చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమం మొబైల్ వాహనాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 35 శాతం పట్టణ ప్రాంతాల్లో 43% పూర్తి చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్( రెవిన్యూ) మార్కండేయులు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం సివిల్ సప్లైస్ కమిషనర్ కోన శశిధర్ ప్రజా పంపిణీ వ్యవస్థ పై వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ సరుకులు పంపిణీ ప్రజల వద్దకే తీసుకెళ్లి ఇవ్వాలనే ఉద్దేశంతో సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని భావంతో కొంత మందికి ఉపాధి కలిగించే గొప్ప ఉద్దేశంతో ప్రభుత్వం మొబైల్ వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర వ్యాప్తంగా 1 నుంచి 2 శాతం మంది మొబైల్ వాహనదారులు కొంత ఇబ్బంది పెడుతున్నారని అయితే ముందే దీన్ని గ్రహించిన ప్రభుత్వం ధరలు పెంచడం కూడా జరిగిందన్నారు. మొబైల్ వాహనదారుడు ఒక సహాయకుని నియమించు కోవాలని వారు వీఆర్వోలు వాలంటీర్లు సూచనల మేరకు ప్రజలకు నిత్యావసర వస్తువులు ప్రభుత్వం ఇచ్చేవి అందజేయాలన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో వాలంటీర్లు మొబైల్ వాహనం డ్రైవర్లు కొత్త కావడం వల్ల కొంత ఆలస్యం జరుగుతోందని వీరికి వీఆర్వోలు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుందని వారికి రెండు నెలల లోపు పని నేర్పిస్తే అనంతరం జిపిఎస్ విధానం ద్వారా పి ఆర్ వో లు ఎక్కడ ఉన్నా సిస్టం ను మానిటరింగ్ చేసుకోవచ్చునని కమిషనర్ తెలిపారు. ఏదైనా ఒక కొత్త పద్ధతిని తీసుకు వచ్చినప్పుడు మొదట సమస్యలు ఉంటాయని అదే విధంగా ప్రస్తుతం ప్రజాపంపిణీ వ్యవస్థ కొంత ఇబ్బందులు ఉన్నాయని కొంతమంది వాహనదారులు సహాయకులను నియమించు కోకుండా సమస్యలు తీసుకురావడం జరిగిందని ఆ సమస్యలు కూడా ప్రస్తుతం పరిష్కారమయ్యే దిశగా అందరూ కృషి చేస్తున్నారన్నారు. ప్రజలకు అనుకూలమైన సమయాల్లోనే నిత్యావసర వస్తువుల పంపిణీ చేయాలని వేసవి కాలం వస్తోందని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉదయం ప్రజలకు అనుకూలమైన సమయం నుంచి ప్రారంభించుకోవచ్చు నని సాయంత్రం ఆరు గంటల నుంచి 7 గంటల వరకు గ్రామ సచివాలయం వద్ద వాహనాలు ఉండేలా చూడాలని మొదటి నెలలో కొన్ని సమస్యలు రావడం జరిగిందని రానున్న కాలంలో ఈ సమస్యలను అధిగమించి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మొబైల్ నుంచి ప్రభుత్వం ఇచ్చే నిత్యావసర వస్తువులను ప్రజలకు అందజేయాలన్నారు. ఇక వాహనాలకు సంబంధించి మెయిన్ స్కేల్ ఈపాస్ యంత్రాలు వాటికి సంబంధించిన చార్జర్ లు వాహనంలో ఉన్న సమయంలో వాహనం ద్వారా లేదా ఇంటి వద్ద ఉన్నప్పుడు వేరే ఛార్జర్ ద్వారా చేయాలని లేకుంటే చార్జర్లు పేలిపోయే ప్రమాదముందని కమిషనర్ తెలిపారు. అదేవిధంగా మెయిన్ స్కేల్ విషయంలో గాని ఈపాస్ యంత్రం మరమ్మతు కు గురైతే జిల్లా కేంద్రంలో ఉండే మెకానిక్ ద్వారా సరి చేసుకోవాలన్నారు మెకానిక్ ను ఇతర ప్రాంతాలకు పంపడం వల్ల వేరే ప్రాంతంలో యంత్రం చెడిపోతే సమస్య వస్తుందని అందువల్ల జిల్లా మేనేజర్ కార్యాలయం లో కానీ సివిల్ సప్లై అధికారి కార్యాలయంలో గానీ మెకానిక్ ఉండేటట్లు చూడాలన్నారు. వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ 18 రోజులపాటు చేయాలని విఆర్ఓ వాహనదారులకు పని నేర్పించిన తర్వాత వారు తిరిగి రెగ్యులర్ విధులకు హాజరు కావచ్చునని ఆయన తెలిపారు. రోజువారి రేషన్ సరుకులు పంపిణీ ఈ కార్యక్రమాన్ని తాసిల్దార్ లు ఆర్ డి వో లు జాయింట్ కలెక్టర్ పౌరసరఫరాల శాఖ వారు సమీక్షించాలని రోజు జాయింట్ కలెక్టర్ నివేదిక చూడాలని అన్నారు. పేద ప్రజల కోసం వారు ఇబ్బందులు పడకుండా వారు కూలీలకు వెళ్ళే సమయం ఉదయం ఉంటుంది కాబట్టి వారిని సంప్రదించి వారికి అనుకూలమైన సమయంలో వాహనం పంపాలని కార్డులకు సంబంధించి మ్యాపింగ్ ప్రక్రియను వీఆర్వోలు చూడాలన్నారు. ఇలా మ్యాపింగ్ ప్రక్రియల సమస్యలు వస్తే పరిష్కరించేందుకు వీలుగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల్లో వాహనదారులు తాము మానేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఇందుకు సంబంధించి కొంతమంది అడగడం జరిగిందని అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు తర్వాత సీనియార్టీ లిస్టు లో ఉన్నవారికి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుందని మరో నాలుగు రోజుల్లో నిర్దేశించిన టార్గెట్లను చేరుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా నెట్వర్క్ సమస్య వస్తే సరిచూసుకొని ఆన్లైన్ విధానం ద్వారా పంపిణీ చేయవచ్చునని తెలిపారు . జాయింట్ కలెక్టర్ మార్కండేయులు మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన ఏడు వందల ఇరవై నాలుగు వాహనాలు ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో రేషన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మార్కండేయులు తో పాటు చిత్తూరు ఆర్డీవో రేణుక ,జిల్లా పౌరసరఫరాల అధికారి శివరాం ప్రసాద్, జిల్లా మేనేజర్ మోహన్ బాబు, సోమయాజులు జిల్లా వ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి, తాసిల్దార్లు పాల్గొన్నారు.
భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు తిరుపతి, తిరుమల పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లా కు రానున్నారని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ఉప రాష్ట్రపతి మార్చి 4 న చెన్నై నుంచి వాయుసేన ప్రత్యేక విమానం ద్వారా బయల్దేరి ఉ. 9.50 గం.లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారన్నారు. అనంతరం ఉ. 10.15 గం. లకు తిరుపతి లోని ఐఐటి కళాశాల చేరుకుని అక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని, తర్వాత ఉ. 11.20 గం. లకు తిరుపతి లోని అమర ఆసుపత్రి ప్రారంభోత్సవం చేస్తారని వివరించారు. ఆ తరువాత మ. 12.15గం. లకు తిరుమల బయల్దేరి మ.1.15 గం. లకు తిరుమల పద్మావతి అతిథి గృహం చేరుకుని, రాత్రి బస చేస్తారని తెలిపారు. 5 వ తేదీ ఉదయం 5.30గం. లకు శ్రీ వారిని దర్శించుకుని ఉ.8.30 గం.లకు తిరుమల నుండి బయల్దేరి ఉ. 9.20గం. లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని ఉ. 9.25 గం. లకు వాయుసేన ప్రత్యేక విమానంలో సూరత్ బయల్దేరి వెళతారని కలెక్టర్ తెలియజేశారు.
మహావిశాఖనగర పాలక సంస్థకు జరిగి ఎన్నికల విషయంలో నోడల్ అధికారులు సంబందిత జోనల్ కమిషనర్లతో సమన్వయం చేసుకొని విధుల్లో పాల్గొనాలని కమిషనర్ ఎస్.నాగలక్ష్మి సెల్వరాజన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జివిఎంసీ ఎన్నికలకు సంబంధించిన విధి విధానాలపై ఆయా అధికారులతో జివిఎంసి సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ, నోడల్ అధికారులు జివిఎంసి ఎన్నికలు ఒక క్రమ పద్దతిలో నిర్వహించేందుకు గాను వారికి కేటాయించిన పనులు పూర్తిచేయడానికి గాను రూట్ మ్యాప్ తయారుచేసుకొని ఇతర అధికారులతో సమన్వయం చేసుకొని విధులు పూర్తి చేయాలన్నారు. జోనల్ కమిషనర్లు కనీసం నాలుగు పర్యాయాలు అయినా ఆయా జోనల్ పరిధిలో గల పోలింగు స్టేషన్లను పరశీలన చేయాలన్నారు. బ్యాలట్ బాక్సులను సమకూర్చుకొని, వాటికి ఆయిల్ సర్వీసు, రిపేర్లు నిర్వహించి, ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉంచాలని సంబందిత జోనల్ అధికారిని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేస్తూ ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఫ్లైయింగ్ స్క్యాడ్ లు ఏర్పాటు చేసి ర్యాలీలు, సమావేశాలు ఇతర సంఘటనలుపై వీడియోలు, ఫోటోలు తీయించాలన్నారు. రిటర్నింగ్ అధికారి నుంచి మొదలుకొని పోలింగు స్థాయి సిబ్బంది వరకు అందరికి క్రమ బద్ధంగా శిక్షణా తరగతులు నిర్వహించాలన్నారు. దీనికోసం ఎక్కువమంది మాష్టర్ ట్రైనీలను ఏర్పాటు చేసుకొని పలు ప్రధాన ప్రాంతాలలో సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున, సాధ్యమైనంతవరకు ఈ నెలాఖరులోపు చేపట్టవలసిన పనులు పూర్తిచేయాలని జోనల్ కమిషనర్లకు నోడల్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జివిఎంసి ఎన్నికల నోడల్ అధికారులు, జోనల్ కమిషనర్లు, ఎలెక్షన్ సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు నాలుగు విడతలుగా నిర్వహించిన గ్రామ పంచాయితీ ఎన్నికల నామినేషన్ వివరాలను విడుదల చేశారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో వాటిని వెల్లడించారు. జిల్లాలో మొత్తం 63 మండలాల్లోని 1040 గ్రామ పంచాయితీలకు గాను 44 మంది సర్పంచులు, 10,692 వార్డులకు గాను 2860 మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. మిగిలిన 995 సర్పంచు పదవులకు, 7765 వార్డులకు పోలింగ్ నిర్వహించామన్నారు. సర్పంచు పదవికి 6922 నామినేషన్లు, వార్డులకు 22,656 నామినేషన్లు అందాయన్నారు. అసలు ఒక్క నామినేషన్ కూడా అందని వార్డులు 76 ఉన్నాయన్నారు. సర్పంచు నామినేషన్లు వేసిన వారిలో 4,106 మంది, వార్డులకు నామినేషన్ వేసిన వారిలో 5140 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారన్నారు. అంటే 59.31 శాతం సర్పంచు నామినేషన్లు, 22.68 శాతం వార్డు మెంబరు నామినేషన్లు ఉపసంహరించుకోవడం జరిగిందన్నారు. 45 సర్పంచు నామినేషన్లు, 245 వార్డు మెంబర్ నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయన్నారు. అంతిమంగా సర్పంచు పదవికి 2764 మంది, వార్డులకు 16,556 మంది పోటీ పడ్డారన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మార్చి నెలలో జరగబోయే మున్సిపల్స్ ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. సోమవారం ఆయా మున్సిపాలిటీలు/మున్సిపల్ ఎన్నికలపై చేస్తున్న ఏర్పాట్లుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మున్సిపల్ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి తో కలసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ, ఆయా మున్సిపాలిటీలలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు తగు చర్యలు చేపట్టాలని, నిబంధనలను తూ. చ. తప్పకుండా పాటిస్తూ ఎప్పటికప్ప్పుడు నియమావళికి అనుగుణంగా తగు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎన్నికలలో పోటీ చేయడానికి ఇదివరకే నామినేషన్లు వేసి చనిపోయిన అభ్యర్ధులకు బదులుగా ఈ నెల 28వ తేదిన ఇతరుల వద్ద నుండి నామినేనషన్లను రిటర్నింగు అధికారులు స్వీకరించడానికి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్నికలు పగద్బందీగా నిర్వహించుటకు గాను, ఏమైనా సందేహాలు ఉంటే, వాటిని నివృత్తి చేసుకోవడానికి రాష్ట్ర ఎన్నికల అధికారులతో నిరంతరం చర్చించుకోవాలని అధికారులకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో విశాఖపట్నం ఎన్నికల పరిశీలకులు ప్రవీణ్ కుమార్, విశాఖ జిల్లా కలక్టరు వి. వినయ్ చంద్, సిటీ పోలీసు కమిషనర్ మనీస్ కుమార్ సిన్హా, జివిఎంసి కమిషనర్ నాగలక్ష్మి ఎస్., జివిఎంసి ఉన్నతాధికారులు, జోనల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో నాలుగు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికలు దిగ్విజయంగా నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్ జె.నివాస్, పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ ను మీడియా ప్రతినిధులు అభినందించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమ వారం జిల్లా కలెక్టర్ నివాస్ కు దుశ్శాలువ, పుష్పగుచ్ఛంతో అభినందించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణకు మీడియా పాసులు జారీ నుంచి మొత్తం నిర్వహణ ఎంతో చక్కగా చేశారని, అదే స్థాయిలో మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల అధికారి ఎల్.రమేష్, మీడియా ప్రతినిధులు శాసపు జోగినాయుడు, ఎస్.వి.రమణ, బి.అప్పల నాయుడు, నాగభూషణ రావు, టెంక శ్రీను, సురేష్, నరసు నాయుడు తదితరులు ఉన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ (ఎస్.ఇ.సి) ఎన్.రమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్లతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఎస్.ఇ.సి వీడియో కాన్ఫరెన్సును నిర్వహించింది. మునిసిపల్ షెడ్యూల్ అందిరికి తెలిసే విధంగా ప్రదర్శించాలని అన్నారు. మునిసిపల్ ఎన్నికలకు ఓటర్ల జాబితాను సిద్ధం చేసి వాటిని సమర్పించాలని ఆదేశించారు. పోలింగు కేంద్రాలను ముందుగానే పరిశీలించాలని, అచ్చట తాగు నీరు, మరుగుదొడ్లు, ర్యాంపులు, విద్యుత్ తదితర సదుపాయాల లభ్యతను పరిశీలించాలని పేర్కొన్నారు. కోవిడ్ నియమ నిబంధనలు విధిగా అమలు చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను దిగ్విజయంగా నిర్వహించారని జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటిండెంట్లను ఆయన ప్రశంసించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్, జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, శ్రీకాకుళం నగర పాలక సంస్ధ కమీషనర్ పల్లి నల్లనయ్య, డిప్యూటి కలెక్టర్లు బి.శాంతి, సీతారామయ్య, ముఖ్య ప్రణాళిక అధికారి ఎం.మోహన రావు, మెప్మా ప్రాజెక్టు డైరక్టర్ ఎం.కిరణ్ కుమార్, మునిసిపల్ కమీషనర్లు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళంజిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. జిల్లాలో నాలుగు దశలలో ఎన్నికలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. 1024 పంచయతీ సర్పంచ్ లకు, 6,708 వార్డు సభ్యులకు ఎన్నికలు జరిగాయని చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమ వారం పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ తో కలసి మీడియా ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో నాలుగు విడతలలో సగటున 78.02 శాతం పోలింగు జరిగిందని, మూడు, నాలుగు దశలలో ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారని సంతోషం వ్యక్తం చేసారు. మునిసిపల్ ఎన్నికలలో సైతరం అందరూ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల సిబ్బందికి చక్కటి శిక్షణా కార్యక్రమం చేపట్టడం, అన్ని ఏర్పాట్లు సమయానుసారం పక్కాగా నిర్వహించడం వంటి కార్యక్రమాల వలన ఎన్నికలు సజావుగా నిర్వహించడం జరిగిందని వివరించారు. రెండు, మూడు చోట్ల కొద్దిగా ఉద్రిక్త వాతావరణం మినహా ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు.
ఎన్నికలలో అసభ్య, అసాంఘిక ప్రవర్తనకు కఠిన చర్యలు : ఎన్నికలలో రెచ్చ గొట్టే చర్యలు, దాడులు వంటి అసభ్య, అసాంఘిక కార్యక్రమాలకు దిగేవారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు. బేలెట్ పేపర్, బేలెట్ బాక్సు ఎత్తుకు పోవడం, కాల్చివేయడం వంటి సంఘటనలకు పాల్పడే వారికి ఐదు సంవత్సరాల కనీస జైలు శిక్ష పడుతుందని అన్నారు. పోటీలో ఉన్న అభ్యర్ధులు లేదా ఏ ఇతర వ్యక్తి అయినా ఇటువంటి కార్యక్రమాలు చేపడితే ఆరు సంవత్సరాల వరకు ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధం విధించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేసారు. అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలను ఇబ్బందులపాలు చేసే ఏ ఒక్క అంశాన్ని చేపట్టరాదని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికలలో కొన్ని ప్రాంతాల్లో ఓట్లు వేసే సమయంలోనూ ముఖ్యంగా ఓట్ల లెక్కింపు సమయంలో అవగాహన లేని వ్యక్తులు దుష్ప్రచారాలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. మునిసిపల్ ఎన్నికలలో సైతం ఇదే తరహా పర్యవేక్షణ పటిష్టంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
మునిసిపల్ ఎన్నికలకు ప్రవర్తనా నియమావళి అమలు : మునిసిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రవర్తనా నియమావళి ఇప్పటికే అమలులో ఉందని జిల్లా కలెక్టర్ నివాస్ అన్నారు. మునిసిపల్ షెడ్యూల్ పై సంబంధిత మునిసిపల్ అధికారులు రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి వివరాలు అందిస్తారని చెప్పారు. మునిసిపల్ ఎన్నికలలో గతంలో నామినేషన వేసిన వ్యక్తులు మరణించి ఉంటే అటువంటి చోట్ల నామినేషన్లు వేసే అవకాశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించిందని కలెక్టర్ చెప్పారు. ఫారం – ఏ, ఫారం – బి మార్పుకు అవకాశం ఉందని తెలిపారు. 2020 మార్చి 3వ తేదీ నాటికి ఉన్న ఓటర్ల జాబితాను అనుసరించి మునిసిపల్ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలను అత్యంత పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన తరహాలోనే మునిసిపల్ ఎన్నికలను కూడా ఇదే ఉత్సాహంతో మరింత సమర్ధవంతంగా నిర్వహించాలని స్థానిక ఎన్నికల నిర్వహణకు సాధారణ పరిశీలకులుగా నియమితులైన సీనియర్ ఐ.ఏ.ఎస్.అధికారి, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే జిల్లా అధికారులను కోరారు. అందుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సాధారణ ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించిన సీనియర్ అధికారి కాంతిలాల్ దండే సోమవారం జిల్లాకు వచ్చారు. స్థానిక జిల్లాపరిషత్ అతిథిగృహంలో ఆయనకు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ స్వాగతం పలికి ఆయనతో భేటీ అయ్యారు. జాయింట్ కలెక్టర్లు డా.జి.సి.కిషోర్ కుమార్, డా.ఆర్.మహేష్ కుమార్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ కట్టా సింహాచలం తదితరులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ బి.రాజకుమారి, జాయింట్ కలెక్టర్‌లతో మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలపై రాష్ట్రంలోనే అత్యధిక శాతం పోలింగ్ ఈ జిల్లాలో జరిగిన విషయమై జిల్లా కలెక్టర్ ఎన్నికల పరిశీలకులకు వివరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలోనే పట్టణ ప్రాంత ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకునే వాతావరణం కల్పించాలని తద్వారా పంచాయతీ ఎన్నికలను మించి పోలింగ్ నమోదు జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ జిల్లా ప్రజలు శాంతి కాముకులని అందువల్ల పట్టణ స్థానిక ఎన్నికలను వారి సహకారంతో విజయవంతంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ ఆయనకు వివరించారు. పోలీసు శాఖ పరంగా చేయనున్న బందోబస్తు ఏర్పాట్లపై జిల్లా ఎస్.పి. బి.రాజకుమారి ఎన్నికల పరిశీలకులకు తెలిపారు. జిల్లా పాలన యంత్రాంగంతో సమన్వయంతో పనిచేసి ఎలాంటి ఘటనలకు తావులేకుండా చర్యలు చేపడుతున్నామని, ఈ కారణంగానే మూడు విడతల్లోనూ ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయన్నారు.
జాయింట్ కలెక్టర్లు డా.జి.సి.కిషోర్ కుమార్, డా.ఆర్.మహేష్ కుమార్, జె.వెంకటరావు, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ కట్టా సింహాచలం తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో నిర్వహించబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎన్నికల యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ పేర్కొన్నారు. ఇది వరకు గుర్తించి నివేదించిన పది పోలింగ్ కేంద్రాలను మార్చనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో సోమవారం జరిగిన వీడీయో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఈ మేరకు స్పందించారు. కలెక్టరేట్‌లోని ఎన్.ఐ.సి. కేంద్రం నుంచి నిర్వహించిన వీడీయో కాన్ఫరెన్స్‌లో ఆయన జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు కాంతిలాల్ దండే, ఎస్పీ రాజకుమారి, జేసీలు కిశోర్ కుమార్, మహేష్ కుమార్, వెంకటరావు, అసిస్టెంట్ కలెక్టర్ సింహాచలంతో కలిసి పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించి ఏమైనా అంశాలుంటే మాట్లాడాలని ఎన్నికల కమిషనర్ సూచించగా స్పందించిన కలెక్టర్ హరిజవహర్ లాల్ మున్నిపల్, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మాట్లాడారు. జిల్లాలో ఇంకా కొన్ని చోట్ల నాడు-నేడు పనులు జరుగుతున్నందున కొన్ని కేంద్రాలు అందుబాటులోకి రాలేదని చెప్పారు. కావున ఆయా ప్రాంతాల్లో 10 ప్రత్యామ్న్యాయ కేంద్రాలను గుర్తించామని, కొత్తగా వాటిలోకి కేంద్రాలను మార్చుకునేందుకు అనుమతివ్వాలని ఎన్నికల కమిషనర్‌ను కోరారు. దీనిపై స్పందించిన కమిషనర్ సంబంధిత వివరాలతో కూడిన నివేదిక సమర్పించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు.
ముందుగా అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన ఎన్నికల కమిషనర్ మున్నిపల్ ఎన్నికల నిర్వహణకు అందరూ సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లూ చేసుకోవాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అన్ని జిల్లా అధికారులు, కలెక్టర్లు ప్రశంస పాత్రను పోషించారని కమిషనర్ కితాబిచ్చారు. అందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో రాబోయే మున్నిపల్, స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఓటర్ల జాబితాలను ప్రదర్శించాలని చెప్పారు. వార్డుల వారీగా ఓటర్ల వివరాలను ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. అలాగే జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి గతంలో ఎవరైనా బెదిరింపులు ఇతరత్రా కారణాలతో నామినేషన్ వేయలేనట్లయితే వారికి తాజాగా అవకాశం కల్పించాలన్నారు. సంతృప్తికరమైన ఆధారాలను సమర్పించినప్పుడే ఎన్నికల అథారిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. సంబంధిత అభ్యర్థుల వివరాలతో కూడిన నివేదికను రెండు రోజుల్లోగా సమర్పించాలని చెప్పారు. అలాగే ఎన్నికల నిర్వహణలో కోవిడ్ నియమాలను అందరూ తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా సూచించారు.
కార్యక్రమంలో డీఆర్‌వో ఎం. గణపతి రావు, మున్సిపల్ కమిషనర్ ఎస్.ఎస్ వర్మ, లైజన్ అధికారి ఏవీ శ్యామ్‌కుమార్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం లో సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా ఫిర్యాదుల విభాగంలో డయల్ యువర్ ఫోన్ ద్వారా స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి పలువురు ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేసారు. కవిటి మండలం బి.గొనగపుట్టుగ నుండి యల్.వెంకటరమణమూర్తి ఫోన్ చేసి మాట్లాడుతూ తన తండ్రి పేరున గల ఎ2.07 సెంట్ల భూమిని తన పేరునకు మార్పుచేయాలని కోరారు. టెక్కలి పాత బస్టాండ్ నుండి పి.చిట్టెమ్మ మాట్లాడుతూ గ్రామకంఠం నిషేదిత జాబితా నుండి పేరు తొలగించాలని కోరారు. మందస మండలం సొండిపూడి నుండి పి.ప్రశాంత్ మాట్లాడుతూ తన రేషన్ కార్డుపై రేషన్ వేరేవ్యక్తికి ఇస్తున్నారని, దానిపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. సంతకవిటి మండలం మందరాడ నుండి టి.సురేష్ కుమార్ మాట్లాడుతూ తమ గ్రామానికి రేషన్ వాహనం ఏర్పాటుచేయాలని కోరారు. నందిగాం మండలం కణితివూరు నుండి కె.నరేష్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో టెక్కలిలో డిజిటల్ అసిస్టెంటుగా పనిచేసిన కాలానికి జీతభత్యాలు మంజూరుచేయలేదని ఫిర్యాదు చేసారు. కొత్తూరు మండలం పొన్నువూరు నండి వై.సంతోష్ కుమార్ ఫోన్ చేస్తూ తమ గ్రామంలోని 20 మంది రైతులకు మోటార్లు ఉన్నాయని, కాని మీటర్ కనెక్షన్లు లేవని వాటిని మంజూరుచేయాలని కోరారు. బూర్జ మండలం జంగాలపేట నుండి కె.సత్యం మాట్లాడుతూ ఫిబ్రవరి 2020 నుండి తనకు వృద్ధ్యాప్య పింఛను మంజూరుకావడంలేదని ఫిర్యాదు చేసారు.పొందూరు నుండి యం.పార్వతి మాట్లాడుతూ చేనేత కార్మికుల ఇళ్లకు రుణాలను మంజూరుచేయాలని కోరారు. శ్రీకాకుళం నగరంలోని దండి వీధి నుండి కె.సుదర్శనరావు మాట్లాడుతూ వృద్దాప్య పింఛను గత ఏడాది జూన్ మాసం నుండి మంజూరుచేసినప్పటికీ ఇంతవరకు పింఛను విడుదల కావడంలేదని ఫిర్యాదు చేసారు. ఆమదాలవలస మండలం లక్ష్ముడుపేట నుండి వై.రాజేష్ ఏ.పి.జి.వి.బి బ్యాంకు ద్వారా డ్వాక్రా రుణం మంజూరుచేయడం లేదని ఫిర్యాదు చేసారు.
దశాబ్దం పాటు ఎదురుచూస్తున్న అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి విస్తరణ పనులకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సమర్థవంతమైన కృషితో మోక్షం లభించింది. ప్రభుత్వం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి విస్తరణ పనులకు అవసరమైన స్థల సేకరణ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించడంతో ఆగమేఘాలపై ఆస్పత్రి విస్తరణ కోసం అవసరమైన స్థలాలను జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి సేకరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ ముందుండి నడిచి, జిల్లా యంత్రాంగాన్ని, అధికారులను నడిపించి జిల్లా వాసుల కలను నెరవేర్చేలా పని చేశారు. ప్రభుత్వ ఆస్పత్రి విస్తరణ పనులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో పదేళ్లపాటు ఎదురుచూస్తున్న కల సాకారం కానుంది. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బెడ్ల కెపాసిటీ 560 నుంచి 1200 పడకలకు విస్తరణ చేయాలని దశాబ్దకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నా కొన్ని రాజకీయ కారణాల వల్ల కదలిక లేని స్థితిలో ఆదేశాలు అందిన వెంటనే జిల్లా కలెక్టర్ అత్యంత సమర్థవంతంగా విస్తరణ పనుల కోసం అవసరమైన స్థలాలను వేగవంతంగా సేకరించారు. ప్రభుత్వ ఆదేశాలు అందిన వెంటనే అనతి కాలంలోనే వివిధ ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ పరిశీలించి ప్రభుత్వ ఆస్పత్రి విస్తరణ పనుల కోసం అవసరమైన 12.79 ఎకరాల స్థలాలను సేకరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఆస్పత్రి విస్తరణ కోసం ప్రభుత్వం అంగీకరించడంతో త్వరలో విస్తరణ పనులు మొదలు కానున్నాయి.
విస్తరణ కోసం 12.79 ఎకరాల ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను సేకరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు :
ప్రభుత్వ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న 7 ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను జిల్లా కలెక్టర్ అతి తక్కువ సమయంలో పరిశీలించి, జిల్లా యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించి విస్తరణ కోసం 12.79 ఎకరాలను సేకరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అందులో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఫైర్ స్టేషన్, మున్సిపల్ గెస్ట్ హౌస్, నెహ్రూ బాల్ భవన్, కమాండ్ కంట్రోల్ సెంటర్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీస్ బంగ్లా, డిఎంఅండ్హెచ్ఓ ఆఫీస్ ప్రాంతంలోని 4.47 ఎకరాలు, ఇరిగేషన్ కార్యాలయంలోని 3.82 ఎకరాలు, ఆర్ అండ్ బి ఆఫీస్ లోని 4.5 ఎకరాలు మొత్తం కలిపి 12.79 ఎకరాలను సేకరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రతిపాదనలు పంపిన అనంతరం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి విస్తరణకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంలో జిల్లా కలెక్టర్ కృషి ఎంతో ఉంది. జనరల్ ఆస్పత్రి విస్తరణకు సంబంధించి త్వరలోనే టెండర్లను ఆహ్వానించనున్నారు.
ఇప్పటికే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ప్రస్తుతం 8 లక్షల చదరపు అడుగులు ఉండగా, ఆస్పత్రి పరిసరాల్లోని 7 ప్రభుత్వ కార్యాలయాల్లో మరో 7 లక్షల చదరపు అడుగులలో విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపించడంతో ప్రభుత్వం విస్తరణ పనులకు అంగీకారం తెలపడం జరిగింది. ఇందుకు సంబంధించి 7 ప్రభుత్వ కార్యాలయాల భవనాలను త్వరలో ప్రభుత్వ ఆస్పత్రి విస్తరణ పనులకు అందజేయడం జరగనుంది.
ప్రభుత్వ ఆస్పత్రి విస్తరణ పనులకు స్థలాన్ని అందజేసిన 7 ప్రభుత్వ కార్యాలయాల భవనాల కోసం 52 కోట్ల రూపాయలతో ప్రత్యామ్నాయ స్థలాలలో భవనాలు నిర్మించేందుకు అంచనాలను జిల్లా యంత్రాంగం రూపొందించింది. అప్పటివరకు 7 ప్రభుత్వ కార్యాలయాల కార్యకలాపాలను నగరంలోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, సేవాసదన్ ( ఏపీ డెయిరీ)లో, వెటర్నరీ ఆఫీస్ న్యూ బిల్డింగ్ లో, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ న్యూ బిల్డింగ్స్, డిఆర్డిఏ ఆఫీస్, గిరిజన భవన్, రెడ్ క్రాస్ భవన్ లలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
అయితే 7 ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలను నిర్మించేందుకు నగరంలోని టీబీ హెచ్ఎల్సీ దగ్గర 5.6 ఎకరాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలన చేసి గుర్తించి నిర్ణయించడం జరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ఆయా ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మాణం కోసం స్థలాల అప్పగింత కార్యక్రమం త్వరలో జరగనుంది.
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బెడ్ల కెపాసిటీ 560 నుంచి 1200 పడకలకు విస్తరణ ;
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బెడ్ల కెపాసిటీ 560 నుంచి 1200 పడకలకు విస్తరణ చేపట్టనున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి ప్రతిరోజు 2 వేల నుంచి 2500 వరకు అవుట్ పేషెంట్ లు వస్తున్నారు. ఆస్పత్రిలో 200 నుంచి 250 మంది వరకు అడ్మిషన్లు, ప్రతి నెల 1000 వరకు డెలవరీలు, 400 వరకు సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతుండగా, ఆస్పత్రిలో మేజర్ సర్జరీలు 900 వరకు జరుగుతుంటాయి.
కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సమయంలో రాయలసీమలోని ఆస్పత్రులలో అవసరమైన వసతి సౌకర్యాలు తక్కువగా ఉండగా, జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులలో కూడా వసతి సౌకర్యాలు తక్కువగా ఉన్నా జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం లో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది. ప్రభుత్వ ఆస్పత్రి విస్తరణ పనులు చేపట్టి బెడ్ల కెపాసిటీ 560 నుంచి 1200 పడకలకు విస్తరణ చేపడితే అధునాతన వైద్య సదుపాయాలు రోగులకు అందించే వీలు కలుగుతుంది. ఇందుకోసం అవసరమైన స్థలాలను సేకరించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడంతో ఆస్పత్రి విస్తరణ పనులకు మార్గం సుగమమైంది. ఆస్పత్రి విస్తరణ వల్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్ల సంఖ్య కూడా 100 నుంచి 150 - 200 వరకు పెంచేందుకు అవకాశం ఏర్పడుతుంది. దశాబ్దం పాటు ఎదురు చూస్తున్న ఆస్పత్రి విస్తరణ పనులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి విస్తరణ పనులకు ఎంతగానో కృషి చేసిన జిల్లా కలెక్టర్ కు ప్రజలంతా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
అనంతపురం జిల్లాలో గతవారం జరిగిన దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 100వ జయంతి వేడుకల సందర్భంగా జిల్లా ఎన్నికల పరిశీలకులు (రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్) హర్షవర్ధన్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు నేతృత్వంలో పెన్నార్ భవన్ సముదాయాన్ని దామోదరం సంజీవయ్య భవన్ గా పేరు మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం నగరంలోని పెన్నార్ భవన్ ప్రవేశ ద్వారానికి మునిసిపల్ కార్పొరేషన్ వాహన నిచ్చెన సహాయంతో దామోదరం సంజీవయ్య భవన్ గా నామకరణం చేస్తూ బోర్డుపై జిల్లా ఎన్నికల పరిశీలకులు మరియు జిల్లా కలెక్టర్ లు ఒక అక్షరానికి లాంఛనంగా పెయింటింగ్ వేసి ప్రారంభించారు. అలాగే కార్యాలయపు గోడలపై భారత రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ మరియు గౌతమ బుద్ధుని చిత్రాలను పెయింటింగ్ వేసే కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ప్రహరీ గోడలను అందంగా తయారు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) గంగాధరగౌడ్, సాంఘిక సంక్షేమశాఖ శాఖ డి డి విశ్వ మోహన్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఇన్చార్జ్ యుగంధర్, సిపిఓ ప్రేమ్ చంద్, ఈ ఈ శివకుమార్, డి టి డబ్ల్యూఓ అన్నాదొర, మున్సిపల్ కమిషనర్ పి వి విఎస్ మూర్తి, సంక్షేమ శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు మరియు బీసీ కళాశాల విద్యార్థినివిద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో జరిగిన చివరి విడత పంచాయతీ ఎన్నికలలో 83.81 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలోని ఎచ్చెర్ల, జి.సిగడాం, రణస్థలం, గార, శ్రీకాకుళం, నరసన్నపేట, జలుమూరు, పోలాకి మరియు సారవకోట మండలాల్లో పోలింగ్ ఆదివారం ఉదయం 06.30గం.ల నుండి మధ్యాహ్నం 03.30గం.ల వరకు జరిగింది.ఈ ఎన్నికల్లో 9 మండలాల నుండి 83.81 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎచ్చెర్ల మండలంలో 85.08 శాతం, జి.సిగడాం మండలంలో 86.89, రణస్థలం మండలంలో 88.86, గార మండలంలో 80.43 శాతం, శ్రీకాకుళం మండలంలో 84.04 శాతం, నరసన్నపేట మండలంలో 80.70 శాతం, జలుమూరు మండలంలో 84.75, పోలాకి మండలంలో 81.60, సారవకోట మండలంలో 81.56 శాతం వెరశి 83.81 శాతం పోలింగ్ నమోదు అయింది. మొదటి విడత ఎన్నికల్లో 75.77 శాతం ఓటర్లు తమ ఓటును వినియోగించుకోగా, రెండవ విడతలో 72.87 శాతం, మూడవ విడతలో 80.13 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా గ్రామాల్లో ఓటు హక్కుపై అవగాహన పెరగడంతో తుది విడతలో 83.81 శాతానికి ఓట్లు పెరగడం విశేషం.