కేంద్ర ప్రభుత్వం అనాగరికంగా ఆమోదింపచేసుకున్న రైతు వ్యతిరేక బిల్లులకు మద్దతుగా రేపు నిర్వహిస్తున్న భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సంకు వెంకటేశ్వరరావు తెలిపారు. విశాఖలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీ రోడ్ల మీద లక్షలాదిమంది రైతులు చలిలో వణుకుతూ ధర్నా చేస్తున్నా మోడీ ప్రభుత్వం కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తోందని సంకు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ శ్రేణులన్నీ ఈ బంద్ లో పాల్గొంటాయని తెలిపారు. రాష్ట్ర, జిల్లా, నగర స్థాయి నాయకులు, కార్యకర్తలు ఈ బంద్ లో పాల్గొంటారని, విశాఖ ప్రజలు, వ్యాపారస్తులు కూడా అన్నదాతలకు మద్దతుగా బంద్ లో పాల్గొనాలని సంకు విజ్ఞప్తి చేసారు.
విధి నిర్వహణలో అంకిత భావం ప్రదర్శిస్తూ.. దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగానికైనా వెనుకాడని సైనికుల సేవలు, త్యాగాలు మరువలేనివి కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ పేర్కొన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సోమవారం సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో జరిగిన సత్కార సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని సైనికులకు, మాజీ సైనికులకు, సైనిక కుటుంబ సభ్యులకు సాయుధ దళాల పతాక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సైనికుల సేవలు వెలకట్టలేనివని.. వారి త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు అర్పించాల్సిన నైతిక బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు. సైనికులు, వారు కుటుంబ సభ్యుల సంక్షేమార్థం ఏర్పాటు చేసిన సంక్షేమ నిధికి విరాళాలు అందజేయటం ద్వారా వారి రుణం తీర్చుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్బిఐ బ్యాంకు విశ్రాంత మేనేజర్ పరిటి శంకర సూర్యారావు రూ.1,00,000/-, ఎక్స్ సర్వీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరడ అప్పారావు రూ.25,000/- సైనిక సంక్షేమ నిధికి అందజేశారు. వీరిని కలెక్టర్ శాలువాలు వేసి సత్కరించారు. జిల్లాలో ఉన్న ఉద్యోగులు, వ్యాపార వేత్తలు, పౌరులు స్పందించి సైనిక సంక్షేమ నిధికి విరాళాలు అందజేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు.
కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి మజ్జి కృష్ణారావు, సైనిక సంక్షేమ సంఘం మాజీ సభ్యులు దేవర ఈశ్వరరావు, బొడ్డేపల్లి రామకృష్ణారావు, కూసుమంచి సుబ్బారావు, సామాజిక కార్యకర్త అబ్దుల్ రవూఫ్, మాజీ సైనికులు, సైనిక కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రామకృష్ణారావుకు కలెక్టర్ ప్రత్యేక అభినందనలు
ఇప్పటివరకు 157 సార్లు రక్తదానం చేసిన ఎక్స్ - సార్జెంట్ (ఎయిర్ ఫోర్స్), ఉపాధ్యాయుడు అయిన బొడ్డేపల్లి రామకృష్ణారావును కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువా వేసి సత్కరించారు. రామకృష్ణారావు ను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.
పరిశుభ్రత, పచ్చదనం, ఆరోగ్యం మన లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ స్పష్టం చేశారు. గంగమ్మతల్లిని గౌరవించే ప్రాంతానికే గౌరవం కూడా దక్కుతుందని ఆయన సూచించారు. పరిసరాలను, ప్రకృతిని పరిరక్షించడానికి ప్రతీఒక్కరూ ముందుకు రావాలని విజయనగరం ఎంపి బెల్లాన చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మనం-మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా, వ్యర్థాలపై వ్యతిరేక పోరాట పక్షత్సవాలు సోమవారం నుంచి జిల్లావ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు కార్యక్రమంలో భాగంగా విజయనగరం కోట వద్ద భారీ అవగాహనా ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ ప్రారంభించారు. అయ్యకోనేరు వరకూ ర్యాలీ చేసిన అనంతరం, కోనేరు గట్టువద్ద ప్రారంభోత్సవ సభను నిర్వహించారు.
ఈ సభలో కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చని సూచించారు. వీటి ప్రాధాన్యతను గుర్తించే, డొనేట్ రెడ్, స్రెడ్ గ్రీన్, సేవ్ బ్లూ నినాదాలతో ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నామని చెప్పారు. అత్యవసర పరిస్థితిలో ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు వీలుగా రక్తదానాన్ని ప్రోత్సహించే చైతన్య కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతనిచ్చామన్నారు. పచ్చదనాన్ని పెంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, దీనిలో భాగంగా ఈ ఏడాది జిల్లాలో ఇప్పటికే సుమారు కోటి,20లక్షల మొక్కలను నాటామని చెప్పారు. జల వనరుల సంరక్షణలో భాగంగా జిల్లాలోని వందలాని చెరువులను శుద్దిచేసి, భూగర్భ జలాలను పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. నీటిని వృధా చేయకూడదని, గంగమ్మతల్లిని గౌరవించిన ప్రదేశానికి ఎనలేని గుర్తింపు లభిస్తుందని స్పష్టం చేశారు. జల వనరుల సంరక్షణకు జిల్లాలో చేపట్టిన చర్యలకు ఇటీవలే జాతీయ అవార్డు లభించిన విషయాన్ని గుర్తు చేశారు.
విజయనగరం జిల్లాకు గొప్ప భవిష్యత్తు ఉందని, త్వరలో మహానగరంగా అభివృద్ది చెందుతుందని కలెక్టర్ అన్నారు. చారిత్రకంగా, సాంస్కృతికం, క్రీడాపరంగా జిల్లాకు సమున్నత చరిత్ర ఉందని, ఆ స్ఫూర్తిని ప్రతీఒక్కరిలో రగిలించేందుకు పలుచోట్ల సైన్ బోర్డులను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలందరి సహకారంతో జిల్లాలో సుమారు రెండు నెలలపాటు కోవిడ్ రాకుండా నియంత్రించగలిగామని చెప్పారు. మళ్లీ ఇప్పుడు గ్రీన్‌జోన్‌లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. అయినప్పటికీ కోవిడ్ ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రజలంతా తగిన జాగ్రత్తలను పాటించాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే, చాలా రకాల వ్యాధులు సోకకుండా నివారించవచ్చని, ప్రతీఒక్కరూ మనసుపెట్టి పనిచేసి, మార్పు తేవడానికి కృషి చేయాలని కలెక్టర్ కోరారు.
విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతీఒక్కరి బాధ్యతని అన్నారు. మన ఆరోగ్యం మెరుగుపడాలంటే, పారిశుధ్యాన్ని, పరిసరాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఏలూరు సంఘటన, ఢిల్లీ వాయు కాలుష్యాన్ని ప్రస్తావిస్తూ, ప్రకృతి వనరుల సంరక్షణ ఆవశ్యకతను వివరించారు. పల్లెల్లో కొనసాగుతున్న బహిరంగ మలవిసర్జన కార్యక్రమాన్ని రూపుమాపేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పారిశుద్యాన్ని మెరుగుపర్చేందుకు రాష్ట్రప్రభుత్వం చేపట్టిన వ్యార్థాలపై యుద్దం గొప్ప కార్యక్రమమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్‌లాల్ జిల్లాకు ఎంతో గౌరవాన్ని తెచ్చారని, గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టారని కొనియాడారు.
జిల్లా పంచాయితీ అధికారి కె.సునీల్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ వ్యర్థాలపై యుధ్దం పక్షోత్సవాల ప్రాముఖ్యతను వివరించారు. ప్రజలకు అవగాహన కల్పించడం, వారి భాగస్వామ్యంతో పల్లెలను పరిశుభ్రంగా మార్చడమే ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ రెండున్నరేళ్ల క్రితమే జిల్లాలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, పరిశుభ్రత, పచ్చదనం, జలవనరుల సంరక్షణకు కృషి చేస్తున్నారని చెప్పారు.
జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వహాణాధికారి టి.వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ మనం-మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా తొలివిడత జిల్లాలో 62 గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం వల్ల మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు గణనీయంగా తగ్గాయన్నారు. దీంతో రెండో దశ క్రింద జిల్లాలో 340 గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. 7వ తేదీనుంచి 21వ తేదీవరకు 15 రోజులపాటు ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రతా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.
విజయనగరం మార్కెట్ కమిటీ ఛైర్మన్ జమ్ము శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యర్థాలపై యుద్దం కార్యక్రమంలో ప్రతీఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
కలెక్టర్ కృషి కారణంగా జిల్లాకు జాతీయస్థాయిలో పేరు దక్కిందని, ఆయన ఇచ్చిన స్ఫూర్తిని నిలబెట్టడానికి కృషి చేయాలని అన్నారు. దీనిని నిలబెట్టుకోవాడంలో బాధ్యత మరింత పెరిగిందని ఆయన సూచించారు.
గ్రామీణ నీటిసరఫరా ఎస్ఇ పప్పు రవి మాట్లాడుతూ మంచినీటిని వృధా చేయవద్దని, అవసరమైనంత మేర మాత్రమే నీటిని వాడాలని సూచించారు. ప్రతీఒక్కరూ మరుగుదొడ్లను నిర్మించుకొని, వాటిని వినియోగించాలని కోరారు. కాలువల్లో చెత్తను పడేయడం సాధారణ అలవాటుగా మారిందని, దీనిని విడనాడాలని సూచించారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన తప్పెటగుళ్లు, డప్పు కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కళాకారులను అభినందిస్తూ ఎంపి బెల్లాన చంద్రశేఖర్, మెప్మా ఏఓ నగదు బహుమతులిచ్చారు. గ్రీన్ అంబాసిడర్లకు రక్షణ పరికరాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిఆర్ఓ ఎం.గణపతిరావు, పశు సంవర్థకశాఖ జెడి ఎంవిఏ నర్సింహులు, జిల్లా విపత్తుల నివారణాధికారి బి.పద్మావతి, మత్స్యశాఖ డిడి నిర్మలాకుమారి, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి ఎస్.జగన్నాధం, డిపిఆర్ఓ డి.రమేష్, డిపిఆర్‌సి జిల్లా కో-ఆర్డినేటర్ సత్యనారాయణ, ఎంపిడిఓలు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా చైతన్యంతోనే సంపూర్ణ పారిశుధ్ధ్యం సాధ్యపడుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు పేర్కొన్నారు. సోమవారం మనం - మన పరిశుభ్రతలో భాగంగా వ్యర్ధాలపై వ్యతిరేక పోరాటంపై జిల్లా పరిషత్ సమావేశ మందిరం లో అవగాహన కార్యక్రమం జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ నెల 7వ తేదీ నుండి 21వ తేదీ వరకు వ్యర్ధాలపై వ్యతిరేక పోరాటం అనే కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతున్నదన్నారు. గ్రామాలు, పట్టణాలు సంపూర్ణ పారిశుధ్ధ్యంతో విలసిల్లాలని, ఇందుకు గాను ప్రజల ఆలోచనలు మారాలని, అలవాట్లు మారాలని వారిలో చైతన్యం తీసుకురావాలని అన్నారు. ఇందుకు చిత్తశుద్ధి, అమలుపట్ల సన్నద్ధత అవసరమని తెలిపారు. గ్రామాలలో సానిటేషన్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. మహిళలు, ప్రజలతో సమావేశాలు నిర్వహించి పారిశుధ్ధ్యంపై వారికి అవగాహన కలిగించాలన్నారు. పంచాయతీలలో సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ ప్రాసెసింగ్ కేంద్రాలలో నిర్మాణం పూర్తి చేయాలని, ఉపాధి హామీ పథకం క్రింద కూడా దీని నిర్మాణానికి అనుసంధానం చేయవచ్చునని సూచించారు. ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. మార్చి అనంతరం పంచాయతీ లకు అధిక మొత్తంలో నిధులు రానున్నాయని తెలిపారు.
జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ భవిష్యతరాల గూర్చి ముందుచూపు ఉండాలన్నారు. మంచి ప్రణాళికలతో అమలు చేస్తే విజయం తధ్యమని, ఓడిఎఫ్, తడి చెత్త - పొడి చెత్త, కాలువలు నిర్వహణ, తాగునీరు కల్పన ప్రధానమైన అంశాలని తెలిపారు. 835 సచివాలయాల్లో కూడా ఓడిఎఫ్ పాటించాలన్నారు. పంచాయితీ సెక్రటరీలు, వాలంటీర్లు టాయ్ లెట్లు వున్న ఇళ్ళు, టాయ్ లెట్లు వుండి వాటిని వినియోగించుకోని వారిని గుర్తించడం చేయాలన్నారు. ప్రజలకు బహిరంగ మల విసర్జనపై అవగాహన కలిగించు నిమిత్తం ఆ యా ప్రదేశాలకు వారిని తీసుకు వెళ్ళి చూపించాలన్నారు. ఉదయాన్నే గ్రామంలో సందర్శించడం అవసరమన్నారు. సాలిడ్ వేస్ట్ ప్రోసెసిగ్ కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయాలన్నారు. మరమ్మత్తులు వుంటే వాటిని చేయించాలన్నారు. గ్రీన్ అంబాసిడర్ ల సేవలను ఉపయోగించుకోవాలని తెలిపారు. మురుగునీటి కాలువలను శుభ్రపరచాలని, సానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని తెలిపారు. మంచి నీటి బావులు, ట్యాంకులలో క్లోరినేషన్ చేయాలని తెలిపారు. ఐ.ఇ.సి. కార్యక్రమాలలో ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొనాలని తెలిపారు. స్వయం శక్తి సంఘాలు, ఉపాధి హామీ సిబ్బంది క్షేత్ర సహాయకులు, టెక్నికల్ అసిస్టెంట్లు ఈ కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.
జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు మాట్లాడుతూ వ్యర్ధాలపై వ్యతిరేక పోరాటంను మొదటి దశలో 76 పంచాయతీలలో చేపట్టామని అన్నారు. రెండవ దశలో 353 పంచాయతీలలో అమలు చేస్తున్నామని చెప్పారు. దీనిని సమర్థవంతంగా అమలు చేయుటకు
ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి ఉందని నిర్ధారించుకోవాలని అన్నారు. కుటుంబ సభ్యులందరూ మరుగుదొడ్డిని ఉపయోగించేలా చైతన్య పరచాలన్నారు. స్నానానికి ఉపయోగించే నీరు, పాత్రలు శుభ్రపరచడం, బట్టలు ఉతకడం వంటి వ్యర్థ జలాలను మురుగు నీటి పారుదల వ్యవస్థ ద్వారా లేదా ఇంకుడు గుంతలకు మళ్ళించడం ద్వారా మురుగునీరు రోడ్ల పై ప్రవహించకుండా చూడాలని ఆయన కోరారు. గ్రామంలో అన్ని విద్యా సంస్థలు, ఇతర సంస్థలు మరుగుదొడ్లు కలిగి ఉండి వాటిని విధిగా ఉపయోగించాలని పేర్కొన్నారు. ఆహారం భుజించే ముందు, మలవిసర్జన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడం అలవాటు చేయాలని ఆయన అన్నారు. గ్రామంలోని అన్ని గృహాలకు సురక్షిత త్రాగునీటి సరఫరా లభ్యత ఉండేలా చూడాలని కోరారు. ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరణ, సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాలకు రవాణా, ఘన వ్యర్ధ పదార్ధాలను వేరుచేయడం, రీసైక్లింగ్, వర్మి కంపోస్ట్ ప్రాసెసింగ్ మొదలైనవి క్రమం తప్పకుండా గ్రామంలో జరగాలని ఆయన పేర్కొన్నారు. ద్రవ్య వ్యర్ధ పదార్ధాల (LIQUID WASTE MANAGEMENT) నిర్వహణ చేపట్టాలని, గ్రామంలో ఉన్న పశువుల సంఖ్య ఆధారంగా 500 కంటే ఎక్కువ ఆవులు లేదా గేదెలు వంటి పశువులు ఉన్నప్పుడు, ఆ గ్రామంలో కమ్యునిటీ బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణం చేపట్టి వినియోగంలోకి తేవడానికి కృషి జరగాలని సూచించారు. కాళింగ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమితులైన పేరాడ తిలక్ మాట్లాడుతూ పారిశుద్ధ్యం మెరుగుపడి ఆరోగ్యవంతమైన సమాజం నెలకొనుటకు కృషి చేయాలన్నారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైనది. ఈ సందర్భంగా పోస్టర్ ను మంత్రి విడుదల చేశారు. ప్రతిజ్ఞ చేయించారు. ముందుగా పొట్టి శ్రీరాములు జంక్షన్ నుండి జల్లా పరిషత్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అర్దబ్ల్యూఎస్ ఎస్ఇ టి.శ్రీనివాసరావు, డిఆర్డీఏ పిడి బి.శాంతిశ్రీ, డీపీఓ వి.రవికుమార్, బిసి కార్పొరేషన్ ఇడి జి.రాజారావు, ఐసీడీఎస్ పిడి జి.జయదేవి, డిఎంహెచ్ఓ డా.కేసి చంద్ర నాయక్, అదనపు డిఎంహెచ్ఓ డా.బి.జగన్నాథ రావు, జిల్లా పరిషత్ డిప్యూటీ సిఇఓ పి.లక్ష్మీపతి, మెప్మా పిడీ ఎం.కిరణ్ కుమార్, ఇతర జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడిఓ లు తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లాలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సోమవారం 2 కళ్యాణ మండపాలను ప్రారంభించి, మరో 2 కళ్యాణ మండపాల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఎర్రగొండ పాలెంలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. అనంతరం మార్కాపురం లో రూ. 1.80 కోట్ల తో నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభించారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, శాసన సభ్యులు నాగార్జున రెడ్డి, అన్నా రాంబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అద్దంకి నియోజ వర్గం సింగరకొండ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ వద్ద నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభించి, గోశాల, కేశఖండన శాల నిర్మాణానికి శంఖు స్థాపన చేశారు. మాజీ ఎమ్మెల్యే గరటయ్య, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పాలక మండలి చైర్మన్ రాము, దేవస్థానం ఈఓ శ్రీని వాసరెడ్డి పాల్గొన్నారు. మేదరమిట్ట గ్రామంలో టీటీడీ నిర్మించనున్న కల్యా.మండపానికి సుబ్బారెడ్డి శంఖుస్థాపన చేశారు.
కుల మతాలకతీతంగా దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేసి మానవతా విలువలను కాపాడిన రోజే డాక్టర్ బీఆర్ అంభేద్కర్ కి నిజమైన నివాళి అర్పించినట్టు అని జెఎన్‌టియుకె ఉపకులపతి ప్రొ.ఎం.రామలింగరాజు అన్నారు. ఆదివారం అంభేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాణానికి డా.బి.ఆర్.అంబేద్కర్ చేసిన కృషి కొనియాడదగినదని గుర్తు చేశారు. అందరూ మహనీయుల ఆశయాలను ప్రతీ ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. లైబ్రరీ & ఈ-లెర్నింగ్ రీసోర్సెస్ డైరెక్టర్ మరియు ఎస్సీ, ఎస్టీ సెల్ లైజన్ ఆఫీసర్ ప్రొ.పి.సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొ.సిహెచ్.సత్యనారాయణ, ఓఎస్‌డి ప్రొ.వి.రవీంద్రనాధ్, డిఏపి ప్రొ.ఆర్.శ్రీనివాసరావు, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (ఎస్‌ఎంఎస్) డైరెక్టర్ ప్రొ.ఏ.కృష్ణమోహన్, ఉమెన్ ఎంపవర్‌మెంట్ & గ్రీవెన్సెస్ డైరెక్టర్ ప్రొ.ఏ.స్వర్ణకుమారి, ఐక్యూఏసి డైరెక్టర్ ప్రొ.ఎన్.బాలాజీ, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ సెంటర్ డైరెక్టర్ ప్రొ.వి.శ్రీనివాసులు, ఇంక్యుబేషన్ సెంటర్ డైరెక్టర్ ప్రొ.జెవిఆర్.మూర్తి, యుసిఇకె ప్రిన్సిపాల్ ప్రొ.బి.బాలకృష్ణ, డా.బి.ఆర్.అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ లైబ్రేరియన్ డా.బి.ఆర్.దొరస్వామినాయక్, టీచింగ్ & నాన్ టీచింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన రోగులను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం స్వయంగా పరామర్శించనున్నారు. సోమవారం ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయల్దేరి ఉదయం 10:20 గంటలకు ఏలూరు చేరుకుంటారు. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. అనంతరం జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో వైద్యఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమవుతారు. ఏలూరులో సుమారు 200 మంది అస్వస్థతకు గురైన విషయం తెలియగానే సీఎం జగన్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనానితో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రి నాని ఆదివారం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించడమే కాకుండా వైద్యపరంగా తీసుకోవాల్సిన చర్యలను అధికారులతో స్వయంగా పర్యవేక్షించారు. సీఎం ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఏలూరులో బాధితులను పరామర్శించి అస్వస్థతకు దారితీసిన కారణాలపై పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల్లో కూడా వారికి ఏ విధమైన వ్యాధి వచ్చిందో నేటికి నిర్ధారణ కాకపోవడంపైనా వైద్యాధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వున్నవారికి ఏ తరహా వైద్య పరీక్షలు చేస్తారనే విషయమై రేపు సీఎం నేరుగా వైద్యాధికారులతో మాట్లాడి దిశా నిర్ధేశం చేయనన్నారు.
ఆదరణలేక, శరీరాలు సహకరించక, దుర్భర స్థితిలో ఉన్న వృద్ధులు, వికలాంగులు ఉన్న చోటుకే భోజనం అందించే సేవా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు విశ్వమానవవేదిక అధ్యక్షులు మల్లుల సురేష్ తెలిపారు. వేడంగి, వేడంగి పాలెం, కుమ్మరిపాలెం గ్రామాల్లో సంస్థ సభ్యులు భోజనాలు పంపిణీని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షలు మాట్లాడుతూ, 2015 నవంబర్ 17న పాలకొల్లు ప్రాంతంలో ప్రారంభించిన విశ్వమానవవేదిక నిత్యాన్నదానం నిరాటంకంగా ఎంతోమంది అభాగ్యుల ఆకలి తీరుస్తుందన్నారు. 1846 రోజులగా ఆదరణలేని వృద్ధులు ఇళ్లకే భోజనాలు అందిస్తున్న ఈ కార్యక్రమాన్ని పోడూరు మండలం వేడంగి, వేడంగిపాలెం, కుమ్మరిపాలెం గ్రామాలకు విస్తరించడం సంతోషదాయకమన్నారు. అనేక ఒడిదుడుకులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు తట్టుకుని అకుంఠిత దీక్షతో అభాగ్యుల ఆకలి తీర్చేందుకు నిత్యాన్నదానాన్ని ముందుకు నడిపిస్తున్న టీమ్ లీడర్ విశ్వమానవ వేదిక శ్యామ్ కి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. వేడంగి, వేడంగిపాలెం, కుమ్మరిపాలెం గ్రామాల పరిధిలో ఆకలితో భోజనం లేక అల్లాడుతున్నవారు ఎవరైనా ఉంటే 9652256999, 9441447084, 08814226399 ఫోన్ నంబర్లకి తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండేటి రవి, పైలా చిన్నా, విశ్వమానవవేదిక శ్యామ్, డాక్టర్ మల్లుల జ్ఞానేశ్వరి, వేండ్ర శ్రీనివాస్, యర్రంశెట్టి జయరాజు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకోవడంతో ప్రత్యేక కేంద్రాల నుంచి 15 మందిని డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. జిల్లాలో కోవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న కోవిడ్ బాధితులు ఆదివారం 15 మంది కరోనా నుంచి కోలుకోగా, డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. వారిని 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని సూచించామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా సెకెండ్ వేవ్ కరోనా వైరస్ ప్రభావం అధికంగా వున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. హోమ్ ఐసోలేషన్ లోఉన్నవారు తప్పనిసరిగా ప్రభుత్వ వైద్యులు నిర్ధేశించిన మందులు, బలవర్ధక ఆహారాన్ని తీసుకోవాలన్నారు. అవసరం వుంటే తప్పా ఎవరూ బయటకు రావొద్దని కోరారు. కాచిచల్లార్చిన నీరు త్రాగడం, ఆకుకూరలు ఆహారంలో ఒక భాగాన్ని చేసుకోవాలన్నారు. ముఖ్యంగా వయస్సు మళ్లిన వారిని జాగ్రత్తగా చూడాలన్న కలెక్టర్ సామాజిక దూరం పాటిస్తూ, ఖచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. ఏ పనిచేసినా ముందు, తరువాత సబ్బుతో 30 సెకెండ్లపాటు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలన్నారు. లేదంటే నాణ్యమైన శానిటైజర్లను వినియోగించాలని కలెక్టర్ గంధం చంద్రడు సూచించారు.
వందేళ్ల ముందు చూపుతో రాజ్యాంగ నిర్మాణాన్ని చేపట్టిన డా.బీఆర్ అంభేద్కర్ దేశం గర్వించదగ్గ మేధావి అని ఆంధ్రా యూనివర్సిటీ సైకాలజీ విభాగం అధిపతి ఆచార్య ఎమ్ విఆర్ రాజు పేర్కొన్నారు. అంభేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా డిహెచ్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విశాఖలోని జైలురోడ్డులో వున్న విగ్రహానికి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశాన్ని పట్టి పిడించిన అస్పృశ్యత నుంచి దళితులకు విముక్తి కలిగించిన మహనీయుడని కొనియాడారు. అందరికీ వయోజన ఓటు హక్కు కలిగించి చాయ వాలాను ప్రధానిని చేసిన మహా జ్ఞాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమేనన్నారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ, అంభేత్కర్ రజ్యాంగం ద్వారా బడుగులకు కల్పించిన ఆత్మగౌరవాన్ని మోడీ కాలరాస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం టిడ్ కో ఇళ్లకు మంచినీరు విద్యుత్ సరఫరా, మురుగు నీటి పారుదల కల్పించాలన్నారు. ఇళ్ల స్థలాలు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బూసి వెంకట రావు, జి రామ్ బాబు, మండే సత్యనారాయణ, సైంటిస్ట్ చంద్ర శేఖర్, బూ సి పరమేశ్వరి ,ఈ తల పాక సుజాత, బత్తుల శ్రీనివాస రావు, పుండి మల్లేశ్వర రావు, మరుపిల్లి పైడి రాజు , సోడా దాసి సుధాకర్, రాజాన అప్పా రావు, బంటు కృష్ణా రావు , ఏళ్లపు రాంబాబు, జి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ బీఆర్ అంభేద్కర్ ఒక దార్శనీకుడని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశాజ్యోతి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు పడాల రమన అన్నారు. ఆదివారం అంబేద్కర్ 64 వ వర్ధంతి సందర్భంగా జీవీఎంసీ జోన్ 3 ఆధ్వర్యంలో సీతమ్మధార పాప హోమ్ లో విద్యార్థులకు అసోసియేషన్ తరఫున ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పడాల రమణ మాట్లాడుతూ, అంభేద్కర్ ఆశయ సాధనలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులంమంతా భాగస్వాములమవుతామని అన్నారు. ప్రతీఏటా ఆ మహాన భావుని పేరుతో ఈ తరహా సేవకార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ లింగాల వెంకటేష్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొట్టా అప్పలరాజు, బోని రామకృష్ణ, పిని పిల్లి కనకరాజు, ఏ.రాంబాబు బి.నాగేశ్వరావు, వేణు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగ విరమణ చేయడం ఆ స్థానానికి మాత్రమేనని, సేవలకు కాదని శ్రీకాకుళం శాసన సభ్యులు ధర్మాన ప్రసాద రావు అన్నారు. ఒక వ్యక్తి ఓపిక, సహనం మేరకు సామాజిక సేవ ఏ వయస్సు వరకైనా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్ గా, జిల్లా ఐటిఐల కన్వీనర్ గా పనిచేసి నవంబరు 30న పదవీ విరమణ చేసిన రాడా కైలాసరావుకు అభినందన సభ ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ధర్మాన ప్రసాద రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాడా కైలాసరావు దంపతులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ సమాజ సేవ చేయుటకు వయస్సు అడ్డంకి కాదన్నారు. సమాజంలో ఇంకా అనేక రంగాల్లో మంచి సేవలు అందాల్సిన పరిస్ధితులు ఉన్నాయని వాటిలో నచ్చిన రంగాన్ని ఎన్నుకుని సేవలు అందించుటకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. పదవీ విరమణ చేసిన అనంతరం జీవితం సమాప్తం అయిందనే ఆలోచనకు చాలా మంది వస్తుంటారని, అది సరికాదని ఆయన పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం కొన్ని బాధ్యతల నుండి మాత్రమే తప్పుకోవడం జరుగుతుందని, అనంతరం స్వచ్ఛందంగా సేవలు అందించవచ్చని సూచించారు. కైలాసరావు విధుల నిర్వహణలో అంకితభావం ప్రదర్శించారని, విద్యార్ధులను తీర్చిదిద్దడంలోను, ఐటిఐలను ఉన్నతంగా తీర్చిదిద్దడంలోను చొరవ చూపించారని ప్రశంసించారు. విధులు అంకితభావంతో నిర్వహిస్తే మంచి సంతృప్తి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. సమాజ హితానికి, అయా శాఖలు అందించే సేవలను మనస్ఫూర్తిగా అందించి ప్రజల గుండెల్లో చిరస్ధాయిగా నిలవాలని అన్నారు. కైలాస రావు విధుల నిర్వహణలో ఉంటూ సమాజ హితం గూర్చి ఆలోచించిన వ్యక్తి అన్నారు. తన భౌతిక కాయాన్ని మరణానంతరం వైద్య పరిశోధనలకు దానం చేసిన వ్యక్తి అన్నారు. ఇటువంటి వ్యక్తులు సమాజానికి అవసరమని కొనియాడారు.
ఐటిఐల ప్రాంతీయ ఉప సంచాలకులు ఆర్.వి.రమణ మాట్లాడుతూ కైలాస రావు మంచి సేవలు అందించారన్నారు. ఐటిఐలు అభివృద్ధి కావాలనే తపనతో సేవలు అందించారని పేర్కొన్నారు. సహృదయులని, అందిరితో ప్రేమ పూర్వకంగా ఉంటారని ఆయన అన్నారు. పనిలో పెండింగు సమస్య ఉండదని ఆయన పేర్కొన్నారు.
వంశధార పర్యవేక్షక ఇంజనీరు డోలా తిరుమల రావు, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీరు ఎస్.వి.రమణ, ప్రజారోగ్య శాఖ కార్యనిర్వాహక ఇంజనీరు పి.సుగుణాకర రావు, రెడ్ క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జగన్మోహన రావు, రెడ్ క్రాస్ జిల్లా ఉపాధ్యక్షులు డా.కె.సుధీర్, ఏపిఐడిసి మాజీ డైరక్టర్ మొదలవలస రమేష్ మాట్లాడుతూ కైలాస రావు సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి గులోన వ్యాఖ్యతగా వ్యవహరించారు. కార్యక్రమంలో పర్యాటక అధికారి ఎన్.నారాయణ రావు, ప్రైవేటు ఐటిఐల రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్టి నాగభూషణం, సుదర్శన రావు, ఎస్.కె.నాయుడు, వావిలాపల్లి జగన్నాథం నాయుడు, ఎస్.జోగినాయుడు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని వివిధ ఐటిఐల శిక్షణాధికారులు, సిబ్బంది, కైలాసరావు కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాను తన కార్యాలయంలో ఆంధ్రామెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డా.సుధాకర్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్ఫగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దాడిశెట్టి రాజా ఆంధ్రామెడికల్ కాలేజీ అభివ్రుద్ధిని, చేపట్టబోయే కార్యక్రమాలను ప్రిన్సిపల్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విప్ దాడిశెట్టిరాజా మాట్లాడుతూ, త్వరలోనే కెజిహెచ్ రూపురేఖలు మారిపోతాయని ప్రిన్సిప్ లకు వివరించారు. ప్రభుత్వం విద్య, వైద్యం, ఉపాది రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అందులో భాగంగానే కెజిహెచ్ లో రోగులకు సేవలు అందించేందుకు పెద్ద సంఖ్యలో స్టాఫ్ నర్సులను భర్తీచేసిందన్నారు. రానున్న రోజుల్లో మిగిలిన పారామెడికల్ పోస్టుల భర్తీ కూడా చేసి ఉత్తరాంధ్రాకే తలమానికంగా కెజిహెచ్ ను ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని చెప్పారు. ప్రభుత్వ పరంగా ఏ సమస్య వచ్చినా దానిని తీర్చడానికి తమవంతు సహకారం అందిస్తామని చెప్పారు.
రాజ్యాధికారం సాధించేవరకు నిరంతర పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజకీయ చైతన్య వేదిక ఆవిర్భావ సభలో వక్తలుక్తులు అభిప్రాయపడ్డారు. ఆదివారం పబ్లిక్ లైబ్రరీ లో జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ వాది, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ గౌరవ అధ్యక్షులు బొడ్డు కళ్యాణ్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేవలం మనువాద పార్టీలే రాజకీయ అధికారాన్ని చలా ఇస్తున్నారన్నారు. బహుజన వాదులందర్ని ఒక వేదిక పైకి తీసుకు వచ్చేందుకు ఈ చైతన్య వేదిక ఏర్పాటు చేశామన్నారు. మన గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వెబ్సైట్ జైరాజ్ మాట్లాడుతూ సమాజంలో బ్రాహ్మణ వాదం, బహుజనవాదం మాత్రమే ఉన్నాయన్నారు. మోసపూరితంగా బహుజనులను మభ్యపెట్టి బ్రాహ్మణ వాదులు అధికారాన్ని చలాఇస్తున్నారన్నారు. పెట్టుబడిదారీ వర్గం , బ్రాహ్మణ వాదంతో రాజ్యాధికారం పొందుతున్నారు అన్నారు. దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జె వి ప్రభాకర్ రావు మాట్లాడుతూ బహుజనులు రాజ్యాధికారం దిశగా నిరంతరం పోరాటం చేయాలని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు బహుజనలంతా కృషి చేయాలని కోరారు .రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజ్యాధికారం కోసం ఆర్థికంగా బలోపేతం కావాల్సిన అవసరం కూడా ఉందన్నారు .ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీలు 50 శాతం పైగా ఉన్నా అధికారం చేజిక్కించుకోలేకపోవడంలో ఐక్యత లేకపోవడమే కారణమని అన్నారు. రాజకీయ ప్రణాళిక అవసరమన్నారు. రాజకీయ చైతన్యం కోసం ఈ వేదికను ఏర్పాటు చేశామన్నారు. రైతు నాకు వ్యతిరేకంగా కేంద్రం ప్రవేశపెట్టిన మూడు చట్టాలను రద్దు చేసే వరకు వారు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తామని, 8 వ తేదీన తలపెట్టిన బందుకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఈ సందర్భంగా తీర్మానాన్ని ఆమోదించారు. అదేవిధంగా కరెంటు బిల్లు రద్దు చేయాలని, కాలుష్యం పై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలని కోరారు. న్యాయవాది గిరిజన మాట్లాడుతూ దేశంలోని మనువాద పార్టీలు బహుజనులను మింగేస్తున్నారన్నారు. బడుగు వర్గాలను అణగదొక్కడానికి కుట్ర జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అర్జున్, ప్రొఫెసర్ ప్రజ్ఞ, టీ గురుమూర్తి,ఐఎం మహ్మద్, గిరిధర్, ప్రసాద్ రావు, పి మల్లేష్, ప్రకాష్ రావు,మాటూరి శ్రీనివాస్, లూధర్ బాబు,డాౠకెఎల్.రావు తదితరులు పాల్గొన్నారు