అనంతపురం జిల్లాలో మెడికల్ ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. సోమవారం హిందూపురం పరిధిలోని తూముకుంట వద్ద వేదిక్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ను హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరానికి ముందు కేవలం సిలిండర్ల ద్వారా మాత్రమే ఆక్సిజన్ అందించేవారమని, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో లిక్విడ్ ఆక్సిజన్ ఉన్న ఆసుపత్రి ఒకటి కూడా జిల్లాలో లేదన్నారు. ఇప్పుడు దాదాపుగా 40 వేల లీటర్ల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 13 వేల లీటర్ల చొప్పున, క్యాన్సర్ హాస్పిటల్, హిందూపురం జిల్లా హాస్పిటల్ లో 6 వేల చొప్పున, కదిరి, గుంతకల్ ఏరియా ఆసుపత్రులలో వెయ్యు లీటర్ల చొప్పున ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇవి కాకుండా జిల్లా మొత్తానికి 336 సిలిండర్లు ఉన్నాయని, పరిశ్రమలో వేరే అవసరాల కోసం ఉపయోగించే సిలిండర్లను కూడా వారితో మాట్లాడి మరో 700 సిలిండర్ ను తీసుకోవడం జరిగిందన్నారు. మొత్తం 1,000 కిపైగా సిలిండర్లను అక్కడి ఉన్న రోగులు ఆధారంగా ఆక్సిజన్ అందించేలా సిలిండర్లను నింపుకొని అందుబాటులో ఉంచామన్నారు. ఇంకా అదనపు నిల్వలు చేసుకునేందుకు గాను ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లను, స్టీల్ ప్లాంట్ యూనిట్లలో ఏవైతే మూలనపడి ఉన్నాయో ఆ యూనిట్లను తిరిగి తెరిపించడం జరిగిందన్నారు.
అందులో హిందూపురం లోని వేదిక్ ఇస్పాత్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన స్టీల్ ప్లాంటు లో యూనిట్లు ఉందని, ఈ స్టీల్ పరిశ్రమ మూతపడడంతో ఉత్పత్తి నిలిచిపోయిందని, వారి సమస్యలను పరిష్కరించి తిరిగి ఆక్సిజన్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇక్కడ రోజుకు 500 సిలిండర్లు ఉత్పత్తి చేస్తున్నారని, 1000 సీలిండర్ల వరకు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందన్నారు. ఇంకా అదనంగా ఉత్పత్తి చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. అంతే కాకుండా సింగనమల మండలం చక్రాయపేట గ్రామంలో రోజుకు 350 సిలిండర్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం గల ప్లాంట్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లాకు రెగ్యులర్ గా కర్ణాటక నుండి ఆక్సిజన్ వస్తోందని, అందులో ఎక్కడైనా సమస్యలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లాలోనే సొంతంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకునే ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇవే కాకుండా భవిష్యత్తులో ఏ హాస్పిటల్ కు అవసరమయ్యే ఆక్సిజన్ ను ఆ హాస్పిటల్లోనే ఉత్పత్తి చేసుకునేలా ప్లాంట్లను నిర్మించి అక్కడే ఖాళీ సిలిండర్లను నింపి అక్కకి ఉన్న ఆక్సిజన్ బెడ్లకు ఉపయోగించుకునేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఇవే కాకుండా జిల్లాలో అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో, హిందూపురం జిల్లా ఆసుపత్రి, కదిరి, గుంటకల్ ఏరియా ఆస్పత్రులలో 1,000 లీటర్లు సామర్థ్యం గల ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందుకు సంబంధించి హిందూపురంలో ప్లాంట్ పనులు ప్రారంభమయ్యాయన్నారు. మిగిలిన మూడు ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే పనులు ప్రారంభమవుతాయన్నారు. ప్రస్తుతం ఆక్సిజన్ కు ఎలాంటి కొరత లేకుండా సమృద్ధిగా ఆక్సిజన్ ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎటువంటి అవకతవకలు కూడా లేకుండా ఉండేందుకు కోసం ప్రభుత్వ ఉద్యోగులను కేటాయించి ఎంత ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోంది, ఏఏ ఆస్పత్రులకు అమ్ముతున్నారు, ఎంత ధరకు అమ్ముతున్నారు, ఎన్ని సిలిండర్లు వెళుతున్నాయి తదితర అంశాలను రోజువారీగా పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ ను ముందుగా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు ఇవ్వాలని, ఆ తర్వాత జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులకు, మిగిలినవి ఇతర జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు, ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రులకు, ఇంకా మిగిలి ఉంటే ఇతర రాష్ట్రాలకు కూడా అమ్ముకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. తక్కువ సమయంలో ఇక్కడి ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు సబ్ కలెక్టర్, పరిశ్రమల శాఖ జిఎం, ఎంపీ, ఎమ్మెల్సీల సూచనల మేరకు కేవలం మూడు రోజుల్లోనే ఈ ప్లాంట్ ను పునరుద్ధరణ చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ప్రతి ఆస్పత్రిలోనూ ఆక్సిజన్ ప్లాంట్లు ఉండేలా ఏర్పాటు చేయనున్నామన్నారు.
రాష్ట్రంలో వైద్యం అందక ఏ ఒక్కరు కూడా మరణించకూడదని అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి : హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో వైద్యం అందక ఏ ఒక్కరు కూడా మరణించకూడదనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సూచన మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ముందుకు వెళుతున్నాయన్నారు. కరోనా వ్యాధికి ముఖ్యంగా ఆక్సిజన్ చాలా అవసరమని, ఇక్కడ మూతపడిన యూనిట్లను ముందుగా గుర్తించి తెరిపించేందుకు జిల్లా కలెక్టర్ గారు వారి సమస్యలను పరిష్కరించి త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. ఇందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, పరిశ్రమల శాఖ జిఎం, తదితరులను అభినందిస్తున్నానన్నారు. అలాగే ఇక్కడ ఉత్పత్తి చేసిన ఆక్సిజన్ ను ముందుగా ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులకు, ఆ తర్వాత ఇతర జిల్లాలు మరియు రాష్ట్రాలకు అందించడం జరుగుతుందని తెలిపారన్నారు. జిల్లా ప్రజలు ఎవరు అభద్రతా భావానికి గురి కావాల్సిన పనిలేదని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని, అన్ని రకాల చర్యలను ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం తీసుకుంటోందన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండి, పోషకాహారం తీసుకుంటూ ఉండాలన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాను తరిమి కొట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో పెనుకొండ సబ్ కలెక్టర్ నిషా0తి, పరిశ్రమల శాఖ జీఎం అజయ్ కుమార్, నోడల్ ఆఫీసర్ ప్రసన్న కుమార్, వేదిక్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ ఎండి శరత్ బుతారా, తదితరులు పాల్గొన్నారు.