1 ENS Live Breaking News

మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి..

అనంతపురం జిల్లాలో మున్సిపల్, అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. ఆదివారం అనంతపురం నగరంలోని శ్రీ సాయిబాబా నేషనల్ ఎయిడెడ్ హై స్కూల్ లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు, సచివాలయాలు మరియు అభివృద్ధి) ఏ. సిరితో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ను పటిష్టంగా చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా మెటీరియల్ పంపిణీ కేంద్రాన్ని, స్ట్రాంగ్ రూమ్, రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేయాలని, కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ లో పాల్గొనే సిబ్బందికి, ఏజెంట్లకి ఐడి కార్డులు అందజేయాలన్నారు.  ఈ సందర్భంగా మ్యాప్ ద్వారా కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటును జిల్లా కలెక్టర్ పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. కౌంటింగ్ కోసం టేబుల్స్ ఏర్పాటు, కౌంటింగ్ సిబ్బంది నియామకం, ఎలా టేబుల్స్ ఏర్పాటు చేయాలి అనే విషయాలపై చర్చించారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ నాగరాజు, ఆర్ డి ఓ గుణభూషణ్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ శోభ స్వరూపరాణి, నగరపాలక సంస్థ కమిషనర్ పివిఎన్ఎన్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-02-21 18:16:43

ఫిబ్రవరి 23న విష్ణుసహస్రనామ పారాయణం..

భీష్మ ఏకాదశి సందర్భంగా ఫిబ్రవరి 23న ఉదయం ఏడు గంటలకు తిరుమల నాదనీరాజనం వేదికపై విష్ణు సహస్రనామ పారాయణం జరగనుంది. దాదాపు మూడు గంటల పాటు జరుగనున్న ఈ కార్యక్రమం కోసం ఆదివారం నాడు నాదనీరాజనం వేదికపై వేదపండితులతో విష్ణు సహస్రనామ పారాయణం ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ అష్టోత్తరం 30 శ్లోకాలు, పూర్వపీఠిక 29 శ్లోకాలు, విష్ణు సహస్రనామం 108 శ్లోకాలు, ఉత్తరపీఠిక 34 శ్లోకాలు పారాయణం చేయాలని నిర్ణయించారు. తిరుమల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం, తిరుప‌తిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు, టిటిడి వేదపారాయణదారులు, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ స్కీమ్  వేదపారాయణదారులు ఈ పారాయణంలో పాల్గొంటారు.  ఆ రోజు ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. 

Tirumala

2021-02-21 18:15:46

తుది దశ ఎన్నికలు ప్రశాంతం..

శ్రీకాకుళం జిల్లాలో తుది దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం శ్రీకాకుళం, ఎచ్చెర్ల, నరసన్నపేట నియోజక వర్గ పరిధిలో గల శ్రీకాకుళం, గార, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడాం, పొలాకి, నరసన్నపేట, జలుమూరు, సారవకోట మండలాల్లో తుది విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి విదితమే. అందులో భాగంగా జిల్లా కలెక్టర్  జె.నివాస్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్దార్ తో కలసి ఎచ్చెర్ల  మండలంలోని ఫరీదుపేట, డి.మత్య్సలేశం, రణస్థలం మండలం జె.ఆర్.పురంతో  పాటు వివిధ మండలాల్లోని పలు గ్రామాలను సందర్శించి ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుది దశ పంచాయతీ ఎన్నికల్లో 274 పంచాయతీలకు గాను 259 పంచాయతీల్లోనూ, 2,658 వార్డులకు గాను 1,915 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నట్లు చెప్పారు. సర్పంచ్ పదవికి 661 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా వార్డుల కొరకు 4,202 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. ఉదయం 06.30 నుండి మధ్యాహ్నం 03.30 గం. ల వరకు జరుగుతున్న ఈ పోలింగులో 4,88,625 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న అన్ని ప్రాంతాలతో పాటు సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలో మధ్యాహ్నం 12.30 గం.లకు 62.07  శాతం పోలింగ్ నమోదైందని కలెక్టర్ తెలిపారు.

Srikakulam

2021-02-21 14:58:58

కరోనా వేక్సినేషన్ సత్వరం పూర్తిచేయాలి..

అనంతపురం జిల్లాలో హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్లకు వేస్తున్న కరోనా వ్యాక్సిన్ వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు నిర్వహించిన వ్యాక్సినేషన్ ప్రక్రియ పురోగతిపై మెడికల్ అధికారులు ,ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు, డి ఎం హెచ్ ఓ, డి ఐ ఓ, తహసిల్దార్ లతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో  వ్యాక్సినేషన్ ఏ మండలం, పి హెచ్ సి ,ఏ సబ్ సెంటర్ లో కూడా 60 శాతం మించ లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ వేయించిన శాతం ఇతర  జిల్లాలతో పోలిస్తే అట్టడుగు నుంచి రెండవ స్థానంలో అనంతపురం జిల్లా నిలిచిందన్నారు. అనంతపురం జిల్లా వివిధ శాఖల కార్యక్రమాలలో అగ్రస్థానంలో  ఉండగా, వ్యాక్సినేషన్ లో మాత్రం అట్టడుగు స్థానంలో ఉందన్నారు. జిల్లా వ్యాక్సినేషన్ శాతం సరాసరి 32 శాతం మాత్రమేనన్నారు. జె సి, డి ఎం హెచ్ ఓ  వ్యాక్సినేషన్ పై  నిరంతరం  ఫాలోఅప్ చేస్తున్నా  పురోగతి రావడం లేదన్నారు. దీన్ని అధిగమించి 100% పురోగతికి తీసుకురావాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. జిల్లాలో హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్ల మండలాల వారి వ్యాక్సినేషన్ డాటా పరిశీలిస్తే కూడేరు, అమరాపురం, 59 శాతం, పెనుగొండ 60 శాతం వ్యాక్సినేషన్ జరిగిందన్నారు. ఈ మండలాలకు చెందిన అధికారులందరినీ అభినందిస్తున్నానన్నారు. గోరంట్ల ,గుంతకల్, కనగానపల్లె 14 శాతం, ఒడిసి మండలాల్లో 16% మాత్రమే అతి తక్కువగా వ్యాక్సినేషన్ జరిగిందన్నారు.  వ్యాక్సినేషన్ తీసుకోవడంపై మెసేజ్లు పంపుతున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ  లబ్ధిదారులు మాత్రం మెసేజ్ లు రావడం లేదని  తనకు తెలిపారన్నారు.  ఈ అంశంలో  జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనబడుతోంది అన్నారు. తక్కువ వ్యాక్సినేషన్ జరగడంపై ఎన్నికలు జరుగుతున్నందువల్ల ,స్వచ్ఛందంగా ముందుకు రావడం లేదని పలు కారణాలు చెబుతున్నారన్నారు. ఇది సరి కాదని ,ఇతర జిల్లాలలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయని ఆ జిల్లాలో వ్యాక్సినేషన్ 90% జరిగిందన్నారు.  మున్సిపల్ ,రెవిన్యూ, పంచాయతీరాజ్ ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలన్నారు. మున్సిపల్ ,పంచాయతీ రాజ్ శాఖలలో వ్యాక్సినేషన్ శాతం చాలా తక్కువగా ఉందన్నారు. రెవెన్యూ శాఖలో వీరికన్నా కొంత పురోగతి ఉందన్నారు. తాను కూడ వ్యాక్సినేషన్ తీసుకోవడం జరిగిందని, తనకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని, తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని కలెక్టర్ తెలిపారు . మెడికల్ అధికారులందరూ, ఐసిడిఎస్, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీరాజ్, డివిజనల్ పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ, వార్డు కార్యాలయ సిబ్బంది అందరు కూడా వ్యాక్సినేషన్ చేయించుకోవాలన్నారు. హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ తీసుకునేందుకు ఈ నెల 25వ తేదీ చివరి రోజు అన్నారు .మెడికల్ అధికారులు బాధ్యత తీసుకొని అందరికీ వ్యాక్సిన్ చేయించాలన్నారు. ఇప్పటివరకు 42 శాతం మాత్రమే హెల్త్ కేర్ వర్కర్లు వ్యాక్సినేషన్ తీసుకోవడం జరిగిందన్నారు. ఈ అంశంలో డిఐ ఓ పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఇకనైనా డి ఐఓ ,డి ఎం హెచ్ ఓ ,మెడికల్ అధికారులు అందరూ కలిసి పూర్తిస్థాయిలో హెల్త్కేర్ వర్గాలకు వ్యాక్సినేషన్ చేయించాలన్నారు. కొన్ని మండలాల్లో హెల్త్ కేర్ వర్కర్ల వ్యాక్సినేషన్ శాతం జీరో గా ఉందన్నారు. ఆ ప్రాంత మెడికల్ అధికారులు ఎలాంటి శ్రద్ధ చూపినట్లు తెలుస్తోందని, అలాంటి వారిని సస్పెండ్ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.  గుంటకల్ 44%, తలుపుల 53% ,ఎన్ పి కుంట 55% ,ధర్మవరం  మెడికల్ అధికారుల పరిధిలో 68 శాతం ఇంకా వ్యాక్సిన్ చేయించుకోవాల్సి ఉందన్నారు. రానున్న రెండు రోజుల్లోపు 10 శాతం కన్నా ఎక్కువ పెండింగ్ ఉన్న మెడికల్ అధికారుల పరిధిలోని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు .ఇకనైనా వాక్సినేషన్ పై పూర్తి స్థాయిలో సన్నద్దం చేసి, అవగాహన కల్పించి, హెల్త్కేర్ వర్కర్ల అందరికీ వ్యాక్సినేషన్ చేయించాల్సిన బాధ్యత మెడికల్ అధికారులదే నని ఆయన అన్నారు .అంగన్వాడీ వర్కర్ల లో మడకశిర 42 శాతం ,సికేపల్లి 49 శాతం, కదిరి ,బొమ్మనహల్ మండలాల్లో 71% ఇంకా వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సి ఉందని, ఈ ప్రాంత ఎంపీడీవో, తాసిల్దారు ,ఇతర అధికారులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పూర్తిస్థాయిలో వాక్సినేషన్ చేయించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు, ఫ్రంట్లైన్ వర్కర్ల లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ,అర్బన్ డెవలప్ మెంట్ లో పురోగతి చాలా తక్కువగా ఉందని ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ వేయించాలని ఆదేశించారు, పంచాయతీరాజ్ లో ఓవరాల్గా 75% వ్యాక్సిన్ చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ అంశంపై డివిజనల్ పంచాయతీ అధికారులు ,ఎంపీడీవోలు ప్రత్యేక బాధ్యత తీసుకొని అందరికీ వ్యాక్సినేషన్ చేయించాలన్నారు .రెవిన్యూ లో 63 శాతం మంది తీసుకోవాల్సి ఉందని ,ఇందుకోసం తాసిల్దారు, సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలని, మిగిలిన వారందరూ కూడా వ్యాక్సినేషన్ చేయించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.  హెల్త్ కేర్ వర్కర్లు ఈనెల 23వ తేదీలోపు ,ఫ్రంట్లైన్ వర్కర్లు మరో వారం రోజుల్లోపు 100% వాక్సినేషన్ చేయించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు .ఇందుకు సంబంధించి తాను ,జేసీ పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ప్రతి రోజు ఉదయం 12 గంటలకు, సాయంత్రం 5 గంటలకు డి ఐ ఓ, డి ఎం హెచ్ ఓ సమన్వయం చేసుకొని నివేదికలను అందించాలన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (.అభివృద్ధి  ) డాక్టర్ ఏ .సిరి పాల్గొన్నారు.

Anantapur

2021-02-20 20:43:33

రామతీర్థం నిర్మాణానికి అనుమతులు..

విజయనగరం జిల్లాలోని రామతీర్థం కొండపై శ్రీ కోదండ రామాలయం పునర్నిర్మాణం నిమిత్తం దేవాదాయ శాఖ కమిషనర్ పరిపాలన, సాంకేతిక పరమైన అనుమతులు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా ఎం. హరిజవహర్ లాల్ తెలిపారు. ఈ ఆలయ పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.3 కోట్లు మంజూరు చేసిందని, ఈ నిధులతో దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్మాణం చేపడతారని పేర్కొన్నారు. ఈ - ప్రోకూర్ మెంట్ నిబంధనల మేరకు టెండర్ లు పిలవాలని ఆలయ ఇ.ఓ.కు ఆదేశించినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా ఆలయ పునర్నిర్మాణం పనులు సక్రమంగా జరిగేలా తగిన పర్యవేక్షణ చేయాలని ఆదేశించడం జరిగిందతెలిపారు.

Vizianagaram

2021-02-20 20:07:05

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు మెరుగు పరచాలి..

ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందించే వైద్య సేవలు మరింత మెరుగు పరచాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు.  శనివారం కాకినాడ కలెక్టరేట్ నుంచి జేసీ కీర్తి చేకూరి ఏరియా ఆసుపత్రులు,వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న పి.హెచ్.సి డాక్టర్లతో ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్యం, ఆరోగ్యశ్రీ పథకం సేవలు, ఇతర అంశాలపై జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా అందించె వైద్య, ఆరోగ్యశ్రీ సేవలు మరింత మెరుగు పరచడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతులు మెరుగుపరచడానికి అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఏరియా ఆస్పత్రులు, పీహెచ్సీలలో సర్జరీ లకు అవసరమైన యంత్రపరికరాలు కొరతగా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలన్నారు. ఎమర్జెన్సీ కేసులు వేరే ఆస్పత్రులకు బదిలీ చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స అందించాలి అన్నారు. వైద్య సేవల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రులకు ఏ సమయంలో ప్రజల వచ్చిన నిరాకరించడానికి వీలు లేదన్నారు. రాత్రి సమయాల్లో కూడా డాక్టర్లు అందుబాటులో ఉండాలని జేసీ తెలిపారు. జిల్లాలో మాతృ శిశు మరణాలు నియంత్రణకు వైద్యులు ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉత్తమ సేవలు అందించడం ద్వారా ప్రజలలో మన్ననలు పొందవచ్చన్నారు.విధులలో అలక్ష్యం వహించే వైద్యులపై కఠిన చర్యలు తప్పవని ఆమె అన్నారు. గ్రామ స్థాయిలో ఆరోగ్య శ్రీ పథకం ద్వారా అందించే సేవల వివరాలను విస్తృత అవగాహన కల్పించాలని జెసి అధికారులకు సూచించారు.    ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాజమహేంద్రవరం డి సి హెచ్ ఎస్ డాక్టర్ పి రమేష్ కిషోర్, జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయ అధికారి డాక్టర్ పి రాధాకృష్ణ, డీయం కె నవిన్ , వివిధ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక డాక్టర్లు సూపరిండెంటులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2021-02-20 19:58:22

ఎన్నికల నిబంధనలు పాటించాల్సిందే..

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొవిడ్ నియమ నిబంధనలను అనుసరిస్తూ నాల్గవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రేపు తిరుపతి డివిజన్ కు చెందిన 13 మండలాల్లో 221 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 4 విడతలో తిరుపతి డివిజన్ కు సంబందించి 14 మండలాల ఎన్నికలు నిర్వహణతో పాటు మొదటి విడతలో చిత్తూరు డివిజన్ లోని బంగారుపాళ్యం మండలానికి సంబందించి కల్లూరుపల్లి పంచాయతీ లోని ఒక వార్డుకు పోటీ చేసిన అభ్యర్ధి మరణించడంతో ఆ పంచాయతీ లోని ఒక వార్డు స్థానానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు నాల్గవ విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టగా కల్లూరుపల్లి పంచాయతీలోని ఆ వార్డు ఏకగ్రీవం కావడం మరియు తిరుపతి డివిజన్ కు సంబందించిన పులిచెర్ల మండలం లోని అన్ని సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలు ఏకగ్రీవం కావడంతో ఈ నెల 21 న తిరుపతి డివిజన్ కు చెందిన 13 మండలాలలో నాల్గవ విడత ఎన్నికల నిర్వహణ జరుగుతుందని తెలిపారు.  నాల్గవ విడతలో మొత్తం 15 మండలాలలో 397 గ్రామ పంచాయతీలకు గాను వివిధ కారణాల రీత్యా 22 పంచాయతీలు మినహా 375 పంచాయతీలకు, 3,649 వార్డులలో 188 వార్డుల మినహా 3,461 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ విడదల చేయడం జరిగిందని తెలిపారు. అందులో 154 గ్రామ పంచాయతీలు, 2066 వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నిక అయినందున మరియు 20 వార్డు మెంబర్లకు నామినేషన్లు ధాఖలు కానందున మిగిలిన 221 సర్పంచ్ లకు మరియు 1,375 వార్డు మెంబర్లకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో 2,93,504 మంది పురుషులు, 3,05,612 మంది స్త్రీలు మరియు 70 మంది ఇతరులు మొత్తం 5,99,186 మంది ఓటర్లు పాల్గొననున్నారని తెలిపారు. ఈ విడతలో 221 సర్పంచ్ స్థానాలకు గాను 618 మంది, 1375 వార్డ్ మెంబర్ల స్థానాలకు గాను 3055 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం 1,765 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో 541 అత్యంత సమస్యాత్మక మరియు 389 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ పోలింగ్ కు సంబంధించి 215 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందని మరియు ఈ పోలింగ్ కేంద్రాలకు అవసరమైన స్థాయిలో పోలీసు బందోబస్త్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి 3,107 పెద్దవి, 1,025 చిన్న బ్యాలెట్ బాక్స్ లను సంబంధిత పోలింగ్ కేంద్రాలకు తరలించామని తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు 108 మంది స్టేజ్ – 1 మరియు 94 మంది స్టేజ్ – 2 ఆర్ఓ లను, 2044 మంది  పోలింగ్ అధికారులు(పి ఓ లు ), 414 మంది ఏఆర్ఓ లను, 29 మంది జోనల్ ఆఫీసర్లను, 86 మంది రూట్ ఆఫీసర్లను నియమించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల సిబ్బంది మరియు సామగ్రి తరలింపుకు అవసరమైన 159 బస్సుల ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకొంటున్నారని తెలిపారు. ఎన్నికల సామగ్రి తరలింపుకు 14 సామాగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, కొవిడ్ దృష్ట్యా ఎన్నికల సిబ్బందికి 19,960 మాస్కులు, 1,765 లీటర్ల హ్యాండ్ స్యానిటైజర్లు, 19,960 హ్యాండ్ గ్లౌజ్ లు అందజేయడం జరిగిందన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ పేపర్లు, కవర్లు, బుక్లెట్లు, రబ్బరు స్టాంప్ లు వంటి ఇతర సామగ్రిని ఎంపిడిఓ లకు సమకూర్చడం జరిగిందన్నారు. 4వ విడత పోలింగ్ ఉదయం 6.30 గం.ల నుండి మ.3.30 గం.ల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఆ వెంటనే ఓట్ల లెక్కింపునకు సంబంధించి 251 మంది సూపర్ వైజర్లు, 753 మంది కౌంటింగ్ స్టాఫ్ ను నియమించామన్నారు.

Tirupati

2021-02-20 18:04:23

కోవిడ్ వ్యాక్సిన్ అత్యంత సుర‌క్షిత‌మైంది..

కోవిడ్‌-19 టీకా అత్యంత సుర‌క్షిత‌మైంద‌ని.. ల‌బ్ధిదారులు ప్ర‌తి ఒక్క‌రూ ముందుకొచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జి.రాజ‌కుమారి పేర్కొన్నారు. శ‌నివారం కాకినాడ‌లోని సూర్య‌నారాయ‌ణ‌పురం ప‌ట్ట‌ణ ప్రాథ‌మిక ఆరోగ్య‌కేంద్రం (యూపీహెచ్‌సీ)లో జేసీ రాజ‌కుమారి, డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు కోవిడ్‌-19 వ్యాక్సిన్ వేయించుకున్నారు. అనంత‌రం జేసీ మాట్లాడుతూ కోవిడ్ క్లిష్ట స‌మ‌యంలో వైద్యం‌, ఆరోగ్యం; పోలీస్‌, రెవెన్యూ, పంచాయ‌తీరాజ్‌, మునిసిప‌ల్‌, గ్రామీణాభివృద్ధి, సంక్షేమం త‌దిత‌ర శాఖ‌ల సిబ్బంది ఎంతో సేవ చేశార‌ని తెలిపారు. కోవిడ్ బాధితుల‌కు స‌రైన చికిత్స అందించ‌డంతో పాటు ఎవ‌రికి ఏ అవ‌స‌ర‌మొచ్చినా మేమున్నామంటూ భ‌రోసా క‌ల్పించార‌న్నారు. ముందుగా వీరంద‌రికీ వ్యాక్సిన్ వేయాల‌న్న ప్ర‌భుత్వ నిర్ణ‌యం మేర‌కు తొలిద‌శ‌లో హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు వ్యాక్సిన్ అందించిన‌ట్లు తెలిపారు. రెండో ద‌శ‌లో ఫ్రంట్‌లైన్ వ‌ర్కర్లు అంద‌రికీ వ్యాక్సిన్ పంపిణీ జ‌రుగుతోంద‌ని.. ఇందులో భాగంగా శ‌నివారం యూపీహెచ్‌సీలో వ్యాక్సిన్ వేయించుకున్న‌ట్లు వివ‌రించారు. క‌లెక్ట‌రేట్ ఉద్యోగులు కూడా వ్యాక్సిన్ వేయించుకున్నార‌ని, వ్యాక్సిన్ వేయించుకున్న వారు త‌మ స‌హోద్యోగులకు కూడా తెలియ‌జేసి వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్స‌హించాల‌ని, ఆరోగ్య‌క‌ర స‌మాజానికి కృషి చేయాల‌ని కోరారు. మొబైల్‌కు వ‌చ్చిన సందేశాల ప్ర‌కారం క‌లెక్ట‌రేట్ సిబ్బంది సూర్య‌నారాయ‌ణ‌పురం యూపీహెచ్‌సీలో వ్యాక్సిన్ వేయించుకున్న‌ట్లు డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు తెలిపారు. అందుబాటులో ఉన్న సుర‌క్షిత‌మైన వ్యాక్సిన్‌ను ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్లంద‌రూ ఉప‌యోగించుకోవాల‌ని సూచించారు. కార్య‌క్ర‌మంలో వైద్యాధికారులు డాక్ట‌ర్ ప్రియాంక‌, డాక్ట‌ర్ ఐ.లిఖిత, ఆసుప‌త్రి సిబ్బంది పాల్గొన్నారు.

Kakinada

2021-02-20 17:44:56

తుది ఎన్నికలకు సర్వం సిద్ధం..

శ్రీకాకుళం  జిల్లాలో తుది విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సంయుక్త కలెక్టర్ ( ఆసరా, సంక్షేమం ) ఆర్.శ్రీరాములు నాయుడు పేర్కొన్నారు.  శ్రీకాకుళం రూరల్ మండలం పంచాయతీ ఎన్నికల పోలింగ్ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించిన జె.సి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ శ్రీకాకుళం రూరల్ మండలంలోని 23 పంచాయతీలకు, 240 వార్డులకు ఆదివారం పోలింగ్ జరగనుందని చెప్పారు. పోలింగ్ కు సంబందించిన మెటీరియల్ పూర్తిగా పంపిణీ అయ్యిందని, 600 మంది సిబ్బంది ఈ పోలింగ్ కు హాజరుకానున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామని వివరించారు. తుది విడత పంచాయతీ ఎన్నికలు సాఫీగా జరిగేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఉదయం 6.30 గం.ల నుండి మధ్యాహ్నం 3.30 గం.ల వరకు పోలింగ్ జరుగుతుందని, ఆ తదుపరి కౌంటింగ్ జరిగేలా చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ప్రతీ కేంద్రంలో రాత్రి 10.00 గం. లకే కౌంటింగ్ ముగిసేలా ఆదేశాలు జారిచేసామని జె.సి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలింగ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-02-20 17:37:35

ఎన్నికలు సజావుగా జరిపించండి..

విజయనగరం జిల్లాలో 10 మండలాల్లో జరుగుతున్న నాల్గవ విడత పంచాయతి ఎన్నికలు సజావుగా జరిగేలా  చూడాలని  జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ ఆదేశించారు. 3వ విడతలో సక్రమంగా జరిగాయని, ఓటింగ్ శాతం కూడా రాష్ట్రం లోనే అధికంగా జరిగిందని, అదే విధంగా 4వ విడత లో కూడా జరగాలని అన్నారు.  శనివారం  కలెక్టర్ గంట్యాడ, ఎస్.కోట, వేపాడ, ఎల్.కోట, కొత్తవలస  మండలాల్లో సుడిగాలి పర్యటన జరిపి ఎన్నికల ఏర్పాట్లను తనిఖీ చేసారు.  ఎన్నికల మెటీరియల్ సరఫరా,  పోలింగ్ ఏర్పాట్లు,  ఎన్నికల సిబ్బందికి భోజన సదుపాయాలు తదితర అంశాల పై రిటర్నింగ్ అధికారులను ఆరా తీసారు. మండల ప్రత్యెక అధికారులను, రిటర్నింగ్ అధికారులను కలసి  సిబ్బంది, మెటీరియల్ తదితర అంశాలలో సమస్య లేమైనా  ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.  సమస్యాత్మక గ్రామాల్లో వెబ్ కాస్టింగ్ , వీడియో, మైక్రో అబ్సర్వర్ లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.  అదే విధంగా టాస్క్ ఫోర్సు బృందాలు కూడా తనిఖీ లు చేస్తాయని అన్నారు.  కౌంటింగ్ కు  సి సి కెమెరా లను ఏర్పాటు చెయ్యాలన్నారు. పోలింగ్,  కౌంటింగ్ సమయాలలో ఎలాంటి మార్పు లేకుండా ఖచ్చితంగా జరపాలన్నారు.   నాలుగు మండలాల్లో ఏర్పాట్ల పట్ల సంతృప్తిని వ్యక్తం చేసారు. కొత్తవలస  మండలం ఎన్నికల సిబ్బంది కొంత మంది 2.30గంటలు  అవుతున్న భోజనం ఇంకా పెట్టలేదని కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా, భోజన ఏర్పాట్ల వద్దకు వెళ్లి కలెక్టర్ తనిఖీ చేసారు. అక్కడ సరిపడా భోజనం లేకపోయేసరికి భోజనాలకు ఇబ్బంది లేకుండా  చూడాలని పదే పదే ఆదేసించినా భోజనాలు ఏర్పటు చేయకపోవడం పై తహసిల్దార్, ఎం.పి.డి.ఓ ల పై ఆగ్రహం వ్యక్తం చేసారు.  భోజనాలు, తాగు నీరు వెంటనే ఏర్పాటు చేయాలనీ ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులను నియమించుకోవాలని, వెబ్ కాస్టింగ్  కు ఏర్పాట్లు చేయాలనీ సూచించారు.  కౌంటింగ్ కోసం  సి.సి కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. మొత్తం ప్రకిర్య సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అధికారులు చుదలనిసుచించారు. 

Vizianagaram

2021-02-20 17:10:19

విశాఖ స్టీల్ కోసం కలం కార్మికులు ఏకమయ్యారు..

విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకోవడం కోసం కలం కార్మికులంతా ఏకమయ్యారని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అన్నారు. శనివారం విశాఖలోని గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీ నాయకులు, మంత్రులతో కలిసి నివాళులు అర్పించిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకోవడం చేస్తున్న ఉద్యమానికి జర్నలిస్టులు కూడా సంఘీభావం వారి వార్తలు, ప్రత్యక్ష ప్రసారాలు, కథనాల  ద్వారా తెలియజేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నప్పటి నుంచి ముందు తమ గళం విప్పింది జర్నలిస్టులేనని, నాటి నుంచి నేటి వరకూ స్టీల్ ప్లాంట్ కోసం జరుగుతున్న పోరాటం మొత్తాన్ని జర్నలిస్టులు ప్రత్యేక కవరేజీ చేస్తూ అన్నివర్గాల ప్రజలను చైతన్యం చేస్తున్నారన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని కూడా తమ సీనియర్ జర్నలిస్టులే అప్పటి పరిమిత మీడియా ద్వారా ప్రజల్లోకి తమ ప్రత్యేక కథనాల ద్వారా తీసుకెళ్లారని కొనియాడారు. సమాజంలో జర్నలిస్టు అనే వ్యక్తి లేకపోతే ప్రజా ఉద్యమాలు ప్రభుత్వం ద్రుష్టికి వెళ్లే పరిస్థితి లేదన్నారు. నవరత్న హోదా కలిగిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవడానికి జర్నలిస్టులు తమ కలంతో రాస్తున్న కధనాలు యావత్ భారతదేశ ప్రజలను, ప్రభుత్వాలను, రాజకీయ పార్టీలను కదిలిస్తున్నాయని అన్నారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి అన్ని వర్గాల కార్మిక సంఘాలు, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తమ పూర్తిస్థాయి మద్దతును జర్నలిస్టులు ప్రకటించారని గంట్ల శ్రీనుబాబు చెప్పారు.

Visakhapatnam

2021-02-20 13:58:10

కనకమ్మను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి..

ఉత్తరాంధ్రవాసుల ఇలవేల్పు విశాఖ వాసుల కుల దైవం శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని శనివారం హైకోర్టు న్యాయమూర్తి  సి.ప్రవీణకుమార్ దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి న్యాయమూర్తికి దర్శన ఏర్పాట్లు చేశారు. న్యాయమూర్తి దంపతులు అమ్మవారిని దర్శించుకొని కొంతసేపు ఆలయంలోనే గడిపారు. అనంతరం అమ్మవారి తీర్ధ ప్రసాదాలను దేవస్థానం అధికారులు అందజేశారు. అంతకుముందు వేదపండితులు న్యాయమూర్తి దంపతులకు ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-02-20 13:36:11

గాంధీజీ సాక్షిగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కదం తొక్కారు..

విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో గాంధీజి సాక్షిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోవడానికి వేలది ప్రజానికంతో కదం తొక్కింది. శనివారం విశాఖలోని జీవిఎంసీ ఎదురుగా ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ యాత్రను ప్రారంభించారు రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా ఒకే నినాదంగా కేంద్రానికి వినిపించేలా ఈ యాత్ర కొనసాగాలంటూ ఆ మహాత్ముడుకి నివాళులు అర్పించి ఒకదండుగా కదలి ముందుకి సాగారు. ఈ మహత్తర కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన క్రిష్ణదాసు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణశ్రీనివాస్, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, గాజువాక ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి, ఉత్తర నియోజకవర్గ నాయకులు కెకెరాజు, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-02-20 12:24:02