1 ENS Live Breaking News

ఇంత పెద్ద స్థాయిలో ఇళ్ల స్థలాల పంపిణీ ఆమోఘం..

రాష్ట్రంలో నిరుపేద‌ల సొంతింటి క‌ల‌లు నెర‌వేరే రోజు ఆస‌న్న‌మ‌య్యింది. ముఖ్య‌మంత్రి  వై.ఎస్‌.జ‌గన్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని ఏ.పి. ప్ర‌భుత్వం చేప‌ట్టిన న‌వ‌ర‌త్నాలు కార్య‌క్ర‌మం వారి సొంతింటి క‌ల‌ల్ని సాకారం చేయ‌నుంది. న‌వ‌రత్నాల్లో భాగంగా పేద‌లంద‌రికీ ఇళ్లు పేరుతో రాష్ట్రంలోని ప్ర‌తి అర్హులైన నిరుపేద‌కు ఇంటి స్థ‌లంతోపాటు ఇళ్లు నిర్మించుకొనేందుకు అవ‌స‌ర‌మైన ఆర్ధిక స‌హాయం అందించేందుకు రాష్ట్ర చ‌రిత్ర‌లోనే ఎన్న‌డూ లేనంత స్థాయిలో ఈ కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర‌‌ ప్ర‌భుత్వం చేప‌ట్టింది. జిల్లా వ్యాప్తంగా డిసెంబ‌రు 25న జిల్లాలో ఈ కార్య‌క్ర‌మం ప్రారంభం కానుంది. జిల్లాలోని ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో మంత్రులు, శాస‌న‌స‌భ్యులు ఈ కార్య‌క్ర‌మాన్ని శుక్ర‌వారం ప్రారంభించ‌నున్నారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఆరోజు మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు ప్రారంభించిన అనంత‌రం రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఈ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మ‌వుతుంది. ఒక్క విజ‌య‌న‌గ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ఈనెల 30న సి.ఎం. ప్రారంభిస్తారు. జిల్లాలో గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ద్వారా గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో చేప‌ట్టిన ల‌బ్దిదారుల గుర్తింపు ప్ర‌క్రియ ద్వారా జిల్లా యంత్రాంగం ఇళ్లులేని 71,249 నిరుపేద కుటుంబాల‌ను గుర్తించి వారంద‌రికీ ఇళ్ల స్థ‌లాలు మంజూరు చేసేందుకు అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ‌ ఏర్పాట్లు చేసింది. వీరంద‌రికీ ఇళ్ల‌స్థ‌లాలు మంజూరు చేసేందుకు గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో 1830.82 ఎక‌రాల‌ను సేక‌రించారు. ఇందులో 1140 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని గుర్తించ‌గా, 690.82 ఎక‌రాల ప్రైవేటు భూముల‌ను సేక‌రించారు. సుమారు రూ.228 కోట్ల‌ను ప్రైవేటు భూముల సేక‌ర‌ణ‌కు ఇప్పటివ‌ర‌కు ఖ‌ర్చు చేశారు. సేక‌రించిన భూముల్లో 1164 లే అవుట్‌లు అభివృద్ధి చేసి ల‌బ్దిదారులుగా గుర్తించిన వారంద‌రికీ ఇళ్ల‌స్థ‌లాలు అంద‌జేసేందుకు జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం గ‌త ఏడాది కాలంగా అన్ని ఏర్పాట్లు చేసింది. విజ‌య‌న‌గ‌రం డివిజ‌న్‌లో 547, పార్వ‌తీపురం డివిజ‌న్‌లో 573 లే అవుట్‌లు అభివృద్ధి చేశారు. ఈ లే అవుట్‌ల‌ను ప్రైవేటు రియ‌ల్ ఎస్టేట్ లే అవుట్ల‌కు ఏమాత్రం తీసిపోని  రీతిలో రోడ్లు, క‌మ్యూనిటీ స్థ‌లాలు త‌దిత‌ర‌ అన్ని సౌక‌ర్యాల‌తో అభివృద్ధి చేశారు. ఈ లేవుట్లలో మంజూరు చేసే ఇళ్ల ప‌ట్టాల‌న్నీ కుటుంబంలోని మ‌హిళ‌ల పేరుతోనే అందించ‌నున్నారు. ఇళ్ల స్థ‌లాల‌ను మంజూరు చేయ‌డంతో పాటు ఆయా స్థ‌లాల్లో ల‌బ్దిదారుల‌కు ఇళ్లు కూడా మంజూరు చేస్తున్నారు. జిల్లాలో తొలివిడ‌త‌గా 98,286 ఇళ్లు ఒక్కొక్కటి రూ.1.80 ల‌క్ష‌ల వ్యయంతో మంజూరు చేస్తున్న‌ట్టు జిల్లా గృహ‌నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైర‌క్ట‌ర్ ఎస్‌.వి.ర‌మ‌ణ‌మూర్తి చెప్పారు. లబ్దిదారులు తామే సొంతంగా నిర్మించుకుంటే వారికి ప్ర‌భుత్వం నుండి నిధులు మంజూరు చేస్తామ‌ని, లేదంటే ఇంటి నిర్మాణ సామాగ్రి రూపంలో ప్ర‌భుత్వ స‌హాయం కోరుకుంటే ఆవిధంగా సామాగ్రి అంద‌జేస్తామ‌ని, లేక ప్ర‌భుత్వ‌మే ఇళ్లు నిర్మించి ఇవ్వాల‌ని ల‌బ్దిదారులు కోరుకుంటే నిర్మించి ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. జిల్లాలో ప్ర‌భుత్వం మంజూరు చేసిన లే అవుట్ల‌తోపాటు, సొంత ఇంటి స్థ‌లాలు క‌లిగి వుండి త‌మ స్థ‌లంలోనే ఇళ్లు నిర్మించుకొనే వారికి కూడా ఇళ్ల‌ను మంజూరు చేస్తున్న‌ట్టు చెప్పారు. వీటితోపాటు గ‌తంలోనే ప్ర‌భుత్వ స్థ‌లాల్లో ఇళ్లు నిర్మించుకొన్న 25,274 మంది నిరుపేద‌ల‌కు వారు నిర్మించుకొన్న ఇళ్ల‌కు పొసెష‌న్ స‌ర్టిఫికెట్ల‌ను కూడా జారీచేయ‌నున్నారు. ఏ.పి.టిడ్కో ద్వారా నిర్మించిన 8,048 ఇళ్ల‌ను కూడా పట్ట‌ణ ప్రాంత నిరుపేద‌ల‌కు ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా కేటాయించనున్నారు. ఈ కార్య‌క్ర‌మాల‌న్నింటి ద్వారా జిల్లాలో 1,08,230 నిరుపేద కుటుంబాలు ల‌బ్ది పొంద‌నున్నాయి. రాష్ట్రంలోని అతి పెద్ద లే అవుట్ల‌లో ఒకటైన గుంక‌లాంలో 12,301 మందికి ఒకేచోట ఇళ్ల స్థ‌లాల‌ను కేటాయిస్తున్నారు. ఇక్క‌డి లేఅవుట్‌లో ఇళ్ల‌స్థ‌లాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించే నిమిత్తం రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈనెల 30న జిల్లాకు వ‌స్తున్నారు. ఇప్ప‌టికే జిల్లా క‌లెక్ట‌ర్ డా.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం గుంక‌లాం లే అవుట్‌లో ముమ్మ‌రంగా ఏర్పాట్లు చేస్తోంది. నా కెరీర్‌లో మ‌ర‌చిపోలేను; ‌జిల్లా క‌లెక్ట‌ర్ డా.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్‌ జిల్లా చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఈ స్థాయిలో పేద‌ల‌కు ఇళ్ల‌స్థ‌లాల పంపిణీ, ఇళ్ల‌నిర్మాణ కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌లేద‌ని, ఈ కార్య‌క్ర‌మంలో తాను కూడా భాగస్వామి కావ‌డం ఆనందంగా వుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ అన్నారు. రెవిన్యూ యంత్రాంగం ఇళ్ల‌స్థ‌లాల‌ భూసేక‌ర‌ణ‌ను ఒక పెద్ద స‌వాలుగా తీసుకొని చేప‌ట్టింద‌ని పేర్కొన్నారు. జిల్లా క‌లెక్ట‌ర్‌గా వేలాది మంది నిరుపేద‌ల‌కు ఇళ్ల‌స్థ‌లాలు అందించే అవ‌కాశం ముఖ్య‌మంత్రి చేప‌ట్టిన  న‌వ‌రత్నాలు కార్య‌క్ర‌మం ద్వారానే త‌న‌కు ల‌భించింద‌న్నారు. ఇదేవిధంగా గిరిజ‌నుల‌కు అట‌వీ భూముల‌పై హ‌క్కులు క‌ల్పిస్తూ వేలాది గిరిజ‌నుల‌కు ప‌ట్టాలు అందించ‌డం, సుమారు 5వేల మంది స‌చివాల‌య సిబ్బందికి నియామ‌కాలు జ‌ర‌ప‌డం వంటివి త‌న జీవిత‌కాలంలో మ‌ర‌చిపోలేన‌ని అన్నారు.

Vizianagaram

2020-12-24 17:56:34

"బిల్లు" వినియోగదారుని చేతిలో వజ్రాయుధం..

ఏ వస్తువైనా  కొనేటప్పుడు తప్పకుండా బిల్లు తీసుకోవాలని, అది వినియోగదారుని చేతిలో వజ్రాయుధం లాంటిదని జేసీ కిషోర్ కుమార్ అన్నారు. బిల్లు ఇవ్వకపోతే అస్సలు వస్తువులు కొనొద్దని, బిల్లు అడిగి తీసుకోవడం వినియోగదారుని హక్కు అని పేర్కొన్నారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌరసరఫరాల శాఖల ఆధ్వర్యంలో దాసన్నపేట రైతు బజారులో గురువారం 34వ జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జేసీ కిషోర్ కుమార్ ఈ సందర్భంగా వినియోగదారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి వినియోగదారుడూ వినియోగదారుల పరిరక్షణ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, నిత్య జీవితంలో దానిని సమృద్ధిగా వినియోగించుకోవాలని సూచించారు. అమ్మకం దారులు లాభార్జనే ప్రధానం కాకుండా, నాణ్యమైన వస్తువును వినియోగదారుడికి అందజేయాలని అప్పుడే ఆరోగ్యకరమైన సమాజం నిర్మితమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వినియోగదారుడు, కొనుగోలుదారుడు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అప్పుడే వినియోగదారుల చట్టం ఫలాలు అందుతాయని అన్నారు. తూనికలు కొలతలు, ఆహార నియంత్రణ, పౌరసరఫరాల శాఖల అధికారులు భాద్యతగా వ్యవహరించి వినియోగదారుడికి మంచి సరుకు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి మండలానికి ఒక సభ్యుడిని నియమించి అతని ద్వారా ప్రజా ఫిర్యాదులు స్వీకరించే వెసులుబాటు త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా వినియోగదారుడికి సత్వర న్యాయం అందుతుందని, సత్ఫలితాలు చేకూరుతాయని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల సేవా కేంద్రం అధ్యక్షుడు చదలవాడ ప్రసాదరావు, డి.ఎస్.వో. పాపారావు, పౌర సరఫరాల డి.ఎం. వరకుమార్, మార్కెటింగ్ శాఖ ఎ.డి. శ్యామ్ కుమార్, ఆహార నియంత్రణ అధికారి ఈశ్వరి, లీగల్ మెట్రోలజీ అధికారి జగన్నాథరావు, డీలర్లు, వినియోగదారులు, రైతు బజార్ అధికారులు, మార్కెటింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2020-12-24 17:48:31

వినియోగదారులు చైతన్యం కావాలి..

వినియోగదారులు ఎంతో చైతన్యవంతంగా ఉన్నరోజునే సమస్యల నుంచి బయటపడానికి అవకాశం వుంటుందని జెసి నిశాంత్ కుమార్ అన్నారు. గురువారం అనంతపురం  కలెక్టరేట్  ఆవరణంలోని రెవెన్యూ భవన్ లో వినియోగ దారుల హక్కు చట్టం-2019 పై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా పౌర సంబంధాల శాఖ నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా జెసి హాజరయ్యారు. దేశంలో వినియోగదారుడు వస్తువులు కొనుగోలు చేసే ప్రక్రియలో మార్పులు చోటు చేసుకుంటున్నందున వాళ్ల హక్కులను కాపాడేందుకు జాతీయ వినియోగ దారుల చట్టం-2019 ని తీసుకొచ్చారనీ.. చట్టం ద్వారా పొందిన హక్కుల గురించి ప్రజలు అవగాహన పెంచుకోవాలని జేసీ నిశాంత్ కుమార్ కోరారు. నూతన చట్టం ద్వారా ఆన్ లైన్ లో అమ్మకాలు చేపట్టేవారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. వినియోగ దారుల హక్కుల కోసం దేశ స్థాయిలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. జిల్లా వినియోగదారుల ఫోరం విచారణ పరిధిని పెంచారన్నారు. గతంలో రూ.20 లక్షల వరకూ జరిగిన కొనుగోలుపై మాత్రమే విచారణ జరిపేందుకు వినియోగ దారుల ఫోరంకు అవకాశం ఉండగా.. నూతన చట్టంలో కోటి రూపాయల వరకూ పరిధి పెంచారన్నారు. చదువుకునే రోజుల్లో వినియోగ దారుల హక్కు చట్టం-1986 ద్వారా సెల్ ఫోన్ పాడైపోయిన అంశంలో న్యాయపోరాటం చేసి కొత్త  సెల్ ఫోన్ తో పాటూ న్యాయ పోరాటానికి అయిన ఖర్చులు కూడా పొందిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. వినియోగ దారులు తమ హక్కులను డిమాండ్ చేయగలిగితేనే అమ్మకందారులు నాణ్యమైన సరుకులు, సేవలు అందించడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో తూనికల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ స్వామి ప్రసంగించారు. తూనికల శాఖ తూనికల్లో, నాణ్యతలో మోసాలు చేసేవారిపై చర్యలు తీసుకోగలుగుతుందే కానీ మోసపోయిన వినియోగదారుడికి న్యాయం చేయలేదనీ.. వారికి న్యాయం చేసేందుకే వినియోగదారుల హక్కుల చట్టం ఉందన్నారు. మనకు ఏదైనా సమస్య వస్తే దాని పరిష్కారం కోసం ఎవరిని సంప్రదించాలో తెలియడమే అవగాహన అనీ.. ప్రజలు జిల్లాలోని ఏ సమస్యకైనా పరిష్కారం కోసం ఎవరిని సంప్రదించాలో తెలియకపోతే జిల్లా సమాచార కేంద్రాలను సంప్రదిస్తే సరిపోతుందన్నారు. ఏ సమాచారం లేనివారికి జిల్లా సమాచార కేంద్రం అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా సరఫరాల అధికారి రఘురామి రెడ్డి, పౌర సరఫరాల శాఖ డీఎం మోహన్ ప్రసాద్, డీసీఐసీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, డీసీఐసీ సెక్రెటరీ నబీ రసూల్, ఇండియన్ ఆయిల్ సేల్స్ ఆఫీసర్ సిద్దార్థ్ పాత్రా, హెచ్.పీ.సీ.ఎల్ సేల్స్ ఆఫీసర్(ఎల్పీజీ) అనుశూల్ తదితరులు పాల్గొన్నారు. 

Anantapur

2020-12-24 16:41:35

టిడ్కో ఇళ్ల పంపిణీని స్వాగతిస్తున్నాం..

టిడిపి ప్రభుత్వ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లను ప్రభుత్వం ప్రజలకు పంపిణీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్ డీ నజీర్ అన్నారు. గురువారం విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టిడ్కో ఇళ్లను పంపిణీ చెయ్యకపోతే సంక్రాంతికి  లబ్దిదారులందరినీ ఏకంచేసి తెలుగుదేశం ఆధ్వర్యంలో పంపిణీ చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టిందని తెలిపారు. సొమ్మొకడిది సోకొకడిది అన్న రీతిలో  తెలుగుదేశం నిర్మించిన టిడ్కో ఇళ్లను వైసీపీ పంపిణీ చేస్తోందని ఎద్దేవా చేసారు. దాదాపు రెండు లక్షల అరవై రెండు వేల రెండువందల పదహారు ఇళ్లను తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించినట్లు తెలిపారు. అర్హులందరికీ ఇవ్వాలని అనేక మార్లు విజ్ఞప్తి చేస్తే దాదాపు పద్దెనిమిది నెలలుగా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అధికారం చేపట్టి దాదాపు రెండేళ్ళైనా కనీసం రెండు ఇళ్ళు కూడా కట్టలేకపోయారన్నారు. అలాగే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా చేపడుతున్నారని, తెలుగుదేశం హయాంలో దాదాపు అరవై వేల ఎకరాలను సేకరించామన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు ఇళ్ల పట్టాల భూసేకరణలో దాదాపు నాలుగువేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారని నజీర్ ఆరోపించారు. పావలా పనిచేసి ముప్పావలా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇప్పటికైనా సక్రమంగా లబ్దిదారులను ఎంపికచేసి అర్హులైన ప్రతీవారికీ టిడ్కో ఇళ్ళు లేదా ఇళ్ల పట్టాలను పారదర్శకంగా పంపిణీ చెయ్యాలని డిమాండ్ చేసారు. రాష్ట్ర సమావేశంలో అబ్దుల్ చిన్నరెహమాన్,దొడ్డిరామానంద్,నడిగట్లశంకర్రావు,ఉరికుటిపైడిరాజు,షేక్ రహంతుల్లా, మహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-12-24 16:35:41

బిసిలకు ఉన్నత స్థానం సీఎం జగన్ చలవే..

తూర్పు కాపుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ అన్నారు. గురువారం విశాఖలో అయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి  బీసీలను గుర్తించి కార్పేరషన్లు ఏర్పాటు చేశారన్నారు. సీఎం జగన్ ఆశయాలమేరకు పనిచేస్తూ కాపుల అభ్యున్నతికి క్రుషి చేస్తానని అన్నారు. 56  కార్పొరేషన్లు ఏర్పాటుచేసి 56 మందిని చైర్మన్లుగా,672  మందిని డైరెక్టర్లుగా నియమించిన చరిత్ర సృష్టించిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. విద్య వైద్య,ఉపాధి తదితర అంశాలపై ద్రుష్టి సారిస్తామన్నారు. త్వరలోనే కార్పొరేషన్ కు కావలసిన నిధులు విడుదల అవుతాయని ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రభుత్వ పధకాలు అందరికీ చేరేలా కృషి చేస్తామని శ్రీకాంత్ తెలిపారు. బీసీలు చిరకాలం జగన్ మోహన్ రెడ్డి మేలు మర్చిపోలేరన్నారు. తమ కులానికి ప్రత్యేక గుర్తింపునిచ్చిన జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సమావేశంలో కార్పొరేషన్ డైరెక్టర్లు,కాపు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని చైర్మను సత్కరించారు. కార్యక్రమంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-12-24 16:34:25

శానిటేషన్ సిబ్బంది సేవలు భేష్..

కొవిడ్‌-19 సమయంలో సానిటరీ సిబ్బంది అందించిన సేవలు స్ఫూర్తిదాయమని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు, వైెస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్‌విప్‌ మార్గాని భరత్‌ రామ్‌ అన్నారు. గురువారం విఎల్‌ పురంలోని ఎంపీ కార్యాలయంలో  31వ వార్డుకు చెందిన వలంటీర్లు, శానిటరీ వర్కర్లు, వాటర్‌ వర్స్క్‌ సిబ్బంది, రేషన్‌ షాపుల డీలర్లకు మాజీ కార్పొరేటర్‌ మజ్జి నూకారత్నం, వైెస్సార్సీపీ బీసీ సెల్‌ నగర అధ్యక్షుడు మజ్జి అప్పారావు ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమం నిర్వహించారు.  ముఖ్య అతిథిగా ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ పాల్గొని సిబ్బందిని ఘనంగా సత్కరించారు. ఈ సరంద్భంగా ఎంపీ మాట్లాడుతూ, కొవిడ్‌ -19 సమయంలో ఆ వ్యాధి వ్యాప్తి చెందకుండా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం ప్రజలకు సేవలు అందించిన వారికి ఎంత చేసినా తక్కువనేనని అన్నారు. ముఖ్యంగా వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బందితోపాటు, వార్డు వలంటీర్లు, వాటర్‌ వర్స్క్‌ సిబ్బంది, రేషన్‌ షాపుల డీలర్లు అందించిన సేవలు మరువలేనివని అన్నారు. వార్డు వలంటీర్లు, వాటర్‌ వర్స్క్‌ సిబ్బంది, రేషన్‌ షాపుల డీలర్లుకు శాలువాలతో సత్కరించి మెమోంటోలను ఎంపీ అందించారు. ఈ కార్యక్రమంలో వైెస్సార్సీపీ రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్‌, తదితరులు పాల్గొన్నారు.

విఎల్ పురం

2020-12-24 16:15:56

శ్రీ కనకమహాలక్ష్మికి గంట్ల ప్రత్యేక పూజలు..

మార్గశిర మాసోత్సవం సందర్భంగా  జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గురువారం విశాఖలోని అమ్మవారి దేవస్థానంలో శ్రీనుబాబు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో జర్నలిస్టుల కష్టాలు తొలగి శుభిక్షంగా ఉండేలా చూడమని కనకమహాలక్ష్మి అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు. తన సేవలు పూర్తిగా జర్నలిస్టులకే అంకితమని చెప్పారు. ధనుర్మాసంలో అమ్మవారి దర్శనం అపురూపంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఇటీవలే జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వంలోని పెద్దలకు వినతిపత్రాలు సమర్పించామన్నారు. అటు ప్రభుత్వం నుంచి జర్నలిస్టుల పట్ల సానుకూల స్పందనే వుందని శ్రీనుబాబు వివరించారు.

విశాఖపట్నం

2020-12-24 14:30:31

స్నేహలత కుటుంబానికి అండగా ఉంటాం..

స్నేహలత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. జిల్లాలో ఒక రోజు పర్యటనలో భాగంగా గురువారం స్థానిక అశోక్ నగర్ కు చెందిన హత్యకు గురైన స్నేహలత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియపరిచారు. అంతకుమునుపు ఆమె స్నేహలత మృతదేహానికి నివాళులర్పించారు. ధర్మవరం మండలం బాదనపల్లి వద్ద బుధవారం  హత్యకు గురయిన స్నేహలత తల్లిదండ్రులను  పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియ పరిచారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంటు సభ్యులు తలారి రంగయ్య, స్థానిక శాసనసభ్యులు అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.   ఈ సందర్భంగా పత్రికా సమావేశంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించడం జరుగుతుందన్నారు. కేసు విచారణ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు.  రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఈ సంఘటన కలిచి వేసిందన్నారు. ఈ కేసుని వేగవంతంగా పరిష్కరించడానికి మా కమిషన్ కృషి చేస్తుందన్నారు.  స్నేహలత ధర్మవరంలో స్టేట్ బ్యాంకు లో పొరుగు సేవల ఉద్యోగం చేస్తూ ఉన్నదని తెలిపారు. స్నేహలత మంచి హాకీ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నదని, జాతీయస్థాయిలో క్రీడలలో  అనేక పథకాలు సాధించడం జరిగిందని తెలిపారు.  ఇటువంటి ఆణిముత్యంను పోగొట్టుకోవడం చాలా  దురదృష్టమని ఆమె ఆవేదన చెందారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టడానికి మా కమిషన్  ప్రత్యేక చట్టం తీసుకురావడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే నిందితులను అరెస్టు చేయడం జరిగిందని, వారిపైన కఠినమైన  సెక్షన్లు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. దిశ చట్టం అమలు చేస్తున్నామని, 24 గంటల్లో ప్రతి కేసుకు సంబంధించి నిందితులను అరెస్టు చేయడం జరుగుతుందని, వారం రోజుల్లో కేసుల విచారణ కార్యక్రమం వేగవంతంగా జరుగుతుందన్నారు. ఈ సంఘటన సంబంధించిన అన్ని విషయాలపై డిఐజి గారితో చర్చించి నిందితులకు కఠినమైన శిక్షలు అమలు చేయడానికి మా కమిషన్ చర్యలు చేపడుతుందన్నారు.  మహిళా సంరక్షణ కార్యదర్శులను ప్రతి గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామాలలో ఆకతాయిలుగా ఉన్న అబ్బాయిలను గుర్తించి బాలికలను ఏడిపిస్తున్న  అంశాలపై దృష్టి పెట్టి   చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో  100  రోజుల పాటు పలు కార్యక్రమాలలో భాగంగా ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తూ ఉన్నది తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలని, ప్రతి అబ్బాయి మనసు మారాలని, మనం అందరం కలిసికట్టుగా కృషి చేయాలని ఆమె తెలిపారు.  అనంతరం స్థానిక శాసనసభ్యులు అనంత వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ ఇటువంటి సంఘటన జరగడం సమాజానికి సిగ్గుచేటని పేర్కొన్నారు. ఎస్పీ పర్యవేక్షణలో ఈ కేసు విచారణ వేగవంతంగా చేయడం జరుగుతుందన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో సిడబ్ల్యుసి చైర్ పర్సన్ నల్లాని రాజేశ్వరి, జిల్లా సంయుక్త కలెక్టర్ ( సంక్షేమం మరియు అభివృద్ధి) ఏ.సిరి, సంయుక్త కలెక్టర్  ( ఆసరా మరియు సంక్షేమం) గంగాధర్ గౌడ్, ఆర్డీవో  గుణభూషణ్ రెడ్డి, ఐసిడిఎస్ పీడీ విజయలక్ష్మి. సాంఘిక సంక్షేమ శాఖ డిడి  విశ్వ మోహన్ రెడ్డి, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2020-12-24 14:07:14

ఘనంగా క్రిస్ మస్ వేడుకలు..

శ్రీకాకుళం నగరంలోని లెప్రసి కాలనీలో సి.వి.నాగజ్యోతి వెల్ఫేర్ సొసైటీ అధ్వర్యంలో బుధవారం ఉదయం క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జె.నివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని చిన్నపిల్లలతో క్రిస్మస్ కేక్ కట్ చేయించి వారికి తినిపించారు. కాలనీ వాసులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని, అందరూ సుఖ:సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం  దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా 4గురు దివ్యాంగులకు ట్రైనైకిళ్లను పంపిణీ చేసారు. క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని సి.వి.నాగజ్యోతి వెల్ఫేర్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో కాలనీ వాసులకు సుమారు నెలరోజులకు సరిపడే నిత్యావసర సరుకులు, సబ్బులు, దుప్పట్లను కలెక్టర్ కాలనీ వాసులకు పంపిణీచేసారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహన్ రావు, జిల్లా లెప్రసీ అధికారి ప్రియా రంజిత్ పట్నాయక్,  దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్  సంక్షేమ శాఖ కె.జీవన్ బాబు  తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2020-12-24 14:04:27

పరదేశమ్మ ఆలయ సమస్య పరిష్కరించండి..

విశాఖలోని రైల్వేన్యూకాలనీ దగ్గర శ్రీపరదేశమ్మ ఆలయ స్థలాన్ని రైల్వే అధికారులు మూసివేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఎంపీ ఎంవివి సత్యన్నారాయణలు రైల్వే అధికారుల ద్రుష్టికి తీసుకెళ్లారు. గురువారం ఈ మేరకు డిఆర్ఎంకు వినతిపత్రం ఇచ్చి సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రైల్వే న్యూకాలనీలోని అమ్మవారి ఆలయానికి వెళ్లడానికి వీలు లేకుండా  31పాత/42కొత్త వార్డ్ రైల్వే న్యూ కోలనీ లో శ్రీ పరదేశమ్మ అమ్మ వారి ఆలయానికి రైల్వే క్వార్టర్స్ గోడ  మార్గం గుండా వెళ్లే 5అడుగుల మార్గాన్ని రైల్వే అధికారులు మూసివేస్తున్న కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ విషయాన్ని రైల్వే అధికారుల ద్రుష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందిచారని చెప్పారు. అంతకు ముందు అమ్మవారి ఆలయ స్థలాన్ని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో లో 42వార్డ్ ప్రెసిడెంట్ జుబేర్, 32వార్డ్ ప్రెసిడెంట్ మూలే రామిరెడ్డి, యూత్ ప్రెసిడెంట్ ఆళ్ల శివ గణేష్, స్థానికులు భాషా, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-12-24 12:49:47

శాంతి, సంతోషానికి చిహ్నం క్రిస్మస్..

శాంతి, సంతోషానికి చిహ్నంగా  క్రిస్మస్ పండుగ నిలుస్తుందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. మానవ కళ్యాణం కోసం ఏసుక్రీస్తు జన్మించాడని ,ఆయన జననం ఈ ప్రపంచానికి శాంతి సంతోషాలు, మోక్ష భాగ్యాలను కలిగించిందని ఈపండుగ సందర్భంగా ఆయన జిల్లాలోని క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు,వారి కుటుంబ సభ్యులకు, పాస్టర్లకు, క్రైస్తవ విశ్వాసులకు  క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రైస్తవులంతా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఈ పండుగ మానవులకు మోక్షం, ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.     ప్రేమ, త్యాగం, సహనం, శాంతికి ప్రతీకగా క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ క్రిస్మస్ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.  కరోనా వైరస్ నేపథ్యంలో క్రిస్మస్ పండుగ ప్రార్థనల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చర్చిలలో ప్రార్థనలు నిర్వహించే సమయంలో భౌతిక దూరాన్ని పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

Visakhapatnam

2020-12-24 12:41:16

సుందరమైన పార్కుగా పెద్దపాడు చెరువు..

శ్రీకాకుళం నగరంలోని పెద్దపాడు చెరువును త్వరలో సుందరంగా, ఆహ్లాదకరమైన పార్కుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక పెద్దపాడు ప్రాంతంలోని చెరువును జిల్లా అధికారులు, గ్రామ పెద్దలతో కలిసి కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీకాకుళం పట్టణంలో గల పెద్దపాడు చెరువు 37 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, దీన్ని త్వరలో సుందరంగా, ఆహ్లాదకరమైన పార్కుగా తీర్చిదిద్ది పెద్దపాడు గ్రామ ప్రజలతో పాటు పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు.  ఇందుకు సంబంధిత అధికారులు, పారిశ్రామికవేత్తలు, గ్రామ పెద్దలు, ప్రజల  సూచనలు,  సలహాలను కోరడం జరిగిందని అన్నారు. వారి సలహా, సూచనలతో ఎవరికీ ఇబ్బంది కలుగకుండా వీలైనంత త్వరగా పెద్దపాడు చెరువును విహార స్థలంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఇందులో పిల్లలు, పెద్దలు విహరించేందుకు బోటు షికార్, చిన్నారులు ఆడుకునేందుకు ఆట పరికరాలు, ఇతర ఏర్పాట్లతో పాటు ప్రజలు నడిచేందుకు వీలుగా ఫ్రత్యేక మార్గాన్ని కూడా ఏర్పాటుచేయనున్నట్లు కలెక్టర్ వివరించారు.  ఈ పర్యటన కార్యక్రమంలో జిల్లా నీటియాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్.కూర్మారావు, రెవిన్యూ డివిజనల్ అధికారి ఐ.కిశోర్, ఏ.పి.ట్రాన్స్ కో పర్యవేక్షక ఇంజినీర్ యన్.రమేష్, ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ జోనల్ మేనేజర్ జి.మంగమ్మ, కార్యనిర్వాహక ఇంజినీర్ పి.సుగుణాకరరావు, దుప్పల వెంకటరావు, నటుకుల మోహన్, రొటేరీయన్ సి.వి.రాజులు, స్థానిక నాయకులు కలగ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-12-24 12:14:33

దేవుని పిలుపుమేరకు నడుచుకోవాలి..

 క్రిస్టమస్ సందేశం కేవలం శుభాకాంక్షలు చెప్పడం మాత్రమే కాదు, దేవుని సందేశం మేరకు మనము నడుస్తున్నామా అనే విషయం  ప్రతి ఒక్కరం  మననం చేసుకోవాల ని క్రిష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. బుధవారం స్థానిక ఇరిగేషన్ కార్యాలయ రైతు శిక్షణా కేంద్రంలో బుధవారం సాయంత్రం సెమి క్రిస్టమస్ వేడుకలు జిల్లా యంత్రంగం ఘనంగా నిర్వహిం చింది. కరోనా సమయంలో అన్ని ప్రార్ధనా మందిరాలు, దేవాలయాలు మూసివుంచి మనకు మనమే ఆలోచించాల్సిన పరిస్థితి రేకెత్తించాయి అన్నారు. దేవుని వాక్యాలు ప్రతి ఒక్కరం గుర్తుంచు కోవాలన్నారు. ప్రతి ఒక్కరు భగవంతుని వ్యాఖ్యలు తప్పకుండా మననం చేసుకోవాలన్నారు. నేనే  నిజం అన్న ప్రభువు వ్యాఖ్యలను గుర్తుంచుకోవాలి . ప్రేమ , సమానత్వం ప్రతి ఒక్కరిపై చూపాలన్నారు .  దేవునిపై నమ్మకం ఉన్నవారు మాత్రమే దేవునిని చేరుకోగలమని పేర్కొన్నారు. క ఖురాన్ లో జీసస్ క్రీస్తు ప్రస్తావన పలు మార్లు వొచ్చిందన్నారు. ఖురాన్ లో మరియం పేరుతో ఒక చాప్టర్ ప్రత్యేకంగా వుందన్నారు.. మనం ఏమిటి అని తెలుసుకొని, అన్నార్తులకు , దివ్యాంగులకు, వెనుకబడిన వారికోసం ఆలోచించాల్సి ఉందన్నారు. అదే ప్రేమ సౌబ్రాతుత్వా నికి సూచికగా క్రిస్టమస్ వేడుకలు నిలుస్తూ యని పేర్కొన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు మాట్లాడుతూ క్రైస్తవ కుటుంబాలకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం , ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రము లోని బలహీన వర్గాలు , వెనుకబడిన వర్గాలు కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. క్రెస్తవుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోంది.  పామర్రు శాసన సభ్యులు కైలా అనిల్ కుమార్ మాట్లాడుతూ , క్రీస్టమస్ వేడుకలు సమయంలో క్రీస్తు మన కోసం శిలువ వేసుకొని , మనందరి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు . కరోనా సమయంలో మనందరినీ కాపాడి ఈ రోజు వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుల మతాలకు రాజకీయ లకు అతీతంగా అమలు చేస్తున్నారు. కరోనా సమయంలో కలెక్టర్ చేపట్టిన కార్యక్రమాలను పలువురు అభినందించారు. కార్యక్రమంలో భాగంగా కాండిల్ లైట్ నిర్వహించారు. పలువురు దేవుని వాక్యాలు వినిపించారు.ఈ సమావేశంలో రెవేరండ్ మేజర్ ఐ డి ఎబెనజెర్,  డా కె .జోసెఫ్ మోసెస్, ఫాదర్ మువ్వాలా ప్రసాద్ , రేవ్. ఐ.కరుణానిధి , నోవెల్ శామ్యూల్, డా వై బాబు, యేసుపాదం, బి దయానందం, ఎం.విజయరావు, అధికారులు  ఎండి రియాజ్ సుల్తాన్, జి రవీంద్ర, మురళి, జి జూన్ మోషే, రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.

Vijayawada

2020-12-23 21:10:24

విజయనగరంలో 420 కేజిల గంజాయి స్వాధీనం..

విశాఖపట్నం నుంచి ఒడిశా సంబల్ పూర్ కు అక్రమంగా తరలిస్తున్న 420 కేజిల గంజాయిని విజయనగరం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బుధవారం సాయంత్రం గంజాయి లోడోతో ఒక లారీ ఒడిసాకి వెళుతున్నట్టు సమాచారం అందుకున్న డిఎస్పీ అనిల్ పులిపాటి తన బ్రుందంతో దాడిచేసి మార్గమధ్యలోనే పట్టుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మీడియాతో మాట్లాడుతూ, గంజాయి రవాణాపై నిఘా వుంచామని, ఈ క్రమంలోనే రావాణ అవుతున్న గంజాయి సమాచారాన్ని తెలుసుకొని దాడులు చేశామన్నారు. వారి దగ్గర నుంచి గంజాయి ట్రేలను స్వాధీనం చేసుకోవడంతోపాటు బీహార్ కి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు వివరించారు. ఈ దాడుల్లో విజయనగరం రూరల్ సిఐ మంగవేణి, మురళి, ఎస్ఐలు కిరణ్, దేవి, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు చాకచక్యంగా గంజాయిని పట్టుకున్న పోలీసు సిబ్బందిని విజయనగరం ఎస్పీ రాజకుమారి అభినందించారు.

విజయనగరం

2020-12-23 21:00:16

29వేల మంది లబ్దిదారులకు ఇళ్ల పంపిణీ..

నవరత్నాల్లో భాగంగా  కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో 29 వేల మంది లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ, సహకార, ఫుడ్ ప్రొసెసింగ్,మార్కెటింగ్ శాఖా మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. బుధవారం కాకీనాడబోట్ క్లబ్ దగ్గరలో ఉన్న కృషి భవన్ లో నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం పై కాకినాడ గ్రామీణ నియోజకవర్గ స్ధాయి సమీక్షా సమావేశానికి మంత్రి కన్నబాబు, కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ గ్రామీణ నియోజకవర్గం పరిధిలో ఇళ్ళ పట్టాల పంపిణీ, 25న జిల్లాలో జరిగే  ముఖ్యమంత్రి పర్యటన తదితర అంశాలపై సంబంధిత అధికారులతో మంత్రి కన్నబాబు సమీక్షించి ముఖ్యమంత్రి పర్యటనను అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని ఆయన సూచించారు.  అనంతరం పాత్రికేయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాత్రికేయులను ఉద్దేశించి మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల సొంత ఇంటి కల నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో వేల కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 30 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.ఎంతటి విపత్కర పరిస్ధితులు ఎదురైన రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆపద సమయంలో అన్ని వర్గాల వారిని ఆదుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళ స్ధలాలకు సంబంధించి అన్నిలేవుట్లలో త్రాగునీరు, విద్యుత్, రవాణా, ఇతర అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. అర్హతలు ఉండి గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ 90 రోజుల్లోనే ఇళ్ళ పట్టాలు అందజేయడం జరిగిందన్నారు. ఇళ్ళ స్ధలాలకు సంబంధించి అత్యంత పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేసి ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం లబ్దిదారుల జాబితా ప్రతీ గ్రామ సచివాలయంలోను ప్రదర్శించడం జరిగిందన్నారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గానికి సంబంధించి సుమారుగా 29 వేల మంది లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.  రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి రైతుల సంక్షేమమే ధ్యేయంగా, రైతు పక్షపాతిగా నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా  నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులందరికీ ఈ నెల 29వ తేదీన ప్రభుత్వం నష్టపరిహారం అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. నష్టపరిహారానికి దరఖాస్తు చేసుకొనేందుకు రైతులకు ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు గడువు ఉందన్నారు. నివర్ తుపాన్ కారణంగా 12 లక్షల ఒక వెయ్యి ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఇ-క్రాప్ లో నమోదైన ప్రతీ రైతుకు నష్టపరిహారం అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ తుఫానులు, భారీ వర్షాలు, వరదలు కారణంగా అధిక నష్టం జరిగిందని ఆయన తెలిపారు. వచ్చే సంవత్సరం నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బీమా సంస్ధను ఏర్పాటు చేసి రైతులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.  ఈ సమావేశంలో కాకినాడ రూరల్, కరప మండలాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Kakinada

2020-12-23 20:37:11