ప్రజల ప్రాణాలను కాపాడటమే మనందరి లక్ష్యమని, కోవిడ్ రోగులపై మరింత శ్రద్ద చూపాలని మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. కోవిడ్ ఆసుపత్రులపై మరింత పర్యవేక్షణ పెంచి, అదనపు వసతులు కల్పించాలని కోరారు. ఎట్టి పరిస్థితిలోనూ ఆక్సీజన్‌కు కొరత రాకుండా చూడాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా రెమిడిసివిర్‌కు కొరత లేదని వారు స్పష్టం చేశారు.
జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, జిల్లాలో కోవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, రోగులకు అందిస్తున్న వైద్యం తదితర అంశాలపై జిల్లా అధికారులతో మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రస్తుత పరిస్థితులు, కోవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను మంత్రులకు వివరించారు. కోవిడ్ మొదటి వేవ్‌తో పోలిస్తే, ప్రస్తుతం ఇన్‌ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉందని, రికవరీ రేటు కొంత తగ్గిందని చెప్పారు. జిల్లాలోని 28 ఆసుపత్రుల్లో ప్రస్తుతం కోవిడ్‌కు చికిత్స నందిస్తున్నామన్నారు. ఏడు కోవిడ్ కేర్ సెంటర్లలో 3వేల పడకలను సిద్దం చేశామని చెప్పారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవారికి కోవిడ్ కిట్ల పంపిణీలో మన జిల్లా ప్రధమ స్థానంలో ఉందన్నారు. బొబ్బిలిలో కోవిడ్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన పెట్టినట్టు చెప్పారు.
జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో ఆక్సీజన్ లభ్యత, ఆసుపత్రుల్లో వసతులు, వాటిని మెరుగుపర్చేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రస్తుతానికి జిల్లాలో ఆక్సీజన్ కొరత లేదని, రెండుమూడు రోజుల్లో జిల్లా కేంద్రాసుపత్రిలో 10 కిలోలీటర్ల ట్యాంకు అందుబాటులోకి వస్తుందన్నారు. మందుల కొరత కూడా లేదని చెప్పారు. జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు మాట్లాడుతూ జిల్లాలోని 28 కోవిడ్ ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య ప్రక్రియను వివరించారు. ఆసుపత్రుల్లో పడకలు ఖాళీ అయిన వెంటనే, ప్రతీ రెండు గంటలకోసారి సమాచారాన్ని అప్‌డేట్ చేసి, 104 కాల్ సెంటర్‌కు పంపిస్తున్నామని చెప్పారు.
సుదీర్గ సమీక్ష అనంతరం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, జిల్లాలో కోవిడ్ నియంత్రణకు జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలను అభినందించారు. జిల్లా అధికారులంతా సమిష్టిగా కృషి చేస్తున్నారని అన్నారు. చిన్నచిన్న లోపాలను సరిదిద్ది, మరింత సమర్థవంతంగా వైద్యాన్ని అందించాలని కోరారు. అంతకుముందు ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలన్నిటికీ పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థాయిలో చేయాల్సిన వాటిని తన దృష్టికి తీసుకువస్తే, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖామంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, కోవిడ్ రోగులపై మరింత శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాత్రి పూట కూడా పర్యవేక్షణను మరింత పెంచాలని సూచించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని వినియోగించాలని, ఎట్టి పరిస్థితిలోనూ వైద్యంలో లోపం ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రతీ రెండుమూడు గంటలకు రోగి ఆరోగ్య పరిస్థితిని నమోదు చేయాలన్నారు. అవసరం అయితే ట్రైనీ నర్సులను విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఆక్సీజన్‌కు ఎట్టి పరిస్థితిలోనూ కొరత రాకూడదని, దానికి తగ్గ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా రెమిడిసివిర్ కొరత లేదని, బ్లాక్ మార్కెట్‌ను పూర్తిగా నిరోధించామని చెప్పారు. ప్రయివేటు ఆసుప్రతుల్లో కూడా అన్ని వసతులు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. పాజిటివ్ వచ్చిన వారికి, కోవిడ్ కేర్ సెంటర్‌లో బెడ్ కేటాయించి, వెంటనే వారిని తరలించాలని ఆదేశించారు. పాజిటివ్ రిపోర్టుతో బాటే, వారికి కేటాయించిన బెడ్ వివరాలు కూడా మెసేజ్ వెళ్లే ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు చెప్పిన సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి బొత్స హామీ ఇచ్చారు.
అంతకుముందు పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, తమ దృష్టికి వచ్చిన సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. ఎంపి బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, జిల్లాలో రోగులపై పర్యవేక్షణ పెంచడం ద్వారా మరణాలను తగ్గించవచ్చని సూచించారు. ఆక్సీజన్ సరఫరాలో చిన్నచిన్న లోపాలున్నాయని, వాటిని సరిదిద్దాలని కోరారు. పరీక్షా ఫలితాలను వేగంగా వెళ్లడించాలని సూచించారు. బొబ్బిలి ఎంఎల్ఏ శంబంగి వెంకట చినప్పలనాయుడు మాట్లాడుతూ, బొబ్బిలి ఆసుపత్రిలో పదిబెడ్లు ఉన్నాయని, వాటిలో కేవలం 4 పడకలకే ఆక్సీజన్ సదుపాయం ఉందన్నారు. మిగిలిన వాటికి కూడా ఈ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. పార్వతీపురం ఎంఎల్ఏ అలజంగి జోగారావు మాట్లాడుతూ, ఏరియా ఆసుపత్రిలో 41 బెడ్లకు మాత్రమే ఆక్సీజన్ సదుపాయం ఉందని, పూర్తిగా వంద పడకలకు కూడా ఈ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. రోగులపై పర్యవేక్షణ ఇంకా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వేక్సినేషన్‌లో పట్టణాలకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. గజపతినగరం ఎంఎల్ఏ బొత్స అప్పలనరసయ్య మాట్లాడుతూ, వేక్సినేషన్ కేంద్రాలను మండలానికి రెండు చొప్పున ఏర్పాటు చేయాలన్నారు. కర్ఫ్యూను దృష్టిలో పెట్టుకొని వేక్సిన్ వేసే సమయాన్ని మార్చాలని కోరారు. ఎంఎల్‌సి పి.సురేష్‌బాబు మాట్లాడుతూ, రాత్రి సమయంలో రోగులను పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. సాంకేతిక నిపుణుల కొరత ఉందని, దానిని పరిష్కరించాలని కోరారు. ఈ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ ఎస్.సత్యనారాయణ, అరకు ఎంపి గొట్టేటి మాధవి, ఎస్‌కోట ఎంఎల్ఏ కడుబండి శ్రీనివాసరావు, సబ్ కలెక్టర్ విదేహ్ ఖరే, ఐటిడిఏ పిఓ ఆర్.కూర్మనాధ్, అడిషనల్ ఎస్‌పి సత్యనారాయణ, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ రమణకుమారి, పలువురు ఉన్నతాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా కోవిడ్ టాస్క్‌ఫోర్స్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.