స్పందన కార్యక్రమానికి పలు వినతులు అందాయి. డయల్ యువర్ ఫోన్ ద్వారా స్పందన కార్యక్రమం కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా ఫిర్యాదుల విభాగంలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ఫోన్ కాలర్స్ ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేసారు. పొందూరు నుండి యస్.రామారావు ఫోన్ చేసి మాట్లాడుతూ విద్యార్ధుల సౌకర్యార్ధం పొందూరు నుండి శ్రీకాకుళంకు ఆర్.టి.సి బస్సులను ఏర్పాటుచేయాలని కోరారు. పలాస పట్టణంలోని 14వ వార్డు నుండి యస్.ప్రభ ఫోన్ చేస్తూ తమ పిల్లలకు ఉపకార వేతనాలను మంజూరుచేయడంలేదని ఫిర్యాదు చేసారు. బూర్జ మండలం కోటవాడ నుండి డి.కిశోర్ కుమార్ మాట్లాడుతూ తమ తాత గారికి చెందిన భూములను వేరే పేరుతో విక్రయాలు జరిపారని, కావున బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. పోలాకి మండలం అంబీరుపేట నుండి యస్.రామకృష్ణ ఫోన్ చేసి మాట్లాడుతూ తమ తండ్రి గారు మరణించి 7 నెలలు అయిందని, తమ కుటుంబానికి ఎటువంటి ఆధారం లేనందున తన తల్లి పొదుపు సంఘం నుండి ఆర్ధిక సహాయాన్ని మంజూరుచేయాలని కోరారు. జలుమూరు మండలం శ్రీముఖలింగం నుండి నాయుడుగారి రాజశేఖర్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రేవుల వద్ద స్నానాలు ఉంటాయని, కాని రేవులు తుప్పలతో ఉన్నందున వాటిని శుభ్రపరచాలని కోరారు. సారవకోట మండలం బుడితి నుండి వి.వెంకటరమణ మాట్లాడుతూ దేవాంగుల వీధికి సిసి రోడ్డు మంజూరుచేయాలని కోరారు. నందిగాం నుండి జె.రమేష్ మాట్లాడుతూ తమ గ్రామంలో ధాన్యం మిల్లు లేక ధాన్యం అలాగే ఉండిపోయాయని, కావున తమ ధాన్యాన్ని వేగంగా ఆడించుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. కంచిలి మండలం మర్తూరు నుండి యం.చిన్నయ్య ఫోన్ చేస్తూ తమకు ప్రభుత్వ లెక్కల ప్రకారం భూమి ఎక్కువగా ఉన్నట్లు డేటా ఉన్నందున రేషన్ నిలిపివేసారని, మరలా పునరుద్దరించాలని కోరారు. కోటబొమ్మాళి మండలం నూకపేట నుండి యన్.వెంకటేషన్ మాట్లాడుతూ పింఛను కొరకు దరఖాస్తు చేసి రెండేళ్లు అయినప్పటికీ ఇంతవరకు మంజూరుచేయలేదని ఫిర్యాదు చేసారు. హిరమండలం నుండి యం.రమేష్ మాట్లాడుతూ తనకు ఇంటిస్థలాన్ని మంజూరుచేయాలని కోరారు. మెళియాపుట్టి మండలం కొసమాల నుండి యస్.గంగాధరరావు మాట్లాడుతూ అమ్మఒడి పథకం ప్రభుత్వ ఉద్యోగులకు మంజూరైందని, దానిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వంగర మండలం కొనిగపాడు నుండి బి.లక్ష్మీనాయుడు మాట్లాడుతూ వాహన మిత్ర నగదు తన ఖాతాలో పడలేదని ఫిర్యాదు చేసారు. ఈ కార్యక్రమంలో స్పందన విభాగం పర్యవేక్షకులు, పర్యవేక్షణ అధికారి భాస్కరరావు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మహిళా అంటే ఆకాశంలో సగభాగం అని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సృష్టి కారకులు మహిళలు అని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవంను నిర్వహించారు. ఈ కార్యక్రమంను లైవ్ కార్యక్రమంగా నిర్వహించి జిల్లాల్లో ప్రసారం చేసారు. జిల్లాల్లో వివిధ రంగాలకు చెందిన మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. కుటుంబం బాగు పడాలి అనే ఆలోచన అక్కాచెల్లెమ్మలలో ఉంటుందని సియం అన్నారు. భూదేవి అంతటి సహనం అక్కాచెల్లెమ్మలలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల్లో అక్షరాస్యత 60 శాతం మాత్రమేనని తెలిపారు. సామాజిక వివక్షకు గురికావడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ అంశాల్లో మార్పులు తీసుకు రావాలని అనేక పథకాలు తీసుకువచ్చామని అన్నారు. ఆడపిల్లలు అందరూ బడిబాట పట్టాలని, పేదరికంతో చదువుకు దూరం కారాదని అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశ పెట్టామని ఆయన తెలిపారు. రూ.32,500 కోట్లను అమ్మ ఒడి పథకం క్రింద తల్లులకు పంపిణీ చేశామని చెప్పారు. రూ. 80 వేల కోట్లకు పైగా మహిళలకు ఆర్ధిక సహాయాన్ని అందించామని పేర్కొన్నారు. రూ.1863 కోట్లను పౌష్టికాహారం కోసం ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అక్కాచెల్లెమ్మలు ఆర్ధిక స్వావలంబన సాధించాలని ప్రయత్నం చేస్తున్నామని సియం చెప్పారు. సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధికి చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. మహిళపై నేరాలు తగ్గించగలిగామని, మహిళా రక్షణకు రాష్ట్రంలో 18 దిశా పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 9 వందల ద్విచక్ర వాహనాలను దిశ పర్యవేక్షణలో భాగంగా కొనుగోలు చేశామని, పోలీసు స్టేషన్లలో మహిళా సహాయక డెస్క్ లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. మహిళా సహాయక కీయాస్క్ లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. మహిళా ఉద్యోగులకు సాధారణ సెలవులు 20 రోజులకు పెంపు చేస్తున్నామని ఆయన చెప్పారు. జూలై 1 నుండి సానిటరీ నేప్కిన్స్ అందిస్తామని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా రాష్ట్రంలో జెండర్ బడ్జెట్ విధానం ఈ ఏడాది బడ్జెట్ నుండి తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. కార్యాలయాల్లో లింగ వివక్ష నివారణకు కమిటీలు కచ్చితంగా ఏర్పాటు కావాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.జయదేవి, పిఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి, హైకోర్టు న్యాయమూర్తి భట్టు దేవానంద్‌లు ఆదివారం జిల్లాకు విచ్చేసిన సందర్బంగా వారికి ఆర్అండ్బీ అతిధి గృహములో జిల్లా కలెక్టరు డి. మురళీధర్ రెడ్డి ,జిల్లా ప్రదాన న్యాయమూర్తి జస్టిస్ ఎం బబిత స్దానిక సబ్ కలెక్టరు అనుపమ అంజలి జిల్లాకు చెందిన పలువురు న్యాయమూర్తులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. హైకోర్డు ప్రదాన న్యాయమూర్తి మరియు హైకోర్డు న్యాయమూర్తులు శనివారం విజయనగరంలో ఇటీవల కాలములో సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడుల నేపధ్యములో ప్రత్యేక మహిళా కోర్టుల ఏర్పాటు ద్వారా న్యాయ వ్యవస్దను పటిష్టం చేసేందుకు ప్రత్యేక న్యాయ స్దానాలు దోహదపడ్తాయని, ఆదిశగా లైంగిక వేదింపులు చట్టం-2012, పోక్సోచట్టం అమలు ద్వారా సత్వర న్యాయం అందించేందుకు ప్రత్యేక మహిళ కోర్డులను ప్రారంబించి తిరుగు ప్రయాణంలో విజయనగరం నుంచి విజయవాడ మార్గమధ్యంలో రాజమహేంద్రవరం స్దానిక రహదారులు భవనాల శాఖ అతిధి గృహము నందు ఆదివారం మధ్యాహ్నాం బోజన విరామం అనంతరం కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మరలా విజయవాడ బయలుదేరారు. ఈ కార్యక్రమంలో స్దానిక సహాయ సూపరింటెండెంటు ఆప్ పోలీసు లా అండ్ ఆర్డరు లతా మాదురి, పలువురు న్యాయమూర్తులు జిల్లా న్యాయ సేవాధికారి సంస్ద కార్యదర్శి కెవిఎల్ హిమబిందు స్దానిక అర్భన్ తాహసిల్దారు కె సుస్వాగత•ం సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి కి సర్క్యూట్ హౌస్ లో ఘన స్వాగతం లభించింది. శనివారం మధ్యాహ్నం వారు విజయనగరం నుండి విశాఖపట్నం సర్య్యూట్ హౌస్ కు చేరుకున్నారు. పోలీసుల నుండి ప్రధాన న్యాయమూర్తి గౌరవ వందనం స్వీకరించారు. ఘన స్వాగతం పలికిన వారిలో జిల్లా జడ్జి జస్టిస్ ఎ. హరిహర నాదశర్మ, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, నగర పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, డిఐజి ఎల్. కాళిదాసు వెంకట రంగారావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి.ఎం.రెడ్డి, డిసిపి ఐశ్వర్య రస్తోగి, ఆర్.డి.వో.పెంచల కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ నెల 8వ తేదీన నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరక్టర్ జి.జయదేవి తెలిపారు. ఈ మేరకు ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు.. 8వ తేదీ ఉదయం 10 గంటల నుండి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతీఏటా నిర్వహించే కార్యక్రమంలోనే భాగంగా ఈ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల్లోని మహిళలంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.
మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్లు హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని జివిఎంసీ కమిషనర్ ఎస్.నాగలక్ష్మి హెచ్చరించారు. శనివారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారికి వార్డు వాలంటీర్లపై పలు రాజకీయ పక్షాలు, మీడియా ప్రతినిధులు,ప్రజల నుంచి పలు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. వార్డు వాలంటీర్లు అందరూ వారియొక్క సెల్ ఫోన్ లను వెంటనే సంబంధిత జోనల్ కమిషనర్ వారికి అందజేయాలన్నారు. ఎవరైనా వాలంటీర్ లబ్ధిదారులను, గ్రూపు సభ్యులను కలసి ఓట్ల గురుంచి అడగవద్దని మరియు ఏ పోటీ దారునకు ఓట్లడిగి లబ్ధి చేకూర్చవద్దని కమిషనర్ ఆదేశించారు. జివిఎంసి పరిధిలో ఓటర్లకు విజ్నప్తి చేస్తూ ఎవరైనా వాలంటీర్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా, ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని పాల్గొనిన యెడల ఈ క్రింది తెలిపిన ఈ-మైల్స్ కు గాని, జివిఎంసి లో నిరంతరం పనిచేస్తున్న ఎన్నికల ఫిర్యాదుల విభాగంనకు ఫోన్ నెంబర్లు ద్వారా గాని, నేరుగా వచ్చి వ్రాతపూర్వకంగా జివిఎమ్ సి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటైన ఎన్నికల విభాగం నందు ఫిర్యాదులు చేయవచ్చని కమిషనర్ సూచించారు. సంబంధిత జివిఎంసి జోనల్ కమిషనర్లు అందరూ వెంటనే వార్డు వాలంటీర్ల వద్ద నుండి సెల్ ఫోన్ లను స్వాధీన పరచుకోవాలని కమిషనర్ ఆదేశాలిచ్చారు. జివిఎంసి ఎన్నికల ఫిర్యాదులు చేయుటకు 24 x 7 పనిచేసే పోన్ నెంబర్లు : టోల్ ఫ్రీ నెంబర్ : 1800 4250 0009 ఫోన్ నెంబర్లు : 0891 – 2869122 / 2869123 జివిఎంసి ఎన్నికల ఫిర్యాదులు చేయుటకు ఈ-మైల్ అడ్రస్ : gvmcelections2020@gmail.comకి మెయిల్్ చేయవచ్చునని కమిషనర్ సూచించారు.
కృష్ణా జిల్లాలో మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వార్డు వాలంటీర్లపై తక్షణ చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఏయంబీ ఇంతియాజ్ హెచ్చరించారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో పాల్గొనే వాలంటీర్లపై ఫిర్యాదుల కోసం వాట్సప్ 8186038738 ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ఎన్నికల్లో పాల్గొన్నట్టు కనిపిస్తే తక్షణమే ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ఫోటోలు, వీడియోలు పంపడం ద్వారా ఎన్నికల కమిషన్ పంపిస్తామని వివరించారు. అదేవిధంగా dpoelections2021 @gmail.com కు మెయిల్ ద్వారాకూడా ఫిర్యాదులు తెలుపవచ్చని పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో విజయవాడ,మచిలీపట్నం రెండు మున్సిపల్ కార్పోరేషన్లు, నూజివీడు, పెడన మున్సిపాలిటీలు,నందిగామ,ఉయ్యురు, తిరువూరు నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా వార్డు వా లంటీర్లుగా పనిచేస్తున్న వారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం,రాజకీయ పార్టీల కు లబ్ధి చేకూర్చడం, ఓటర్లను ప్రభావితం చేయడం నిషేధించామన్నారు. ఫిర్యాదుల కోసం 24 గంటలూ పై నెంబరు పనిచేస్తుందని కలెక్టర్ వివరించారు.
శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న వాలంటీర్లు తమ అధికారిక సెల్ ఫోన్ లను తక్షణం అప్పగించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ ఆదేశించారు. ఈ మేరకు శని వారం ఒక ప్రకటన జారీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం వాలంటీర్లు సెల్ ఫోన్ లు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. మునిసిపాలిటీ కార్యాలయంలో పాలనాధికారి లేదా మేనేజర్ లేదా నియమిత అధికారికి తక్షణం తమ సెల్ ఫోన్ లను అప్పగించాలని ఆదేశించారు. తప్పనిసరి పరిస్ధితుల్లో ఫోన్ చేయాల్సివస్తే మునిసిపల్ కార్యాలయానికి వచ్చి సంబంధిత అధికారి అనుమతితో, అధికారి సమక్షం నుండి ఫోన్ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు మేరకు వాలంటీర్లు ఎటువంటి అనధికారిక, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనరాదని ఆయన స్పష్టం చేసారు. అనధికారిక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు పిర్యాధులు అందితే వారిపై విచారణ చేసి నిబంధనల మేరకు క్రమశిక్షణా చర్యలు చేపడతామని కలెక్టర్ స్పష్టం చేసారు. అనధికార కార్యకలాపాల్లో పాల్గొనే వాలంటీర్లపై చర్యలు చేపట్టవచ్చని డివిజన్ బెంచ్ స్పష్టంగా పేర్కొనడం జరిగిందని ఆయన తెలిపారు. వాలంటీర్లపై పిర్యాధులను కంట్రోల్ రూమ్ కు : అనధికారిక కార్యకలాపాల్లో పాల్గొనే వాలంటీర్లపై పిర్యాధులను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 08942 240605, 240606 ఫోన్ నంబర్లకు తెలియజేయాలని కలెక్టర్ కోరారు. కంట్రోల్ రూమ్ కు సమాచారం అందిన 12 గంటల్లోగా విచారణ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. తీవ్ర ఆక్షేపణలు వచ్చిన వాలంటీర్లపై విచారణలో ఆరోపణలు రుజువైతే డివిజన్ బెంచ్ ఆదేశానుసారం తొలగించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
భారత పోస్టల్ శాఖ అల్లూరి సీతారామరాజుకి నాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గౌరవాన్ని నేడు ఏమీ కాకుండా తీసేసింది. అవును మీరు చదువుతన్నది అక్షర సత్యం.. నాడు అల్లూరి సీతారామరాజు తెల్లదొరలపై వీరోచితంగా పోరాటం చేసి, ప్రాణాలకు భరతకు అర్పించిన పోరాటాల పురిటి గడ్డ విశాఖజిల్లా, గొలుగొండ మండలం, క్రిష్ణదేవిపేట( ఓల్డ్ క్రిష్ణ దేవిపేట అలియాస్ పాతూరు)లో అల్లూరి గుర్తుగా ఏర్పాటు చేసిన బ్రాంచి పోస్టాఫీసుని నేడు రద్దుచేసింది(పోస్టల్ పరిభాషలో ఇక్కడి బ్రాంచి వేరో బ్రాంచిలో విలీనం చేయడం). దానికి ఒక చిన్న సాంకేతిక కారణం చూపి అంటే ఎస్ ఓ పోస్టాఫీసుకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉందనే ఒకే ఒక్క చిన్నకారణం చూపి మొత్తానికి ఇక్కడి పోస్టాఫీసుని రద్దు చేసి ఎక్కడో నర్సీపట్నం ప్రక్కన వున్న కొత్తకోట గ్రామం వద్ద వున్న పోస్టాఫీసులో విలీనం చేసింది. దీనితో అల్లూరి సీతారామరాజు ప్రాణాలకు తెగించి స్వాంత్ర్యం కోసం తెల్లవాడిపై పోరాటం చేసిన క్రిష్ణదేవిపేట ప్రాంతంలో అల్లూరికి గుర్తుగా వున్న పోస్టాఫీసు రద్దైపోయింది. ఫలితంగా మూడు గ్రామాల(పాత క్రిష్ణదేవిపేట, నాగాపురం, పల్లావూరు) ప్రజలకు పోస్టల్ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఎప్పుడో 70 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ పోస్టాఫీసుని రద్దు చేసిన విషయం, ఈ గ్రామం స్వాతంత్ర్య ఉద్యమ చరిత్ర, అల్లూరి సీతారామరాజు తెల్లవాడిపై తిరుగుబాటు చేసిన మన్యం పితూరి ఉద్యమం గ్రామంలోనే ప్రారంభమవడం తదితర అంశాలను గుర్తుపెట్టుకొని అప్పటి కేంత్ర ప్రభుత్వం ఇక్కడ బ్రాంచి పోస్టాఫీసు ఏర్పాటు చేసింది అప్పటి నుంచి నిరాటంకంగా సేవలు ప్రజలకు అందుతూ వస్తున్నాయి. అయితే ఇన్నేళ్ల తరువాత మళ్లీ ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉన్నగ్రామంలో కేంద్రం ప్రభుత్వం పోస్టాఫీసు బ్రాంచిని రద్దుచేయడం(పోస్టల్ పరిభాషలో రీలొకేషన్) ఈప్రాంతీయుల మనోభావాలను దెబ్బతీయడంతోపాటు, ఈ అల్లూరి సీతారామరాజు ఉద్యమ చరిత్రకు సాక్ష్యంగా వున్న పోస్టాఫీసును రద్దు చేయడం చర్చనీయాంశం అవుతుంది. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ గ్రామంలోని పోస్టాపీసును తరలిస్తున్న విషయాన్ని అల్లూరి సీతారామరాజుపై వున్న దేశభక్తి, గౌరవం, సామాజికి సేవా ద్రుక్పదంతో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా విశాఖలోని పోస్టుమాస్టర్ జనరల్, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, అనకాపల్లి ఎంపీ డా.సత్యవతి, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ, విశాఖ రాజ్య సభ్ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, రాష్ట్ర పర్యాటకశాఖ, సాంస్క్రుతికశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్యల, అల్లూరి పేరుతో సేవా, చైతన్య, చరిత్రను వివరించే కార్యక్రమాలు చేపట్టే జాతీయ అల్లూరి యువజన సంఘం, అల్లూరి చరిత్రపై గత 18ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నా పరిశోధకులు పి.బాలభాను(బాలు) ద్రుష్టికి కూడా తీసుకెళ్లింది. అంతేకాకుండా ఈ గ్రామానికి భారతదేశ చరిత్రలోకానీ, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోగానీ ఒక ప్రత్యేక పేజీ ఉన్న విషయన్నాకూడా వివరించింది. అయితే పోస్టల్ మార్కెటింగ్ తక్కువగా ఉండటం, ఎస్ఓకి రెండు కీలోమీటర్ల మేరే ఉండటం తదితర కారణాలతో చాలా చోట్ల బ్రాంచి పోస్టాఫీసులను రద్దు చేసి మరో చోట విలీనం చేస్తున్నామని పోస్టల్ శాఖ వివరిస్తోంది. దానికి అనుగుణంగానే ఈ ప్రాంతానికి మరో మూడు కిలోమీటర్లు దూరంలో వున్న మరో ప్రాంతంలో కూడా అల్లూరి సీతారామరాజు పోరాటం చేసిన ప్రాంతంగా అప్పటిలోనే రికార్డులు కెక్కన నల్లగొండ గ్రామంలో మరో బ్రాంచి పోస్టాఫీసుని పోస్టల్ శాఖ ఏర్పాటు చేస్తుందని కూడా ప్రచారం జరిగింది కానీ నేటి వరకూ అదికూడా కార్యరూపం దాల్చలేదు. పైగా ఇపుడు ఈ పాత క్రిష్ణదేవీపేట పోస్టాఫీసుని వేరే ప్రాంతానికి తరలించేకంటే అటు నల్లగొండ, పాత క్రిష్ణాదేవీపేటలకు ప్రాంతాలకు వీలుగా దీనినే కొనసాగించాలని ఈ ప్రాంతీయులు పోస్టల్ శాఖ ముఖ్య అధికారులను కోరుతున్నారు. పైగా ఈ ప్రాంతంలోని ప్రజలకు అల్లూరి సీతారామరాజుకి, పోస్టాఫీసుకి ఎంతో మంచి అనుబంధం ఏన్నో ఏళ్ల నుంచి ముడిపడి వుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి చేపడుతున్నా జాతీయ గ్రామీణ ఉపాది పధకం చెల్లింపుల్లో ఈ పోస్టాఫీసు ద్వారా ఎందరికో సేవలు అందుతున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టాఫీసు తీసేయడం ద్వారా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. మూడు గ్రామాలకు అనుకూలంగా ఉన్న ఈ పోస్టాఫీసును ఇక్కడే ఉంచేలా పోస్టల్ శాఖ పోస్ట్ మాస్టర్ జనరల్, పోస్టల్ సూపరింటెండెంట్ లు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు. అయితే అల్లూరికి గౌరవం ఇస్తూ..ఇక్కడే కొనసాగిస్తారా లేదంటే..అల్లూరి గౌరవం కంటే మాకు అత్యధిక వ్యాపారమే ముద్దు అనుకుని పూర్తిగా రద్దుచేస్తారా అనేది తేలాల్సి వుంది.
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థకు మార్చి 10వ తేదీన జరిగే ఎన్నికలకు సంబంధించి ఓటర్లు పోలింగ్ కేంద్రాల ప్రాంతాలును తెలుసుకునేందుకు గాను జివిఎంసి అంతర్జాలంలో తగు ఏర్పాట్లు చేపట్టిందని కమిషనర్ ఎస్.నాగలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం జీవిఎంసీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలు, ఈ ఏర్పాట్లకు సంబంధించి www.gvmc.gov.in/wss/ వెబ్సైటు ద్వారా వివరాలు తెలుసుకోవచ్చనన్నారు. అందులో “Voter Search” ను క్లిక్ చేసి, “Voter Epic” నెంబర్ ను ఎంటర్ చేసిన తర్వాత, ఓటర్ పేరు, వార్డ్ నెంబర్ క్లిక్ చేసిన తరువాత, ఓటర్ కు కావలసిన పోలింగ్ స్టేషన్ పేరు మరియు సూచిస్తున్న మ్యాప్ వివరాలు గూగుల్ ద్వారా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఓటు హక్కు దారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, జివిఎంసికి జరుగబోయే ఎన్నికలలో వారి పోలింగు స్టేషన్ ను తెలుసుకొని తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించు కొనవలసినదిగా జివిఎంసి కమిషనర్ , అదనపు ఎన్నికల అథారిటీ ఓటర్లను అభ్యర్థించారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పోరాటంతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్, విశాఖ ప్రజల ఆత్మ గౌరవం కంటే తనకేమీ వద్దనుకున్నారు రాష్ట్రమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు..ఆయనొక మంత్రి అనే విషయాన్ని పక్కనపెట్టి రాష్ట్రబంద్ లో చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. నడిరోడ్డుపై మటం వేసుకొని మరీ బైటాయించి స్టీలు ప్లాంట్ కోసం నినదించారు. ఒక రాష్ట్ర మంత్రిగా పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి విశాఖ వాసుల సెంటిమెంట్ కోసం తన హోదాను లెక్కచేయకుండా చేసిన పోరాటం రాష్ట్రంలోనే హాట్ టాపిక్ అయ్యింది. సాధారణంగా రాజకీయ నాయకులు ఉద్యమాలు చేస్తే..ఖరీదైన పరుపులు, గాలి తగలడానికి మంచి ఫ్యాన్లు, నీడకోసం మంచి టెంట్లు ఇలా చాలానే ఉంటాయి. మీడియా హడావిడీ చెప్పాల్సిన పనేలేదు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రజాగ్రహం పెల్లుభుకిన సమయంలో విశాఖజిల్లా మంత్రి కూడా తన పోరాటాన్ని శక్తివంచన లేకుండా ప్రదర్శించారు. స్టీల్ కోసం తనస్థాయి తగ్గించుకొని మరీ నడిరోడ్డుపై కూర్చొని చేసిన ఆందోళన అందరికీ ఆలోచింపచేసింది. ఈ రాష్ట్రవ్యాప్త సమ్మెకు ప్రభుత్వమే పిలుపుఇవ్వడంతో రెట్టించిన ఉత్సాహంతో బంద్ లో పాల్గొన్న మంత్రిని చూసి వెనుక నాయకులు, కార్యకర్తలు, వామపక్షనేతలు కూడా మంత్రితోపాటే రోడ్డుపైనే బైటాయించి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కి ఐకాన్ గా ఉన్న స్టీలు ప్లాంట్ ను పరిరక్షించుకోవాల్సిన అందరిపైనా ఉందన్నారు. అదేవిధంగా తమ ప్రభుత్వం కూడా విశాఖ వాసుల సెంటిమెంటుకి కట్టుబడి ఉందని చెప్పారు. స్టీలు ప్లాంట్ ను రక్షించుకోవడానికి ఎంతవరకైనా పోరాడతమన్న మంత్రితో అందరూ వంతపాడారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదని కదం తొక్కారు. అనంతరం మంత్రి అవంతి జిల్లా ఇన్చార్జి మంత్రి కె.కన్నబాబు, రాజ్యసభ్ సభ్యులు వి.విజయసాయిరెడ్డితోపాటు ధర్నా, ర్యాలీ, మానవ హారంలో పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతున్నంతసేపూ అలా నడిరోడ్డుపైనే కూర్చొని మంత్రి తన నిరసనను తెలియజేస్తూ.. మాట్లాడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో విశాఖ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణశ్రీనివాస్, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఇతర నాయకులు, కార్యకర్తలు,జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
జివిఎంసీ పరిధిలోని ప్రతీ ఒక్కరూ ఇంటింటికీ వచ్చే చెత్త వాహనాలకే చెత్తను అందించాలని కమిషనర్ ఎస్.నాగలక్ష్మి నగర వాసులను కోరారు. శుక్రవారం 5వ జోన్ లో గల 41వ వార్డు సుబ్బలక్ష్మి నగర్, 42వ వార్డు రైల్వే న్యూకోలనీ, 44వ వార్డు రామచంద్ర నగర్ మొదలగు ప్రాంతాలలో జివిఎంసి కమిషనర్ పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. ఆయా ప్రాంతాలోని ప్రజలతో ముచ్చటిస్తూ, పారిశుధ్య కార్మీకులు పనితీరు, ఇంటినుండి చెత్తను వేరుచేసి తీసుకెళ్లడం మొదలగు కార్యకలాపాలను ప్రజలను అడిగితెలుసుకోన్నారు. చెత్తలను రోడ్డు ప్రక్కన వేయకుండా వాహనాలకు అందించాలని ప్రజలకు సూచించారు. మధ్యాహ్నం సమయంలో కాలువల పూడికలు తీయుట, రోడ్లు ఊడ్చు కార్యక్రమము చేపట్టాలని ఎ.ఎం.ఓ.హెచ్.ను ఆదేశించారు. మహిళా సభ్యులు వారి గృహాల వద్ద తడి చెత్త నుండి ఎరువును వేరుచేసి వ్యక్తిగతంగా ఉపయోగించుకొనే హోమ్ కంపోస్టు విధానాన్ని స్వయంగా పరిశీలించారు. సుబ్బలక్ష్మి నగర్లో గల ప్రజా సౌచాలయాన్ని పరిశీలించి, ప్రతీ రోజు శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలని కేర్ టేకర్ ను ఆదేశించారు. మలేరియా సిబ్బందితో మాట్లాడుతూ కాలువల్లో స్ప్రేయింగు చేయడం, దోమల నివారణ చర్యల పై ప్రజలకు తగు అవగాహన నిరంతరం కల్పించడం వంటివి చేయాలని మలేరియా ఇన్ స్పెక్టర్ ను ఆదేశించారు. ఈ పర్యటనలో జోన్-5 కమిషనర్ సింహాచలం, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసరు రాజేష్, కార్యనిర్వాహక ఇంజినీరు శ్రీనివాసరావు, జోన్-5 శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్ స్పెక్టర్, మలేరియా ఇన్ స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
వార్డు,గ్రామ సచివాలయాలకు వచ్చే ఆర్జీదారులు సంతృప్తితో ఇంటికి తిరిగివెళ్లాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ వార్డు సచివాలయ సిబ్బందికి సూచించారు. ఎన్నో ఆశలతో ఆర్జీదారులు సచివాలయాలకు వచ్చి దరఖాస్తులను సమర్పిస్తారని, వాటిన్నింటిని పరిశీలించి వీలైనంత త్వరగా అర్హత మేరకు మంజూరుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం పలాస పరిధిలో గల పలు వార్డు సచివాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసారు. వార్డు సచివాలయాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్న ఆయన సచివాలయంలో నిర్వహిస్తున్న రిజిష్టర్లను పరిశీలించారు. వార్డు సచివాలయాలకు వచ్చే ఆర్జీదారులు సమర్పించే దరఖాస్తుల వివరాలను సంబంధిత రిజిష్టర్లలో ఎప్పటికపుడు నమోదు చేయాలని ఆదేశించారు. ఆర్జీదారుల సమస్యలను ఎప్పటికపుడు పరిష్కరిస్తూ ప్రజల మన్ననలను పొందాలని, అధికారులు తనిఖీలకు వచ్చినపుడు సచివాలయంలో నిర్వహిస్తున్న రిజిష్టర్లను అందజేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గరోడా, ఎం.డి.ఓ రమేష్ నాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తలపెట్టిన రాష్ట్ బంద్ విశాఖలో పూర్తిగా విజయవంతం అయ్యింది. విశాఖ నగరంతోపాటు జిల్లాలోనూ అన్ని వర్గాలు స్వచ్ఛందంగా ఈ బంద్ లో పాల్గొన్నారు. దీనితో ప్రభుత్వ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ ఇలా అన్ని నిర్మానుష్యంగా మారాయి. ఆందోళన కారులంతా అధికార పార్టీ నిర్వహించిన బంద్ లో పాల్గొన్నారు. జాతీసంపదను విచ్చిన్నం చేస్తా మంటే విశాఖ ప్రజలు ఊరుకోరనే విషయం కేంద్రానికి తెలియజెప్పడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు తెలియజేయడంలో సఫలీక్రుతలయ్యారు. రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి కన్నబాబు, జిల్లా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస్, నగర అధ్యక్షులు వంశీక్రిష్ణశ్రీనివాస్, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబులు ఈ ఉద్యమంలో ఆందోళనాకారులతో కలిసి తమ మద్దతులను, స్టీలుప్లాంట్ ను కాపాడుకోవడానికి కదం తొక్కారు. గ్రామీణ ప్రాంతంలో రోజంతా బంద్ పాటించారు. నగరంలో మాత్రం మధ్యహ్నాం మూడు గంటలు దాటిన తరువాత జన సంచారం మొదలైంది..
మునిసిపల్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. ఓటును పక్కాగా పరిశీలించాలని ఆయన స్పష్టం చేసారు. మునిసిపల్ ఎన్నికల అధికారులు, సిబ్బందికి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ నివాస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. చెల్లుబాటు అయ్యే ఓటు, చెల్లు బాటు కానీ ఓట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ చెప్పారు. స్వస్తిక్ గుర్తు ఉన్నవాటిని మాత్రమే సరైనదిగా గుర్తించాలని, నిశాని ఉంటే చెల్లుబాటు కాదని వివరించారు. స్వస్తిక్ గుర్తు సంబంధిత అభ్యర్థి విభాగంలో పక్కాగా ఉండాలని అన్నారు. కౌంటింగ్ కు ముందు ఓట్లు విభజన చేసేటపుడు ఏజెంట్లకు చూపించాలని సూచించారు. ఒక్క ఓటు తేడా ఉన్నప్పుడు మాత్రమే అవసరమైతే ఓట్లను రీ కౌంటింగ్ మాత్రమే చేయాలని సూచించారు. ఒక్కసారి మాత్రమే రీ కౌంటింగ్ చేయాలని అన్నారు. మొదటి సారి కౌంటింగ్ పక్కాగా జరగాలని సూచించారు. బాలట్ లను భద్రపరచాలని ఆదేశించారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా కౌంటింగ్ చేయాలని సూచించారు. ఎన్నికల శిక్షణ అధికారి పి.రజనీకాంత రావు కౌంటింగ్ నిర్వహించు విధానం, పాటించాల్సిన విధి విధానాలు, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ కలెక్టర్ మరియు ఎన్నికల శిక్షణా సమన్వయ అధికారి బి.శాంతి, మెప్మా పిడి ఎం.కిరణ్ కుమార్, కౌంటింగ్ అధికారులు పాల్గొన్నారు.