క్రిస్టమస్ సందేశం కేవలం శుభాకాంక్షలు చెప్పడం మాత్రమే కాదు, దేవుని సందేశం మేరకు మనము నడుస్తున్నామా అనే విషయం ప్రతి ఒక్కరం మననం చేసుకోవాల ని క్రిష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. బుధవారం స్థానిక ఇరిగేషన్ కార్యాలయ రైతు శిక్షణా కేంద్రంలో బుధవారం సాయంత్రం సెమి క్రిస్టమస్ వేడుకలు జిల్లా యంత్రంగం ఘనంగా నిర్వహిం చింది. కరోనా సమయంలో అన్ని ప్రార్ధనా మందిరాలు, దేవాలయాలు మూసివుంచి మనకు మనమే ఆలోచించాల్సిన పరిస్థితి రేకెత్తించాయి అన్నారు. దేవుని వాక్యాలు ప్రతి ఒక్కరం గుర్తుంచు కోవాలన్నారు. ప్రతి ఒక్కరు భగవంతుని వ్యాఖ్యలు తప్పకుండా మననం చేసుకోవాలన్నారు. నేనే నిజం అన్న ప్రభువు వ్యాఖ్యలను గుర్తుంచుకోవాలి . ప్రేమ , సమానత్వం ప్రతి ఒక్కరిపై చూపాలన్నారు . దేవునిపై నమ్మకం ఉన్నవారు మాత్రమే దేవునిని చేరుకోగలమని పేర్కొన్నారు. క ఖురాన్ లో జీసస్ క్రీస్తు ప్రస్తావన పలు మార్లు వొచ్చిందన్నారు.
ఖురాన్ లో మరియం పేరుతో ఒక చాప్టర్ ప్రత్యేకంగా వుందన్నారు.. మనం ఏమిటి అని తెలుసుకొని, అన్నార్తులకు , దివ్యాంగులకు, వెనుకబడిన వారికోసం ఆలోచించాల్సి ఉందన్నారు. అదే ప్రేమ సౌబ్రాతుత్వా నికి సూచికగా క్రిస్టమస్ వేడుకలు నిలుస్తూ యని పేర్కొన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు మాట్లాడుతూ క్రైస్తవ కుటుంబాలకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం , ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రము లోని బలహీన వర్గాలు , వెనుకబడిన వర్గాలు కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. క్రెస్తవుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోంది.
పామర్రు శాసన సభ్యులు కైలా అనిల్ కుమార్ మాట్లాడుతూ , క్రీస్టమస్ వేడుకలు సమయంలో క్రీస్తు మన కోసం శిలువ వేసుకొని , మనందరి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు . కరోనా సమయంలో మనందరినీ కాపాడి ఈ రోజు వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుల మతాలకు రాజకీయ లకు అతీతంగా అమలు చేస్తున్నారు. కరోనా సమయంలో కలెక్టర్ చేపట్టిన కార్యక్రమాలను పలువురు అభినందించారు.
కార్యక్రమంలో భాగంగా కాండిల్ లైట్ నిర్వహించారు. పలువురు దేవుని వాక్యాలు వినిపించారు.ఈ సమావేశంలో రెవేరండ్ మేజర్ ఐ డి ఎబెనజెర్, డా కె .జోసెఫ్ మోసెస్, ఫాదర్ మువ్వాలా ప్రసాద్ , రేవ్. ఐ.కరుణానిధి , నోవెల్ శామ్యూల్, డా వై బాబు, యేసుపాదం, బి దయానందం, ఎం.విజయరావు, అధికారులు ఎండి రియాజ్ సుల్తాన్, జి రవీంద్ర, మురళి, జి జూన్ మోషే, రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం నుంచి ఒడిశా సంబల్ పూర్ కు అక్రమంగా తరలిస్తున్న 420 కేజిల గంజాయిని విజయనగరం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బుధవారం సాయంత్రం గంజాయి లోడోతో ఒక లారీ ఒడిసాకి వెళుతున్నట్టు సమాచారం అందుకున్న డిఎస్పీ అనిల్ పులిపాటి తన బ్రుందంతో దాడిచేసి మార్గమధ్యలోనే పట్టుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మీడియాతో మాట్లాడుతూ, గంజాయి రవాణాపై నిఘా వుంచామని, ఈ క్రమంలోనే రావాణ అవుతున్న గంజాయి సమాచారాన్ని తెలుసుకొని దాడులు చేశామన్నారు. వారి దగ్గర నుంచి గంజాయి ట్రేలను స్వాధీనం చేసుకోవడంతోపాటు బీహార్ కి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు వివరించారు. ఈ దాడుల్లో విజయనగరం రూరల్ సిఐ మంగవేణి, మురళి, ఎస్ఐలు కిరణ్, దేవి, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు చాకచక్యంగా గంజాయిని పట్టుకున్న పోలీసు సిబ్బందిని విజయనగరం ఎస్పీ రాజకుమారి అభినందించారు.
నవరత్నాల్లో భాగంగా కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో 29 వేల మంది లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ, సహకార, ఫుడ్ ప్రొసెసింగ్,మార్కెటింగ్ శాఖా మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. బుధవారం కాకీనాడబోట్ క్లబ్ దగ్గరలో ఉన్న కృషి భవన్ లో నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం పై కాకినాడ గ్రామీణ నియోజకవర్గ స్ధాయి సమీక్షా సమావేశానికి మంత్రి కన్నబాబు, కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ గ్రామీణ నియోజకవర్గం పరిధిలో ఇళ్ళ పట్టాల పంపిణీ, 25న జిల్లాలో జరిగే ముఖ్యమంత్రి పర్యటన తదితర అంశాలపై సంబంధిత అధికారులతో మంత్రి కన్నబాబు సమీక్షించి ముఖ్యమంత్రి పర్యటనను అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని ఆయన సూచించారు.
అనంతరం పాత్రికేయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాత్రికేయులను ఉద్దేశించి మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల సొంత ఇంటి కల నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో వేల కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 30 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.ఎంతటి విపత్కర పరిస్ధితులు ఎదురైన రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆపద సమయంలో అన్ని వర్గాల వారిని ఆదుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళ స్ధలాలకు సంబంధించి అన్నిలేవుట్లలో త్రాగునీరు, విద్యుత్, రవాణా, ఇతర అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. అర్హతలు ఉండి గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ 90 రోజుల్లోనే ఇళ్ళ పట్టాలు అందజేయడం జరిగిందన్నారు. ఇళ్ళ స్ధలాలకు సంబంధించి అత్యంత పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేసి ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం లబ్దిదారుల జాబితా ప్రతీ గ్రామ సచివాలయంలోను ప్రదర్శించడం జరిగిందన్నారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గానికి సంబంధించి సుమారుగా 29 వేల మంది లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి రైతుల సంక్షేమమే ధ్యేయంగా, రైతు పక్షపాతిగా నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులందరికీ ఈ నెల 29వ తేదీన ప్రభుత్వం నష్టపరిహారం అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. నష్టపరిహారానికి దరఖాస్తు చేసుకొనేందుకు రైతులకు ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు గడువు ఉందన్నారు. నివర్ తుపాన్ కారణంగా 12 లక్షల ఒక వెయ్యి ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఇ-క్రాప్ లో నమోదైన ప్రతీ రైతుకు నష్టపరిహారం అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ తుఫానులు, భారీ వర్షాలు, వరదలు కారణంగా అధిక నష్టం జరిగిందని ఆయన తెలిపారు. వచ్చే సంవత్సరం నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బీమా సంస్ధను ఏర్పాటు చేసి రైతులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
ఈ సమావేశంలో కాకినాడ రూరల్, కరప మండలాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జివిఎంసీ పరిధిలోని అన్ని పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను సత్వరమే పూర్తిచేయాలసి అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన నాల్గవ జోన్ పరిధిలోని 47వ వార్డులో గల శ్రీహరిపురం ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. పాఠశాలలో జరుగుచున్న నాడు–నేడు పనుల పురోగతిని ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతంగా పూర్తిచేయుటకు గాను సంబందిత అధికారులతో ప్రతీ రోజూ చర్చించాలని ప్రధానోపాధ్యాయునికి సూచించారు. పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకొనే బాధ్యత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధులపై ఉందని చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా, పిల్లలకు పరిశుభ్రతపై అవగాహనను ఉపాధ్యాయులు కల్పించాలని సూచించారు. ముఖ్యంగా, తడి-పొడి వేరు చేసి చెత్తను అందించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ప్లాస్టిక్ బ్యాగులు ఉపయోగం నిషేధం వంటి వాటిపై విద్యార్ధులకు అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలను ప్రతీరోజూ శుభ్రపరచాలని, శానిటరి ఇన్ స్పెక్టరును ఆదేశించారు. 10వ తరగతిలో ఉన్నతస్థాయి మార్కులు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని, ఉన్నత చదువులు చదువుకోవాలని విద్యార్ధినీ విద్యార్ధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇతర ఉపాధ్యాయులు, 47వ వార్డు శానిటరీ ఇన్ స్పెక్టరు తదితరులు పాల్గొన్నారు.
రబీలో వ్యవసాయానికి నీటి ఎద్దడి లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ నీటిపారుదల, వ్యవసాయ, అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జలవనరులు, వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రబీలో వ్యవసాయ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎట్టి పరిస్థితిల్లోనూ రబీలో వ్యవసాయ పంటలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలని, పశుదాహార్తిని తీర్చాలని పేర్కొన్నారు. వంశధార ఎడమ ప్రధాన కాలువ (23ఆర్ డిస్ట్రిబ్యూటరీ ) ద్వారా హిరమండలం, సారవకోట, జలుమూరు మండలాల్లోని సుమారు 2,500 ఎకరాలకు రబీలో ఆరుతడి పంటలకు నీటిని అందించే అవకాశముందని కలెక్టర్ పేర్కొన్నారు. రానున్న సంక్రాంతి, వేసవిని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయం, పశుదాహార్తి నిమిత్తం వంశధార కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేయుటకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే రెండవ పంటకు గొట్టా బేరేజీ ద్వారా నీటి నిల్వలు బట్టి దిగువకు విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదైన కారణంగా రిజర్వాయరులో తగినంత నీటి నిల్వ లేదని, దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని చెప్పారు. రబీలో 400 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేసే అవకాశం ఉన్నందున ఈ విషయాన్ని రైతులు గమనించాలని కలెక్టర్ కోరారు. వ్యవసాయ అధికారులు రైతులకు ఈ విషయాలను వివరించాలని, నీటిని విడిచిపెట్టేముందు పొలాల్లో ధాన్యం నిల్వలు లేకుండా రైతులకు ముందుగానే సమాచారాన్ని అందించాలని కలెక్టర్ ఆదేశించారు. కాలువలకు మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు.ఈ సమీక్ష సమావేశంలో పర్యవేక్షక ఇంజినీర్లు డోల తిరుమల రావు, ఎస్.సి.రమణరావు, నరసన్నపేట, టెక్కలి , హిరమండలం, ఆమదాలవలస ఉపకార్య నిర్వాహకఇంజినీర్లు, కార్యనిర్వాహక ఇంజినీర్లు, నీటిపారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ డి.శ్రీనివాస్, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు రామచంద్రరావు, శ్రీకాంత్, రామకృష్ణ , ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో సూక్ష్మ పరిశ్రమల ప్రోత్సాహక కార్యక్రమం (ఎంఈపీపీ) ద్వారా జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి, ప్రోత్సహిస్తున్నట్లు జెసి (సంక్షేమం) జి.రాజకుమారి తెలిపారు. భారతీయ లఘు పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బీ) సహకారంతో చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహక, అభివృద్ధి సంస్థ (మెప్డా) ద్వారా ఈ కార్యక్రమం అమలవుతున్నట్లు వివరించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్.. మూడు యూనిట్లకు సంబంధించి నలుగురు మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.40 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ మహిళలు బేకరీ ఉత్పత్తులు, శానిటరీ న్యాప్‌కిన్స్, ఫోం క్లాత్ బెడ్స్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బేకరీ ఉత్పత్తుల యూనిట్‌కు రూ.25 లక్షలు, శానిటరీ న్యాప్‌కిన్స్ యూనిట్‌కు రూ.5 లక్షలు, ఫోం క్లాత్ బెడ్స్ యూనిట్‌కు రూ.10 లక్షలు అందించినట్లు వెల్లడించారు. ఈ యూనిట్ల ద్వారా 75 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు రుణ సహాయం అందించినట్లు జాయింట్ తెలిపారు. సమన్వయంతో వ్యవహరించి సూక్ష్మ పరిశ్రమల ప్రోత్సాహక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జేసీ జి.రాజకుమారి అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సిడ్బీ ఏజీఎం (న్యూఢిల్లీ) దినేష్ ప్రసాద్, మెప్డా సీఎండీ, సీఈవో ఎస్.జగన్నాథరాజు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. దీనికోసం రెండు రోజుల్లో సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ఆయన సూచించారు. సాగునీటి ప్రాజెక్టు పనులపై ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ, జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు తదితర అంశాలను ఆయా ప్రాజెక్టుల వారీగా వివరించారు. విజయనగరం లాంటి జిల్లాకు సాగునీరు, వ్యవసాయం అత్యంత ప్రాధాన్యతాంశాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మంత్రి బొత్స సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారని చెప్పారు.
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తీవ్రమైన జాప్యం జరుగుతోందని, ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంతో సానుకూలంగా ఉన్నప్పటికీ, ప్రాజెక్టులు ఏమాత్రం ముందుకు సాగడం లేదని అన్నారు. తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి గతంలో తన హయాంలోనే సుమారు 80శాతం పనులు పూర్తి అయ్యాయని, గత ప్రభుత్వ హయాంలో మరో 12 శాతం పనులు జరిగాయని, మిగిలిన పనులను ఎప్పటికి పూర్తి చేస్తారని ప్రశ్నించారు. తారకరామ తీర్ధసాగర్ ప్రాజెక్టు విషయంలో కూడా అధికారులు నిర్లిప్తతను ప్రదర్శిస్తున్నారని అన్నారు. జిల్లాలో మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే, జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి పరిష్కరించుకొనేందుకు రెండు రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయాలని మంత్రి ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎంపి బెల్లాన చంద్రశేఖర్, ఎంఎల్ఏ బొత్స అప్పలనరసయ్య, జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, సబ్ కలెక్టర్ విదేహ ఖరే, డిఆర్ఓ ఎం.గణపతిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భవానీశంకర్, వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యుటీ కలెక్టర్లు, వివిధ ప్రాజెక్టుల ఎస్ఇలు, ఇఇ లు, డిఇలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకోవడంతో ప్రత్యేక కేంద్రాల నుంచి 30 మందిని డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. జిల్లాలో కోవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న కోవిడ్ బాధితులు బుధవారం 30 మంది కరోనా నుంచి కోలుకోగా, డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. వారిని 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని సూచించామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా సెకెండ్ వేవ్ కరోనా వైరస్ ప్రభావం అధికంగా వున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. హోమ్ ఐసోలేషన్ లోఉన్నవారు తప్పనిసరిగా ప్రభుత్వ వైద్యులు నిర్ధేశించిన మందులు, బలవర్ధక ఆహారాన్ని తీసుకోవాలన్నారు. అవసరం వుంటే తప్పా ఎవరూ బయటకు రావొద్దని కోరారు. కాచిచల్లార్చిన నీరు త్రాగడం, ఆకుకూరలు ఆహారంలో ఒక భాగాన్ని చేసుకోవాలన్నారు. ముఖ్యంగా వయస్సు మళ్లిన వారిని జాగ్రత్తగా చూడాలన్న కలెక్టర్ సామాజిక దూరం పాటిస్తూ, ఖచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. ఏ పనిచేసినా ముందు, తరువాత సబ్బుతో 30 సెకెండ్లపాటు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలన్నారు. లేదంటే నాణ్యమైన శానిటైజర్లను వినియోగించాలని కలెక్టర్ గంధం చంద్రడు సూచించారు.
అనంతపురం జిల్లాలో రెండు రోజుల్లోగా జగనన్న తోడు, వైయస్సార్ బీమా, పిఎం స్వానిధి పథకాల కింద పెండింగ్లో ఉన్న లబ్ధిదారుల దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేసి వెంటనే వారికి రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. బుధవారం సాయంత్రం డిఆర్డిఎ పిడి నరసింహారెడ్డి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ కామమూర్తి, జిల్లాలోని ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ లతో జగనన్న తోడు, వైయస్సార్ బీమా, పిఎం స్వానిధి తదితర పథకాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రత్యేకంగా జగనన్న తోడు, వైయస్సార్ బీమా, పిఎం స్వానిధి తదితర పథకాలను ప్రారంభించిందన్నారు.
ఆయా ప్రభుత్వ పథకాల కింద ఎవరికైతే రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందో వారికి ఖచ్చితంగా రుణాలు ఇవ్వగలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో వైయస్సార్ బీమా కు సంబంధించి ప్రభుత్వం ఎంతో బాధ్యతగా ప్రీమియం, బీమా సౌకర్యం కల్పించేందుకు, జగనన్న తోడు కింద అర్హులైన వారికి రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోగా, బ్యాంకర్లు ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా స్పందించడం లేదని, దీని ద్వారా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదన్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 70 బ్రాంచ్ లలో 30కి పైగా బ్రాంచ్ లలో ఇప్పటివరకూ ఒకరికి కూడా రుణాలు మంజూరు చేయలేదని, మొత్తం 12 వేల దరఖాస్తులలో 8 వేల వరకు దరఖాస్తులు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నాయన్నారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే రెండు రోజుల్లోగా పూర్తి చేయాల్సిన బాధ్యత ఆయా బ్యాంకు మేనేజర్ల పై ఉందన్నారు. కొన్ని బ్రాంచ్ లలో లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసినా వాటిని జగనన్న తోడు వెబ్సైట్లో అప్లోడ్ చేయడం లేదని, వెంటనే అప్లోడ్ చేసేలా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ధర్మవరం, రాయదుర్గం ఎస్బిఐ బ్రాంచ్ లలో ఎక్కువగా పెండింగ్లో దరఖాస్తులు ఉన్నాయని వెంటనే దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేసి రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అలాగే లబ్ధిదారులకు సంబంధించి లోన్ అకౌంట్ క్రియేట్ చేసేందుకు ఎక్కువ సమయం పట్టడం లేదని, అధికారులు ప్రత్యేక దృష్టి సారించి లోన్ అకౌంట్ క్రియేట్ చేయాలన్నారు. అలాగే పిఎం స్వానిధి పథకం కింద అర్హులైన చిరు వ్యాపారులకు రుణాలు మంజూరు చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ప్రజలకు సేవలు అందించడంలో ఆనంతపురాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపే విధంగా పంచాయితీ విస్తరణ అధికారులు, మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు పని చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కోరారు. స్థానిక జెడ్పీ కార్యాలయంలో పంచాయతీ విస్తరణ అధికారులు, మేజర్ గ్రామ పంచాయితీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ గంధం చంద్రుడు పాల్గొన్నారు. వచ్చే మార్చిలోగా ఇంటి పన్నుల బకాయిల వసూలు పూర్తి చేసి సత్తా చాటాలని ఉద్యోగులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూ సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఎస్సీ,ఎస్టీ కాలనీల పేర్లు మార్పుకు సంబంధించి కాలనీ వాసులు అభిప్రాయ వ్యక్తీకరణకు చర్యలు తీసుకోవాలని అదేశించారు. మంచి నీటి సరఫరా, ఈ- సర్వీసులు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఉద్యోగులు అలసత్వాన్ని దరిచేయనీయకుండా పనిచేయాలని విజ్ఞప్తి చేసారు. పై అధికారుల పర్యవేక్షణతో సంబంధం లేకుండా ప్రజలకు సేవలు అందించడం అలవర్చుకోవాలన్నారు. జీరో పెండెన్సీ లక్ష్యంగా పని చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలని పంచాయతీ విస్తరణ అధికారులు, మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులను డీపీవో పార్వతమ్మ కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ అధికారులను కోరారు. బుధవారం నాడు ఆయన ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం పై నియోజకవర్గం ప్రత్యేక అధికారులు, తాహశీల్దారులతో వీడియో కాన్ఫెరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి జనవరి 7వ తేదీ వరకు మండలాలు, గ్రామాల వారీగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని షెడ్యూలు చేసుకోవాలని తెలిపారు. శాసనసభ్యులతో సమన్వయం చేసుకొని కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అన్ని లేఅవుట్ లలో లెవలింగ్ పనులు, అంతర్గత రోడ్ల ఏర్పాటు సక్రమంగా వుండేలా చూసుకోవాలని తెలిపారు.
నియోజకవర్గ ప్రత్యేక అధికారులు వారి సంబంధిత నియోజకవర్గంలోని తాహశీల్దారులతో కార్యక్రమ నిర్వహణ పై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ సమస్యలను పరిష్కరించాలని కోరారు. వి.ఆర్.ఒ.లు, వి.ఆర్.ఎ.లు., గ్రామ సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు అందరినీ కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములను చేయాలని కోరారు. అన్ని లేఅవుట్ ల వద్ద బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని, లబ్దిదారుల జాబితాను, అనర్హుల జాబితాను సిద్థంగా వుంచుకోవాలని తెలిపారు.
డిసెంబరు 15వ తేదీ వరకు వచ్చిన అన్ని దరఖాస్తులను పరిష్కరించి అర్హులైన వారందరికి ఇళ్లపట్టాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, వచ్చిన ప్రతి దరఖాస్తును 90 రోజులలోగా పరిష్కరించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలను ఇస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు యం.వేణుగోపాల్ రెడ్డి, పి.అరుణ్ బాబు, డి.ఆర్.ఒ.ప్రసాద్, డ్వామా పి.డి.సందీప్, హౌసింగ్ పి.డి. శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వైయస్‌ఆర్ కడప జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయకు చేరుకున్నారు. బుధవారం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా ఇడుపులపాయకు చేరుకున్నారు. కడప ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ , ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి , ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి , విప్ కొరుముట్ల శ్రీనివాసులు , ఎమ్మెల్యేలు రవీంద్రారెడ్డి , రఘురామి రెడ్డి , మేడా మలికార్జున రెడ్డి, సుధీర్ రెడ్డి , కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి , ఎమ్మెల్సీ జకియా , కత్తి నరసింహ రెడ్డి , మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి , స్థానిక వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
విజయనగరం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లో హార్టికల్చర్ ఒక సంవత్సరం డిప్లొమా కోర్సును విద్యార్థుల అభ్యర్ధన మేరకు వీసీ ఆచార్య టివి కట్టిమని ఆదేశాల మేరకు డిప్లొమాకోర్సుగా మార్పుచేసినట్లు యూనివర్సిటీ స్పెషల్ ఆఫీసర్, ఇంచార్జి రిజిస్ట్రార్ ప్రోఫెసర్ హనుమంతు లజిపతిరాయి తెలియజేశారు. బుధవారం విద్యార్థుల అభ్యర్ధన మేరకు వీసీ ప్రోఫ్రీసర్ టివి కట్టిమని ఆదేశాల ఆదేశానుసారం కోర్సుకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబెర్లు ఏపీ హార్టికల్చర్ యూనివర్సిటీ అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ బి ప్రసన్నకుమార్, ఆంధ్రాయూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్ బి పడాల్, విజయనగరం జిల్లా డైరెక్టర్ ఆర్ శ్రీనివాసరావు సమావేశమై రెండవ సంవత్సరం సిలబస్ రూపొందించారు. ఈ కోర్సు చదివే విద్యార్థులకు జీవనోపాధి, ఉద్యోగావకాశాలు లభించే విధంగా కోర్సును రూపొందించినట్లు చెప్పారు. సమావేశంలో యూనివర్సిటీ అడ్మిన్ ఆఫీసర్ డాక్టర్ ఎన్వివిసూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల కుటంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుంటుందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా ఎస్పీ భాస్కరభూషణ్ అన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో విధినిర్వహణలో అనారోగ్యంతో మ్రుతిచెందిన హోంగార్డు లక్ష్మణ్ కుటుంబానికి రూ.4,12,510 నష్టపరిహారం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసుల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు జాగ్రత్తతోనే వుంటుందన్నారు. అయినప్పటికీ లక్ష్మణ్ అనారోగ్యంతో మ్రుతిచెందడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి పోలీసుశాఖ తోడు వుంటుందన్నారు. ఈ సందర్భంగా ఆ కుటుంబాన్ని ఓదార్చారు. ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా తమను కలవాల్సిందిగా ఎస్పీ బరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జాతీయ బి.సి కమిషన్ గౌరవ సభ్యులు ఆచారి తల్లోజు ఈ నెల 24,25 వ తేదిలలో చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త చెప్పారు. బుధవారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేషనల్ బి.సి కమిషన్ గౌరవ మెంబర్ ఈ నెల 24 వ తేది గురువారం ఉ. 11.05 ని.లకు తిరుపతి అతిధి గృహo చేరుకుని మ. 12 గం.లకు వివిధ పిటిషన్ లపైన జిల్లా కలెక్టర్, ఎస్.పి, ఆర్.డి.ఓ, బి.సి.వెల్ఫేర్ డిస్పార్ట్మెంట్ మరియు ఇతర సంబందిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు తిరుపతిలోని National Sanskrit University వైస్ చాన్సలర్, రిజిష్ట్రార్ మరియు ఇతర అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మ 2.30 గంటలకు ఎస్.వి యూనివర్సిటి లోని కాన్ఫరెన్స్ హాల్ చేరుకొని ఆంధ్రప్రదేశ్ బి.సి.వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్, యూనివర్శిటి బోధన మరియు బోధనేతర సిబ్బంది, విద్యార్థులతో సమీక్షా సమావేశం, తదుపరి అదే సమావేశ మందిరం నందు సా.3.30 గంటలకు ఎస్.వి.యూనివర్శిటి వైస్ ఛాన్సలర్, రిజిష్ట్రార్ మరియు ఇతర అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 6 గం. తిరుమల చేరుకొని రాత్రి బస చేస్తారు. 25 వ తేది శుక్రవారం ఉ. 5 గంటలకు శ్రీవారిని దర్శించుకొని తిరుపతి అతిథి గృహం చేరుకుని ఉ. 8గం.లకు టిటిడి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ఉ.9.30 గం.లకు తిరుపతి అతిథి గృహం నుండి బయలుదేరి ఉ.11.35 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని హైదరాబాదుకు తిరుగు ప్రయాణం అవుతారని జిల్లా కలెక్టర్ తెలిపారు.