నాడు నేడు పనులు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశించారు. నాడు నేడు పనుల ప్రగతిపై మండల అధికారులతో జిల్లా కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. పనులు త్వరగా పూర్తి చేసి పాఠశాలలను సిద్ధం చేయాలని స్పష్టం చేసారు. ఇంకా పనులు జాప్యం కారాదని ఆయన అన్నారు. 1216 పాఠశాలల్లో పనులు ఇప్పటికే చేపట్టగా 536 పాఠశాలల్లో మరమ్మతులు పూర్తి కాలేదని అన్నారు. 880 గ్రీన్ చాక్ బోర్డులు, 440 టివిలు అందుబాటులో ఉన్నాయని వాటిని వారం రోజుల్లో బిగించి నివేదిక సమర్పించాలని పేర్కొన్నారు. టివిలు బిగించడం వలన ఇంగ్లీషు లాబ్ లు సిద్దం కాగలవని పేర్కొన్నారు. 120 పాఠశాలల్లో తాగునీటి సరఫరా సామగ్రి తక్షణం బిగించాలని ఆదేశించారు. మేజర్, మైనర్ మరమ్మతులు, మరుగుదొడ్ల పనులు విధిగా పూర్తి చేయాలని ఆయన తెలిపారు. పూర్తి చేసిన పనుల వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ కనెక్షన్లు, పెయింటింగ్ వివరాలు అప్ లోడ్ చేయాలని అన్నారు. ఈ వీడియో సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, సహాయ కలెక్టర్ ఎం.నవీన్, జిల్లా విద్యాశాఖ అధికారి కె.చంద్రకళ, పంచాయతీ రాజ్ ఎస్ఇ భాస్కరరావు, గృహ నిర్మాణ సంస్థ పిడి టి.వేణుగోపాల్, ఇడబ్ల్యుఐడిసి ఇఇ కె.భాస్కరరావు, సమగ్ర శిక్షా అభియాన్ ఎపిసి పివి రమణ, ఇఇ వి.వెంకట కృష్ణయ్య, గృహ నిర్మాణ సంస్థ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.
కెజిబివి పాఠశాల విద్యార్ధినులకు వన్ స్టాప్ సెంటర్ ద్వారా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం,సింగుపురం కెజిబివి పాఠశాల విద్యార్ధినులకు బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, కిడ్నాప్, డొమెస్టిక్ వయెలెన్స్, తదితర అంశాలపై వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ అవగాహన కల్పించారు. బాల్య వివాహాల వలన ఆడపిల్లల ఆరోగ్యం పాడవుతుందని, పిల్లలు బలహీనంగా పుడతారని తెలిపారు. ఆడపిల్లల చదువు మధ్యలో ఆగిపోవడం జరుగుతుందని చెప్పారు. బాల్య వివాహాలపై ఫోన్ నెం.1098 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పారు. ప్రేమ పేరుతోను, ఉద్యోగాలు ఇప్పిస్తామని అమ్మాయిలను మోసం చేసి వేరే రాష్ట్రాలకు అమ్మడం చేస్తున్నారని, అమ్మాయిలు చాలా జాగ్రత్తగా వుండాలని తెలిపారు. తల్లితండ్రులు, ఉపాధ్యాయుల అనుమతి లేకుండా పరిచయం లేని వ్యక్తులతో పిల్లలు ఎక్కడకీ వెళ్ళరాదని తెలిపారు. అనంతరం, పోస్కో చట్టంపై అవగాహన కలిగించారు. 18 సం.లలోపు అమ్మాయిలను ప్రేమ పేరుతో పెళ్ళి చేసుకోవడం వలన పోస్కో చట్టం ద్వారా జైలు శిక్షను వేయడం జరుగుతుందని తెలిపారు. వన్ స్టాప్ సెంటర్ లో కౌన్సిలింగ్ చేయడం జరుగుతుందని, అవసరమైన వారికి పోలీసు సాయం, న్యాయ సహాయం, వైద్య సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. వన్ స్టాప్ సెంటర్ కు ఆశ్రయానికి వచ్చిన వారికి స్వధార్ హోమ్, స్టేట్ హోమ్ నందు ఆశ్రయం కల్పించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ వై.హిమబిందు, కెజిబివి ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో ఈ నెల 21న జరగనున్న ఆఖరి దశ పంచాయతీ ఎన్నికల్లో అధికారులంతా ఉత్సాహంగా పాల్గొనాలని.. ప్రశాంత ఎన్నిక నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ పేర్కొన్నారు. 17వ తారీఖున జరిగిన మూడో దశ ఎన్నికల మాదిరిగానే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని, నాడు పాటించిన పంథానే కొనసాగించాలని సూచించారు. తప్పులు, పొరపాట్లు పునరావృతం కాకుండా అధికారులంతా సమన్వయంతో వ్యవహరించి ఎన్నిక ప్రక్రియను, లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో ఈ నెల 21న బొండపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, గంట్యాడ, జామి, కొత్తవలస, ఎల్.కోట, ఎస్.కోట, మెంటాడ, వేపాడ మండలాల పరిధిలో జరగనున్న పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్షించేందుకు ఆయా మండలాల ఎంపీడీవోలు, తహశీల్దార్లు, ప్రత్యేక అధికారులతో కలెక్టర్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రతి మండల కేంద్రంలో సహాయ కేంద్రాన్ని, కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసుకొని ఎన్నికను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అధికారులందరూ సమన్వయంతో వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా జాగ్రత్త పడాలని చెప్పారు. ఎన్నికల విధులకు ఎవరూ గైర్హాజరు కావడానికి వీలులేదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే ఇటీవల జరిగిన రెండు దశల ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ఉద్యోగులకు కాస్త వెసులు బాటు ఇవ్వాలని ఆయా మండలాల ఆర్వోలకు సూచించారు. ఆయా ఆర్వోలు విచక్షణా అధికారాలను ఉపయోగించి నిర్ణయం తీసుకోవచ్చని, ఒక వేళ సిబ్బంది తగినంత మంది అందుబాటులో ఉంటే ఇది వరకు రెండు దశల్లో పనిచేసిన సిబ్బందిని రిజర్వులో ఉంచుకోవచ్చని చెప్పారు. అలాగే సిబ్బందికి భోజన వసతి తప్పకుండా కల్పించాలని, సిబ్బంది తరలింపు విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు.
ఎన్నికల నిబంధలన ప్రకారం అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ ప్రక్రియ మొదలవ్వాలని ఆదేశించారు. పోలింగ్ ముగిసిన అనంతరం బాక్సులకు సీల్ వేసి, 4.00 గంటలకి లెక్కింపు మొదలు పెట్టేయాలని, రాత్రి 10.00 గంటల లోపు ఫలితాలు వెల్లడించాలని చెప్పారు. ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి కంట్రోల్ రూమ్‌కు నివేదించాలని సూచించారు. ఎన్నిక ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రక్రియను త్వరగా సజావుగా నిర్వహించేలా ఆయా ఆర్వోలు తగిన ముందస్తు ప్రణాళిక రచించుకోవాలన్నారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రాత్రి 10.00 గంటలకు లోపే ఫలితాలను అందజేయాలని చెప్పారు. గంట గంటకు పోలింగ్ శాతాన్ని జిల్లాపరిషత్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలని ఆర్వోలను ఆదేశించారు. ఎన్నిక రోజంతా కమాండ్ కంట్రోల్ రూమ్‌లో జేసీ మహేష్ కుమార్ అందుబాటులో ఉంటారని, ఎన్నిక ప్రక్రియను పరిశీలిస్తారని తెలిపారు. అలాగే ఎలాంటి సమస్య వచ్చినా సొంత నిర్ణయాలు తీసుకోకుండా తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందుగానే పోలీసుల సహకారం తీసుకోవాలని, పరిస్థితి చేయిదాటకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. గొడవలు జరగకుండా చూసుకోవాలని, వీడియో రికార్డింగ్ చేయాలని చెప్పారు. ప్రత్యేక అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
మళ్లీ మళ్లీ కౌంటింగ్ వద్దు...
జేసీ కిశోర్ కుమార్ మాట్లాడుతూ పలు కేంద్రాల్లో ఫలితాల వెల్లడి ఆలస్యం కావడానికి రీ కౌంటింగ్ కారణంగా కనబడుతుందని, ఎన్నికల నిబంధనలను అనుసరించి దీన్ని పరిష్కరించాలని సూచించారు. ఎన్నికల నియమావళి ప్రకారం సింగిల్ డిజిట్‌లో ఓట్లు తేడా వస్తేనే రీ కౌంటింగ్ చేయాలని, ఒక వేళ డబుల్ డిజిట్‌లో ఓట్లు తేడా వస్తే రీ కౌంటింగ్ చేపట్టనవసరం లేదని పేర్కొన్నారు. ఒక వేళ రీ కౌంటింగ్ చేయాల్సి వస్తే ఒక సారి మాత్రమే అలా చేయాలని, మళ్లీ మళ్లీ రీ కౌంటింగ్ చేయవద్దని జేసీ స్పష్టం చేశారు. అధికారులు ఓర్పుతో సహనంతో వ్యవహరించాలని సూచించారు.
సమావేశంలో డీపీవో సునీల్ రాజ్ కుమార్, సీపీవో విజయలక్ష్మి, డీఎల్‌డీవో రామచంద్రరావు, పలువురు ప్రత్యేక ఉప కలెక్టర్లు, ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
1.30 గంటలకే పోలింగ్ ముగిసే కేంద్రాలు
ఈ దఫా ఎన్నికల్లో నాలుగు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించారు. ధారపర్తి, లోతుగెడ్డ, కూనేరు, కొండలింగాల వలస గ్రామాల్లో పోలింగ్ మధ్యాహ్నం 1.30 గంటల వరకే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో 2.00 గంటలకే లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు.
21న ఒమ్మి పంచాయతీలో వార్డుకు ఎన్నిక
ఈ నెల 17వ తేదీన సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన నెల్లిమర్ల మండలంలోని ఒమ్మి పంచాయతీలో నాలుగో వార్డు ఎన్నిక ఈ నెల 21న నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా. ఎం. హరిజవహర్ లాల్ స్పష్టం చేశారు. దానికి తగిన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయగలిగామని సమీకృత గిరిజనాభివృధ్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి డా. వెంకటేశ్వర్ సలిజామల పేర్కొన్నారు.శుక్రవారం స్దానిక కాఫీ హౌస్ సమావేశ మందిరంలో ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ముందు చూపు,చొరవతో మన్యంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పెద్ద ఎత్తున కసరత్తు చేసారన్నారు. ప్రతీ మండలాలనికి ప్రత్యేకాధికారులను నియమించారన్నారు. అదేవిధంగా నలుగురు ఐ ఎస్ అధికారులను ఏజెన్సీకి పంపించి నిత్యం పర్యవేక్షించేలా ఆదేశించారన్నారు. పోలీసులు చేపట్టిన మూడంచల భద్రతా చర్యలు,బందోబస్తు ఏర్పాట్లు చేసిన చింతపల్లి ఎస్ ఎస్‌పి విద్యాసాగర్‌నాయుడు, పాడేరు డి ఎస్ పి విబి రాజ్‌కమల్ సేవలు,పోలీస్ సిబ్బంది సేవలను కొనియాడారు. రెవెన్యూ, మండల అభివృధ్ది అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారి పి ఎస్ కుమార్ సేవలను గుర్తించి అభినందించారు. పాడేరు ఆర్ డి ఓ కె. లక్ష్మి శివ జ్యోతి మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సహకారంతో మైదాన ప్రాంతంతో పోలిస్తే మన్యంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో విజయవంతంగా పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసామని అధికారులను అభినందించారు. ఈ సమావేశంలో చింతపల్లి ఎస్ పి విద్యాసాగర్ నాయుడు, డి ఎస్‌పి రాజ్‌కమల్, డి ఎల్ పి పి ఎస్ కుమార్, ఐటిడి ఏ పరిపాలనాధికారి కె. నాగేశ్వరరావు, 11 మండలాల తాహశీల్దారులు, ఎంపిడి ఓలు తదితరులు పాల్గొన్నారు.
విశాఖలోని కొత్తవెంకోజిపాలెం జీవీఎంసీ 15వ వార్డ్ నడింపల్లి రేవతి కృష్ణంరాజు ఆధ్వర్యంలో టిడిపి కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. శుక్రవారం విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, విశాఖ తూర్పు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు విజయ్ కుమార్ పార్టీలోకి చేరిన కార్యకర్తలను, నాయకులను సాదరంగా ఆహ్వానించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఎనలేని అభిమానమని, ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే తమను పార్టీలోకి చేరేలా చేశాయని వారంతా అన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చూసి తామంతా చైతన్యవంతం అయ్యామన్నారు. ఈరోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివ్రుద్ధికి కొత్తవెంకోజి పాలెంలో శక్తివంచన లేకుండా పనిచేసి వార్డు కార్పొరేటర్ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామని యువత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు వైఎస్సార్సీపీ యువత, నాయకులు పాల్గొన్నారు.
నాల్గవ విడత గా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోలింగ్ పగడ్బందీగా, ఓట్ల లెక్కింపు పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన విశాఖపట్నం రెవెన్యూ డివిజన్ లోని ఆరు మండలాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంత వరకు జరిగిన మూడు విడతలను విజయవంతంగా నిర్వహించామన్నారు. అప్పటికంటే ఈసారి ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు. అధికారులందరూ సమిష్టిగా సమన్వయంతో పని చేసినట్లైతే జిల్లాలో ఎన్నికలు విజయవంతంగా ముగుస్తాయన్నారు. పోలింగ్ అధికారులు ఎన్నికలు నిర్వహించే క్రమంలో గ్రామంలో ఎవరితో కూడా మాట్లాడ రాదన్నారు. ఎన్నికల నిర్వహణ, పై అధికారులకు రిపోర్టులు సమర్పించడంలో, ఆదేశాలను పెడచెవిన పెట్టినట్లయిన తీవ్ర చర్యలు తప్పవన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక వసతులు ఉండాలన్నారు. ఓట్ల లెక్కింపు కు సంబంధిత రిటర్నింగ్ అధికారులు ప్రణాళిక ప్రకారం ముందస్తు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమస్యాత్మక కేంద్రాలలో ఓట్ల లెక్కింపును తప్పక వీడియోగ్రఫీ చేయించాలన్నారు. సూక్ష్మ పరిశీలకులు, వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలు వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాల్గొనే సిబ్బంది అందరికీ మంచి భోజనం, అల్పాహారం సరఫరా చేయాలన్నారు.
పోలింగ్ కౌంటింగ్ లను గూర్చిన రిపోర్టులు ఎప్పటికప్పుడు వేగంగా స్పష్టంగా కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలన్నారు. అన్ని రిపోర్టుల పై సంతకం తప్పనిసరిగా ఉండాలని, పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియలో ఏమైనా సంఘటనలు జరిగినట్లయితే వెంటనే తెలియజేయాలని ఆదేశించారు. లెక్కింపు చేసేటప్పుడు వేగంగా కచ్చితత్వంతో చేయాలన్నారు. రీకౌంటింగ్ చేయవలసి వస్తే నియమ నిబంధనల ప్రకారం తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
డ్యూటీ వివరాలు తెలిపే ప్రత్యేక యాప్..
మన జిల్లాలో ఎన్నికల సిబ్బంది తాము పని చేయవలసిన కేంద్రం గూర్చి తెలుసు కునేందుకు నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (NIC) వారు ప్రత్యేక యాప్ ను రూపొందించారని కలెక్టర్ తెలియజేశారు. పోల్ పార్టీ కోడ్ ను సదరు యాప్ లో ఎంటర్ చేయగానే తాము ఏ గ్రామానికి కేటాయించబడింది తెలుస్తుందని చెప్పారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, జిల్లా పరిషత్ సీఈవో నాగార్జునసాగర్ , డి ఆర్ డి ఏ పి డి వి.విశ్వేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి కృష్ణకుమారి పాల్గొనగా జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో అనంతపురం జిల్లా ముందు వరుసలో ఉంటుందని మరోసారి రుజువైంది. తాజాగా కేంద్రం ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ అవార్డు సొంతం చేసుకుని జిల్లా సత్తా చాటింది. పీఎం కిసాన్ పథకం ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవంతో పాటు పథకం అమలులో ముందు వరుసలో ఉన్న జిల్లాలకు అవార్డులు ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా పీఎం కిసాన్ లో లబ్ధిదారుల ఫిజికల్ వెరిఫికేషన్ విభాగంలో జిల్లాకు అవార్డు వరించింది. పీఎం కిసాన్ పథకానికి అర్హులైన వారిలో 28,505 మంది రైతుల వెరైఫికేషన్ ను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. జాతీయ స్థాయిలో మరే జిల్లాలోనూ లేని విధంగా 99.60 శాతం రైతుల వెరిఫికేషన్ పూర్తి చేయడంతో జిల్లాకు అవార్డు దక్కింది. జిల్లాకు అవార్డు రావడంపై జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆనందం వ్యక్తం చేశారు. అక్షర క్రమంలో ముందు వరుసలో ఉన్న అనంతపురము జిల్లా అభివృద్ధి, సంక్షేమంలోనూ ముందు వరుసలో ఉంటుందని మరోసారి నిరూపితమైందన్నారు. గతంలో కిసాన్ రైలు వంటి కార్యక్రమానికి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు దక్కిందని, ఇప్పుడు వ్యవసాయ రంగంలోనే మరో అవార్డు దక్కడం ద్వారా రైతుల కోసం జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి దేశ వ్యాప్త గుర్తింపు దక్కినట్టయిందన్నారు. ఫిబ్రవరి 24న న్యూఢిల్లీ పుసా భవనంలో నిర్వహించనున్న పీఎం కిసాన్ వార్షికోత్సవ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులతో కలిసి కలెక్టరు అవార్డు స్వీకరించనున్నారు.
కోవిడ్ వ్యాక్సిన్ రెండవ డోసు తీసుకున్న పదిహేను రోజుల తర్వాత నుంచి మాస్కు వాడాల్సిన అవసరం వుండదని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్.వి.రమణ కుమారి వెల్లడించారు. జిల్లాలో మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారంతా 28 రోజుల తర్వాత తప్పనిసరిగా రెండో డోసు తీసుకోవాలన్నారు. రెండో డోసు తర్వాత ఎవ్వరికీ మాస్కు వాడాల్సిన అవసరమే వుండదన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించి ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు. ఇది పూర్తి సురక్షితమైన టీకా అన్నారు. వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న ప్రతి ఒక్కరికీ ఆన్ లైన్ ధృవపత్రం కూడా జారీచేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఫోటోతో వున్న ధృవపత్రాన్నిఆమె ప్రదర్శించారు.
స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ నేతృత్వంలో యూనియన్ గౌరవ సలహాదారులు నాగనబోయిన నాగేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం భగవంతుని సన్నిధానములో జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసోసియేషన్ కు కార్యాలయం ఏర్పాటు చేయడం శుభపరిణామం అన్నారు. వర్కింగ్ జర్నలిస్టులకు మరింత సంక్షేమం అందించే విధంగా భవిష్యత్తులో అసోసియేషన్ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ, వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే ద్యేయంగా ఎస్.సి.ఆర్.డబ్ల్యూ. ఏ పనిచేస్తుందని అన్నారు. నూతనంగా ప్రారంభించిన కార్యాలయంలో జర్నలిస్టులకు ఉపయోగపడే విధంగా ఇంటర్నెట్, కంప్యూటర్ల సౌకర్యంను ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా జర్నలిస్టుల వృత్తిలో నైపుణ్యతను పెంపొందించేందుకు శిక్షణ తరగతులను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. గ్రేటర్ విశాఖ పరిధిలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరికి సంక్షేమం అందేంచే విధంగా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో
అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కర్రి సత్యనారాయణ(సత్య),కార్యదర్శి నక్కాన అజయ్ కుమార్ యాదవ్,ఉపాధ్యక్షులు కాళ్ల సూర్య ప్రకాష్(కిరణ్),రామకృష్ణ, కార్యవర్గ సభ్యులు జి.వి.సాగర్, నవగాని శరత్, వల్లీ,చందు తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు నగరంలోని అన్ని శానిటరీ డివిజన్లల్లో ప్రతి రోజు తెల్లవారుజామునే నిర్ధేశించిన సమయంలోపే విధులకు వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు హాజరుపట్టికను వేయాలని నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ వార్డు శానిటరీ కార్యదర్శులు, శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఉదయం మూడవ శానిటరీ డివిజన్ పరిధిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి రోజు పాతబస్తీ జిమ్మిచెట్టు వద్ద మష్టర్ ప్రక్రియ(మష్టర్ అనగా కార్మికులకు హాజరు వేయడం, వారికి రోజూ వారి పారిశుద్ధ్య పనుల అప్పగింత) జరుగుతుంది. ఇందులో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు కర్నూలు నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ పాతబస్తీ జమ్మిచెట్టు వద్ద వార్డు శానిటరీ కార్యదర్శులు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఈ ప్రక్రియ ఎలా నిర్వహిస్తున్నారు? పారిశుద్ధ్య కార్మికులకు సమయానికి హాజరు వేస్తున్నారా లేదా అని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డివిజన్లల్లో జరిగే డ్రైనేజీ పూడికతీత పనులను ఎప్పటికపుడు రికార్డుల్లో నమోదు చేయాలని, అలాగే సంబంధిత శానిటరీ సిబ్బంది వాటిపై డిసిల్ట్ చేసినట్లు స్థానికల నుంచి సంతకాలను పెట్టించుకోవాలని సూచించారు.
విజయనగరం జిల్లాలో మార్చ్ నెల 10న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు. శుక్రవారం అయన ఛాంబర్ లో మున్సిపల్ కమీషనర్ల తో ఎన్నికల ఏర్పాట్ల పై సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పట్నుంచే చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది ఎంత మంది అవసరం అవుతారో అంచనా వేసి ఎన్.ఐ.సి కి లేఖ పంపలన్నారు. ఎన్నికల పరిశీలకుల కోసం వాహనాలను, లైజెన్ అధికారులను, భోజన, వసతి ని చూసేందుకు సమర్ధులైన వారిని నియమించాలని అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులను నియమించుకోవాలని, వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లు చేయాలనీ సూచించారు. కౌంటింగ్ కోసం సి.సి కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. షెడ్యూల్ ప్రకారంగా ప్రతి అంశాన్ని క్సున్నంగా పరిశీలించి ముందస్తు ప్రణాళికలను వేసుకోవలన్నారు. ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్ డా. మహేష్ కుమార్, సహాయ కలెక్టర్ సింహాచలం, విజయనగరం కార్పొరేషన్ కమీషనర్ వర్మ, బొబ్బిలి, పార్వతీపురం, నెల్లిమర్ల, సాలూరు మున్సిపల్ కమీషనర్లు ఎం.మల్లయ్య నాయుడు, కనక మహలక్ష్మి, పి. అప్పల నాయుడు, పి.వ.రమణ మూర్తి తదితరులు హాజరయ్యారు.
ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, దక్షిణ భారత సమాఖ్య విశాఖపట్నం బ్రాంచ్, 2021-22 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు విశాఖలో జరిగిన నూతన కార్యవర్గ ఎన్నికల్లో బ్రాంచ్ చైర్మన్ గా సిఎ. ఎస్. మురళీ కృష్ణ, వైస్ చైర్మన్ గా, కోశాధికారిగా సిఎ. జి. వాసుదేవ మూర్తి , సెక్రటరీగా సిఎ. ప్రశాంత్ కుమార్ పండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విద్యార్థుల సమాఖ్య అధ్యక్షులుగా సిఎ. ప్రశాంత్ కుమార్ పండా నియమితులయ్యారు. కార్యవర్గసభ్యులుగా సీఎ. వి.రామ ప్రసాద్, సీఏ. వై.సూర్యచంద్ర రావు, సీఏ. ఎం చలపతి రావు, సీఏ. జి భారతి దేవి కొనసాగుతారు. ఈ సందర్భంగా చైర్మన్ సీఏ. మురళీ కృష్ణ మాట్లాడుతూ, తన కార్యాచరణ ప్రణాళికలో ఛార్టర్డ్ అకౌంటెంట్స్ కు ఉపయోగపడే పలు సదస్సులు, జి ఎస్ టి పన్నుపై పలు అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని, సీఏ విద్యార్థులకు పలు కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రజల కోసం కూడా అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఆంధ్రా యూనివర్శిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి కృష్ణ మోహన్ మోహన్ గారు. గౌరవ అతిధి గా సీఏ. సి.వి. ఎస్.మూర్తి, గౌరవనీయు అధ్యక్షులుగా జాతీయ కార్యవర్గ సభ్యులు,ఎక్సఫీసియో సభ్యులు సీఏ. డి.ప్రసన్నకుమార్ హాజరయ్యారు.
రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యప్రభ వాహనసేవలో టిటిడి శ్రీవేంకటేశ్వర బాలమందిరంలో చదుకుంటున్న 130 మంది విద్యార్థులు ఆలపించిన 'ఆదిత్యహృదయం', 'సూర్యాష్టకం' సంస్కృత శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తర మాడ వీధిలోకి సూర్యప్రభ వాహనం వచ్చిన అనంతరం విద్యార్థులు లయబద్ధంగా శ్లోకాలు ఆలపించారు. ఐదేళ్లుగా బాలమందిరం విద్యార్థులు శ్లోకాలు ఆలపిస్తున్నారు. గతంలో జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల్లోనూ విద్యార్థులు శ్రీనివాసగద్యం తదితర సంస్కృత శ్లోకాలు ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు. టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి ఈ శ్లోక పారాయణంలో పాల్గొన్నారు.
విజయనగరం డివిజన్లో ఈ నెల 21 న జరగనున్న పంచాయతి ఎన్నికల పోలింగ్ సిబ్బందికి 3వ రాండమైజేషణ్ ద్వారా శుక్రవారం పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. ఎన్.ఐ.సి లో వ్యయ పరిశీలకులు సందీప్ కృపాకర్, జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ ఈ రాండమైజేషణ్ ద్వారా పోలింగ్ అధికారులను , అదర్ పోలింగ్ అధికారులను , రిజర్వు సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు కేటాయించారు. 4వ దశ లో దత్తిరాజేరు, మెంటాడ, గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ, ఎస్.కోట, వేపాడ, ఎల్.కోట, జామి, కొత్తవలస 10 మండలాల్లో జరగ నున్న 2793 పోలింగ్ కేంద్రాలకు గాను 6222 మందిని నియమించారు . 342 మందిని రిజర్వ్ లో ఉంచారు. మరో 309 మందిని రిజర్వు లో నియమించారు. వీరందరికీ వెంటనే ఉత్తర్వులను అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమం లో సంయుక్త కలెక్టర్ డా. మహేష్ కుమార్, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, డి.పి ఓ సునీల్ రాజ్ కుమార్, ఎన్.ఐ.సి డి.ఐ.ఓ నరేంద్ర , సహాయ అధికారి బాలసుభ్రమణ్యం, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.