"వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం" అనేది ఒక బృహత్తర పథకమని రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలంలోని ఎస్.కొత్తపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల వద్ద బుధవారం "వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం" సమగ్ర రీ సర్వేను శాస్త్రోక్తంగా భూమి పూజ చేసి, సరిహద్దు రాయిని పాతి జిల్లాలో పథకాన్ని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కాపు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంతో పక్కాగా సమగ్ర రీ సర్వేతో భూ వివాదాల కు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 21వ తేదీన కృష్ణా జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి "వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం" సమగ్ర రీ సర్వేను ప్రారంభించారని తెలిపారు. ఒక తల్లికి తన బిడ్డపై ఎంతో మమకారం ఉంటుందో భూమిపై రైతుకు కూడా అంతే మమకారం ఉంటుందన్నారు. భూమి తగాదాలు అన్నవి జీవితాలు నాశనం చేస్తాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్ప ఆలోచన చేసి మీ భూమి మా హామీ లక్ష్యంతో భూమి సమస్యలు రాకూడదని సమగ్ర సర్వే మొదలుపెట్టారన్నారు. దేశంలోనే అత్యంత సమర్థత కలిగిన ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ నాలుగో స్థానంలో నిలిచారని, సమగ్ర సర్వే ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చరిత్ర సృష్టిస్తారన్నారు. సమగ్రమైన సర్వే ద్వారా భూములకు సంబంధించి కచ్చితమైన రికార్డు ఉంటుందని, సర్వే ఆఫ్ ఇండియా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుని ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. శాటిలైట్ ద్వారా ఖచ్చితమైన కొలతలతో భూముల సర్వే చేయడం ద్వారా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలబడుతుందన్నారు. భూమి సమస్యలు తొలగాలంటే జీవిత కాలం పడుతుందని అలాంటి భూమి సమస్యలను ప్రభుత్వమే బాధ్యత తీసుకొని సర్వే చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరికి ఏ తగాదాలు లేకుండా పక్కాగా భూమి హక్కు కల్పిస్తామన్నారు. సమగ్ర సర్వే కు ప్రజలు కూడా సహాయ సహకారాలు అందించాలన్నారు. ఎలాంటి డాక్యుమెంట్లు అడగకుండా సర్వే చేయడం జరుగుతుందని, సర్వేయర్ల అంతా బాగా పని చేయాలన్నారు. పలు ప్రభుత్వ పథకాలలో అనంతపురం జిల్లా మొదటి స్థానంలో ఉందని సమగ్ర సర్వేలో కూడా అనంతపురం జిల్లా మొదటి స్థానంలో నిలిచేలా సర్వేయర్లు విధులు నిర్వహించాలన్నారు.
దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో "వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం"అమలు
: జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు
దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో "వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం"అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైగా సమగ్ర సర్వే కోసం ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో గ్రామ కంఠం భూములు, ఇంటి స్థలాలు, ప్రైవేట్ భూములు, వ్యవసాయ పొలాలు తదితర అన్ని రకాల భూములు ఎంత ఉన్నాయి అనేది సర్వే చేసి హక్కు పత్రాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. సోమందేపల్లి మండలంలోని ఎస్.కొత్తపల్లి గ్రామంలో ఒకే భూ సమస్య తమ దృష్టికి వచ్చిందని, అందుకోసం ఈ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మీ భూమి మా హామీ కింద సమగ్ర సర్వే కార్యక్రమాన్ని ఈ గ్రామంలో ప్రారంభించడం జరిగిందన్నారు. ఇది ఎంతో చారిత్రాత్మకమైన రోజని, భూముల సర్వే పక్కాగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ల్యాండ్ సర్వే లు ప్రజలంతా కొన్ని కాలాలపాటు గుర్తుంచుకునేలా అందరూ బాగా పని చేయాలని, భూముల సర్వే లో రాళ్ళు పాతడానికి ఒక్క పైసా కూడా తీసుకునేది లేదన్నారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి మాట్లాడుతూ మీ భూమి మా హామీ కింద సమగ్ర సర్వే కు ప్రజల సహకారం అందించాలన్నారు. ఎవరికి ఎంత భూమి అనేది పక్కాగా సర్వే చేయడం జరుగుతుందని, ప్రజలు సర్వేను సద్వినియోగం చేసుకోవాలన్నారు. భూమి విలువ పెరగడంతో ఘర్షణలు కూడా పెరిగాయని సర్వే కరెక్ట్ గా చేయించుకోవడం ప్రజల బాధ్యత అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్ మాట్లాడుతూ వందేళ్ల తర్వాత "వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం" కింద భూముల సమగ్ర సర్వే జరుగుతోందని, దీని ద్వారా ప్రజలకు ఎంతో మంచి జరుగుతుందన్నారు. ప్రతి కుటుంబంలోనూ భూమి సమస్యలు ఉంటాయని సమగ్ర సర్వే ద్వారా భూమి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రజలకు శాశ్వతంగా భూమి హక్కు కల్పించడం కోసం ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించిందన్నారు.
అంతకుముందు డ్రోన్ ద్వారా గ్రామంలో భూముల రీ సర్వేను విప్, కలెక్టర్ లు ప్రారంభించారు..
ఈ కార్యక్రమంలో పెనుకొండ సబ్ కలెక్టర్ నిషా0తి, సర్వే శాఖ ఏడీ మచ్చింద్రనాథ్, సర్వే ఆఫ్ ఇండియా సర్వేయర్ చక్రధరరావు, సర్వే సూపర్వైజర్ నర్సింగరావు, ఇన్స్పెక్టర్ కృపాకర్, డిఐఓఎస్ చిట్టి బాబు, ఆర్డివో లు రామ్మోహన్, మధుసూదన్, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆయా శాఖల అధికారులు, సర్వేయర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ఈనెల 28 న శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందూరు వద్ద పంపిణీ చేసే ఇంటిపట్టాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ డా.ఎస్.భరత్ గుప్తా అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్, జెసి లు , ఉన్నతాధికారులు సభా స్థలం లో జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించి, అనంతరం శ్రీకాళహస్తి తహశీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హెలిపాడ్ ఏర్పాటు, సభాస్థలికి లబ్ధిదారుల రాక , పార్కింగ్, రోడ్లు, పైలాన్ పరిశీలన ఇతర ఏర్పాట్లపై సంబందిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 28 న సభాస్థలికి ఉదయం 10:45 కు చేరుకొని ఇంటి పట్టాల పంపిణీ చేయనున్న స్థలంలో ఏర్పాటు చేసిన శిలాపలకాన్ని ప్రారంబించి, ప్రక్కనే ఏర్పాటు చేసిన సభా వేదిక చేరుకొని లబ్ధిదారుల నుద్దేశించి ప్రసంగించనున్నారని, అనంతరం ఇంటిపట్టాలను పంపిణీ చేసి మద్యాహ్నం 1:30 గంటలకు లోపు కార్యక్రమం ముగింపు కావచ్చని తెలిపారు. రేణిగుంట , ఏర్పేడు, శ్రీకాళహస్తి మండలాల్లో 16 వేల మంది లబ్దిదారులు వున్నారని, వారు ముఖ్యమంత్రి సభకు రానున్నారని తెలిపారు. 160 ఎకరాలలో వేసిన లేఔట్ల నుండి లబ్దిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ జరుగుతుందన్నారు.
జిల్లాలో ఎక్కడా లేని విధంగా 2 లక్షల 60 వేలమందికి ఇవ్వనున్న ఇంటి పట్టాల కోసం భూసేకరణ 1850 ఎకరాలు అతితక్కువ ధర రూ.370 కోట్లతో జరిగిందని వివరించారు. జిల్లా కలెక్టర్ పర్యటనలో జాయింట్ కలెక్టర్ (డి) వీరబ్రహ్మం, జెసి 2 రాజశేఖర్, అసిస్టెంట్ కలెక్టర్ విష్ణుచరణ్ తిరుపతి ఆర్డిఓ కనకనరసా రెడ్డి, తహసీల్దార్ జరీనా, హౌసింగ్ పి.డి. పద్మనాభం, పోలీస్ , పంచాయతీరాజ్ , ఆర్ అండ్ బి అధికారులు, అనధికారులు ఉన్నారు.
విశాఖలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని గౌరవ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది , క్రిడా శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పాలభిషేఖం చేసి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు కుటుంబ సభ్యులతో సహా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు ప్రసాదాలు , చిత్రపటాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో జ్యోతి మాధురి, ఏఈవో రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ.. ప్రజలందరూ అమ్మ ఆశీస్సులతో సంతోషంగా, ఆరోగ్యాలతో ఉండాలన్నారు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవటం సంతోషంగా ఉందని తెలిపారు.
విశాఖజిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ బుధవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును మర్యాద పూర్వకంగా కలిశారు. విశాఖజిల్లాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మంత్రిని కలిసి పుష్ఫగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ, అర్హులైన ప్రతీ నిరుపేదకు ఇళ్ళు అందించడంలో గృహ నిర్మాణ శాఖ కీలకంగా వ్యవహరించి ప్రభుత్వానికి పేరు తీసుకు రావాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో శాఖ అధికారులు మిగిలిన శాఖల సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఇళ్ల నిర్మాణం విషయంలో అనర్హులను దూరంగా పెట్టి అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. ఇంటి సమస్యలకు సంబంధించి ఏ సమస్యపై అర్జీలు వచ్చినా పరిష్కరించడంలో ప్రాజెక్టు డైరెక్టరుగా కీలకంగా వ్యవహరించాలని శ్రీనివాసరావుకు సూచించారు. మంత్రిని కలిసిన వారిలో డిఈలు,ఏఈలు ఉన్నారు.
విజయనగరం జిల్లా విజయాలకు ఖిల్లాగా మారింది. తాజాగా జిల్లాకు మరో స్కోచ్ అవార్డు వరించింది. హరిత విజయనగరం సాధనే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ చేసిన కృషిని గుర్తిస్తూ, స్కోచ్ కమిటీ మంగళవారం విజయనగరం జిల్లాకు రజత పురస్కారాన్నిప్రకటించింది. దీంతో జాతీయస్థాయిలో జిల్లా ఖ్యాతి మరోసారి మారుమ్రోగింది. విజయనగరం జిల్లాకు పురస్కారాల పరంపర కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్‌లాల్ అత్యంత ప్రాధాన్యతాంశాలు మూడింటిలోనూ అవార్డులను దక్కించుకోవడం ద్వారా జిల్లా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. కలెక్టర్ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా తప్పనిసరిగా మూడు నినాదాలను విరివిగా ప్రజల్లోకి తీసుకువెళ్తూ వచ్చారు. డొనేట్ రెడ్, సేవ్ బ్లూ, స్ప్రెడ్ గ్రీన్ నినాదాలు ఇప్పటికే విస్తృత ప్రాచుర్యం పొందాయి. డొనేట్ రెడ్ పేరుతో జిల్లాలో రక్తదానానికి బహుళ ప్రాచుర్యం కల్పించారు. ఈ నినాదం స్ఫూర్తితో వేలాదిమంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. ఫలితంగా రక్తదానంలో ఇండియన్ రెడ్‌క్రాస్ నుంచి జిల్లాకు పురస్కారం లభించింది.
ప్రకృతిని సంరక్షించాలని, భావితరాలకోసం నీటి వనరులను కాపాడుకోవాలని కలెక్టర్ ప్రజలకు పిలుపునివ్వడమే కాకుండా, స్వయంగా తానే చెరువులను శుద్ది చేయడానికి నడుంబిగించారు. నిత్యం ఏదో ఒక చెరువును శుద్దిచేసి, చెత్తా చెదారాలను తొలగించి, వాటి గట్లపై మొక్కలను నాటి, వందలాది చెరువులను నందన వనాలుగా తీర్చిదిద్దారు. జిల్లాలో చెరువుల సంరక్షణకు జరిగిన కృషికి గుర్తింపుగా కేంద్ర జలశక్తి శాఖ ఇటీవలే జిల్లాకు జాతీయ అవార్డును అందజేసింది. దీంతో జిల్లా ఖ్యాతి జాతీయస్థాయికి ఎగసింది.
అనునిత్యం మొక్కలను నాటడం జిల్లా కలెక్ట్‌ర్‌కు దినచర్యగా మారింది. ఈ ఏడాది ఇప్పటికే జిల్లాలో సుమారు కోటి, 36లక్షలకు పైగా మొక్కలను నాటారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించకముందు నుంచే జిల్లా కలెక్టర్ హరిత యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. హరిత విజయనగరంగా మార్చేందుకు జిల్లా కేంద్రంలోనే వేల సంఖ్యలో మొక్కలను నాటారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛంద సంస్థలు, వేలాదిమంది యువకులు పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. ఫలితంగా జిల్లాకు తాజాగా మంగళవారం సాయంత్రం స్కోచ్ అవార్డు లభించింది. అంతకుముందు జిల్లాలో కోవిడ్ నియంత్రణకు తీసుకున్న చర్యలపై కలెక్టర్ స్కోచ్ కమిటీ ముందు వర్చువల్ విధానంలో ప్రసంగించారు. అనంతరం జిల్లా రజత పురస్కారానికి ఎంపికైనట్లు ప్రకటన వెలువడింది. అదేవిధంగా స్వచ్ఛభారత్‌లో బొబ్బిలి మున్సిపాల్టీకి స్కోచ్ రజిత పురస్కారం లభించింది.
ఇటీవలే వ్యక్తిగతంగా మేన్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డును గెలుచుకున్న కలెక్టర్ హరి జవహర్‌లాల్, తాను అత్యంత ఇష్టపడే మూడు అంశాల్లోనూ అవార్డులను సాధించడం పట్ల జిల్లా అంతటగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అవార్డు ప్రకటన వెలువడిన వెంటనే, ప్రజాప్రతినిధులు, జాయింట్ కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు కలెక్టర్‌ను అభినందనలతో ముంచెత్తారు.
జిల్లా ప్రజలకు అంకితం ః కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్
హరిత యజ్ఞంలో భాగస్వాములైన ప్రతీఒక్కరికీ ఈ స్కోచ్ పురస్కారాన్ని అంకితం చేస్తున్నాను. హరిత విజయనగరం సాధన కోసం నాతో కలిసి నిత్యం అడుగులు వేసిన ప్రతీఒక్కరికీ అభినందనలు. మనందరి సమిష్టి కృషి వల్లే, ఈ మనకు ఈ అరుదైన గుర్తింపు లభించింది. ఈ అవార్డులను స్ఫూర్తిగా తీసుకొని ప్రకృతి వనరుల సంరక్షణకు, మొక్కలను నాటడానికి మనమంతా పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నా. రజత పురస్కారాన్ని గెలుచుకున్న బొబ్బిలి మున్సిపాల్టీకి ప్రత్యేక అభినందనలు.
మాదక ద్రవ్యాల వినియోగం కారణంగా పలువురి జీవితాలు తెగిన గాలిపటాల మాదిరిగా మారుతున్నాయని, మత్తు పదార్ధాల కారణంగా లభించే సౌఖ్యం క్షణికమే కాగా ఆర్థికంగానే కాకుండా ఆరోగ్య పరంగాను, సామాజిక పరంగాను ఒనగూరే నష్టాలే అధికంగా ఉంటాయని కృష్ణాజిల్లా కలెక్టర్ ఏ ఎం డి ఇంతియాజ్ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలో పోలీసులు మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు యాంటీ డ్రగ్ కార్యక్రమాలపై దృష్టి సారించారు. మత్తు పదార్ధాలు సేవించడం ద్వారా కలిగే అనర్ధాలపై ప్రజలకు వివరిస్తున్నారు. పట్టణంలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో దీనిపై ప్రచార కార్యక్రమాన్ని కొద్దిరోజులుగా నిర్వహిస్తున్నారు. కళాశాల విద్యార్థిని విద్యార్థులకు మహిళా పోలీసులు ప్రజలతో సమావేశమయ్యి మత్తు పదార్ధాల వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పిస్తున్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద నున్న పోలీస్ పెట్రోల్ బంకు నుంచి జిల్లా కోర్టు కూడలి వరకు స్థానిక పోలీసులు, కళాశాల విద్యార్థినీ విద్యార్థులచే ఒక భారీ యాంటీ డ్రగ్ ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల చివరిరోజును పురస్కరించుకుని స్థానిక కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం జిల్లా కోర్టు సెంటర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ, దేశంలో 273 జిల్లాలలో మాధకద్రవ్యాల వినియోగం అధికంగా ఉందని మన ఆంధ్రప్రదేశ్ లో 4 జిల్లాలు ఉంటే అందులో మన కృష్ణాజిల్లా బాధాకరమని అన్నారు. నషా ముఖ్త్ భారత్ లో భాగంగా కృష్ణాజిల్లాను సైతం మాదకద్రవ్యాల వినియోగం లేని జిల్లాగా రూపొందించేందుకు అందరూ నడుం బిగించాలని పిలుపు ఇచ్చారు. మత్తు పదార్థాలకు యువతీ యువకులు దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాలు సేవిస్తే జీవితాలు నాశనమవు తాయని చెప్పారు. వ్యక్తి తన కుటుంబం కోసం కొంత సాయాన్ని కేటాయిస్తే ఎన్నో అనర్ధాలు నివారించవచ్చని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ , పలు కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు, పలువురు పోలీస్ అధికారులు, మహిళా సంరక్షణా కార్యకర్తలు, ఆటో యూనియన్ ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉన్నతాధికారులు ఏ ప్రభుత్వ శాఖను తనిఖీ చేస్తే ఆ శాఖలోకి పరకాయ ప్రవేశం చేస్తేనే అక్కడి లోపాలు తెలుస్తాయ్.. ఎక్కడికి వెళ్లినా..ఏ సమస్యనైనా నిశితంగా పరిశీలించి పరిష్కరించడంలో జివిఎంసీ అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావుది ప్రత్యేక శైలి. ఈ క్రమంలోనే మంగళవారం 11వ వార్డులోని మున్సిపల్ పాఠశాలను తనిఖీ చేసిన ఆయన ఒక్కసారిగా ఉపాధ్యాయుడిగా మారిపోయారు. అక్కడి పిల్లలకు పాఠ్యాంశాలు బోధిస్తూ.. ఇతర ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు ఎలా చెబుతున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సన్నివేశంతో విద్యార్ధులు ఒక్కసారిగా తమకు కొత్త ఉపాధ్యాయ అధికారి వచ్చారా అంటూ కాస్త సందిగ్దంలో పడ్డారు. అదేసమయంలో తాను జీవిఎంసీ అధికారినని చెప్పడంతో విద్యార్ధులంతా వారి సమస్యలను, విద్యావిధానాన్ని అదనపు కమిషనర్ కి వివరించారు. ఈ సన్నివేశం చూస్తున్న మీడియాకి ఈ అధికారి ఏ శాఖ సమస్యలు తెలుసుకోవాలో ఆ శాఖను క్షుణ్ణంగా పరిశీలించడానికి ఈ విధంగా చేస్తారా అనే బ్రమ కల్పించారు. ఈ తరహా ఆకస్మిక తనిఖీల వలన ఎంతో ప్రయోజనాలుంటాయని చెబుతున్నారు సన్యాసిరావు. దానికోసమే ఈ విధంగా వారి స్టైల్ లోనే వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారాయన. అనంతరం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. పాఠశాలలో జరుగుచున్న నాడు – నేడు పనుల పురోగతిని ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతంగా పూర్తిచేయుటకు గాను సంబందిత అధికారులతో ప్రతీ రోజూ చర్చించాలని ప్రధానోపాధ్యాయునికి సూచించారు. పాఠశాల ఆవరణలో అపరిశుభ్రత వాతావరణం గమనించి శానిటరీ ఇన్ స్పెక్టరు ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. పాఠశాలలో ప్రతీ రోజూ శుభ్రం చేయాలని శానిటరీ ఇన్ స్పెక్టరు, ప్రధానోపాధ్యాయుని ఆదేశించారు. ఉపాధ్యాయులు సమయపాలన క్రమం తప్పకుండా పాటించాలని అప్పుడే విద్యార్ధులు క్రమశిక్షణతో పాఠశాలలో మెలుగుతారని ఉపాధ్యాయులకు సూచించారు. పదవ తరగతి చదువుచున్న విద్యార్ధిని, విద్యార్ధులను ప్రశ్నిస్తూ ఉపాద్యాయులు బోధిస్తున్న పాఠ్యాంశాలుపై అవగాహన గూర్చి విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకొని పరీక్షలలో ఉన్నత ర్యాంకు సాధించి తల్లిదండ్రులకు, జివిఎంసికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని విద్యార్ధినీ విద్యార్ధులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, 11వ వార్డు శానిటరీ ఇన్ స్పెక్టరు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న తోడు, జగనన్న స్వానిధి పధకాల క్రింద లబ్ధిదారులకు ఋణ మంజూరు ఇచ్చిన టార్గెట్ మేరకు పూర్తి చేయాలని బ్యాంకు అధికారులకు జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన కోరారు. మంగళవారం, జివిఎంసి పి.డి.(యు.సి.డి.) వై. శ్రీనివాసరావుతో కలసి కమిషనర్ కంచరపాలెం ప్రాంతాలలో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు బ్రాంచీలను సందర్శించి ఈ పధకం క్రింద సమర్పించిన దరఖాస్తు దారులకు టార్గెట్ మేరకు ఋణాల మంజూరు చేయడంలో జాప్యం జరుగుతుండటాన్ని గుర్తించి సంబంధిత బ్రాంచి మేనేజర్లుకు తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. ప్రతిష్టాత్మకమైనటువంటి పధకాలు క్రింద ఋణ మంజూరులో అలసత్వం ఉపేక్షించబోమని జివిఎంసి డిపాజిట్లు ఆ బ్యాంకుల వద్ద ముగించడానికి కూడా వెనకాడబోమని కమిషనర్ హెచ్చరించారు. ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులతో మాట్లాడుతూ రెండు రోజులలో పధకాల క్రింద సమర్పించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి ఋణాలు మంజూరు చేసే విధంగా తగు సూచనలు బ్రాంచ్ మేనేజర్లుకు అందించవలసినదిగా కోరారు. ఎక్కువగా దరఖాస్తులు పెండింగ్ ఉన్న బ్యాంకు బ్రాంచ్ మేనేజర్లతో ఏ.పి.డి.లు సంప్రదించి ఇచ్చిన టార్గెట్ ప్రకారంగా ఋణ మంజూరు.. ఆయా బ్యాంకులు చేసే విధంగా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని పి.డి. (యు.సి.డి.) వై. శ్రీనివాసరావు కు సూచించారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి పి.డి.(యు.సి.డి.) వై. శ్రీనివాసరావు, నాల్గవ జోనల్ కమిషనర్ పి. సింహాచలం, కమ్యునిటీ ఆర్గనైజర్లు, వార్డు సంక్షేమ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో డిసెంబర్ 25 తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాలోని ఆర్డీవోలు తహశీల్దార్లు మున్సిపల్ కమిషనర్లతో ఇళ్ల పట్టాల పంపిణీ పై జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ తో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పవిత్ర కార్యక్రమంగా భావించి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈనెల 25వ తేదీన ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు జరుగకుండా అధికారులందరూ నిబంధనలకు అనుగుణంగా విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక అజెండాలో భాగంగా ఇంటిగ్రేటెడ్ కాలనీలు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు.అందుకు అనుగుణంగా లబ్ధిదారులకు లాటరీలలో కేటాయించిన విధంగానే ఏ ఫ్లాట్ లో ఉన్న లబ్ధిదారులు ఆ ఫ్లాట్లోనే ఇళ్లు కట్టుకునేలా చూడాలన్నారు. భవిష్యత్తులో లబ్ధిదారులకు కేటాయించిన ఫ్లాట్ కాకుండా ఇతర ఫ్లాట్ లకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అన్ని మండలాలకు ఇళ్ల పట్టాలను పంపించడం జరిగిందన్నారు.ఆ పట్టాలలో జిల్లా పేరు, మండలం ,గ్రామానికి సంబంధించిన వివరాలను ముందుగానే ఒక సీల్ రూపంలో సిద్ధం చేసుకోవాలన్నారు .లబ్దిదారులకు అందించే ఇంటి పట్టాలకు సంబంధించిన కొలతలు చదరపు గజాల లో ఉండాలన్నారు. దాంతోపాటు బ్రాకెట్లలో చదరపు అడుగులు కూడా పొందుపరచాలన్నారు.అలాగే నివేశపు లే అవుట్ నెంబరు, ఆర్ ఎస్ ఆర్ నెంబరు, బ్లాక్ మరియు ఫ్లాట్ నెంబరు ఇందులో పొందు పర చాలన్నారు. లబ్ధిదారుని పట్టాలకు సంబంధించి పట్టా కట్టడడం నకు ముందు వెనక వైపు సెట్ బాక్ అడుగుల స్థల వివరాలతో సహా పూర్తిగా పొందుపరచాలన్నారు.
పట్టాలలో తాసిల్దార్ సంతకము, తేదీ, సీల్,అలాగే ఫోటోపై కూడా తాసిల్దార్ సంతకం చేయాలన్నారు. పట్టాలలో సర్వే నంబరు ,లేఅవుట్ నెంబరు తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. అందులో లబ్ధిదారులకు ఇంటి పట్టాల సరిహద్దుల వివరాలు మరియు కొలతలు కూడా పొందుపరచాలన్నారు. ఇదివరకే రూపొందించిన లేఅవుట్లలో మొక్కల పెంపకాన్ని శ్రద్ధగా చేపట్టాలన్నారు. వాటికి ట్రీగార్డులను అమర్చాలన్నారు. ఇళ్ల పట్టాలకై దరఖాస్తు చేసుకున్న 90 రోజుల పూర్తయిన వారికి డిసెంబర్ 25వ తేదీ నాటికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలన్నారు.ప్రజా ప్రతినిధులను సంప్రదించి ఇళ్ల పట్టాలకు సంబంధించి రోజువారీ పంపిణీ చేసే షెడ్యూల్ వివరాలను రేపటి సాయంత్రం లోగా తనకు పంపించాలని కలెక్టర్ సూచించారు .ప్రతి లేఔట్ వద్ద లబ్ధిదారుల జాబితాను ,వారి ప్లాట్ నెంబరు, చిరునామాలతో సహా ప్లెక్సీ రూపంలో రూపొందించి ప్రదర్శించాలన్నారు.
జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా కేంద్రాలు, రెవెన్యూ) నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ,రెవెన్యూ గ్రామాల వారీగా పట్టాలను వేరుచేసి ఉంచాలన్నారు. మున్సిపాలిటీకి సంబంధించి పట్టాలను పంపడం జరుగుతుందన్నారు .అందుకు సంబంధించి సిబ్బందిని అందుబాటులో ఉంచుకుని వెంటనే వాటిలో వివరాలు పొందుపరచాలన్నారు. ఇందుకోసం సచివాలయంలోని సిబ్బందిని ఉపయోగించుకోవలసిందిగా ఆయన సూచించారు. అందిన పట్టాలలో వివరాలన్నింటినీ పరిశీలించుకోవాలన్నారు.అనర్హుల జాబితాలో ఉన్న పేర్లతో పట్టాలు వస్తే వాటిని కలెక్టరేట్లోని ఈ సెక్షన్ కు పంపాలన్నారు.
ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి వరప్రసాద్, హౌసింగ్ పిడి వెంకటేశ్వర్ రెడ్డి ,నగరపాలక సంస్థ కమిషనర్ పి వి విఎస్ మూర్తి ,తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకోవడంతో ప్రత్యేక కేంద్రాల నుంచి 19 మందిని డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. జిల్లాలో కోవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న కోవిడ్ బాధితులు మంగళవారం 29 మంది కరోనా నుంచి కోలుకోగా, డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. వారిని 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని సూచించామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా సెకెండ్ వేవ్ కరోనా వైరస్ ప్రభావం అధికంగా వున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. హోమ్ ఐసోలేషన్ లోఉన్నవారు తప్పనిసరిగా ప్రభుత్వ వైద్యులు నిర్ధేశించిన మందులు, బలవర్ధక ఆహారాన్ని తీసుకోవాలన్నారు. అవసరం వుంటే తప్పా ఎవరూ బయటకు రావొద్దని కోరారు. కాచిచల్లార్చిన నీరు త్రాగడం, ఆకుకూరలు ఆహారంలో ఒక భాగాన్ని చేసుకోవాలన్నారు. ముఖ్యంగా వయస్సు మళ్లిన వారిని జాగ్రత్తగా చూడాలన్న కలెక్టర్ సామాజిక దూరం పాటిస్తూ, ఖచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. ఏ పనిచేసినా ముందు, తరువాత సబ్బుతో 30 సెకెండ్లపాటు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలన్నారు. లేదంటే నాణ్యమైన శానిటైజర్లను వినియోగించాలని కలెక్టర్ గంధం చంద్రడు సూచించారు.
శ్రీకాకుళం జిల్లాలో జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష (NTSE) స్టేజ్- 2 పరీక్ష ఫిబ్రవరి 14వ తేదీన నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యా శాఖ అధికారి కె.చంద్రకళ తెలిపారు. ఈ మేరకు మంగళ వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ నవంబరు 2019 లో జరిగిన జాతీయ ప్రతిభాన్వేషణ రాష్ట్ర స్థాయి (స్టేజ్ -1) పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు జాతీయ స్థాయి స్టేజ్ -2 పరీక్ష 2021 ఫిబ్రవరి 14న విశాఖపట్నంలో జరుగుతుందన్నారు. ఈ పరీక్ష కేంద్రం (ఎక్సమినేషన్ సెంటర్) మార్చుకోవాలని ఆశించే విద్యార్థులు ఈ నెల 28 లోగా ntsexam.ncert@nic.in అనే ఈ మెయిల్ ద్వారా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్.సి.ఈ.ఆర్.టీ) వారికి తెలియజేయాలని ఆమె పేర్కొన్నారు. పూర్తి వివరములకు ఎన్.సి.ఈ.ఆర్.టీ వెబ్ సైటు www.ncert.nic.in ను సంప్రదించవచ్చని ఆమె వివరించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ఇంటి పట్టాల పంపిణీ కోసం సిద్ధం చేసిన ప్రభుత్వ లేఔట్ లను ప్రైవేటు లేఔట్లు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉండేలా అన్ని రకాలుగా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. మంగళవారం తాడిపత్రి పట్టణ పరిధిలోని లబ్ధిదారులకు అందజేసేందుకు యర్రగుంటపల్లి గ్రామం వద్ద, ఆర్డీటీ కాలనీ (గన్నవారిపల్లి కాలనీ)వద్ద, సజ్జలదిన్నె గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన ఇంటి పట్టాల లేఔట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటి పట్టాల పంపిణీ కోసం సిద్ధం చేసిన లేఔట్ లలో సకల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రతి లేఔట్ వద్ద లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లాటరీలలో కేటాయించిన విధంగానే ఏ ఫ్లాట్ లో ఉన్న లబ్ధిదారులు ఆ ఫ్లాట్లోనే ఇళ్లు కట్టుకునేలా చూడాలన్నారు. భవిష్యత్తులో లబ్ధిదారులకు కేటాయించిన ఫ్లాట్ కాకుండా ఇతర ఫ్లాట్ లకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. భవిష్యత్తులో ఎప్పుడు ఎవరు వచ్చి తనిఖీ చేసినా కేటాయించిన ఇంటి స్థలం లోనే ఆ యజమాని ఉండేవిధంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
తాడపత్రి పట్టణ లబ్ధిదారులకు అందజేసేందుకు రూరల్ పరిధిలోని యర్రగుంటపల్లి గ్రామం వద్ద సిద్ధం చేస్తున్న లేఔట్లో పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఆర్డీటీ కాలనీ (గన్నవారిపల్లి కాలనీ)వద్ద లేఔట్ లో అన్ని రకాల పనులు పూర్తి చేయడంపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. సజ్జలదిన్నె వద్ద సిద్ధం చేసిన లేఔట్ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా లేదని, వెంటనే పూర్తిస్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లేఔట్ ను సిద్ధం చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లేఔట్లకు సంబంధించి మ్యాప్ లను పరిశీలించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ తాడిపత్రి మున్సిపాలిటీని పరిశీలించి పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు జిల్లా కలెక్టర్ కు తమ సమస్యలను వివరించారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వర్ నాయుడు, మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, తహసీల్దార్ నాగభూషణ, ఈఓఆర్డీ జిలాన్ భాష, ఏపీఓ గంగరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్య మంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు విశాఖలోని 39 వార్డు లో గల మదర్ ఏ సా దావతుల్ హఖ్ అరబ్బిక్ స్కూలులో ఏపి బిసిషేక్ కార్పొరేషన్ డైరెక్టర్ సబీరా బేగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం పాఠశాలలోని చిన్నారులకు పండ్లు పంపిణీ చేసి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, బిసిలకు అత్యున్నత స్థానాన్ని కల్పించిన డైనమిక్ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మాత్రమేనని అన్నారు. అలాంటి తమ అధినేత పుట్టినరోజు వేడుకలను చిన్నారుల సమక్షంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా వుందన్నారు. జగనన్నకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టమని, ఆయన ఇష్టానికి అనుగుణంగా చిన్నారుల మధ్య ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకున్నామన్నారు. బీసీలంతా సీఎం వెంటే ఉంటారని, దేశంలోనే తిరుగులేని సీఎం జగన్ మాత్రమేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మదర్సా ఇమామ్, హఫీస్, ఓవైష్ కర్ణి, అయాజ్ కేసర్, ఎజాజ్ అహ్మద్, జ్యోతి భాస్కర్, సద్దాం హుస్సేన్, సయ్యద్ అఫ్రిది అంబాబు తదితరులు పాల్గొన్నారు.
క్రీస్తు బోధనలతో శాంతి యుత సమాజం ఏర్పడుతుందని సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్టమస్ సందర్భంగా తేనీటి విందు కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా జె.సి. మాట్లాడుతూ, మానవాళి మనుగడకు, సమాజ అభ్యన్నతికి, శాంతి యుత సమాజ స్థాపనకు క్రీస్తు బోధనలు అవసరమని అన్నారు. క్రీస్తు ప్రభోదాలు ఆచరణీయమని, సమాజానికి ఎంతో అవసరమని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సర్వతోముఖాభివృద్ది సాధించాలని కోరుకుంటున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని, అన్నారు. అందరూ మత సామరస్యంతో ఉండాలని, జిల్లా లో శాంతి ఎప్పటి వలె కొనసాగాలని, క్రిస్మస్ అన్ని కుటుంబాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని నింపాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. క్రైస్తవులకు ప్రభుత్వం మంజూరు చేసిన స్థలానికి అవసరమగు సహాయాన్ని అందించుటకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బిషప్ డి.ఎస్.వి.ఎస్.కుమార్ క్రీస్తు సందేశాన్ని వినిపించారు.
భగవంతుని చేరుకునే మార్గాన్ని చూపడానికి దేవుని బిడ్డగా భూమిపై అవతరించిన మహాపురుషుడు ఏసు క్రీస్తు అని తెలిపారు. సర్వమానవాళికి రక్షకుడు, ప్రేమ స్వరూపుడు, ఓర్పు, సహనం, ప్రేమ, సేవాభావాలను మానవాళికి తెలియ చెప్పాడని తెలిపారు.
జిల్లా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ అధికారి పి.నీలకంఠం మైనారిటీ సంక్షేమశాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా జె.సి. క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. మత పెద్దలు ప్రార్థనలు చేశారు. ప్రధాన మంత్రి 15 సుత్రాల కార్యక్రమం కమిటీ సభ్యులు పి. కృపానందం స్వాగతం చెప్పారు. సి.హెచ్.ప్రేమ్ కుమార్, ఎచ్చెర్ల పాస్టర్ల అధ్యక్షులు సామ్యూల్ ప్రార్ధనలు చేసారు. క్రొవ్వొత్తులను వెలిగించి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో, ప్రధాన మంత్రి 15 సూత్రాల కార్యక్రమం సభ్యులు మహిబుల్లా ఖాన్, జ్ఞాన రాజు, ఆండ్రూస్, డి.వి.డి.వి.కుమార్, పాస్టర్ బర్నాబాస్, సామ్యూల్, క్రిస్టియన్ మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
వివాద రహిత భూమిని ఆవిష్కరించడమే మీ భూమి మా హామీ ఆశయమని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. వై.యస్.ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్ష పథకం భూముల సమగ్ర సర్వే 2020 మీ భూమి - మా హామీ కార్యక్రమంను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ సొంత మండలం, పొలాకి మండలం కొండ లక్కివలస గ్రామంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం ప్రారంభించారు. కొండలక్కివలస గ్రామంలో 314 ఎకరాల భూమి, 205 మంది రైతులు ఉన్నారు. 169 ఎకరాలు జిరాయితి భూమి కాగా, 145 ఎకరాలు ప్రభుత్వ భూమిగా ఉంది. వివాదాలు లేకుండా భూమి ఉండాలని రైతులు కోరుకుంటున్నారని స్పీకర్ అన్నారు. వివాదాలు ఉంటే రైతుకు వేదన ఉంటుందని చెప్పారు. రైతు వేదన తీర్చుటకు ప్రభుత్వం సంకల్పించిందని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సర్వే చేపట్టడం జరుగుతుందని అన్నారు. మూడు దశలుగా జరుగుతుందని అందరూ సహకరించాలని కోరారు.
సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో రీ సర్వే కార్యక్రమం ను ప్రభుత్వం చేపడుతుందన అన్నారు. రాష్ట్రంలో 4,500 బృందాలు పనిచేస్తాయని చెప్పారు. 17 వేల గ్రామాల్లో 2.62 కోట్ల ఎకరాల్లో రీ సర్వే రాష్ట్రంలో జరుగుతుందని స్పీకర్ తెలిపారు. జిల్లాలో సమర్థవంతమైన అధికార యంత్రాంగం ఉందని, రీ సర్వే విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 13375 గ్రామాల్లో 40 లక్షల ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయని,110 పట్టణ ప్రాంతాల్లో 10 లక్షల ఆస్తులు ఉన్నాయని వాటిని రీ సర్వేలో గుర్తించడం జరుగుతుందని వివరించారు. అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులను సక్రమంగా చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. గ్రామ సచివాలయంలో భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. ప్రభుత్వానికి ఒక లక్ష్యం ఉందని స్పీకర్ పేర్కొన్నారు. రీ సర్వే పక్కాగా జరుగుతుందని ఆయన చెప్పారు. రీ సర్వే కార్యక్రమం దేశానికే మార్గదర్శనం చేస్తుందని, తలమానికంగా ఉంటుందని ఆయన అన్నారు. మీ ఆస్తికి రక్షణ, హక్కు ఈ కార్యక్రమం కల్పిస్తుందని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో 50 శాతం భూ వివాదాలకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ఆంగ్లేయులు వంద సంవత్సరాలు క్రితం సర్వే చేశారని, 60 సంవత్సరాలు క్రితం రీ సర్వే చేశారని చెప్పారు. ప్రస్తుత రీ సర్వే వలన 95 శాతం మందికి మంచి ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు. సంవత్సరానికి మూడో వంతు గ్రామాల్లో సర్వే జరుగుతుందని వివరించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో కార్యక్రమంను చేపడుతుందని, రైతులు సహకరించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. మీ భూమి మా హమీ అంటూ ప్రభుత్వం భరోసా ఇస్తుందని కలెక్టర్ అన్నారు. రీ సర్వే అనంతరం గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ చేయుటకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. గ్రామ భవిష్యత్తు దృష్ట్యా ప్రజలు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు.
జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ప్రయోగాత్మకంగా కొండ లక్కివలస గ్రామంలో చేపట్టడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో సంవత్సర కాలంలో 621 గ్రామాల్లో రీ సర్వే చేస్తామని అన్నారు. రైతులు సహకరించాలని కోరారు. భూ వివాదాలు నివారణకు ఒక బృందం ఉంటుందని, వెంటనే పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ జరుగుతుందని చెప్పారు. గ్రామాల్లో సరిహద్దు నిర్ణయంతో సహా ప్రభుత్వ భూమి, ఇతర భూములు గుర్తింపు చేసి డిజిటల్ పత్రాలు జారీ చేస్తామని చెప్పారు.
జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి మాట్లాడుతూ రైతు వివరాలు రెవెన్యూ రికార్డులలో సక్రమంగా నమోదు కావాలని అన్నారు. రైతు వద్ద హక్కు పత్రాలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. పెద్ద కార్యక్రమమని, ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో అర్హత కలిగిన సర్వేయర్లు ఉన్నారని పేర్కొన్నారు. సర్వే జరగడం వలన రైతులకు పూర్తి రక్షణ ఉంటుందని ఆయన చెప్పారు. భూ వివాదాలు లేకపోవడంతో భూముల విలువ పెరుగుతుందని, అదనంగా భూమి సాగులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఐ.కిషోర్, సర్వే సహాయ సంచాలకులు కె.ప్రభాకర్, మాజీ కేంద్ర మంత్రి డా.కిల్లి కృపారాణి, జిల్లా వ్యవసాయ సలహా సంఘం ఛైర్మన్ కరిమి రాజేశ్వరరావు, కాళింగ కార్పొరేషన్ డైరెక్టర్ కంది కృష్ణా రావు, స్థానిక నాయకులు డా.ధర్మాన క్రిష్ణ చైతన్య, తమ్మినేని భూషణం, తహసీల్దార్లు శ్రీనివాసరావు, సింహాచలం, ప్రవల్లిక., ఎం.పి.డి.ఓ రాధాకృష్ణ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.