అనంతపురం జిల్లాలో ఇళ్ళ పట్టాల పంపిణికి చేపట్టనున్న భూసేకరణలో అసైన్డ్ భూములకు చివరి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్ లోని రెవిన్యూ భవన్ లో సబ్ కలెక్టర్, ఆర్.డి.ఓ.లు, ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో ఇళ్ళ పట్టాల పంపిణి, భూసేకరణ, కోర్ట్ కేసులు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 25వ తేదీన నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా 2,03,199 ఇళ్ళ పట్టాలను లబ్దిదారులకు అందించనున్నామన్నారు. భూసేకరణకు సంబంధించి తొలుత అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రభుత్వ భూములు లేనిచోట ప్రైవేటు భూములను సేకరించాలన్నారు. ఈ రెండూ లేని ప్రాంతాల్లో మాత్రమే చివరి ప్రాధాన్యతగా అసైన్డ్ భూములను సేకరించాలన్నారు.
సబ్ కలెక్టర్, జిల్లాలోని ఆర్.డి.ఓ.లు భూసేకరణ ప్రతిపాదనలను వెంటనే పంపాలన్నారు. అట్టి ప్రతిపాదనలను ఆమోదించిన వెంటనే ఆ లేఔట్ లలో భూమి చదును, రాళ్ళను పాతడం, అంతర్గత రహదారులు, సర్వే పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. లేఔట్ లలో భూముల కేటాయింపుకు సంబంధించి ఎన్ని రాళ్ళు కావాలో ముందుగానే లెక్కించి సరఫరా చేసేందుకు సర్వం సిద్ధం చేసుకోవాలన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఇళ్ళ పట్టాల మంజూరులో భూసేకరణకు సంబంధించి కోర్టుల్లో 187 కేసులు పెండింగ్ లో ఉన్నాయని, ఈ కేసులు వేసిన వారితో సంబంధిత సబ్ కలెక్టర్, ఆర్.డి.ఓ.లు మాట్లాడి కేసులను విత్ డ్రా చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూసేకరణ కేసుల్లో కోర్టులు జారీ చేసిన ఇంటరిమ్ ఆర్డర్లకు సంబంధించి కౌంటర్ లను వెంటనే వేయాల్సిందిగా భూసేకరణ నోడల్ అధికారి వరప్రసాద్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. హై కోర్ట్ లో ఈ కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని లైసన్ ఆఫీసర్ త్రిమూర్తులును జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటివరకు జిపి ద్వారా కోర్టుకు సమర్పించిన కేసులు, జిపిచే ఆమోదించిన కేసులు, ఆమోదించాల్సిన కేసుల వివరాలను క్రోడీకరించి నివేదికను తనకు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆ నివేదికను పరిశీలించిన పిమ్మట ఏజితో తాను మాట్లాడడం జరుగుతుందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు 350 లేఔట్ లలో నిర్మించిన అంతర్గత రహదారులు దెబ్బతిన్నాయని ఎంపిడిఓలు, ఏపిఓలు నివేదికలు పంపారన్నారు. ఆ నివేకలలోని లేఔట్ లను సబ్ కలెక్టర్, ఆర్.డి.ఓ.లు 2 రోజుల్లోపు మరొకమారు పరిశీలించి వాస్తవాలను నివేదించాలన్నారు. అందుకు సంబంధించి మరమ్మతులు చేపట్టి వాటి డ్రోన్ ఫోటోలు, వీడియోలను తనకు పంపాలన్నారు. లేఔట్ లలో ఎండిన మొక్కల స్థానంలో వెంటనే మొక్కలను నాటాలన్నారు.
ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు తమ పరిధిలోని లేఔట్లన్నింటినీ పరిశీలించి పనులన్నీ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. లబ్దిదారుల ఎంపిక నుండి ఇళ్ళ నిర్మాణాలను పూర్తి చేసి లబ్దిదారులకు అందించే ప్రక్రియ ఆన్లైన్ ద్వారానే నిర్వహించాల్సి ఉందన్నారు. ఇందుకోసం గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది ముందుగా లాగిన్ సౌకర్యం పొందేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులలో ఇంజనీరింగ్ అసిస్టెంట్/వార్డ్ అమెనిటీస్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్/వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్/వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, విలేజ్/వార్డ్ వాలంటీర్లకు నిర్దేశించిన బాధతలను తు.చ. తప్పక పాటించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ లు నిశాంత్ కుమార్, డా. ఎ.సిరి, గంగాధర్ గౌడ్, డి.ఆర్.ఓ. గాయత్రీ దేవి, జిల్లా అధికారులు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న "వ్యర్థం పై యుద్ధం" కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) నాగార్జున సాగర్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో ఈ కార్యక్రమం అమలు, నిర్వహణపై ఆయన, జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ కుమారి తో కలిసి పత్రికా విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో "మనం మన పరిశుభ్రత కార్యక్రమం" (ఎం.ఎం.పి.ఎస్) రెండవ దశలో భాగంగా జిల్లా లోని 35 మండలాల్లో ఎంపిక చేసిన 153 గ్రామ పంచాయతీలను ఒ.డిఎఫ్ ప్లస్ గ్రామాలుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో పారిశుద్ధ్యం మెరుగు పరిచేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామన్నారు. అందులో భాగంగా 15 రోజుల పాటు (7-12-2020 నుంచి 21-12-2020 వరకు) పక్షోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ నేతృత్వంలో జిల్లాలోని అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల్లో పారిశుద్ధ్యం పై సంపూర్ణ అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందన్నారు.
ప్రభుత్వ శాఖల సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సమన్వయంతో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో " వ్యర్థం పై యుద్ధం" చేసేందుకు ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి యాజమాన్య సంస్థ, గ్రామీణ నీటి వ్యవస్థ, వైద్య ఆరోగ్య, విద్య, వ్యవసాయ శాఖల జిల్లా స్థాయి అధికారులతో పాటు డివిజనల్ పంచాయతీ అధికారులు, అభివృద్ధి అధికారులు, ప్రత్యేక అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు. సంబందిత శాఖల డివిజన్, మండల స్థాయి అధికారులు ఎం.పి.డి.వో.లు, తమ పరిధిలోని గ్రామీణ స్థాయి సిబ్బంది చేత పరిశుభ్రత, ఆరోగ్యం మెరుగు పరచడం పై ప్రజల్లో సంపూర్ణ అవగాహన తీసుకురావాలన్నారు.
* జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 7న పక్షోత్సవాల పై వర్కుషాపు, ర్యాలీ
"మనం - మన పరిశుభ్రత" పక్షోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో భాగంగా. ఈ నెల 7వ తేదీన జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు , అధికారులు, ఎన్.జి.ఒ.లతో వర్కుషాపు నిర్వహిస్తామని తెలిపారు. అన్ని అనుబంధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని జెడ్పి సీ.ఈ.ఓ పేర్కొన్నారు. 8వ తేదిన మండల స్థాయిలో, ప్రజా ప్రతినిధులు , అధికారులు, ఎన్.జి.ఒ.లతో సమావేశం జరిపి ర్యాలీ నిర్వహిస్తారని తెలిపారు. 9వ తేదీన గ్రామ పంచాయతీ స్థాయిలో సమావేశం మరియు ర్యాలీ జరుపుతారని అన్నారు. 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు గ్రామ పంచాయతీలను వ్యర్థ రహిత గ్రామాలుగా తీర్చి దిద్దేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ జిల్లా కోఆర్డినేటర్ ఈ.నాగలక్ష్మి పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకూ నిర్వహించనున్న “వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం” పక్షోత్సవాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గం.లకు జడ్పి మీటింగ్ హాలులో జరిగే సమావేశంలో ప్రారంభిస్తామన్నారు. అనంతరం మద్యాహ్నం 11-50 గం.లకు జడ్పి కార్యాలయ కూడలి నుండి మెయిన్ రోడ్ వరకూ వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, పార్లమెంటు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొంటారన్నారు. ఇదే తరహా కార్యక్రమాలను ఈ నెల 8వ తేదీన మండల స్థాయిలోను, 9వ తేదీన గ్రామపంచాయితీ స్థాయిలోను నిర్వహించి, 10 నుండి 21వ తేదీ వరకూ గ్రామ పంచాయితీ స్థాయి ఫంక్షనరీలు, స్వయం సహాయక బృందాలు, విద్యార్థులు, రైతులు, స్వచ్ఛంద సంస్థలు, దుకాణదారులు, కూరగాయల వ్యాపారులు, గ్రామీణ వృత్తికారులు, పారిశుద్య సిబ్బంది, ఉద్యోగుల భాగస్వామ్యంతో ఆవాసాలలో పారిశుద్య ఉద్యమ కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్ని రంగాల ప్రజలు వ్యర్థాల పై వ్యతిరేక పోరాటం పక్షోత్సవాల్లో భాగస్వాములై విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డిని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కె.కనకారావు, రెల్లి కార్పొరేషన్ చైర్మన్ వి.మధుసూధన రావులు మర్యాదపూర్వకంగా కలిసారు. పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. వీసి ప్రసాద రెడ్డిని విశాఖపట్నం ఎస్సీ, ఎస్టీ న్యాయవాదుల అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసారు. వీసీగా పదవీ బాధ్యతలు చేపట్టిన సంధర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు, ఆంధ్రప్రదేశ్ లోనే ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్శిటీకి విసిగా పనిచేసే అవకాశం వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో దక్కిందని, మీ హాయాంలో యూనివర్శిటీ మరింత అభివ్రుద్ధి చెందాలని ఆకాంక్షించారు.
అనంతపురం జిల్లాలో ప్రతి ఇంటిని రూ.1,80,000/-ల ఖర్చుతో నిర్మించనున్నట్టు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. శనివారం ఈ మేరకు అధికారులతో సమీక్షనిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఇంటి నిర్మాణానికి 20 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తామన్నారు. ఆ ఇళ్ల కు దగ్గరగా ఉన్న ఇసుక రీచ్, స్టాక్ యార్డ్, డిపోల నుండి ఇసుక రవాణా చార్జీలు మాత్రమే లబ్దిదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇంటి నిర్మాణానికి కావాల్సిన సామాగ్రి సైతం జిల్లా స్థాయిలో సేకరించి లబ్దిదారులకు అందించడం జరుగుతుందన్నారు. ప్రతి ఇంటి నిర్మాణానికి 92 సిమెంట్ బస్తాలు అవసరమన్నారు. ఒక సిమెంట్ బస్తా ధర మార్కెట్ లో రూ.390/-లు ఉంటే గృహ నిర్మాణ లబ్దిదారులకు రూ.235/-లకే ప్రభుత్వం అందిస్తోందన్నారు. లేఔట్ లు రూపొందించిన ప్రాంతాల్లో విద్యుత్, నీటి సౌకర్యం, బోర్లు వేయడంతో పాటు ఇతర సౌకర్యాలను కల్పించడం జరుగుతుందన్నారు.
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,240 కోట్లతో పనులను చేపట్టేందుకు నిధులను మంజూరు చేసిందన్నారు. మొదటి విడతలో పట్టణ ప్రాంతంలో 44,945 ఇళ్ళు , అర్బన్ డెవలప్మెంట్ పరిధిలోని మండలాలలోని లబ్దిదారులకు 66,154 ఇళ్ళు నిర్మించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 988 లేఔట్ లలో 509 కి.మీ.ల అంతర్గత రహదారులను, 58 కి.మీ.ల అప్ రోచ్ రోడ్లను నిర్మించామన్నారు. లేఔట్ లలో 9 మీటర్లు, 6 మీటర్ల రహదారులను నిర్మిస్తున్నామన్నారు. 9 మీటర్ల రహదారి నిర్మాణంలో 6 మీటర్ల వెడల్పుతో రోడ్డును, ఆ రోడ్డుకు ఇరువైపులా 1.50 మీటర్ వెడల్పుతో మురుగునీటి కాలువలను నిర్మిస్తామన్నారు. అలాగే 6 మీటర్ల రహదారి నిర్మాణంలో 4 మీటర్ల వెడల్పుతో రోడ్డును, ఆ రోడ్డుకు ఇరువైపులా ఒక మీటర్ వెడల్పుతో మురుగునీటి కాలువలను నిర్మిస్తామన్నారు.
రోడ్లను 6 ఇంచుల మందంతో నిర్మిస్తున్నామన్నారు. లబ్దిదారులందరికి సౌకర్యవంతంగా ఉండేలా లేఔట్ నిర్మాణాలను అత్యంత నాణ్యత, పచ్చదనం, అన్ని వసతులతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. 988 లేఔట్ లలో రహదారులకు ఇరువైపులా మరియు ఖాళీ ప్రదేశాలలో 1,20,000 మొక్కలను నాటడంతోపాటు ట్రీ గార్డ్స్ ను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ లు నిశాంత్ కుమార్, డా. ఎ.సిరి, గంగాధర్ గౌడ్, డి.ఆర్.ఓ. గాయత్రీ దేవి, జిల్లా అధికారులు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో అన్ని సదుపాయాలతో లేఔట్ లను సిద్ధం చేసి ఇళ్ళ పట్టాలను లబ్దిదారులకు అందించనున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్ లోని రెవిన్యూ భవన్ లో సబ్ కలెక్టర్, ఆర్.డి.ఓ.లు, ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో ఇళ్ళ పట్టాల పంపిణిపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 25వ తేదీన నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 15,10,000 మంది లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలను అందించనుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు విడతలలో 28,30,000 ఇళ్ళను లబ్దిదారులకు ఇవ్వనుందన్నారు. అందులో మొదటి విడతలో 15,10,000 మందికి, రెండవ విడతలో 13,20,000 మంది లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలను అందివ్వడమే కాకుండా ఇళ్ళ నిర్మాణాలను కూడా చేపడుతుందన్నారు.
దేశ వ్యాప్తంగా 5 సంవత్సరాల కాలంలో 60 లక్షల ఇళ్ళను నిర్మించారన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 సంవత్సరాల కాల వ్యవధిలోనే సుమారు 30 లక్షల ఇళ్ళను నిర్మించడం ఇంతవరకూ ఏ రాష్ట్రంలోనూ జరగలేదన్నారు. అనంతపురం జిల్లాలో 2,03,199 మందికి ఇళ్ళ పట్టాలను పంపిణి చేయనున్నామన్నారు. ఇందులో 1,11,099 మంది లబ్దిదారులకు గృహ నిర్మాణాలకు కూడా మంజూరు ఉత్తర్వులను జారీ చేస్తామన్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ,ప్రతి ఒక్క లబ్దిదారునికి 340 చ.అ.ల ఇంటి పట్టాని అందించి, అందులో 272 చ.అ.లో ఇంటిని నిర్మించడం జరుగుతుందన్నారు. ఇందులో లివింగ్ రూమ్, కిచెన్, బాత్ రూమ్, టాయిలెట్ లు ఉంటాయన్నారు. మొదటి విడతలో పట్టణ ప్రాంత లబ్దిదారులకు మరియు అర్బన్ డెవలప్మెంట్ పరిధిలోని మండలాలలోని లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలను అందించడం జరుగుతుందన్నారు. రెండవ విడతలో గ్రామీణ ప్రాంత లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలను అందించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ లు నిశాంత్ కుమార్, డా. ఎ.సిరి, గంగాధర్ గౌడ్, డి.ఆర్.ఓ. గాయత్రీ దేవి, జిల్లా అధికారులు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బాలల హక్కుల పరిరక్షణకు సమిష్టిగా కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ అట్టాడ సిరి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని బాలల సంక్షేమ పోలీసు అధికారులు, ఇతర విభాగాల అధికారులకు ఒక రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పోలీసుశాఖ, మహిళ శిశు సంక్షేమశాఖలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ అట్టాడ సిరి ... అతిథులుగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి దీనబాబు, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య, అదనపు ఎస్పీ ఇ.నాగేంద్రుడు, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ....పిల్లల సంరక్షణలో పోలీసుల పాత్ర చాలా కీలకమైందన్నారు. బాలల సంరక్షణ అందరి బాధ్యత అన్నారు. బాలల న్యాయ చట్ట పరిధిలోకి వచ్చే పిల్లల ఐడెంటిటీని బహిర్గతం చేయరాదన్నారు. గుడ్ టచ్ & బ్యాడ్ టచ్ లపై అవగాహన చేసి పిల్లలను అప్రమత్తం చేయాలన్నారు. యూనిసెఫ్ సంస్థ (హైదరాబాద్ )బాలల పరిరక్షణ విభాగం రిసోర్స్ పర్సన్ డేవిడ్ ఆన్లైన్ ద్వారా బాలల న్యాయ చట్టం, బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టం నిబంధనలు వివరించారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి సుబ్రమణ్యం "బాలల సంరక్షణలో పోలీసుల పాత్ర- పిల్లల దత్తత " అనే అంశంపై అవగాహన చేశారు. బాలల న్యాయ మండలి ప్రిన్సపల్ మేజిస్ట్రేట్ చట్టంతో విబేధించబడిన పిల్లల పునరావాస చర్యలు గురించి వివరించారు. మహిళ శిశుసంక్షేమ విభాగం ఏ.పి.డి లక్ష్మీకుమారి, రీజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్రొబెషన్ హుస్సేన్ బాషా, జిల్లాలోని పలువురు పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న, రంగుమారిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరిగేలా రైతులకు సహాయసహకారాలు అధికారులు అందించాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని కోర్టుహాల్ నుంచి జిల్లాస్థాయి అధికారులతో కలిసి జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం కొనుగోలు కమిటీ సమావేశం నిర్వహించారు. మరో ఏడు రోజులు కీలకమైనవని, ఈ సమయంలో క్షేత్రస్థాయిలో అందుబాటులోఉండి దెబ్బతిన్న, రంగుమారిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేలా చూడాలని వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్ సప్లయ్‌స్, రెవెన్యూ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. తమ దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు జరగలేదంటూ ఏ ఒక్క రైతు నుంచి ఫిర్యాదు రాకుండా చూడాలన్నారు. ప్రతి రైతు భరోసా కేంద్రంలో తప్పనిసరిగా ధాన్యం కొనుగోలు సహాయకుడు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ధాన్యం సేకరణకు సంబంధించి జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూం (08886613611)కు అనుసంధానంగా 21 బృందాలు ఏర్పాటుచేశామని.. ప్రతి 20 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఒక బృందం సమన్వయం చేస్తున్నట్లు వివరించారు. ఒక్కో బృందం తరఫున కంట్రోల్ రూం నుంచి టెక్నికల్ అసిస్టెంట్, క్షేత్రస్థాయి నుంచి మండల వ్యవసాయ అధికారి సేవలందిస్తున్నట్లు తెలిపారు. దెబ్బతిన్న ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్లు కూడా సహకరిస్తున్నారన్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ విషయంలో మిల్లర్లు పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని సూచించారు. ఈ విషయంలో జిల్లాకు మంచి పేరుందని, దీన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలన్నారు. సమావేశంలో సివిల్ సప్లయ్‌స్ డీఎం ఇ.లక్ష్మీరెడ్డి, డీఎస్‌వో పి.ప్రసాద్‌బాబు, డీడీఏ ఎస్.మాధవరావు, మార్కెటింగ్ ఏడీ కేవీఆర్ఎన్ కిశోర్, రైస్ మిల్లర్ల అసోషియేషన్ ప్రతినిధులు, డివిజనల్ అధికారులు పాల్గొన్నారు.
జివిఎంసి పరిధిలోని పాఠశాలల్లో పిల్లలకు అర్ధమయ్యే రీతిలో నాడు-నేడు పథకం ప్రణాళికు రూపొందించాలని కమిషనర్ డా.స్రిజన అధికారులను ఆదేశించారు. శనివారం వి.ఎం.ఆర్.డి.ఏ. చిల్డ్రన్ ఎరేనా థియేటర్లో అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావుతో కలసి విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాబోయే ఫిబ్రవరి–2021నెల నుంచి పాఠశాలల్లో ప్రారంభమయ్యే నాడు-నేడు ఎంతో చక్కగా ఉండాలన్నారు. నాడు-నేడు పధకంలో ప్రధాన భాగాస్వామ్యులైన తల్లిదండ్రుల కమిటీలకు విద్యార్ధులకు అవసరమయ్యే విధంగా నూతన ప్రణాళికలు రూపొందించడంపై అవగాహన పెంపొందించాలని ఆదేశించారు. స్మార్ట్ సిటీ పధకంలో భాగంగా సిటీ ప్రాజెక్టు క్రింద 50స్కూళ్ళలో పలు అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. ఈ పధకంలో చేపడుతున్న పనులు, సాధారణ ఇంజినీరింగు పనులుగా సిమెంటు, ఇసుక, ఇటుక పనులు వలే కాకుండా, “సృజన” తో కూడిన పనులుగా చేపట్టాలని “సృజన” పేర్కొన్నారు. “బాల” (బిల్డింగ్ ఏజ్ ఎ లెర్నింగ్ ఎయిడ్) విధానంలో ప్రణాళికలు రూపొందాలని, అప్పుడే ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మన పాఠశాలలు పోటీని ఎదుర్కొంటాయని సూచించారు.
పిల్లలు సామాజిక వికాసాభివృద్ధికి పాఠశాలలు ఒక స్ప్రింగు బోర్డులా తోడ్పాటునందించాలన్నారు. దైనందింక జీవనంలో మంచి అలవాట్లుగా ప్లాస్టిక్ వినియోగ నిషేధం, చెత్తను వేరు చేసి, పారిశుద్ధ్య కార్మీకుడికి అందించడం, ఆరుబయట మలమూత్ర విసర్జన చేయకుండా ఉండటం వంటి అలవాట్లు విద్యార్ధులకూ, ఉపాధ్యాయులు నేర్పించాలని కోరారు. పాఠశాలలు ప్రస్తుతం ప్రారంబమైనందున, పాఠ్యబోధనా ప్రణాళికలను తయారు చేసి, వచ్చే శనివారంలోగా ప్రధాన కార్యాలయానికి సమర్పించాలని ప్రదానోపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్ధిని, విద్యార్దుల మానసిక వికాసాభివృద్ధికి గాను క్రీడా పోటీల నిర్వహణ, స్టడీ టూర్ వంటివి రాబోతున్న కాలంలో నిర్వహిస్తామని వీటిపై తగుసూచనలు ఉపాధ్యాయులు అందించాలని కోరారు. ప్రభుత్వం మంజూరు చేసిన విద్యాకానుక కిట్లు విద్యార్ధులకు అందించేటట్లు తగు చర్యలు చేపట్టాలన్నారు.
అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు మాట్లాడుతూ, వార్డు ఎడ్యుకేషన్ కార్యదర్శులు, ప్రతీ పాఠశాలనందు స్వచ్ఛ సర్వేక్షణ్ – 2021పై అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయుల సహకారం తీసుకోవాలన్నారు. విశాఖను స్వచ్ఛ సర్వేక్షణ్ లో మూడవ ర్యాంకు లోపు ర్యాంకు సాధించడానికిగాను విద్యార్ధులకు అవగాహన కల్పించాలని యాప్ ను వినియోగించడం, 7 ప్రశ్నలపై అవగాహన కల్పించడం, ర్యాలీలు నిర్వహించడం వంటివి పాఠశాలల విద్యార్ధులు, ఉపాధ్యాయులు ద్వారా చేపట్టాలన్నారు. ప్రతీరోజూ డైరీ నిర్వహణ, రిజిస్టర్లను నిర్వహించడం వంటివి చేపట్టాలని కార్యదర్శులను ఆదేశించారు. విద్యార్ధుల డ్రాపౌట్స్ జాబితా చేతిలో పట్టుకొని తల్లిదండ్రుల వద్దకు వెళ్లి విద్య ఆవశ్యకతను వివరించి పాఠశాలలో చేర్చడానికి తగుచర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీనివాసరావు, జివిఎంసి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వార్డు ఎడ్యుకేషన్, డేటా ప్రోసెసింగు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
నీరే జీవనాధారమని, నీరున్న ప్రదేశాలు మాత్రమే క్షేమంగా ఉంటాయని భావించి, జిల్లాలో జల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ చెప్పారు. జాతీయ జలశక్తి శాఖ ఆధ్వర్యంలో వాననీటి పరిరక్షణపైన జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో శనివారం జాతీయస్థాయి వెబ్‌నార్ జరిగింది. ఈ వెబ్ నార్‌లో జలశక్తి శాఖ కార్యదర్శి యుపి సింగ్ కీలకోపన్యాసం చేయగా, ఆంధ్రప్రదేశ్ నుంచి విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వర్షపునీటి సంరక్షించి, భూగర్భజలాలను పెంచడానికి, చెరువుల శుద్ది కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా భూగర్భజల మట్టం గణనీయంగా పెరిగిందన్నారు. ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం ద్వారా అదనంగా 20.9 టిఎంసిల నీటిని రీఛార్జి చేయడం జరిగిందని, తద్వారా భూగర్భజల మట్టం 1.9 మీటర్లు మేరకు పెంచడం జరిగిందని వివరించారు. జిల్లాలో 9,346 చెరువులకు గానూ, ఇప్పటివరకు సుమారు 300కుపైగా చెరువులను శుద్దిచేయడం జరిగిందని తెలిపారు.
శుద్దిచేసిన చెరువుల ద్వారా భూగర్భజలాలను పెంచడమే కాకుండా, పశువులు, జీవాలకు నీటి కొరత లేకుండా చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా గతేడాది త్రాగునీటి సమస్య కూడా తలెత్తకుండా చేయగలిగామని తెలిపారు. బహిరంగ మలవిసర్జన నిర్మూలనకు కూడా దోహదపడిందని చెప్పారు. జిల్లాలో జరిగిన చెరువుల శుద్ది కార్యక్రమాన్ని గుర్తించి, ఇటీవలే జల సంరక్షణలో జాతీయ అవార్డును గెలుచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ద్వారా జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల ఆద్వర్యంలో కోటి, 14లక్షల మొక్కలను పెంచి, రాష్ట్రంలోనే మొదటి స్థానంలోనే నిలిచామన్నారు. ఫలితంగా జిల్లాలో పచ్చదనాన్ని 16.9 శాతం నుంచి 17.9 శాతానికి పెంచడం జరిగిందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛం సంస్థలు, వివిధ వర్గాలకు చెందిన ప్రజల భాగస్వామ్యంతో మొక్కల పెంపకాన్ని జిల్లాలో ఒక ఉద్యమ స్థాయిలో నిర్వహిస్తూ, హరిత విజయనగరం స్థాపనే ధ్యేయంగా కృషి చేయడం జరుగుతోందని వివరించారు. పచ్చదనాన్ని పెంచడానికి, చెరువుల శుద్దికి, పారిశుధ్యానికి విస్తృతమైన ప్రచారాన్ని కల్పించడంలొ భాగంగా, తానే స్వయంగా మూడు పాటపాడి, ప్రజల్ని చైతన్యవంతులను చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యర్ధాలపై యుద్ధం పేరుతో డిశంబరు 7 నుంచి పరిశుభ్రత పక్షోత్సవాల్లో భాగంగా స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మండల ప్రత్యేకాధికారులుగా వ్యవహరిస్తున్న జిల్లా అధికారులు పాల్గొనాల్సి వున్న కారణంగా ఆరోజు జరగాల్సిన స్పందన కార్యక్రమం రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా అధికారులంతా ఆ రోజున మండల కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నందున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరగాల్సిన స్పందన కార్యక్రమం రద్దు చేశామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కలెక్టర్ కోరారు.
వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డికి శనివారం విశాఖలో ఘన స్వాగతం లభించింది. సోషల్ మీడియా కార్యకర్తల సమావేశాన్ని ముగించుకొని విజయవాడ నుంచి విశాఖ చేరుకున్న ఆయనకు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షులు తిప్పల వంశీ రెడ్డి విశాఖ ఎయిర్ పోర్టులో స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు. రెండు రోజుల పాటు విశాఖలో ఉత్తరాంధ్రా సోషల్ మీడియా కార్యకర్తల సమావేశం విశాఖలోని విఎంఆర్డీఏలో జరిగే కార్యక్రమానికి రాజ్యసభ్యులు హాజరవుతారు. తొలుత మూడు ప్రాంతాలకు చెందిన సమావేశాలు పూర్తికావడంలో ఆయన విశాఖ చేరుకున్నారు. ఆయనను కలిసిన వారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీలకర్ర నాగేంద్ర, బీశెట్టి గణేష్, జాన్ ప్రసాద్, గిరి తదితరులు ఉన్నారు.
తుని మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ది పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) జి.రాజకుమారి, ప్రత్యేక అధికారి హోదాలో తుని మున్సిపాలిటీలో పర్యటించి పట్టనంలో చేపట్టిన వివిధ అభివృద్ది పనులను తనిఖీ చేసారు. ఇందులో భాగంగా ఆమె 14వ ఆర్ధిక సంఘం నిధులు కోటీ 15 లక్షల రూపాయలతో తుని పట్టనంలో జరుగుతున్న సిమ్మెంట్ రోడ్లు, డ్రెయిన్ల పనులను పరిశీలించి పనులు చిరకాలం నిలిచి ఉండేలా నాణ్యతా ప్రమాణలతో నిర్వహించాలని సూచించారు. పట్టనంలో గృహాల నుండి తడి, పొడి చెత్త సేకరణ కార్యక్రమాన్ని, బాలభవనం వద్ద 5 లక్షలు సాధారణ నిధులతో చేపట్టిన మెటిరీయల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ పనుల పురోగతిని సమీక్షించారు. అలాగే బ్యాంకుపేట మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను, 14వ ఆర్థిక సంఘం నిధులు 35 లక్షలతో నిర్మిస్తున్న ప్రహరీ గోడ పనులను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. తదుపరి ఇసుకపేటలోని వార్డు సచివాలయం-10ను ఆకస్మికంగా సందర్శించి వివిధ ప్రభుత్వ సంక్షేమాల పధకాలను అమలు చేస్తున్న తీరును ఫంక్షనరీలతో సమీక్షించారు. ప్రజల నుండి అర్జీలను పారదర్శకంగా, త్వరితగతిన పరిష్కరించాలని, ఆయా పధకాల ప్రయోజనాలను లక్ష్యిత వర్గాలకు ముంగిటే అందించి వారి సంతృప్తిని, హర్షాన్ని అందుకోవాలని ఫంక్షనరీలకు సూచించారు. అనంతరం మున్సిపల్ ఆఫీసులో కమీషర్, మున్సిపల్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి పట్టనంలో పారిశుద్యం, త్రాగునీటి సరఫరా, సీజనల్ వ్యాధుల నివారణ, పన్నుల సేకరణ, పౌర సేవలు, మున్సిపల్ ఆస్తుల అభివృద్ది, పరిరక్షణ తదితర అంశాలను సమీక్షించి వాటి పటిష్ట అమలుకు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమాల్లో తుని మున్సిపల్ కమీషనర్, మున్సిపల్ ఇంజనీరింగ్, ప్రజారోగ్య, పాలనా విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తూ జిల్లాలో డిశంబరు 7 నుండి 21 వరకు నిర్వహించే పారిశుద్ధ్య పక్షోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. ప్రజలు భాగస్వాములైతేనే ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడుతుందని, అందువల్ల ఈ పారిశుద్ధ్య పక్షోత్సవాలకు మండలంలో ఎంపిక చేసిన పది గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజలను ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించి పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచి ఆయా గ్రామాలను సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. మండల ప్రత్యేకాధికారులతో శనివారం కలెక్టర్ కార్యాలయంలో మనం-మన పరిశుభ్రతపై జిల్లా కలెక్టర్ ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశుభ్రంగా, పచ్చదనంగా, ఆరోగ్యంగా మన విజయనగరం అనే నినాదంతో మన జిల్లాలో కార్యక్రమాలు ఎప్పటినుండో చేపడుతున్నామని, దీనికి కొనసాగింపుగా పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో జల జీవన్ మిషన్ కింద ఇప్పటికే వాష్ అనే కార్యక్రమాలు చేపడుతున్నామని వీటి ద్వారా స్వచ్ఛమైన తాగునీరు, వ్యర్ధాల నిర్వహణ, డ్రెయిన్ల నిర్వహణ, చేతులు పరిశుభ్రంగా వుంచుకోవడం, సబ్బుతో చేతులను కడగటం వంటి అంశాలపై ప్రచారం చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో తడి చెత్త, పొడిచెత్త విడిగా సేకరించడం వంటి అంశాలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. భోజనం చేసే ముందు, మలవిసర్జన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవడం అనేది ఒక అలవాటుగా మారాలన్నారు. ఈ వారోత్సవాల్లో భాగంగా గ్రామాల్లో పిచ్చిమొక్కలు తొలగించడం, డ్రెయిన్లలో పూడిక, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పక్షోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ఈనెల 7వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యుల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం వద్దకు వెళ్లి దాని పనితీరును ప్రతిఒక్కరికీ తెలియజేయాలన్నారు. 8, 9 తేదీల్లో మండల కేంద్రాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఆయా మండలాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. 10వ తేదీ నుండి 21 వరకు గ్రామస్థాయిలో రైతులు, మహిళలు, విద్యార్ధులు, వ్యాపారుల తదితర వివిధ వర్గాల ప్రజలతో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈనెల 21న పక్షోత్సవాల ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకుల నిర్వహించి ఈ పక్షోత్సవాల్లో చేపట్టిన కార్యక్రమాలపై గ్రామ ప్రజలకు వివరించాలన్నారు. మండల ప్రత్యేకాధికారులంతా 7వ తేదీ నుండి జరిగే పారిశుద్ధ్య పక్షోత్సవాల్లో తమకు కేటాయించిన మండలాల్లో పాల్గొనాలని ఆదేశించారు.
7న జిల్లా కేంద్రంలో పక్షోత్సవాల ప్రారంభ ర్యాలీ
వ్యర్ధాలపై యుద్ధం పేరుతో చేపడుతున్న పక్షోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈనెల 7వ తేదీ సోమవారం ఉదయం 7 గంటలకు జిల్లా కేంద్రంలోని కోట జంక్షన్ నుండి అయ్యకోనేరు వరకు ర్యాలీ చేపడుతున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించే ర్యాలీలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొంటారని, అనంతరం అయ్యకోనేరు వద్ద ప్రారంభిస్తామని చెప్పారు. పారిశుద్ధ్య పక్షోత్సవాలపై రూపొందించిన ప్రచార సామాగ్రి, కరపత్రాలు, పోస్టర్లను జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్, జాయింట్ కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్, ఐటిడిఏ పి.ఓ. ఆర్.కూర్మనాథ్, జిల్లా పంచాయతీ అధికారి కె.సునీల్ రాజ్‌కుమార్, జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. టి.వెంకటేశ్వరరావు తదితరులు ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో ఎమ్మెల్యేలు ఒకరికొకరు దూషించుకోవడం మాని ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని ఏపీ బీజేజేపి అధికార ప్రతినిధి సుహాసిని అన్నారు. విశాఖలో శనివారం నగరంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లపై ఎంవీపీ, టిటిడి కళ్యాణమండపం జంక్షన్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ లో రాష్ట్రంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లకు నిధులు కేటాయించాలన్నారు. రాష్ట్ర బిజెవైఎమ్ అధ్యక్షులు సురేంద్రమోహన్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఒక్కొక్కటిగా విజయ ఢంకా మ్రోగిస్తూ ప్రజల పార్టీగా ముద్ర వేసు వేసుకుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఏ పార్టీ వలన సాధ్యం కాదని అది కేవలం బీజేపీ తోనే సాధ్యం అవుతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రం లో ఉన్న రోడ్ల దుస్థితి బట్టి వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరిపాలన ఏవిధంగా ఉందో అంచనా వేయవచ్చవచ్చాన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటూరి రవీంద్ర ,బీజేపీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.