను ఘనంగా సత్కరించి  ఈఓ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆహ్వానితులు అంతా మాట్లాడుతూ, తాము పూర్తిస్థాయిలో స్వామివారి సేవకు  అంకితమవుతామని చెప్పారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని చెప్పారు.  అనంతరం ప్రత్యేక ఆహ్వానితులు అంతా కలిసి సింహాచలం అన్నదానం, గోసంరక్షణ పథకానికి లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కులు ఆలయ ఈవోకు ఇచ్చి త్వరలో మరిన్ని పధకాలు కి తమ వంతు విరాళాలు అంద చేస్తామని చెప్పారు.

పూర్వ జన్మ సుకృతము
..గంట్ల శ్రీనుబాబు

సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులు కావడం ఎంతో సంతోషం కలిగించింది అని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు.  గతంలో తాను సింహాచలం దేవస్థానం చందనోత్సవం కమిటీ సభ్యునిగా స్వామి సోదరి శ్రీ పైడితల్లి అమ్మవారి
ఉత్సవ కమిటీ సభ్యుడిగా పలు మార్లు సేవలు అందించామన్నారు. అంతే కాకుండా మరో సోదరి శ్రీ సత్తమ్మ  తల్లి ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడిగా  ఉన్నప్పటికీ కూడా స్వామి ధర్మ కర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులు కావడం పూర్తి పూర్తిస్థాయిలో సంతోషం కలిగించిందన్నారు. ఈ కార్యక్రమం లో ఆలయ ఏఈ వో కేకే రాఘవ కుమార్రమణమూర్తి,చిట్టి తదితరులు పాల్గొన్నారు.

సింహాచలం

2021-05-12 08:24:44

రైతు బజార్ల వద్ద జర భద్రం సుమీ..

కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా వున్న తరు ణంలో రైతుబజార్లకు వెళ్లేవారు అత్యంత జాగ్రత్తలు పాటించాలని అర్భన్ తహశీల్దార్ జ్నానవేణి కోరుతున్నారు. ఈమేరకు బుధవారం ఆమె మీడియాకు ప్రకటన విడుదల చేశారు. కరోనా వైరస్ ఉద్రుతి అధికంగా ఉన్నందున ప్రతీ ఒక్కరూ డబుల్ లేయర్ వున్న మాస్కులు ధరించాలన్నారు. బౌతిక దూరం పాటిస్తూ, రైతుబజార్లలో కావాల్సిన కూరగాయలు కొనుగోలు చేసుకోవాలన్నారు. సాధ్యమైనంత వరకూ హేండ్ గ్లౌజులు, శానిటైర్లు వినియోగించడం ద్వారా వైరస్ నుంచి రక్షణ పొందడానికి ఆస్కారం వుంటుందన్నారు. జనసాంధ్రత సాధారణంగా అత్యధికంగా వుండే ఈ ప్రాంతాల్లో ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి వీలుపడుతుందన్నారు. వారానికి సరపడే కూరగాయలన్నీ ఒకేసారి కొనుగోలు చేసుకోవడం ద్వారా నిత్యం రైతు బజార్లకు వెళ్లే అవకాశం వుండదని, అదే సమయంలో బయటకు వెళ్లే అవసరం కూడా తప్పుదందని తహశీల్దార్ సూచిన్నారు. అదే సమయంలో కొనుగోలు చేసిన కూరగాయలను  కూడా ఇంటి బయటనే ఒక సారి ముందుగా మంచినీటితో శుభ్రం చేసుకొని అపుడు మాత్రమే ఇంటిలోకి తీసుకెళ్లాలన్నారు. 60ఏళ్లు దాటిన వారు జనసాంధ్రత ఉన్న ప్రదేశాలకు పంపడం మానుకోవాలని జ్నానవేణి నగరవాసులకు సూచిస్తున్నారు.

Visakhapatnam

2021-05-12 05:56:22