రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కోవిడ్ సోకిన వారికి వైద్య సేవలు అందించేందుకు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడే ప్రసక్తి లేదని తెలియజేశారని, రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ పేర్కొన్నారు. బుధవారం అనంతపురం నగరంలోని ఏడిసిసి బ్యాంక్ కార్యాలయం సమావేశ మందిరంలో కోవిడ్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి శంకర నారాయణ, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ్, తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి శంకర నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, కరోనా కట్టడికి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, కరోనా సోకిన వారిని కాపాడేందుకు ఎంతయినా ఖర్చు చేస్తామన్నారు. జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు.
కరోనా నేపథ్యంలో బుధవారం నుంచి కర్ఫ్యూ మొదలవుతుందని, ప్రతి ఒక్కరు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. కర్ఫ్యూని పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేయాలన్నారు. కర్ఫ్యూ విధించేందుకు కోవిడ్ కేసులు పెరగడమే కారణమని, కేసులు మరిన్ని పెరగకుండా అరికట్టేందుకు, తగ్గించడానికి కర్ఫ్యూని అమలు చేస్తున్నామన్నారు. గత ఏడాది ఏ విధంగా అయితే అధికారులు సమర్థవంతంగా లాక్ డౌన్ లో పనిచేసారో కర్ఫ్యూలో కూడా అలాగే పనిచేసేలా పాలుపంచుకోవాలన్నారు. కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలు, కరోనా టెస్టింగ్, వ్యాక్సిన్ కోసం వస్తున్న వారిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కర్ఫ్యూ నేపథ్యంలో జాతీయ రహదారుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉందని, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం దానిపై దృష్టి పెట్టాలన్నారు.
కరోనా సమయంలో శానిటేషన్ అనేది ముఖ్యమైన అంశమని, గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. శానిటేషన్ పై ఎలాంటి అజాగ్రత్త, నిర్లక్ష్యం పనికిరాదన్నారు. క్షేత్రస్థాయిలో కాంట్రాక్ట్ ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ ను సక్రమంగా చేపట్టాలన్నారు. కరోనా పరిస్థితులలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేసేలా చూడాలన్నారు. కరోనా కట్టడికి గత ఏడాది ఏ విధంగా అయితే టీం వర్క్ తో, ఒక స్ఫూర్తి తో పని చేసామో అదేవిధంగా జిల్లా యంత్రాంగం టీం వర్క్ తో కలిసి కట్టుగా పని చేయాలన్నారు. గత ఏడాది చేసిన మాదిరిగా కోవిడ్ కేర్ సెంటర్లను పూర్తి స్థాయిలో నిర్వహించాలని, గతేడాది లాక్ డౌన్ సమయంలో ఆస్పత్రులపై ఒత్తిడి తక్కువగా ఉండేదని, ప్రస్తుతం కోవిడ్ ఆస్పత్రులపై ఎక్కువ ఒత్తిడి పడిందన్నారు. జిల్లాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు కరోనా నివారణకు కట్టుదిట్టంగా పనిచేయాలన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో భోజనం, వైద్య సదుపాయాలు, తదితర అన్ని రకాల ఏర్పాట్లను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో నాణ్యమైన, పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అందిస్తున్నామన్నారు. పోలీస్, రెవెన్యూ, హెల్త్, పంచాయతీరాజ్, తదితర అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కరోనా కట్టడికి కృషి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో నోడల్ అధికారులు కిందిస్థాయి ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయించాలన్నారు.
హిందూపురం జిల్లా ఆస్పత్రిలో అవసరమైన సిబ్బందిని నియమించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని) ఆదేశాలు ఇచ్చారన్నారు. కరోనా నేపథ్యంలో వైరస్ సోకిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామని, హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి కిట్లను ఇస్తున్నామని, వారికి తగిన సూచనలు, సలహాలు కూడా అందిస్తున్నామన్నారు. కరోనా నేపథ్యంలో యువత నిర్లక్ష్యంగా ఉండరాదని, అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని, ప్రజాసంక్షేమం, ఆరోగ్యం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడకుండా కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. జిల్లాలో సరిపడినన్ని ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని, ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. హిందూపురం పరిధిలోని తూముకుంట వద్ద, తాడిపత్రి పరిధిలోని అర్జాస్ స్టీల్ ప్లాంట్ వద్ద ఆక్సిజన్ ప్లాంట్ లు ఉన్నాయన్నారు. ఆక్సిజన్ అందించే విషయమై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పెట్టామని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా కోవిడ్ చికిత్సకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలనే వసూలు చేయాలని, లేదంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.