శ్రీకాకుళంజిల్లాలో జగనన్న తోడు, చేయూత యూనిట్లు సకాలంలో ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. ప్రతి శుక్రవారం నాటికి ప్రగతి నివేదికలు సమర్పించాలని పేర్కొన్నారు. జగనన్న తోడు, చేయూత పథకాలపై పశుసంవర్ధక శాఖ, బ్యాంకర్లు, డీఆర్డీఏ తదితర శాఖలతో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. చేయూత క్రింద పశుసంపద యూనిట్లు జిల్లాకు లక్ష్యంగా ఇవ్వడం జరిగిందని ఆయన చెప్పారు. జగనన్న చేయూత క్రింద పాడిపశువుల యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లాను ఆముల్ తో అనుసంధానం చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటికే వంద గ్రామాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ప్రతి రోజు కనీసం మూడు యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. బ్యాంకులకు రుణాల మంజూరుకు దరఖాస్తులు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. సంతబొమ్మాలి, కంచిలి వంటి ప్రాంతాల్లో ఎపిజీవిబి శాఖలు స్పందించడం లేదని డీఆర్డీఏ సిబ్బంది తెలియజేయగా వెంటనే రీజనల్ మేనేజర్ దృష్టిలో పెట్టాలని ఆయన సూచించారు. యూనిట్ల ఏర్పాటులో పశుసంవర్ధక శాఖ ఎడిలు, వెలుగు ఏసిలు శ్రద్ద వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. లబ్ధిదారులు తమ వాటా మొత్తాన్ని వెంటనే చెల్లించుటకు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.
జగనన్న తోడు క్రింద ప్రభుత్వ లక్ష్యం పూర్తి చేయాలని కోరారు. బ్యాంకుల నుండి మంచి సహకారం లభిస్తుందన్నారు. చనిపోయిన దాదాపు వెయ్యి మందికి బీమా క్లెయిమ్ లు పరిష్కరించాలని ఆయన అన్నారు. జగనన్న తోడు క్రింద తీసుకున్న రుణాలను తిరిగి కట్టించాలని ఆయన ఆదేశించారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. జీవనోపాధులు కల్పించుటకు ప్రభుత్వం సదుద్దేశంతో తోడు పథకం క్రింద రుణాలు మంజూరు చేస్తున్న విషయాన్ని గ్రహించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. డీఆర్డీఏ సిబ్బంది దుకాణాలను పరిశీలించి లబ్ధిదారులకు పథకం వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు డా.కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములు నాయుడు, డీఆర్డీఏ పిడి బి.శాంతిశ్రీ, యూనియన్ బాంక్ రీజనల్ మేనేజర్ పి.కృష్ణయ్య, ఎల్.డి.ఎం జి.వి.బి.డి.హరిప్రసాద్, ఎస్బిఐ రీజనల్ మేనేజర్ తపోధన్ దేహారి, ఎపిజివిబి ఆర్.ఎం మహమ్మద్ రియాజ్ , డిసిసిబి సిఇఓ దత్తి సత్యనారాయణ, పశుసంవర్ధక శాఖ జెడి డా.ఏ.ఈశ్వర రావు, డిడి డా.మాదిన ప్రసాదరావు, మెప్మా పిడి ఎం.కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు దృష్ట్యా పరిశ్రమల్లో అదనపు జాగ్రత్తలు తీసుకునేలా పారిశ్రామిక యాజమాన్యాలకు ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి అధికారులకు సూచించారు. తాగునీరు, ప్రాథమిక చికిత్స వంటి ఏర్పాట్లు చేసేలా చూడాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పారిశ్రామిక ప్రమాదాలు జరక్కుండా అవసరమైన భద్రతా చర్యలు తీసుకునేలా మార్గనిర్దేశనం చేయాలని ఆదేశించారు. శుక్రవారం కాకినాడలోని కలెక్టరేట్ నుంచి వర్చువల్ విధానంలో కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధి విధానం (2015-20) కింద సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక (ఎంఎస్ఎంఈ) యూనిట్లకు వివిధ ప్రోత్సాహకాలు అందిస్తున్నామని, తాజాగా 21 దరఖాస్తులకు సంబంధించి రూ.84,90,650 మేర మంజూరుకు డీఐఈపీసీ సిఫార్సు చేసినట్లు తెలిపారు. పారిశ్రామిక యూనిట్లకు ప్రోత్సాహకాలు అందించేందుకు 2021, ఫిబ్రవరి 25, మార్చి 18న స్క్రుటినీ వెరిఫికేషన్ కమిటీ (ఎస్‌వీసీ) సమావేశాలు జరిగినట్లు తెలిపారు.
ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందిన పారిశ్రామిక యూనిట్ల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించి, అవసరమైన సలహాలు అందించాలని దీనివల్ల ఆయా యూనిట్లు లాభాల బాట పట్టేందుకు అవకాశముంటుందని పేర్కొన్నారు. ఏపీ సింగిల్ డెస్క్ పాలసీ కింద అనుమతులు పొందేందుకు 2021, ఫిబ్రవరి 12 నుంచి మార్చి 18 వరకు 57 దరఖాస్తులు అందాయని తెలిపారు. వీటిలో 29 దరఖాస్తులు ఇప్పటికే ఆమోదం పొందాయని.. మిగిలిన 28 దరఖాస్తులను కూడా నిర్దేశ గడువు (ఎస్ఎల్ఏ)లోనే పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. పీఎంఈజీపీ పథకం కింద ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పేపర్, జ్యూట్ ఆధారిత ఉత్పత్తుల తయారీకి వచ్చిన 23 దరఖాస్తులను క్షుణ్నంగా పరిశీలించి, బ్యాంకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల గృహ నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిస్తూ నిధులు కేటాయిస్తోందని, దీన్ని పారిశ్రామిక రంగ అభివృద్ధికి కూడా ఓ మార్గంగా ఉపయోగించుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. లేఅవుట్లలోనే ఇటుకలు వంటి నిర్మాణ సామగ్రి తయారీ యూనిట్లు ప్రారంభించేలా ఔత్సాహికులను ప్రోత్సహించాలని, వారికి అన్ని విధాలా సహాయసహకారాలు అందించాలని సూచించారు. దీనివల్ల తక్కువ ధరకు నాణ్యమైన సామగ్రి అందుబాటులోకి రావడంతో ఇళ్ల లబ్ధిదారులకు మేలు జరుగుతుందని, అదే విధంగా అధిక డిమాండ్ కారణంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం ఉంటుందన్నారు. సమావేశంలో డీఐసీ జనరల్ మేనేజర్ బి.శ్రీనివాసరావు, బీఐఎస్ (విశాఖపట్నం) సైంటిస్ట్ సంధ్య, కాయిర్‌బోర్డ్ రీజనరల్ ఆఫీస్ ఇన్‌ఛార్జ్ కె.దశరథరావు, డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాథ్ తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా భవిష్యత్తు అంతా పాడిపరిశ్రమపైనే ఆధారపడి వుంటుందని, ఈ రంగానికి బ్యాంకులు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పాడిపశువుల కొనుగోలుకు పెద్ద ఎత్తున రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉందని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అన్నారు. వచ్చే ఆరు నెలల్లో జిల్లాలో పాడిపరిశ్రమ ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటికే గ్రామాల్లో 634 బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ల ఏర్పాటుకోసం భవనాల నిర్మాణాలకు స్థల సేకరణ పూర్తిచేసి అందజేశామన్నారు. అన్ని గ్రామాల్లో రైతుభరోసా కేంద్రాల పక్కనే ఇవి ఏర్పాటవుతాయన్నారు. వీటి ఏర్పాటుతో బ్యాంకుల్లోనూ కార్యకలాపాలు అధికం అవుతాయని, డిపాజిట్లు కూడా పెరుగుతాయని అందువల్ల బ్యాంకులన్నీ పాడిపరిశ్రమ పట్ల చిన్నచూపు మానుకొని ఇప్పటికైనా పాడిపశువుల కొనుగోలు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావాలన్నారు. పాడిపరిశ్రమ విషయంలో బ్యాంకులకు సరైన అవగాహన లేకనే ఈ పథకం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని, రైతులకు పాడిపరిశ్రమ ద్వారా ఎంతగానో సహాయం అందించే అవకాశం ఉందన్నారు. జిల్లాలో రైతుల ఆదాయాలు పెంచడంలో ఈ పాడిపరిశ్రమ ఎంతగానో తోడ్పడుతుందని, ఏదైనా సమయంలో వ్యవసాయం వల్ల రైతు నష్టపోతే పాడిపశువులే ఆదుకుంటాయన్నారు. అందుకే ఈ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. జిల్లా వ్యవసాయ ఆధారిత ఆర్ధికవ్యవస్థగా రూపొందుతుందని, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి జిల్లాలో అత్యధిక ప్రాధానత్య వుంటుందన్నారు. జిల్లాలో సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ప్రోత్సహించేందుకు వాటి మార్కెటింగ్‌కు సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. రైతు వల్లే సమాజం మనుగడ సాగిస్తోందని, మనకు ఆహార భద్రత చేకూరుతుందనే విషయాన్ని బ్యాంకర్లు గుర్తుంచుకొని అటువంటి రైతుల సంక్షేమం, వారి అవసరాల పట్ల నిర్లక్ష్యం చూపకుండా జాగ్రత్త వహించాల్సి వుందన్నారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో బ్యాంకు అధికారులు, జిల్లా అధికారులతో కూడిన బ్యాంకుల సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా జగనన్న చేయూత పథకంలో పాడిపశువుల యూనిట్లకు బ్యాంకుల నుండి తగిన సహకారం అందడం లేదని పశుసంవర్థక శాఖ జె.డి. ఎం.వి.ఏ.నర్శింహులు కలెక్టర్‌కు వివరించారు. బ్యాంకులు కోరిన పత్రాలన్నింటినీ అందజేస్తున్నప్పటికీ యూనిట్లు మంజూరు కావడం లేదన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ లీడ్ బ్యాంకు అధికారి రానున్న రోజుల్లో అన్ని బ్యాంకుల కంట్రోలింగ్ అధికారులతో మాట్లాడి మంజూరైన యూనిట్లు ఏర్పాటయ్యేలా చొరవ చూపాలన్నారు.
జగనన్న తోడు పథకం అమలుపై కూడా కలెక్టర్ సమీక్షించారు. ఈ పథకం అమలులోనూ బ్యాంకర్ల సహకరించాల్సి వుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏయే బ్యాంకులు ఈ పథకం అమలులో వెనుకంజలో ఉన్నాయో గుర్తించి ఏ కారణాలతో దరఖాస్తులు తిరస్కరించారో తెలపాలని బ్యాంకర్లను కలెక్టర్ కోరారు. లబ్దిదారు వారీగా సమీక్షించి అర్హత ఉన్న వారందరికీ రుణాలు ఇవ్వాలని కలెక్టర్ కోరారు. పట్టణ ప్రాంతాల్లోనే ఈ పథకం అమలు కొంత మందకొడిగా సాగుతోందని వెంటనే మునిసిపల్ కమిషనర్లతో సమావేశం ఏర్పాటుచేసి రుణాల మంజూరు వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ డా.మహేష్ కుమార్‌కు కలెక్టర్ సూచించారు.
రిజర్వు బ్యాంకు అధికారి సాయిచరణ్ మాట్లాడుతూ నాబార్డు రూపొందించిన రుణ ప్రణాళిక సమాచారం మేరకు జిల్లాలో చిన్నపరిశ్రమల రంగానికి గత ఏడాది బ్యాంకులు 20శాతం మాత్రమే రుణాలు అందజేయడం పై ప్రశ్నించారు. కోవిడ్ కారణంగా పరిశ్రమల ఏర్పాటుకోసం రుణాలు తీసుకొనేందుకు గత ఏడాది ఎవరూ ముందుకు రాలేదని పలువురు బ్యాంకు అధికారులు వివరించారు.
నాబార్డు రుణ సామర్ధ్య అంచనా ప్రణాళిక విడుదల
నాబార్డు 2021-22 సంవత్సరానికి రూపొందించిన జిల్లా రుణ సామర్ధ్య అంచనా( District Potential Linked Credit Plan 2021-22) ప్రణాళికను జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ విడుదల చేశారు. వ్యవసాయం, చిన్న పరిశ్రమలు తదితర ప్రాధాన్యత రంగాలకు వచ్చే ఏడాది రూ.6730.53 కోట్ల రుణాలు ఇచ్చేందుకు అవకాశం ఉన్నట్లు ప్రణాళికలో వెల్లడించారు. వ్యవసాయ రంగానికి రుణ ప్రణాళికలో 64 శాతం, చిన్న పరిశ్రమలకు 23శాతం రుణాలు కేటాయించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.4297.84 కోట్లు, చిన్న పరిశ్రమల రంగానికి రూ.1544.74 కోట్ల రుణాలు, వ్యవసాయానికి సంబంధించిన ఇతర అవసరాలకు రూ.887.98 కోట్ల రుణాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రణాళికలో తెలిపారు.
లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ఏడాది రూ.2652 కోట్ల లక్ష్యానికి గాను రూ.2038 కోట్ల పంటరుణాలు అందజేశామని, వ్యవసాయ టెర్మ్ రుణాలు రూ.680 కోట్లు ఇవ్వాల్సి ఉండగా లక్ష్యానికి మించి రూ.720 కోట్లు అందజేశామన్నారు.
నాబార్డు ఏ.జి.ఎం. పి.హరీష్ మాట్లాడుతూ వ్యవసాయ రంగ నిపుణులు, బ్యాంకర్లు తదితర అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే రుణ సామర్ధ్య అంచనా ప్రణాళిక రూపొందించామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్, వ్యవసాయ శాఖ జె.డి. ఆశాదేవి, డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరక్టర్ సుబ్బారావు, పశుసంవర్ధక శాఖ జె.డి. నర్శింహులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలువురు జిల్లా అధికారులు, బ్యాంకుల జిల్లాస్థాయి కంట్రోలింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేదలకు కార్పోరేట్ వైద్యం అందించాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తుంటే కొందరు కావాలనే పథకాన్ని తప్పుదోవపట్టిస్టున్నారని తూర్పుగోదవరి జిల్లా కలెక్టర్(అభివ్రుద్ధి) కీర్తిచేకూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు, సేవలు, ఫిర్యాదులపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా జెసీ మాట్లాడుతూ, ప్రభుత్వమే రోగులకు ఉచితంగా వైద్యం చేయడానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటే అందులోకూడా కొన్ని ఆసుపత్రులు డబ్బులుు వసూలు చేయడం క్షమించరాని నేరమన్నారు. ఈ విషయంలో ఆరోగ్యశ్రీ కోర్డినేటర్ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎక్కడైనా ఆరోగ్యశ్రీ రోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తే దానికి పదింతలు సదరు ఆసుపత్రి, సిబ్బంది నుంచి పెనాల్టీలు వసూలు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అక్రమ వసూళ్లకు పాల్పడే సిబ్బందిపైనా ఆసుపత్రులపైన కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు ఆయా ఆసుపత్రులను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పథకానికి లోబడి పనిచేయాలన్నారు. అలా పనిచేయని ఆసుపత్రులను గుర్తించాలన్నారు.ఇకపై ఎవరైనా ఆరోగ్యశ్రీ పథకంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తే తొలుత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి (ఇన్చార్జి)డా. ప్రసన్న కుమార్, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా.పి రాధాకృష్ణ, రంపచోడవరం కోఆర్డినేటర్ డా పి.ప్రియాంక, జిల్లా మేనేజర్ కే నవీన్ పాల్గొన్నారు.
విజయనగరం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లో ప్రతీ విద్యార్థి తన పుట్టినరోజు న మొక్కలు నాటే కార్యక్రమాన్ని శుక్రవారం చెప్పట్టారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ స్పెషల్ ఆఫీసర్ ప్రొఫెసర్. హనుమంతు లజిపతి రాయ్ గారు యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి పుట్టిన రోజున మొక్కను నాటి తదుపరి పుట్టిన రోజు వరకు దాని సంరక్షణ బాధ్యత ను చేపట్టాలని సూచించారు. యూనివర్సిటీ లో చేరిన విద్యార్థులు 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ వ్యవధిలో ప్రతి సంవత్సరం మొక్కలు నాటి వాటి పెరుగుదలను వీక్షించాలని అన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ లో BBA కోర్స్ చదువుతున్న విద్యార్ధిని భావన చేత మొక్కను నాటి స్వీట్స్ పంచారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధికారులు ఎస్. ప్రభాకర రావు , ఎన్.వి. సూర్యనారాయణ గారు మరియు విద్యార్థులు పాల్గున్నారు.
పంటలకు నీటి నాణ్యత పరిశీలించడం అవసరమని భూగర్భ జలం, జల గణన శాఖ ఉపసంచాలకులు సి.ఎస్.రావు అన్నారు. భూగర్భ జలం, జల గణన శాఖ స్వర్ణోత్సవాలలో భాగంగా శ్రీకాకుళం ఉప సంచాలకుల కార్యాలయంలో శుక్ర వారం అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. పంట భూములకు నీరు అవసరమని, అదే సమయంలో నీటి నాణ్యత కూడా అంతే అవసరం అన్నారు. నాణ్యత తక్కువగా ఉన్న నీటిని వాడటం వలన నేల పైభాగంలో లవణాలు చేరి పంట దిగుబడులు తగ్గుతాయని ఆయన సూచించారు. పంట భూమి క్రమంగా చవిటి భూమిగా మారిపోతుందని తెలిపారు. సాగునీటి నాణ్యత నాలుగు అంశాలపై ఆధారపడి వుంటుందని పేర్కొంటూ - నీటిలో కరిగివుండే మొత్తం లవణాల పరిమాణం, నీటిలో గల సోడియం ధాతువుకు, ఇతర ధాతువులతో గల నిష్పత్తి, నీటిలో గల జక్కొక్క ధాతువు ఆధిక్యత, కాల్షియం, మెగ్నీషియం ధాతువులతో కలసిపోగా మిగిలిన సోడియం కార్బొనేట్ పరిమాణం పరిశీలించాలని వివరించారు. సాగు చేస్తున్న నేల భౌతిక రసాయన లక్షణాలు, వేయదలచిన పైర్లను కూడ దృష్టిలో పెట్టుకొని నీటి వినియోగాన్ని నిర్ణయించాలని ఆయన సూచించారు. లవణ పరిమాణం ఎక్కువగా వున్న నీటిని వాడితే నేలలు పాలచౌడుగా మారుతాయని చెప్పారు. ప్రత్తి, ఆవాలు, ఉల్లి మొదలగు పంటలు లవణాలను తట్టుకుంటాయని., వరి, చెరకు, పొద్దుతిరుగుడు, జొన్న, మొక్కజొన్న ఇతర సాధారణ పంటలు ఒక మాదిరిగా తట్టుకుంటాయని., అపరాలు, వేరుశెనగ పంటలు, నిమ్మజాతి ఫలవృక్షాలు లవణాలను తట్టుకోలేవని వివరించారు. సోడియం ధాతువుకు కాల్షియం, మెగ్నీషియం ధాతువుల మధ్య గల నిష్పత్తి అధికంగా ఉండే నీటిని, సోడియం కార్బొనేట్ అధికంగా వుండే నీటిని వాడినపుడు నేలలు కారు చౌడుగా మారుతాయని, ఈ నీటిని వినియోగించునపుడు జిప్పం కట్టిన బస్తాలు వేసి ఉంచాలని తద్వారా అందులోని కాల్షియం నెమ్మదిగా కరుగుతుందని చెప్పారు. నీటిలో కాల్షియం ఆధిక్యత పెరుగుతుందని, హానికరమైన సోడియం లవజాల ఉధృతి తగ్గుతుందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో పండించే పంటలకు సాధారణంగా వేసే ఎరువుల కన్నా 25 శాతం ఎక్కువ వేయాలని, సేంద్రియ ఎరువులు అధికంగా వాడాలని సూచించారు. ప్రతి సంవత్సరం సాగు నీటిని, నేలను పరీక్షకు పంపి సలహాలు పొందాలని, పరి, ఎనుముగడ్డిలాంటి పైర్లు కారుచౌడును తట్టుకుంటాయని తెలిపారు. భూగర్భ జలాల నాణ్యతను పరిశీలించటానికి హైడ్రాలజీ ప్రాజెక్టు ఆధ్వర్యంలో వాటర్ క్వాలిటీ లేబరేటరీలను నూతనంగా ఏర్పాటు చేయటం లేదా వున్నవాటిని ఆధునీకరించటం జరిగిందని అన్నారు. పరిశీలక బావులు, హైడ్రాలజీ ప్రాజెక్టు ద్వారా నిర్మించబడిన పీజోమీటర్ల నుండి సేకరించిన నీటి నమూనాలను ఈ లేబరేటరీల ద్వారా విశ్లేషించి వ్యవసాయ నిమిత్తం భూగర్భ జల నాణ్యతను పరిశీలించటం జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటుచేసిన 1254 పీజో మీటర్ల నుండి ప్రతి సంవత్సరం వేసవిలోను, వర్షాల అనంతరం నీటి నమూనాలను సేకరించి, వాటి సాగునీటి యోగ్యతను నిర్ధారించటం జరుగుతుందని తెలిపారు. ఈ నమూనాలను అధ్యయనం చేయటం ద్వారా కోస్తా తీరం వెంబడి వున్న మండలాలలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో భూగర్భ జలం సాగు యోగ్యంగా వున్నట్లు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. కోస్తా ప్రాంతంలో కొన్ని మండలాలలో భూగర్భ జలంలో లవణశాతం ఎక్కువగా వుండటంతో అవి సాగుకు అంత యోగ్యంగా లేనట్లు తెలుస్తోందని చెప్పారు. వరి పంట కొంత వరకు లవణ శాతం ఎక్కువగా ఉన్న నీటిని కూడా తట్టుకోగలుగుతుందని మిగిలిన ప్రాంతమంతా స్థానికంగా నీటిలో లవణీయత వున్నప్పటికీ, సాధారణంగా భూగర్భ జలం సాగుయోగ్యంగా వున్నట్లు తెలుస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు డి.లక్ష్మణ రావు, ఏపిడి ఏ.లక్ష్మణరావు, ఏ.హెచ్.జి జి.రామారావు తదితరులు పాల్గొన్నారు.
మహావిశాఖ నగరపాలక సంస్థకు మొట్టమొదటి మహిళా మేయర్ గా ఎన్నికైన గొలగాని వెంకట హరి కుమారిని గురువారం జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు సత్కరించారు. మేయర్ ఎన్నిక పూర్తయిన తరువాత ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. సుమారు 14ఏళ్ల తరువాత కొలువుదీరిన సభలో మహిళా మేయర్ గా రాణించి, విశాఖ ప్రజలకు మంచి సేవలు అందించాలని ఆకాంక్షించారు. దీర్ఘకాలికంగా పరిష్కారం కాకుండా ఉండిపోయిన సమస్యలను పరిష్కరించాలని కోరారు. అదేవిధం జర్నలిస్టుల నుంచి జీవిఎంసీకి, వైఎస్సార్సీపీకి ఎల్లప్పుడూ సహకారం వుంటుందని చెప్పారు. అత్యధిక సభ్యులు పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నందున జీవిఎంసీకి మహిళా మేయర్ గా మరింత వన్నతీసుకురావాలని గంట్ల ఆకాంక్షించారు. మేయర్ ను కలిసిన వారిలో స్వతంత్ర అభ్యర్ధి కందుల నాగరాజు తదితరులు ఉన్నారు.
రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ ఈ నెల 25న జిల్లాకు రానున్నారు. జిల్లాలో రెండు రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. మార్చి 24న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో బయలుదేరి 25న ఉదయం 05.40గం.లకు శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) కు చేరుకుంటారు. ఉదయం 05.50గం.లకు రైల్వేస్టేషన్ నుండి బయలుదేరి ఉదయం 06.10గం.లకు శ్రీకాకుళం ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరుకొని జిల్లా అధికారులు, ఇతర అధికారులతో సమావేశం కానున్నారు. ఉదయం 09.30గం.లకు ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి బయలుదేరి 10.00గం.లకు అరసవల్లికి వెళతారు. అక్కడనుండి 11.00గం.లకు శ్రీకూర్మంకు చేరుకుంటారు. ఉదయం 11.30గం.లకు శ్రీకూర్మం నుండి బయలుదేరి మధ్యాహ్నం 12.00గం.లకు శాలిహుండం చేరుకోనున్న ఆయన మధ్యాహ్నం 12.30గం.లకు శాలిహుండం నుండి బయలుదేరి 01.00గం.కు శ్రీకాకుళం ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 03.30గం.లకు అతిథి గృహం నుండి బయలుదేరి సాయంత్రం 04.00గం.లకు డా. బి.ఆర్.అంబేద్కర్ విశ్వ విద్యాలయంలో జర్నలిజం చేస్తున్న విద్యార్ధులు మరియు పాత్రికేయులతో సమావేశమవుతారు. సాయంత్రం 06.00గం.లకు ఆర్ అండ్ బి అతిథిగృహంలో జిల్లా అధికారులు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. మార్చి 26న ఉదయం 09.00గం.లకు ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి బయలుదేరి ఉదయం 10.00గం.లకు శ్రీముఖలింగం చేరుకుంటారు. 11.00గం.లకు శ్రీముఖలింగం నుండి బయలుదేరి మధ్యాహ్నం 12.00గం.లకు వంశధార ప్రోజెక్టు వద్ద జిల్లా అధికారులు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 03.00గం.లకు వంశధార ప్రోజెక్టు నుండి బయలుదేరి సాయంత్రం 04.00గం.లకు ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరుకోనున్న ఆయన రాత్రి 07.00గం.లకు ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి బయలుదేరి 07.30గం.లకు శ్రీకాకుళం రైల్వేస్టేషనుకు చేరుకుంటారు. అక్కడ నుండి బయలుదేరి విజయవాడకు వెళ్లనున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో విక్రయించని రైతుల వద్ద గల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఈ నెల 25 వరకు గడువును పెంపుదల చేసినట్లు సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 2020-21 ఖరీఫ్ సీజన్ లో 246 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అనుసంధానం చేసిన 837 రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించిన సంగతి విదితమే. అందులో భాగంగా జిల్లాలో డిసెంబర్ 2020 నుండి నేటి వరకు 7.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 99,159 మంది రైతుల నుండి సేకరించి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్ధతు ధరను ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. ధాన్యం సేకరణ కార్యక్రమం 2021 ఫిబ్రవరి మాసాంతానికి ముగిసినప్పటికీ, ఇంకనూ రైతుల వద్ద ధాన్యం నిల్వలు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. రైతులు నష్టపోరాదనే ఉద్దేశ్యంతో ఈ నెల 25 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి కొనుగోలు చేయుటకు ప్రభుత్వం నిర్ణయించినట్లు జె.సి వివరించారు. కావున ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ఇంకనూ ధాన్యం అమ్మని రైతులు వారి గ్రామానికి దగ్గరలో గల ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్ధతు ధరకు విక్రయించుకోవాలని జె.సి ఆ ప్రకటనలో కోరారు.
భూగర్భ జల మరియు జలగణన శాఖ స్వర్ణోత్సవంలో భాగంగా రైతులు, ప్రజలు బోర్ల నిర్మాణంలో తగు జాగ్రత్తలు పాటించాలని ఆ శాఖ సంచాలకులు ఏ.వరప్రసాదరావు పేర్కొన్నారు. గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోర్ల నిర్మాణంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై వివరించారు. బోర్లలో త్రవ్వకపు బోర్లు, బోరు బావులు అని రెండు రకాల బోర్లు ఉంటాయన్నారు. భూమి పై పొరల్లో నిక్షిప్తమైన భూగర్భ జలాన్ని వెలికి తీయడానికి చేసే నిర్మాణాలను బావులంటారని, బోర్వెల్స్ రావటంతో త్రవ్వకవు బావులు క్రమంగా కనుమరుగవుతున్నా యని చెప్పారు. అలాగే కాస్తంత లోతైన భూపొరల్లో నిక్షిప్తమైన నీటిని వెలికి తీయడానికి నిర్మించే బావులనే బోరుబావులంటారని, సాధారణంగా గట్టి రాతిపొరల్లో వున్న నీటిని వెలికి తీయడానికి ఈ బోరుబావులను నిర్మిస్తారని చెప్పారు. సాధారణంగా మంచినీటి కోసం 4 అంగుళాల వ్యాసంతోను, సాగునీటి కోసం 6 అంగుళాల వ్యాసంతోను వీటి నిర్మాణం చేస్తారని, ఈ బోర్లు అయా రాతిపారలను బట్టి 60 నుండి 120 మీ. లోతు వరకు నిర్మిస్తారని తెలిపారు. పైన వుండే మెతక పొరలను బట్టి 40 నుండి 80 అడుగుల కేసింగు పైపు వేయాల్సి ఉంటుందని, బోరు నిర్మాణానికి 5 నుండి 8 గంటల సమయం పడుతుందని అన్నారు. వీటి ద్వారా గంటకు 4,000 నుండి 15, 000 లీటర్ల నీరు లభ్యమవుతుందని తెలిపారు. రైతులు లేదా ప్రజలు బావి, బోరు నిర్మించుకునే ముందు జియాలజిస్ట్ సలహా తీసుకోవడం మంచిదని, నల్లరేగడి ప్రాంతంలో వృత్తాకారపు బావులు నిర్మిస్తే ఒడ్డు త్వరగా విరిగిపడిపోదని ఆయన సూచించారు. బావికి స్టీనింగు కట్టాలని, తద్వారా పశువులు ప్రమాదవశాత్తు బావిలో పడిపోకుండా ఉంటుందని ఆయన సూచించారు.అలాగే సందులు, పగుళ్ళు ఉన్న రాయి వస్తే బావి అడుగున బోరు వేసుకోవాలని, బోరు చేసేటప్పుడు తేమ లేకుండా పౌడరు లాంటి దుమ్ము వస్తుంటే డ్రిల్లింగు నిలిపివేయాలని పేర్కొన్నారు.బోరులో నీరు పడిన తరువాత లోతు వెళ్ళే కొలది నీరు పెరుగుతుందో లేదో గమనించాలని, లోతుతో పాటు నీరు పెరగకపోతే ఎక్కువ లోతు డ్రిల్లింగు చేయటం అనవసరం అని అన్నారు. బోరు వేసేటప్పుడు వంకర లేకుండా నిట్టనిలువుగా వేసేలా జాగ్రత్త వహించాలని, బోరు సైజు కూడా పైనుండి క్రింది వరకు సమానంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. అలా కానిపక్షంలో బోరులోనికి మోటారు, పైపులు అమర్చటం కష్టమవుతుందని, బోరు నిర్మించేటప్పుడు లోపలి రాయిలో పగుళ్ళుండి నీటితోపాటు పెద్ద పెద్ద రాయి ముక్కలు బయటకు వస్తుంటే బోరు ఇంకా లోతు వేయించాల్సి ఉంటుందని చెప్పారు. ఇనుప గొట్టాలు చెడిపోతున్న ప్రాంతాలలో పి. వి. సి. కేసింగు పైపు వేసుకోవాలని, మెత్తని రాతిపొర ఉన్నంతవరకు కేసింగ్ పైపు దించుకోవాలని, కేసింగు పైపు దించవలసిన లోతు వరకు ఎక్కువ వ్యాసంతో బోరు నిర్మించాలని అన్నారు. డ్రిల్లింగు చేసే సమయంలో ఎంత పరిమాణంలో నీరు వస్తుందో తెలుసుకోవాలని, ఈ విధంగా లోతుతో పాటు నీరు పెరుగుతుందా లేదా గమనించి బోరు లోతు పెంచాలా వద్దా అనేది నిర్ధారించుకోవాలని స్పష్టం చేశారు. బోరు డ్రిల్లింగు అయ్యాక రెండు గంటలు బోరు శుభ్ర పరచేందుకు ప్లషింగ్ చేయించాలని ఆయన తెలిపారు. ఒక ప్రాంతంలో బోరు పడుతుందా లేదా అనేది అనేక అంశాల మీద ఆధారపడి వుంటుందని,. బోర్వెల్ పడుతుందా లేదా అని పరిశీలించే భూగర్భజల శాస్త్రజ్ఞులు ద్వారా ఒక ప్రాంతం లేదా పొలంలో క్షుణ్ణంగా పరిశోధన చేసిన తదుపరి మాత్రమే బావులను నిర్మించుకోవడం మంచిదని తెలిపారు. ప్రభుత్వం ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మహా విశాఖ నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక కేవలం 10 నిమిషాల్లోనే ఎన్నికల అధికారులు ముగించేశారు. సుమారు 14ఏళ్ల తరువాత కొలువుదీరిన కార్పోరేటర్ల ప్రమాణ స్వీకారం గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా పదే పది నిమిషాల్లో జరిగిపోయింది. ఉదయం 10.50 గంటలకు ఎన్నికల పరిశీలకులు ప్రవీణ్ కుమార్, జివిఎంసీ కమిషనర్ నాగలక్ష్మీ సెల్వరాజన్ లతో పాటు ఎన్నికలో గెలుపొందిన కార్పోరేర్లంతా జివిఎంసీ కౌన్సిల్ హాలులో కూర్చుకున్నారు. అప్పటికే ఎవరి పేర్లతో వారి సీట్ల వద్ద ప్రమాణ పత్రాలను ఉంచేలా అధికారులు ఏర్పాటు చేశారు. సరిగ్గా 11.55 నిమిషాలకు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ఆవెంటనే 11.57 ఎన్నికల నియమ నిబంధనలను సభకు చదివి వినిపించారు. అనంతరం కార్పోరేటర్ల ప్రమాణ స్వీకారం తెలుగు, మరియు ఇంగ్లీషులో జరిగింది. ఆపై అత్యధిక మెజార్టీ వున్న వైఎస్సార్సీపీ కార్పోరేటర్లల నుంచి వంశీక్రిష్ణ శ్రీనివాస్ మేయర్ అభ్యర్ధికై గొలగాని వెంకట హరి కుమారి పేరును ప్రతిపాదించారని ఎన్నికల అధికారి ప్రకటించగానే మూజువాణి రూపంలో ఎన్నిక నిర్వహించారు. ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడంతో మేయర్ అభ్యర్ధిని పేరు ఎన్నికల అధికారి ఖరారు చేశారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ గా జియ్యాని శ్రీధర్ ను ఎంపిక చేశారు. ఈ తంతు మొత్తం పది నిమిషాల్లోనే ముగిసిపోయంది.. ఆపై ప్రోటో కాల్ ప్రకారం జివిఎంసీ మేయర్ అభ్యర్ధికి ప్రత్యేక డ్రెస్ వేసిన తరువాత, ఆమెను రాష్ట్ర మంత్రి ముత్తం శెట్ట శ్రీనివాసరావు పోడియంలో సాదరంగా తోడ్కొని వెళ్లి కూర్చో బెట్టి శుభాకంక్షాలు చెప్పారు. తరువాత ఒక్కొక్కరుగా నూతన మేయర్ కు బొకేలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. కాగా టిడిపి కార్పోరేట్లరు, జనసేన, స్వతంత్ర్య అభ్యర్ధుల కోసం ఒక వైపు, వైఎస్సార్సీపీ కార్పోరేటర్లకు మరో వైపు కౌన్సిల్ లో సీట్లను కేటాయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్సీపీ జాతీయ కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, ఎంపీలు ఎంవీవీ సత్యన్నారాయణ, డా.బి.సత్యవతి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్, గాజువాక ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణాబాబు, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు, ఎమ్మెల్సీలు పివిఎన్ మాధవ్, దువ్వారపు రామారావు, బుద్దా వెంకన్న, పి.రవీంధ్రబాబు, జీవిఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.
యువ ఐఏఎస్ అధికారులు ఏ పనిచేసినా అది చాలా వైవిధ్యభరితంగా, వినూత్నంగానూ ఉంటుంది..ప్రజలకు చాల తక్కువ సమయంలో చేరుతుంది కూడా..మొబైల్ టెక్నాలజీ పుణ్యమాని ఇపుడు అది మరింత చేరువుగా మారుతోంది. సరిగ్గా అదే ఆలోచన చేశారు యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ అధికారిణి, జివిఎంసీ కమిషనర్ నాగలక్ష్మి.. సుమారు 14 సంవత్సరాల తరువాత విశాఖ జీవిఎంసీ కి మేయర్ ఎన్నిక జరగబోతుంది. తమ తమ పార్టీ అభ్యర్ధులు ప్రమాణస్వీకారం ఎలా చేస్తారో చూడాలని చాలా మంది కుటుంబ సభ్యులకు ఎంతో ఉత్సాహంగా వుంటుంది. కానీ స్వయంగా అక్కడికి వెళ్లడానికి అవకాశం లేనివారికి, సుమారు 98 మంది కార్పోరేట్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యుల కార్యక్రమాన్ని విశాఖ నగర ప్రజలదరికీ నేరుగా చూపించాలనే సంక్షల్పంతో రేపు జరిగే కార్యక్రమాన్ని జీవిఎంసీ యూట్యూబ్ ఛానల్ https://www.youtube.com/channel/UCxEFAwSRd6WH5TDY0-o-wlg/live ద్వారా లైవ్ లో చూపించాలని సంకల్పించారు. దానికోసం ప్రత్యేక ఏర్పాట్లును చేయించి ఆ లింక్ ను ఒక రోజు ముందుగానే విశాఖ ప్రజలకు తెలియజేయశారు. దీనితో ఆ లింక్ ద్వారా తమవారి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని వాళ్లు చూడంటంతో పాటు తమ తమ కుటుంబ సభ్యులకు కూడా చిరస్థాయిగా నిలిచిపోయేలా ఆ యూట్యూబ్ లింక్ ని పంపించుకునే వెసులుబాటుని కల్పించారు. సాధారణంగా అయితే వీరు ప్రమాణ స్వీకారం చేసిన వార్త మరుసటి రోజు అంటే 24 గంటలు గడిస్తే తప్పా పత్రికల్లో రాదు...ఎవరో గట్టిగా ప్యాకేజీలు ఇస్తే తప్పా వారి విజువల్స్ టీవీ ఛానళ్లలో కనిపించవు. కానీ కమిషన్ ఆలోచన ద్వారా మాత్రం అన్ని వర్గాల ప్రజలు రేపు జరగబోయే జివిఎంసీ మేరయ్ ఎన్నిక, కార్పోరేటర్ల ప్రమాణ స్వీకారం కూడా అందరూ లైవ్ లో తిలింకించే అశకాశం ఏర్పడనుంది. ఏది ఏమైనా యువ ఐఏఎస్ అధికారులు ఆలోచన సరళి ఏ స్థాయిలో వుంటుందనడానికి ఈ చిన్న టెక్నాలజీ ఈవెంట్ ఒక మచ్చుతునకగా చెప్పవచ్చు..అదే విషయాన్ని ఈఎన్ఎస్ లైవ్ ద్వారా కూడా అందరికీ ఒక రోజు ముందుగానే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం...
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయరు, డిప్యూటీ మేయరు ఎన్నికలు మార్చి 18 వ తేదీన జరుగనున్నాయని జిల్లా కలెక్టరు, జిల్లా ఎన్నికల అధారిటీ వి. వినయ్ చంద్ అన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం జి.వి.యం.సి. సమావేశ మందిరంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ నెల 18వ తేదీన ఉదయం 11గం. లకు నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్లతో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఎన్నికైన వార్డు మెంబర్లు తప్పనిసరిగా తమ ఎన్నికల ధృవీకరణ పత్రంతో మేయరు, డిప్యూటీ మేయరు ఎన్నికలకు ఉదయం గం.10.30 ని.లకే హాజరు కావాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషన్ వారి ఆదేశాల మేరకు మార్చి 18 వ తేదీన జి.వి.యం.సి.లో మేయరు, డిప్యూటీ మేయరు పదవులకు జరుగుచున్న ఎన్నికలలో నూతనంగా ఎన్నికైన 98 మంది వార్డు మెంబర్లు, 15 మంది ఎక్ష్అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 113 మంది ఓటు హక్కును వినియోగించుకుంటారన్నారు. ఈ ఎన్నికలలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలైన బి.జె.పి, సి.పి.ఐ, సి.పి.ఐ(ఎం), టి.డి.పి, వై.ఎస్.ఆర్.సి.పి.లు విప్ జారీ చేయవలసి ఉంటుందన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా వివరాలతో కూడిన అనుబంధం పత్రాలు- 1, 2, 3 (Annexure – I, II & III), మేయరు, డిప్యూటీ మేయరు అభ్యర్ధులను నామినేట్ చేసేందుకు సంబంధించిన “ఎ” & “బి” ఫారాలును (Form “A”&“B”) నిర్ణీత సమయంలో సంబంధిత జి.వి.యం.సి. అధికారులకు అందజేయ వలసినదిగా కలెక్టరు తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను సజావుగా నిర్వహించేటట్లు చూడాలని అదనపు కమీషనర్లు పి. ఆషా జ్యోతి, ఎ.వి. రమణిలను ఆదేశించారు. ఈ సమావేశంలో గుర్తింపు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్. విజయానందరెడ్డి(బి.జె.పి), బి. గంగారావు, ఆర్.కె.ఎస్.వి.కుమార్ (సి.పి.ఐ.(ఎం). పాసర్ల ప్రసాద్ (టి.డి.పి.), తైనాల విజయ్ కుమార్ (వై.ఎస్.ఆర్.సి.పి), అదనపు కమీషనర్లు పి. ఆషాజ్యోతి, ఎ.వి.రమణి, వ్యయ పరిశీలకులు వై.మంగపతిరావు, సెక్రటరీ లావణ్య,, జి.వి.యం.సి. సలహాదారు జి.వి.వి.ఎస్.మూర్తి తదితరులు పాల్గొన్నారు.