యానం పద్మశాలీ సేవా సంక్షేమ సంఘం ఆద్వర్యంలో శ్రీశ్రీశ్రీ భద్రవతి సమేత భావనాఋషి వారి కళ్యాణ మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. మాఘ శుద్ద సప్తమిని అత్యంత పవిత్ర దినంగా భావించే పద్మశాలీలు భావనాఋషి స్వామి వారి కళ్యాణం జరిపించడం ఆనవాయితి. అయితే యానం పద్మశాలీ సేవా సంఘం వారు బాల కామహః, పశు కామహః, యజ్ఞోమి కామహః, శ్రీయోమి కామహః అనే ధార్మిక నినాధంతో లోక కళ్యాణార్థం గత 81 సంవత్సరాలుగా విరామం లేకుండా స్వామి వారి కళ్యాణం జరిపిస్తూ వస్తున్నారు. స్వామివారి కళ్యాణ వేడుకలను ఒగ్గు భావణాఋషి అనంతలక్ష్మి దంపతులు జరిపించగా కాకినాడ పట్టణ పద్మశాలీ సంఘం స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి తూతిక శ్రీనివాస విశ్వనాథ్, కాకినాడ పద్మశాలీ సంఘం అద్యక్షులు పొన్నగంటి సత్యనారాయణ, అయితపూడి మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు, ఆదిమూలం కృష్ణ, అయ్యంకుల సత్తిబాబు అదిక సంఖ్యలో పద్మశాలీ సంఘీయులు పాల్గొన్నారు. అనంతరం అన్నసమారాదన కార్యక్రమం జరిపి భక్తులకు స్వామివారి ప్రసాద వితరణ చేసారు.
అరవెల్లిలోని శ్రీ సూర్య నారాయణస్వామి ఆలయంలో రథ సప్తమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. రథ సప్తమి ఏర్పాట్లను 18వ తేదీ ఉదయం పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ తో కలసి గురు వారం పరిశీలించారు. 80 ఫీట్ రహదారి వద్ద వాహనాల పార్కింగు స్ధలాన్ని పరిశీలించిన కలెక్టర్ , ఎస్.పి పి.స్.ఎన్.ఎం మిల్లు జంక్షన్ నుండి కలెక్టర్ కార్యాలయం దిశగా వెళ్ళునపుడు ఎడమ చేతి వైపు ఆటోలు, బస్సులు, కార్లు పార్కింగు చేయాలని, కుడి వైపున ద్విచక్ర వాహనాలు పార్కింగు చేయాలని సూచించారు. వి.వి.ఐ.పి కార్లను సన్ రైజ్ హోటల్ వరకు అనుమతించి అచ్చట నుండి ప్రోటోకాల్ వాహనంలో ఆలయం వరకు వి.వి.ఐ.పిలను దర్శనానికి తీసుకువెళ్ళడం జరుగుతుందని పేర్కొన్నారు. వి.ఐ.పిలు విధిగా పాస్ ను కలిగి ఉండాలని, పాస్ లు లేని వారిని అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేసారు. పాస్ లకు ముందుగా వివరాలను ఆర్.డి.ఓకు సమర్పించాలని సూచించామని, ఆ మేరకు వివరాలు వచ్చాయని చెప్పారు. వంద రూపాయలు, ఉచిత దర్శనం క్యూ లైన్సు ఇంద్ర పుష్కరిణి గుండా వెళుతుందని తెలిపారు. విరాళాలు ఇచ్చిన దాతలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఉదయం 10 గంటల వరకు వారికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. డిసిఎంఎస్ తోట వద్ద నుండి 5 వందల రూపాయల టికెట్ లైన్ ప్రారంభం అవుతుందని అన్నారు.
కోవిడ్ నిబంధనలు పాటించాలి : శ్రీ సూర్య నారాయణ స్వామి వారి ఆలయంలో రథ సప్తమి వేడుకలు గురు వారం రాత్రి 12 గంటల నుండి ప్రారంభం అవుతుందని కలెక్టర్ అన్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. కోవిడ్ వ్యాప్తి భారీన త్వరగా పడే ముప్పు ఉన్న దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధులు వంటి వారు దర్శనానికి రాకుండా ఇంటి వద్ద ఉండుటకు ప్రయత్నించాలని సూచించారు.
సాధారణ భక్తులు సైతం ప్రశాతంగా, చక్కటి దర్శనాన్ని పొందుటకు అన్ని ఏర్పాట్లు చేసామని, భక్తులు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ కోరారు. పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ మాట్లాడుతూ రథ సప్తమి వేడుకలకు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రశాంత వాతావరణంలో స్వామి వారి దర్శనం కావడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, రెవిన్యూ డివిజనల్ అధికారి ఐ.కిషోర్, డి.ఎస్.పి ఎం.మహేంద్ర, ఎన్.ఎస్.ఎస్.శేఖర్, శ్రీనివాస రావు, సి.హెచ్.శ్రీనివాస రావు., నగర పాలక సంస్ధ కమీషనర్ పి.నల్లనయ్య, ఆలయ ఇ.ఓ వి.హరి సూర్యప్రకాష్, తహశీల్దార్ వై.ఎస్.ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 21వ తేదీన చివరి విడతలో అమలాపురం డివిజన్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి మండల, డివిజనల్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి జేసీ (అభివృద్ధి) కీర్తి చేకూరి, జేసీ (సంక్షేమం) జి.రాజకుమారి తదితరులతో కలిసి కలెక్టర్.. వర్చువల్ విధానంలో అమలాపురం డివిజన్ గ్రామ పంచాయతీ ఎన్నికలపై జిల్లా, డివిజన్, 16 మండలాల ఎంపీడీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలను చూస్తే పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగినా.. కౌంటింగ్ ప్రక్రియలో కొంత జాప్యం జరుగుతోందని.. ఈసారి అలా కాకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. సరైన సమయానికి ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలా చూడాలని, కౌంటింగ్‌కు అవసరమైనన్ని టేబుళ్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. బ్యాలెట్ బాక్సులతో పాటు ఇతర ఎన్నికల సామగ్రికి కొరత లేకుండా చూసుకోవాలని, కోవిడ్-19 జాగ్రత్తలకు అవసరమైన థర్మల్ స్కానర్లు, మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సెన్సిటివ్ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి నివేదికలు పంపేలా ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా దాదాపు 20 శాతం రిజర్వ్ సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. స్థానిక పంచాయతీ సిబ్బందితో సమన్వయం చేసుకొని గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణ విధులకు హాజరయ్యే ఉద్యోగులకు రవాణా, ఆహారం, వసతి పరమైన ఏర్పాట్లలో లోటు లేకుండా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సమావేశంలో అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, డీపీవో ఎస్‌వీ నాగేశ్వర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి శ్రీ కపిలేశ్వర ప్రకృతి ఉద్యానవనం లో స్వర్ణిం విజయ్ వర్ష్ (గోల్డెన్ జుబ్లీ సెలెబ్రషన్స్ అఫ్ ఇండియన్ ఆర్మీ విక్టరీ ఓవర్ పాకిస్తాన్ ఆర్మీ ఇన్ 1971 వార్) లో భాగంగా ఆంధ్ర, తెలంగాణా సబ్ ఏరియా జి ఓసి మేజర్ జనరల్ ఆర్కే సింగ్ అధ్వర్యంలో అమర్ జవాన్స్ స్మారక స్తూపం వద్ద అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ గురువరం స్రద్ధాంజలి ఘటించారు. తొలుత ఆంధ్ర, తెలంగాణా సబ్ ఏరియా జి ఓసి మేజర్ జనరల్ కు స్వాగతం పలికారు. స్వర్ణిం విజయ్ వర్ష్ జ్యోతిని మేజర్ జనరల్ తీసుకున్నారు. అనంతరం మేజర్ జనరల్, తదితరులు అమర జవాన్స్ స్మారక స్తూపం వద్ద పూలు అర్పిత్ చేసారు. ఈ కార్యక్రమంలో బ్రిగేడియర్ జె.జె.ఎస్ బ్రిన్దర్, చిత్తూరు సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ ఏ వి రమణ మూర్తి, తిరుపతి ఎన్ సి సి గ్రూప్ కమాండర్ కల్నల్ గంగా సతీష్, తిరుపతి నగర పాలక సంస్థ అడిషనల్ కమీషనర్ హరిత, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఏపిఈపీడిసిఎల్ లో డైరెక్టర్ గా వున్న కె.రాజబాపయ్యను ఎఫ్ఏసిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ఇందనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ జిఓఆర్టీ నెంబరు 15ను ఈరోజు విడుదల చేశారు. ఇక్కడ సీఎండీగా ఉన్న ఎస్.నాగలక్ష్మిని మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇదేశాఖలో డైరెక్టర్ గా వున్న రాజబాపయ్యకు(ఎఫ్ఏసి) బాధ్యతలను అప్పగించింది. దీనితో ఉద్యోగులు ఆయనకు కార్యాలయంలో తమ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఫేజ్-3 ఎన్నికల్లో విజయనగరం జిల్లా చరిత్ర సృష్టించింది. జిల్లాలో బుధవారం జరిగిన పంచాయితీ ఎన్నికల్లో, రాష్ట్రంలోనే అత్యధికంగా 87.09 శాతం ఓటింగ్ నమోదయ్యింది. జిల్లాలో రెండో విడత ఎన్నికలు చెదురుమదురు సంఘటనలు మినహా స్వల్ప సంఘటనలు మినహా, ప్రశాంతంగా పూర్తయ్యాయి. అత్యధిక శాతం ఓటింగ్ నమోదు చేయడం ద్వారా విజయనగరం జిల్లా రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలిచింది. విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాల్లోని 9 మండలాల్లో ఈ విడత ఎన్నికలు జరిగాయి. మొత్తం 244 పంచాయితీలకు, 2330 వార్డులకు ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటిలో 37 సర్పంచ్ పదవులు, 610 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇవి పోగా 207 సర్పంచ్ పదవులు, 1719 వార్డులకు బుధవారం ఎన్నికలు నిర్వహించారు. నెల్లిమర్ల మండలం ఒమ్మి గ్రామంలోని 4వ వార్డు ఎన్నికను సాంకేతిక కారణాలతో వాయిదా వేశారు. ఎన్నికల కోసం డివిజన్ పరిధిలో 2,030 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
నిర్ణీత సమయం ఉదయం 6.30కే రెండోవిడత పోలింగ్ ప్రారంభమయ్యింది. అప్పటినుంచే ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్యూలైన్లలో బారులు తీరారు. పలుచోట్ల వృద్దులు, వికలాంగులు సైతం ఓటేయడానికి పోటీ పడ్డారు. ఉదయం 8.30 గంటలకు 15.30 శాతం ఓటింగ్ నమోదు కాగా, అక్కడినుంచి ప్రక్రియ మరింత ఊపందుకుంది. ఉదయం 10.30 గంటలకు ఓటింగ్ శాతం 50.70కు చేరుకుంది. ఆ తరువాత కూడా ఓటర్లలో అదే ఉత్సాహం కొనసాగింది. మధ్యాహ్నం 12.30 గంటలకు 78.50 శాతం నమోదయ్యింది. ఆ తరువాత కాస్త నెమ్మదిగా ఓటింగ్ సాగింది. మధ్యాహ్నం 2.30 గంటలకు 84.60 శాతం నమోదు కాగా, ఓటింగ్ ముగిసేటప్పటికి 87.09 శాతానికి చేరుకొని, జిల్లా చరిత్ర సృష్టించింది. అక్కడక్కడా స్వల్ప సంఘటనలు చోటుచేసుకున్నప్పటికీ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్‌పిలు సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవడంతో ప్రక్రియ సజావుగా పూర్తయ్యింది. జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల ఫలితంగా ఓట్ల లెక్కింపు కూడా సకాలంలో మొదలయ్యింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఉదయం 6 గంటలు నుంచే కమాండ్ కంట్రోల్ రూము ద్వారా ఎన్నికలను పర్యవేక్షించారు. జిల్లా ఎస్‌పి బి.రాజకుమారి, జాయింట్ కలెక్టర్లు డాక్టర్ జి.సిహెచ్. కిశోర్ కుమార్, డాక్టర్ ఆర్.మహేష్ కుమార్క్షే, నియోజక వర్గాల ప్రత్యేకాధికారులు, క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. ఎన్నికల అధికారులకు, సిబ్బంది కి ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేయడం ద్వారా ప్రశాంతంగా ఎన్నికలను పూర్తి చేశారు.
జిల్లా యంత్రాంగానికి అభినందనలు ః కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్
జిల్లాలో రెండో విడత పంచాయితీ ఎన్నికలు సజావుగా పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ తెలిపారు. ఈ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తి చేయడంతోపాటుగా, అత్యధిక శాతం ఓటింగ్‌ను నమోదు అవ్వడానికి కారణమైన ఎన్నికల అధికారులను, సిబ్బందిని, పోలీసు శాఖను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇందుకు సహకరించిన జిల్లా ప్రజలకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
అనంతపురం జిల్లాలోని అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో జరుగుతున్న మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో మధ్యాహ్నం 3.30 గంటల వరకు 80.29 శాతం పోలింగ్ నమోదయిందని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. బుధవారం ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధి నందు ఉన్న 19 మండలాలలోని 355 గ్రామ పంచాయతీలలో, 2619 వార్డులలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. పెద్ద వడుగూరు మండలం రావులుడికి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మరణించినందు వల్ల అక్కడ ఓటింగ్ జరగలేదని, అందువల్ల పోలింగ్ జరగాల్సిన గ్రామ పంచాయతీల సంఖ్య 356 నుండి 355 కు సంఖ్య తగ్గిందని తెలిపారు. అలాగే ఉరవకొండ గ్రామ పంచాయతీ మూడో వార్డు ఎన్నికలకు సంబంధించి పోటీ నుంచి తప్పుకున్న ఒక వ్యక్తికి గౌను గుర్తు కేటాయించి బ్యాలెట్ పేపర్లను ముద్రించడంతో వాయిదా అనివార్యమైందన్నారు. ప్రస్తుతం ముద్రించిన బ్యాలెట్ పేపర్లోని గౌను గుర్తు లేకుండా తిరిగి కొత్త బ్యాలెట్ పేపర్లను ముద్రించి ఫిబ్రవరి 21న జరగనున్న నాలుగో విడత ఎన్నికలలో మూడో వార్డుకు ఎన్నిక నిర్వహిస్తామన్నారు. అందువల్ల పోలింగ్ జరగాల్సిన వార్డుల సంఖ్య 2620 నుండి 2619 కు సంఖ్య తగ్గిందని తెలిపారు.
బుధవారం ఉదయం 6:30 గంటలకు గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మొదలు కాగా, ఉదయం 7:30 గంటలకు అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని 19 మండలాల పరిధిలో 5.13 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. 8:30 గంటలకు 15.14 శాతం, 9:30 గంటలకు 32.21 శాతం, 10:30 గంటలకు 48.15 శాతం, 11:30 గంటలకు 61.25 శాతం, మధ్యాహ్నం 12:30 గంటలకు 70.23 శాతం, 1:30 గంటలకు 75.58 శాతం, 2:30 గంటలకు 78.32 శాతం, 3:30 గంటలకు 80.29 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. ఇందులో 6,03,927 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.
ప్రశాంతంగా మూడవ విడత పోలింగ్ :
జిల్లాలోని అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని 19 మండలాల పరిధిలో జరిగిన మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా, విజయవంతంగా జరిగిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పోలింగ్ సజావుగా పూర్తయిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. సాఫీగా, సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల బందోబస్తు చర్యలు తీసుకోవడం, ఎన్నికల అధికారులకు, సిబ్బందికి, ఓటర్లకు అవసరమైన అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పించడంతో మూడవ విడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరిగిందన్నారు.
మూడవ విడత పోలింగ్ విజయవంతంపై ఎన్నికల అధికారులకు, పోలీస్ సిబ్బందికి జిల్లా కలెక్టర్ అభినందనలు :
ఈ సందర్భంగా మూడవ విడతలో అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించడం పట్ల ఎన్నికల అధికారులు, సిబ్బందికి, పటిష్టమైన బందోబస్తు నిర్వహించిన పోలీసు సిబ్బందికి, మండల, డివిజనల్, జిల్లా స్థాయి ఎన్నికల సిబ్బంది కి, నోడల్ అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో జరిగిన ఎన్నికల విజయవంతంకు ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి పనిచేశారని జిల్లా కలెక్టర్ అభినందించారు. మూడవ విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, జిల్లాలో మరో దశలో పెనుగొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో జరగనున్న పోలింగ్ ను కూడా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.
విజయనగరం డివిజన్ లో 3వ విడతలో 9 మండలాలలో బుధవారం జరిగిన పంచాయితీ ఎన్నికలలో 87.09 శాతం ఓటింగ్ నమోదు జరిగిందని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ వెళ్లడించారు. ఉదయం 6.30 గంటలకే పోలింగ్ బూత్ ల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూలైల్లో వున్నారని అన్నారు. బుధవారం కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి కలెక్టర్ పోలింగ్ సరళిని, కౌటింగ్ ను వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో జరిగిన చిన్న చిన్న సంఘటనల పట్ల అప్పటికప్పుడే స్పందిస్తూ అధికారులకు, పోలీసులకు తగు సలహాలు, సూచనలు జారీ చేయడమైనదని, ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని వివరించారు. కౌటింగ్ కూడా త్వరగా పూర్తయ్యేలా ఏర్పాట్లను చేసుకోవాలని పోలింగ్ అధికారులకు ఆదేశించడం జరిగిందన్నారు. సంయుక్త కలెక్టర్లు డా. జి.సి.కిషోర్ కుమార్, డా.మహేష్ కుమార్ క్షేత్రస్థాయిలో పోలింగ్, కౌటింగ్ ప్రక్రియను పరిశీలించి సజావుగా జరిగేలా చూసారు. సంయుక్త కలెక్టర్ కిషోర్ కుమార్ మధ్యాహ్నం కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించారు.
3వ విడత పోలింగ్ లో మెరకముడిదాం, చీపురుపల్లి, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ, విజయనగరం 9 మండలాలలో 3 లక్షల 60 వేల 181 మంది ఓటర్ల వుండగా ఓటింగ్ ముగిసే సమయానికి 3 లక్షల 13 వేల 679 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8.30 గంటలకు 15.3 శాతం, 10.30 గంటలకు 50.7 శాతం, 12.30 గంటలకు 78.5 శాతం, 2.30 గంటలకు 84.6 శాతం నమోదు కాగా పోలింగ్ ముగిసే సమయం 3.30 గంటలకు 87.09 శాతం నమోదైనట్లు కలెక్టర్ తెలిపారు. అత్యల్పంగా గరివిడి మండలంలో 81.83 శాతం నమోదు కాగా, అత్యధికంగా 91.43 శాతం నెల్లిమర్ల మండలంలో నమోదయిందని తెలిపారు.
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి మార్చి 14న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సన్నద్ధతా చర్యల్లో భాగంగా కౌంటింగ్ ప్రక్రియకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ మురళీధర్‌రెడ్డి కాకినాడలోని జేఎన్‌టీయూను సందర్శించి, అక్కడి కౌంటింగ్ కేంద్రంలో చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. మార్చి 17న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు తగినన్ని టేబుళ్లను ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్ కేంద్రం వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. విద్యుత్ సౌకర్యానికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు, కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ తదితరులు ఉన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికలలో, 9 మండలాల పరిధిలో, 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో, సుమారు 2 లక్షల 90 వేల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ జె. నివాస్ మాట్లాడుతూ, ఈ రోజు 298 సర్పంచ్ స్థానాలకు గాను 248 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 588 మంది అభ్యర్థులు పోటీలో వున్నారని తెలిపారు. వార్డులకు సంబంధించి, 2648 వార్డులకు గాను 1706 వార్డుల్లో ఎన్నికలు, 3771 మంది అభ్యర్థులు పోటీలో వున్నారు. ఉదయం 6.30 గం. ల కు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైనదని చెప్పారు. వెబ్ క్యాస్టింగ్ ద్వారా 175 పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ముందుగానే సిబ్బందిని తరలించినట్లు తెలిపారు. అక్కడ జె సి పర్యవేక్షణ చేస్తారు. భద్రతా ఏర్పాటు చేసాం, ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసామని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో మూడవ విడతలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం పోలింగ్ సరళిని పరిశీలించిన జె.సి ఆమదాలవలస మండలం తోగరాంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ జిల్లాలోని 9 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రతీ కేంద్రంలో సాఫీగా జరుగుతున్నట్లు వివరించారు. గడచిన రెండు దశల్లో ఓటర్లు వలసలు వెళ్లిపోవడంతో 78 శాతం వరకే పోలింగ్ నమోదైందని, ప్రస్తుతం ప్రతీ కేంద్రంలో 85 శాతం వరకు పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో కూడా గడచిన రెండు దశల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పారు. ప్రస్తుతం మూడవ దశలో కూడా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నట్లు తెలిపారు. వి.ఆర్.ఓ, గ్రామ కార్యదర్శిల ద్వారా గ్రామాల్లో ఓటు వినియోగంపై అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ఎక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తిన తక్షణమే పరిష్కారం అయ్యేలా పటిష్ట ఏర్పాట్లు చేశామని జె.సి చెప్పారు.