ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామ సచివాలయాలపై అవినీతి నిరోధక శాఖ ద్రుష్టిసారించింది..ఏక కాలంలో ఒకేసారి రెడ్ హేండెడ్ గా అక్రమార్కులను బుక్ చేయాలని మాస్టర్ స్కెచ్ వేసింది..దానికి కారణం కూడా లేకపోలేదు..వంద రూపాయలు కూడా లేని చలానా లేని పెళ్లి ద్రువీకరణ పత్రం(మేరేజ్ సర్టిఫికేట్ )కు దేవస్థానాల పరిధిలో ఉన్న గ్రామ సచివాలయాల కార్యదర్శిలు ఏకంగా మూడు వేల నుంచి 5వేల రూపాయల వరకూ అడ్డంగా దోచేస్తున్నారు. పెళ్లి జరిగిన వెంటనే కాకుండా నెల రోజుల లోపు సర్టిఫికేట్ కావాలంటే దానికి మరో రేటు పెడుతున్నారు కూడా. ఇటీవల కాలంలో చాలా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మ్యారేజ్ సర్టిఫికేట్ లు అవసరం పడటంతో చాలా మంది ముదర కార్యదర్శిలకు చేతినిండా పనిదొరకడంతోపాటు, అదే స్థాయిలో అక్రమాదాయానికి బాటలు వేసుకుంటున్నారు. వీరి చేతికి మట్టంటకుండా గతంలోని పంచాయతీలో పనిచేసే డైలీవేజ్ సిబ్బందిని, మరికొందరు బిల్ కలెక్టర్లను మధ్యవర్తులుగా పంపి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ల వ్యాపారం చేస్తున్నారు. దీనితో ఈ విషయం కాస్తా ప్రభుత్వం ద్రుష్టికి, ఏసీబి ద్రుష్టికి పలు దఫాలుగా ఫిర్యాదులు వెళ్లాయట. అదీ వారు ఎంత మొత్తం ఏ ఏ రకాల మేరేజి సర్టిఫికేట్లకు తీసుకున్నారో..ఎవరి ద్వారా తీసుకున్నారో తదతర పేర్లతో సహా ఫిర్యాదులు చేశారని సమాచారం. ఈ క్రమంలోనే ప్రముఖ దేవస్థానాల పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాలపై నిఘా పెట్టారు. రెండు మూడేళ్లలో ఉద్యోగవిరమణకు దగ్గర పడ్డ కార్యదర్శిలు మరింతగా తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. రిటైర్ మెంట్ దగ్గరపడ్డ ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకోదనే కారణంతో, దైర్యంతో వారంతీ ఇలాంటి సంపాదనకు తెరతీశారని తెలుస్తుంది. ఇప్పటికే విశాఖజిల్లాలోని ఎస్.రాయవరం మండల కేంద్రంలోని ఒక ఈఓపీఆర్డీ సచివాలయ నిధులను నిధులను తమ కుటుంభ సభ్యుల ఖాతాలకు నేరుగా దారిమళ్లించుకున్న విషయమై కేసు రాష్ట్ర కమిషనరేట్ లో నడుస్తుంది. దానికి సంబంధించి విశాఖజిల్లా పంచాయతీ అధికారి, జిల్లా కలెక్టర్లు ఇద్దరూ సదరు కార్యదర్శిపై చర్యలకు ఉపక్రమించారు. నేరం రుజువైనా ఆయనపై చర్యలు తీసుకునే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో అదికాస్తా ఆలస్యం అయ్యింది. ఎన్నికల కోడ్ ఎత్తివేయగానే ఆయనపై శాఖ పరమైన చర్యలు తీసుకోవడంతోపాటు అరెస్టు చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈయనతోపాటు మరో ఇద్దరు సచివాలయ కార్యదర్శిలపైనా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా తేడాగా విధులు నిర్వహిస్తూ..అక్రమార్జనే ధ్యేయంగా పనిచేసే సచివాలయ కార్యదర్శిలపై నిఘా పెట్టిన ప్రభుత్వం, ఏసీబి త్వరలోనే వరుసపెట్టి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం అందుతుంది. అయినప్పటికీ తాము చేసిందే ఉద్యోగం, లంచాలు తీసుకున్నా తమను కాపాడటానికి తమపై స్థాయిలో ఎంపీడీఓలు ఉన్నారని బ్రమపడుతూ ఆమ్యామ్మాలు పుచ్చుకునే కార్యదర్శిలు, వారిని అన్ని పనుల్లోనూ వెనుకేసుకు వచ్చే ఎంపీడీఓలపైనా నిఘా పెట్టినట్టు కూడా సమాచారం వస్తుంది. ప్రజల ముంగిటే సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గ్రామసచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ, గతంలో పంచాయతీల్లో కార్యదర్శిలుగా చేసిన కొందరు సీనియర్లు తమ చేతివాటాన్ని మాత్రం ఇప్పటికీ ప్రదర్శిస్తూనే ఉన్నారు. వీరి అక్రమార్జను అడ్డుకట్టవేయాలంటే రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అక్రమార్కులపై చర్యలు తీసుకోడం ద్వారా మాత్రమే మార్పుతీసుకు రావడం సాధ్యపడుతుందని ప్రభుత్వం యోచిస్తుంది. అంతేకాకుండా కొత్తగా విధుల్లోకి చేరి సచివాలయ సిబ్బంది, కార్యదర్శిలు ఇతర విభాగాలకు చెందిన వారికి కనువిప్పు కల్పించాలని కూడా రాష్ట్ర ఉన్నతాధికారులు ఒక నిర్ణయానికి వచ్చారట. అందులోభాగంగానే ఏకకాలంలో అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి తేడా సచివాలయ సిబ్బందిని పట్టుకొని చర్యలు తీసుకోనుందని సమాచారం. ప్రభుత్వం, ఏసీబి నిజంగా అలాంటి చర్యలు తీసుకుంటే చాలా మంది చేతివాటం ప్రదర్శించే సీనియర్ కార్యదర్శిలు అడ్డంగా పెద్దమొత్తంలో చిక్కే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయని తెలుస్తుంది. గత 5నెలల్లో అందిన ఫిర్యాదులు కూడా ప్రభుత్వ ఆలోచనకు అద్ధం పడుతున్నాయి. ఏం జరుగుతుందో వేచిచూడాలి మరి..!
విజయనగరం జిల్లాలో మార్చి 10వ తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డ్రై డేస్ ప్రకటిస్తూ కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు జరిగే విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీలు మరియు నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో 48 గంటల ముందుగానే మద్యం, కల్లు దుకాణాలు, బార్లు మూసివేయాలని పేర్కొన్నారు. ఎన్నిక జరిగే ఆయా ప్రాంతాలకు 5 కి.మీ. సమీపం వరకు ఈ నిబంధలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం మార్చి 8వ తేదీ సాయంత్రం 5.00 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5.00 వరకు ఆయా ప్రాంతాల్లో మద్యం, కల్లు దుకాణాలు, బార్లు మూసివేయాలన్నారు. ఫలితాల వెల్లడి రోజు అనగా మార్చి 14వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసేంత వరకు పైన పేర్కొన్న నిబంధనల మేరకు రోజంతా మద్యం, కల్లు దుకాణాలు, బార్లు మూసివేయాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నిక నిర్వహించేందుకే డ్రై డేస్ ప్రకటించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో చైల్డ్ కేర్ కేంద్రాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశించారు. జిల్లా బాలల రక్షణ కమిటీ సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ప్రదేశాల్లో రక్షించిన బాలలను పాఠశాలల్లో చేర్పించాలన్నారు. చిన్నారుల విద్యా పరిస్థితులు, హాజరు తదితర అంశాలను తరచూ పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. అవసరాలు ఉన్న చిన్నారులకు ఏ సమయంలో నైనా పూర్తి సహకారాన్ని అందించాలని స్పష్టం చేసారు. చైల్డ్ కేర్ కేంద్రాలు పక్కాగా నిర్వహించాలని, నిర్దేశించిన ప్రామాణికాలు విధిగా పాటించాలని ఆయన పేర్కొన్నారు. చిన్నారుల అంశం సున్నితమైనదని, ఎటువంటి తప్పులు లేకుండా కేంద్రాలు పనిచేయాలని స్పష్టం చేసారు. కేంద్రాలు వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసి వచ్చి వెళ్ళేవారిపై పర్యవేక్షణ అవసరమని అన్నారు. సిసి కెమెరాలు ఏర్పాటు చేయని చైల్డ్ కేర్ కేంద్రాలను కొనసాగింపుకు అనుమతించమని ఆయన స్పష్టం చేసారు. ప్రతి చిన్నారికి ఆరోగ్య పరీక్షలు తరుచూ నిర్వహించాలని అన్నారు. అన్ని రిజిస్టర్ లు పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. రక్షించిన పిల్లల భవిష్యత్తుకు మంచి పునాదులు వేయాలని కలెక్టర్ అన్నారు. 1098 సేవలు ద్వారా తీసుకువచ్చిన చిన్నారులను విధిగా మహిళా ప్రాంగణంలోకి చేర్చుకోవాలని ఆయన స్పష్టం చేసారు. అభ్యంతరాలు వ్యక్తం చేస్తే చర్యలు చేపడతామని హెచ్చరించారు. రవాణా సదుపాయాలు కల్పించడంలో జాప్యం ఉండరాదని ఆయన తెలిపారు. స్టేట్ హోమ్ లో సామర్ధ్యం పెంచాలని ఆయన ఆదేశించారు.
జువెనైల్ కోర్టు ప్రధాన జడ్జి కె.రాణి మాట్లాడుతూ చిన్నారులకు చక్కని సలహాలు, సూచనలు ఇవ్వాలని, తద్వారా పాజిటివ్ దృక్పధం కలిగి ఉండగలరని అన్నారు. అటువంటి వాతావరణం కల్పించాలని సూచించారు. మంచి చెడులను విశదీకరించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని పేర్కొన్నారు. జిల్లా బాలల రక్షణ అధికారి కె.వి.రమణ కార్యక్రమాన్ని గురించి వివరిస్తూ 18 సంవత్సరాలలోపు వయస్సు గల బాలబాలికల రక్షణ ఇందులోకి వస్తుందన్నారు. జిల్లాలో 398 కేసులపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు కాగా 18 వాటికి శిక్షపడిందని చెప్పారు. 60 విచారణలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గుజరాత్ వీరావల్ వంటి ప్రాంతాలకు వెళుతున్న చిన్నారులు ప్రమాదకర పరిస్థితులలో పనిచేస్తున్నట్లు వాటితో ముఖాముఖి మాట్లాడినప్పుడు తెలిసిందని చెప్పారు. జిల్లాలో 517 గ్రామ స్థాయి కమిటీలు, 11 పట్టణ స్థాయి కమిటీలు, 11 మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో 20 చైల్డ్ కేర్ కేంద్రాలు ఉన్నాయని, మొత్తం 315 మంది చిన్నారులు ఉన్నారని వివరించారు. చిన్నారులకు ఆధార్ చేయించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా కె.శ్రీనివాసులు, అదనపు ఎస్పీ పి.సోమశేఖర్, సి.డబ్ల్యు.సి ఛైర్మన్ జి.నరసింహ మూర్తి, ఐసిడిఎస్ పిడి జి.జయదేవి, అదనపు డి.ఎం.హెచ్.ఓ డా.బి.జగన్నాథ రావు, సాంఘిక సంక్షేమ శాఖ డిడి వెంకట రత్నం, జిల్లా బిసి సంక్షేమ అధికారి కె.కె.కృత్తిక, కార్మిక శాఖ సహాయ కమీషనర్ సిహెచ్ పురుషోత్తం, బాలల పరీక్షణ అధికారి ఓ.వి.ఎల్.సత్యనారాయణరావు, కార్యాలయ సిబ్బంది డి.మధుర మీనాక్షి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
'అనంత దర్శిని' జిల్లా ప్రత్యేకతలను వివరిస్తూ అసిస్టెంట్ కలెక్టర్లకు పరిపాలనపై అవగాహన యాత్రల చక్కగా సాగేలా చూడాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు. 2019 బ్యాచ్ అసిస్టెంట్ కలెక్టర్ల జిల్లా పర్యటన 'అనంత దర్శిని' కార్యక్రమంపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మార్చి 6-8 తేదీలలో నిర్వహించనున్న ఈ పర్యటన విజయవంతం కావాలన్నారు. జిల్లాలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యాన పంటల వ్యవసాయంలో నూతన ఒరవడులు, తాగు నీటి సరఫరా, విద్యా రంగం, సంస్కృతి వంటి అంశాల గురించి శిక్షణలో ఉన్న అసిస్టెంట్ కలెక్టర్లకు తెలియజేయాలన్నారు. 2019 బ్యాచుకు చెందిన పది మంది అసిస్టెంట్ కలెక్టర్లకు 'ఏపీ దర్శన్' పేరిట ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త పర్యటన ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా మొదటగా జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్లు పర్యటించనున్నారు. అసిస్టెంట్ కలెక్టర్ల జిల్లా పర్యటనను 'అనంత దర్శిని'గా కలెక్టర్ గంధం చంద్రుడు నామకరణం చేశారు. 'అనంత దర్శిని' కార్యక్రమంపై తన ఛాంబర్లో కలెక్టర్ సమీక్ష నిర్వహించి పర్యటన తేదీలను, సందర్శించే ప్రదేశాలను ఖరారు చేశారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్(రెవెన్యూ), ఏ.సిరి(అభివృద్ధి) మరియు ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ చాంబర్లో మున్సిపల్ ఎన్నికలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిర్భయంగా నిర్వహించేలా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ కండక్ట్ అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, సజావుగా ఎన్నికలు నిర్వహించేలా అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఓటర్ స్లిప్పుల ప్రింటింగ్ పూర్తి చేసి మార్చి 8వ తేదీ లోపు పూర్తిగా స్లిప్పులు పంపిణీ చేయాలన్నారు. ఎన్నికల కోసం స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ల, వీడియో సర్వైలెన్స్ టీమ్స్ ఏర్పాటు, వెబ్ క్యాస్టింగ్, ఈఓ, ఏఈఓ లకు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతుల నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి అందుకు సంబంధించిన రిపోర్టులను ఎప్పటికప్పుడు అందజేయాలన్నారు. ఇందుకు సంబంధించి ఒక ప్రణాళిక రూపొందించుకొని దాని ప్రకారం అన్ని పనులు పూర్తి చేసేలా చూడాలన్నారు. ఎన్నికల్లో ఉత్పన్నమయ్యే సమస్యలను ముందుగానే అంచనా వేసి అందుకు తగిన విధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.
అత్యధికంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాలి :
మున్సిపల్ మరియు లోకల్ బాడీ ఎన్నికలలో అత్యధికంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఇందుకు సంబంధించి అన్ని మునిసిపాలిటీలలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఆటోల ద్వారా ప్రచారం చేయాలని, ఎన్జీవోలు, షాపు యజమానుల ద్వారా ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అలాగే మున్సిపాలిటీల పరిధిలోని పాఠశాలలలో విద్యార్థులకు ఓటు ప్రాధాన్యం తెలియజేసి వారి తల్లిదండ్రులు ఓటింగ్లో పాల్గొనేలా అవగాహన కల్పించాలని, మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలా అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకు సంబంధించి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని సూచించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్లకు వచ్చే వృద్ధులు, వికలాంగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికల్లో మద్యం, డబ్బు రవాణా కాకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఓటు వేసేలా ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. సజావుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపడతామన్నారు.
సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్, ఏ. సిరి, గంగాధర్ గౌడ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజినల్ డైరెక్టర్ నాగరాజు, నగరపాలక సంస్థ కమిషనర్ పి వి ఎన్ ఎన్ మూర్తి, డిప్యూటీ కలెక్టర్ నిశాంత్, రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కుమారీశ్వరన్, తదితరులు పాల్గొన్నారు.
మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రక్రియలో పీఓలు, ఏపీఓలు పోలింగు విధులను బాధ్యతగా నిర్వహించాలని జిల్లా కలెక్టరు,జిల్లా ఎన్నికల అధారిటీ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. గురువారం జి.వి.యం.సి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగు స్టేషన్లలో విధులు నిర్వహించవలసిన పోలింగు అధికారులకు, సిబ్బందికి వారి బాధ్యతలు, పోలింగులో తీసుకోవలసిన జాగ్రత్తలపై వి.ఎం.ఆర్.డి.ఎ. చిల్డ్రన్ ఎరీనాలో అదనపు ఎన్నికల అధారిటీ మరియు జి.వి.యం.సి. కమీషనరు నాగలక్ష్మి.ఎస్. తో కలసి జిల్లా కలెక్టరు మరియు జిల్లా ఎన్నికల అధారిటీ 55 మంది మాస్టర్ ట్రైనర్స్ కు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో కలెక్టరు మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరుపుటకు ప్రధాన ఘట్టం పోలింగు ప్రక్రియే అన్నారు. ఈ పోలింగు ప్రక్రియ పూర్తిగా పోలింగు అధికారులపై ఆధారపడి ఉన్నందున వారికి ప్రత్యేకంగా పోలింగు విధి, విధానాలపై ఇప్పుడు శిక్షణ తీసుకుంటున్న మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ ఇవ్వవలసివుంటుదన్నారు. పోలింగు నియమ నిబంధనలు, సాదారణంగా చేసే పొరపాట్లు, పోలింగులో వచ్చే సమస్యలు, పరిష్కార మార్గాలపై పూర్తిగా వివరించాలని మాస్టర్ ట్రైనర్స్ ను కలెక్టరు ఆదేశించారు.
పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారికి పూర్తి అధికారాలు ఉంటాయన్నారు. పోలింగ్ కేంద్రంలో వారి నడవడి, వ్యవహారశైలి హుందాగా ఉండాలని, అనుమానాలకు ఆస్కారం ఇవ్వకూడదన్నారు. బ్యాలెట్ బాక్స్ తెరవడం, సీలింగు, ఏజెంట్ల నియామకం, పోలింగ్ కేంద్రం అమరిక, ప్రొఫార్మా లు, కవర్లు, ప్రిసైడింగ్ అధికారి డైరీ, సాధారణంగా వచ్చే పొరపాట్లు, క్షేత్రస్థాయిలో విధినిర్వహణ మొదలైన అన్ని విషయాలను క్షుణ్ణంగా బోధించి రిటర్నింగ్ అధికారి పోలింగ్ అధికారులను బలోపేతం చేయాలని కలెక్టరు ఆదేశించారు.
నియమ నిబంధనలతో కూడిన హేండ్ బుక్స్ పి.ఓ.లందరికి అందేలా చర్యలు తీసుకోవాలని జోనల్ కమీషనర్లను ఆదేశించారు. పోలింగ్ అనంతరం సంబంధిత మెటీరియల్ అప్పగించే వరకు పి.ఓ.లు, ఎ.పి.ఓ.లు తప్పకుండా ఉండాలన్నారు. బాక్స్ లు పూర్తిగా సీలింగ్ చేసిన తరువాత మాత్రమే పోలింగ్ కేంద్రం నుండి బయలుదేరాలని, పోలింగ్ స్టేషన్ లోనే సంబంధిత ఫారాలు పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఎ.ఎస్.డి.లో (A – Absentees, S – Shifted, D – Dead అనగా ఓటరు స్లిపులు ఓటరుకు అందించినప్పుడు గుర్తించిన వివరాలు) ఉన్న వారు ఓటింగ్ కు వచ్చినపుడు పోలింగ్ అధికారి అన్నింటిని పరిశీలించాలని పేర్కొన్నారు. మాస్టర్ ట్రైనర్లు ఉత్సాహంతో పోలింగ్ శిక్షణ ఇవ్వాలన్నారు. పోలింగు ప్రక్రియ పూర్తయిన తరువాత పోలింగు ఏజెంట్లచేత తప్పకుండా సంతకాలను చేయించాలని మాస్టర్ ట్రైనర్ల కు కలెక్టరు సూచించారు.
అనంతరం జి.వి.యం.సి. కమీషనరు నాగలక్ష్మి.ఎస్. మాట్లాడుతూ ఈ ఎన్నికల పోలింగు ప్రక్రియలో 2100 ప్రిసైడింగ్ అధికారులు, 2100 సహాయ ప్రిసైడింగ్ అధకారులుకు పోలింగు ప్రక్రియపై తరువుగా శిక్షణను 55 మంది మాస్టర్ ట్రైనర్స్ ఇవ్వవలసి ఉంటుందన్నారు. మార్చి 1 వ తేదీన పి.ఒ.లకు, ఎ.పి.ఒ. లకు పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వాలని మాస్టర్ ట్రైనర్స్ ను కమీషనరు ఆదేశించారు. పోలింగు అధికారులు పోలింగు సామాగ్రిని తీసుకుని, తరుచుగా తనిఖీ చేసుకొని పోలింగు స్టేషన్లకు వెళ్ళేటట్లు అవహాగాహన పరచాలని రిటర్నింగ్ అధికారులను, మాస్టర్ ట్రైనర్స్ ను కమీషనరు ఆదేశించారు.
ముందుగా ఈ శిక్షణా కార్యక్రమంలో పోలింగు స్టేషన్లో బ్యాలట్ బాక్సు తెరవడం, పోలింగు అనంతరం సీలు చేయడం వంటి ప్రక్రియను ఆడియో, వీడియో రూపంలో జిల్లా పరిషత్ సి.ఇ.ఒ. వి. నాగార్జునసాగర్ చూపించి వివరించారు. పోలింగు స్టేషన్లో పోలింగు అధికారుల విధి, విధానాలపై, రిటర్నింగ్ అధికారుల బాధ్యతలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సి.ఇ.ఒ. వివరించారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో అదనపు కమీషనరు ఎ.వి. రమణి, డిప్యూటీ ప్రాజెక్టు అధికారి బి.వి. రమణి, జి.వి.యం.సి. సలహాదారు జి.వి.వి.ఎస్. మూర్తి, జోనల్ కమీషనర్లు, జోనల్ అధికారులు/ మేజిస్ట్రేట్ లు, రిటర్నింగ్ అధికారులు, మాస్టర్ ట్రైనర్స్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వందరోజుల క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) ప్రణాళిక క్రింద జివిఎంసి పరిధిలో చేపట్టే పలు పనులను శ్రద్ధతో నిర్వహించి విశాఖ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఎం.ఎ.&యు.డి. ముఖ్య కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, జివిఎంసి అధికారులను ఆదేశించారు. గురువారం, జివిఎంసి సమావేశ మందిరంలో కార్పొరేషన్ కమిషనర్ నాగలక్ష్మి ఎస్., వి.ఎం.ఆర్.డి.ఎ. కమిషనర్ కోటేశ్వరావులతో కలిసి క్లాప్ పథకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జివిఎంసి పరిధిలో సోలిడ్ వేస్ట్ పునర్వినియోగం కింద చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల అమలు తీరును ప్రధాన ఇంజినీరును, చీఫ్ మెడికల్ అధికారిని అడిగి తెలుసుకుని, పలు సూచనలు ఇచ్చారు. కార్పొరేషన్ పరిధిలో గృహం వద్ద చెత్తను వేరు చేసి వాహనాలకు అందించే విధంగా తగు చర్యలు చేపట్టాలని ఇందుకు గాను 100 రోజుల వ్యవధిలో ప్రజలకు అవగాహన నిరంతరం కల్పించాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు. ప్రజారోగ్య విభాగంలో నడుపుతున్న వాహనములకు ట్రాకింగ్ సిస్టం యాప్ ద్వారా గుర్తించే విధంగా ఇండోర్ కార్పొరేషన్ మోడల్ ను అనుసరించాలని అదనపు కమిషనర్ కు సూచించారు. నగరంలో చెత్తను తరలించే ట్రాన్స్ఫర్ స్టేషన్లు పెంచాలని కమిషనర్ కు సూచించారు. కాపులుప్పాడ డంపింగ్ యార్డ్ లో బయో మైనింగ్ ప్రాసెస్ ద్వారా ఖాళీ అయిన స్థలంలో సుందరమైన పార్కు అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. నగరంలో గల కార్పొరేషన్ కు చెందిన స్థలాల్లో వాణిజ్య అవసరాలకు అనుగుణంగా భవనాలను నిర్మించి జివిఎంసి రెవెన్యూ పెంపుకు కృషి చేయాలని కమిషనర్ కు సూచించారు.
కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న పలు వినూత్న పద్ధతులకు మద్దతు తెలుపుతూ, ఇటువంటి పద్ధతులు రాష్ట్రంలో ఇతర కార్పొరేషన్లు/మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. నగరంలో అమలులో గల భూగర్భ డ్రైనేజీ, నీటి సరఫరా పథకాలు అమలు తీరును ప్రధాన ఇంజినీరును, పర్యవేక్షక ఇంజనీరును అడిగి తెలుసుకున్నారు. మురుగు నీటి శుద్ధి కేంద్రాలను మరింత అభివృద్ధి చేసి, వాటి నుండి వచ్చిన నీటిని వాణిజ్యపరంగా వినియోగించి, రెవెన్యూ పెంపుకు కృషి చేయాలని కమిషనర్ కు సూచించారు. కమిషనర్ నాగలక్ష్మి ఎస్. మాట్లాడుతూ, కార్పోరేషన్లో చేపడుతున్న పలు అభివృద్ధి పనులు గురించి ముఖ్యకార్యదర్శి కి వివరించారు.
ఈ సమావేశంలో వ.ఎం.ఆర్.డి.ఎ అదనపు కమిషనర్ డా. మనజిర్ జిలానీ సామూన్, మున్సిపల్ పరిపాలనా శాఖ రీజనల్ డైరెక్టర్ కె. రమేష్, జివిఎంసి కి చెందిన అదనపు కమిషనర్లు, ప్రధాన ఇంజనీర్, చీఫ్ సిటీ ప్లానర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్, పి.డి.(యు.సి.డి), జె.డి.(అమృత్), ఎఫ్.ఎ.&ఎ.ఓ, కార్యదర్శి, పర్యవేక్షక ఇంజినీరులు, ఎ.ఎమ్.ఓ.హెచ్ లు, వివిధ విభాగపు ఇంజనీరింగ్ అధికారులు, ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రడుని రాష్ట్రముఖ్యమంత్రి అభినందించారు. పీఎం కిసాన్ జాతీయ అవార్డు అందుకున్న నేపథ్యంలో గురువారం వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు రామకృష్ణ తో సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. అనంతరం అవార్డు రావడానికి గల కారణాలను సీఎంకి వివరించారు. దీనితో స్పందించిన సీఎం వెరీగడ్ కలెక్టర్ గారు..మంచి అవార్డు రాష్ట్రానికి తేవడంతో విశేషంగా క్రుషిచేశారు అంటూ కితాబిచ్చారు. ఇదే ఉత్సాహంతో ప్రభుత్వ పధకాల అమలుతోపాటు ప్రతీ నిరుపేదకు పథకాలు పూర్తిస్థాయిలో అందేలా చూడాలని సీఎం కలెక్టర్ కు సూచించారు. ఇలాంటి అవార్డులు మరిన్ని మీరు అందుకోవాలని రాష్ట్రాన్ని అన్ని పథకాల విషయంలో ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్ గంధం చంద్రుడుని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రానికి పీఎం కిసాన్ జాతీయ స్థాయి అవార్డు రావడంతోపాటు, దానిపై ముఖ్యమంత్రి ప్రశంస నాలో మరింత ఉత్తేజాన్ని బాధ్యతను పెంచాయని అన్నారు. సీఎం సూచనలు తప్పక పాటిస్తూ, అన్ని రంగాల్లో అనంతపురం జాల్లాను రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలబెట్టడానికి శక్తివంచన లేకుండా క్రుషిచేస్తానని వివరించారు.
జగనన్నపాల వెల్లువ లక్ష్య సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. గురువారం బాపూజీ కళామందిరంలో నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా అమలు చేస్తున్న ఎ.పి. అమూల్ ప్రాజెక్ట్ జగనన్న పాల వెల్లువ కార్యక్రమంపై కన్వెర్జన్స్ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, గార, నరసన్నపేట, శ్రీకాకుళం (6) మండలాల పరిథిలోని 139 గ్రామాలలో మొదటి విడతగా అమలు చేస్తున్న జగనన్నపాల వెల్లువ కార్యక్రమాన్ని నిర్దేశిత లక్ష్యాలతో పూర్తి చేయాలన్నారు. అమూల్ పాల వెల్లువ కార్యక్రమానికి సంబంధించి డాటా ఎంట్రీ నిమిత్తం గ్రామానికి దగ్గరలోనే గది (రూమ్) ను ఐడెంటీఫై చేయాలని, విద్యుద్దీకరణ, ఇంటర్నెట్ సదూపాయాలు కలిగించాలని సంబంధిత ప్రత్యేక అధికారులను ఆదేశించారు. తహశీల్దారులు, ఆర్.ఐ.లు, వెటర్నరీ డాక్టర్లు ప్రత్యేక అధికారులు సంయుక్తంగా పాల శీతలీకరణ కేంద్రాల యూనిట్లను గుర్తించాలన్నారు. పాలశీతలీకరణ కేంద్రాలను ఉపాధిహామీ పథకం ద్వారా నిర్మాణం చేయాలని తెలిపారు. కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కలిగించాలని, ఈ పథకం వలన కలిగే ప్రయోజనాలను వారికి వివరించాలని చెప్పారు. ముఖ్యంగా మహిళలకు అవగాహన కలిగించాలన్నారు. సోసైటీని ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ చేయించాలని ఆన్ లైన్ ద్వారా సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. మంచి ఆరోగ్యవంతమైన ఆవులు, గేదెలను కొనుగోలు చేయాలన్నారు. ట్యాగ్ వున్న పశువులను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. వాటిని వెటర్నరీ డాక్టర్లు సర్టిఫై చేయాలని తెలిపారు. వాటికి ఇన్సూరెన్స్ చేయించాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేసిన పశువుల ఆరోగ్య పరిస్థితిని గమనించుకోవాలన్నారు. వై.ఎస్.ఆర్.చేయూత పథకానికి 45 నుండి 60 సం.లలోపు బి.సి, ఎస్.సి, మైనారిటీలు, వితంతువులు అర్హులని తెలిపారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగాను నిక్కచ్చిగాను చేయాలన్నారు. అమూల్ సంస్థ పాలను కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పారు. దీని వలన లబ్దిదారులకు సుమారు అయిదు వేల రూపాయల వరకు అదనంగా ఆదాయం వస్తుందని తెలిపారు. మంచి ఆరోగ్యంతో కూడిన పశువులను కొనుగోలు చేయాలని వాటికి ట్యాగ్ లు వేయాలని తెలిపారు. జె.సి.సుమీత్ కుమార్ మాట్లాడుతూ, వై.ఎస్.ఆర్. చేయూత దరఖాస్తులను బ్యాంకులు మార్చి 5వ తేదీలోగా గ్రౌండ్ చేయాలన్నారు.
ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు,జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, పశు సంవర్ధక శాఖ సంయక్త సంచాలకులు వెంకటేశ్వర్లు, లీడ్ బ్యాంక్ మేనేజరు హరిప్రసాద్, ఎపిజివిబి, డిసిసిబి, కెనరా బ్యాంకు మేనేజర్లు, ప్రత్యేక అధికారులు, ఏ.పి.ఎం.లు, తదితరులు హాజరయ్యారు.
మున్సిపల్ ఎన్నికల్లో జోనల్ అధికారుల పాత్ర చాలా కీలకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ అన్నారు. వీరంతా బాధ్యతతో, సమర్థవంతంగా విధులను నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జోనల్ అధికారులకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జోనల్ అధికారుల వ్యవహార సామర్థ్యంపైనే ఎన్నికల ప్రక్రియ ఆధారపడి ఉంటుందన్నారు. ఆర్ఓలు, పిఓలు, ఇతర ఎన్నికల అధికారులు, సిబ్బందిని సమన్వయ పరిచే బాధ్యత జోనల్ అధికారుల ముఖ్య విధి అని అన్నారు. ఎన్నికల ముందురోజు సిబ్బంది అంతా హాజరైనదీ, వారికి అవసరమైన సామగ్రి అందినదీ లేనిదీ పరిశీలించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల రోజు తమ పరిధిలోని ప్రతీ పోలింగ్ స్టేషన్‌ను జోనల్ అధికారులు కనీసం రెండుసార్లైనా పరిశీలించాలని చెప్పారు. జెడ్ఓలు పోలింగ్ స్టేషన్లను ఎంత ఎక్కువగా సందర్శిస్తే, అంత సజావుగా ఎన్నిక జరుగుతుందని సూచించారు. ఓటింగ్ ఎక్కువగా జరిగేలా చూడటం, నిర్ణీత సమాయానికి పోలింగ్ ప్రారంభించడంతో పాటు, సకాలంలో ముగిసిలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సక్రమంగా అందించే బాధ్యతను జోనల్ అధికారులు నిర్వర్తించాలని సూచించారు. జోనల్ అధికారుల హాజరును, వారి సన్నద్దతను కలెక్టర్ పరిశీలించారు.
జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్ కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగుతాయని, కాబట్టి ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, దానిని తట్టుకొనే విధంగా జోనల్ అధికారులు ముందే సంసిద్ధులు కావాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని సూచించారు. తమ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లను ముందుగానే పరిశీలించి, లోటుపాట్లను సరిచేయాలన్నారు. పంచాయితీ ఎన్నికలకు భిన్నంగా జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మరింత అప్రమత్తంగా విధులను నిర్వహించాలని కోరారు. జోనల్ అధికారుల బాధ్యతలు, నిర్వర్తించాల్సిన విధులను ట్రైనింగ్ నోడల్ ఆఫీసర్ ఎస్.అప్పలనాయుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) డాక్టర్ జిసిహెచ్ కిశోర్ కుమార్, జాయింట్ కలెక్టర్(వెల్ఫేర్) జె.వెంకటరావు, మున్సిపల్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో తాగునీటి వసతుల పనుల అంచనాలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆర్.డబ్ల్యు ఎస్ పనులపై జిల్లా కలెక్టర్ నివాస్ గురువారం సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రానున్న వేసవి దృష్ట్యా పనులలో వేగం పెంచాలని ఆయన ఆదేశించారు. వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. తాగునీటి సమస్య వచ్చే గ్రామాలను ముందుగా గుర్తించి నీటి సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఇంటింటికి కొళాయి కనెక్షన్లను లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని స్పష్టం చేసారు. శత శాతం గృహాలకు కనెక్షన్లు అందాలని అన్నారు. కొత్త పనుల అంచనాలు తక్షణం చేపట్టాలని ఆదేశించారు. పెండింగులో ఉన్న పనుల అంచనాలు మార్చి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పనులను వ్యక్తిగతంగా ప్రతి రోజు పర్యవేక్షణ చేయాలని ఆయన స్పష్టం చేసారు. రేగిడి ఆమదాలవలసలో 61 పనులకు ఒక పనికి మాత్రమే అంచనాలు తయారు చేయడంపై ప్రశ్నించారు. శ్రీకాకుళం ఏఇ అంచనాలు సమర్పించడంలో శ్రద్ధ వహించారని అభినందించారు. 289 పనులకు రూ.26 కోట్లతో అంచనాలు తయారు చేశారని అయితే పనులు పూర్తి చేయడంలో జాప్యం కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. జగనన్న కాలనీల్లో తాగునీటి వసతుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఎచ్చెర్ల, టెక్కలి మండలాల్లోని కాలనీల్లో పనులు బాగా చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్.డబ్ల్యు ఎస్ ఎస్.ఇ టి. శ్రీనివాసరావు, ఇఇలు, డిఇఇలు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చుల వివరాలను ఈ నెల 28వ తేదీ నాటికి సమర్పించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు సచిన్ గుప్తా ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల వ్యయాలపై ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎం.పి.డి.ఓ లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధుల ఖర్చుల వివరాలను తక్షణం సమర్పించాలని ఆదేశించారు. అభ్యర్ధుల ఖర్చుల వివరాలు సేకరించాల్సిన బాధ్యత సంబంధిత ఎం.పి.డి.ఓలదేనని తేల్చిచెప్పారు. పోటీ చేసిన అభ్యర్ధుల ఖర్చులు ఖచ్చితంగా ఉండాలని, ఎట్టి పరిస్థితిల్లోనూ ఈ నెల 28లోగా సమర్పించేలా చర్యలు తీసుకోవాలని ఎం.పి.డి.ఓలకు స్పష్టం చేసారు. ఈ సమావేశంలో జిల్లా ఆడిట్ అధికారి కె.రాజు తదితరులు పాల్గొన్నారు.
జివిఎంసికి జరగబోయే ఎన్నికలలో ఇప్పటికే నామినేషన్ వేసి మరణించిన వివిధ రాజకీయ పక్షాలకు చెందిన అభ్యర్థులకు బదులు మరొక వ్యక్తితో తిరిగి నామినేషన్ చేయవచ్చునని కమిషనర్ నాగలక్ష్మీ సెల్వరాజన్ పేర్కొన్నారు. ఈమేరకు బుధవారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు. అభ్యర్ధులు ఈనెల 28వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల లోపు సంబంధిత రిటర్నింగ్ అధికారుల వద్ద నామినేషన్ దాఖలు చేయవచ్చునన్నారు. దానికోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నూతనంగా ఆదేశాలు జారీ చేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికనుగుణంగా జివిఎంసి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తరపున పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు కేటాయించే నిమిత్తము ఫారం - “ఎ” & ఫారం – “బి” లను ఆయా రాజకీయ పక్షాలు సమర్పించవలసిన తేదీలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిందన్నారు. ఫారం – “ఎ” పత్రాన్ని సంబందిత రాజకీయ పక్షాలు తరపున ఈనెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు విశాఖపట్నం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ వారికి ఆయా రాజకీయ పక్షాల అధ్యక్షులు, జనరల్ కార్యదర్శి మొదలగు వారు సమర్పించాలన్నారు. అదేవిధంగా ఫారం – “బి” ని మార్చి 3వ తేదీ 3 గంటల లోపు సంబంధిత రిటర్నింగ్ అధికారులకు అందించాలని రాష్ట్రంలో గల అన్ని రాజకీయ పక్షాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలియజేసిందన్నారు. ఈ విషయమును గమనించి, నిర్ణీత సమయంలో ఫారం - “ఎ” , ఫారం –“బి” లను సంబంధిత అధారిటీ వారికి అందించవలసిందిగా జివిఎంసి కమిషనర్ అన్ని రాజకీయ పక్షాల వారిని కోరుతున్నామన్నారు.