విజయనగరం జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ నిల్వ, పంపిణీకి అవసరమైన ఏర్పాట్లన్నింటినీ ఇప్పటి నుండే చేయాలని జిల్లా కలెక్టర్, కోవిడ్‌పై జిల్లా టాస్కుఫోర్స్ కమిటీ ఛైర్మన్ డా.ఎం.హరిజవహర్ లాల్ వైద్య ఆరోగ్య అధికారులను ఆదేశించారు. కోవిడ్ వ్యాక్సిన్ నిల్వ, రవాణాలో శీతలీకరణ వ్యవస్థ నిర్వహణే ముఖ్యమని, దీనిపై అధికంగా శ్రద్ధ చూపాలన్నారు. ఇప్పటి నుండే వ్యాక్సిన్‌ను నిల్వచేసే ప్రదేశాలను గుర్తించడం, రవాణా సందర్భంగా వ్యాక్సిన్‌కు అవసరమైన స్థాయిలో శీతల వ్యవస్థ వుండేలా ఆయా వాహనాల్లో ఏర్పాట్లు చేయడం ముఖ్యమని చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ సన్నద్ధతపై శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా టాస్కు ఫోర్సు కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలస్థాయి టాస్కుఫోర్సు సమావేశాలు తహశీల్దార్‌ల అధ్యక్షతన నిర్వహించి ఆ సమావేశపు నివేదికలు వెంటనే పంపించాలని ఆదేశించారు. కోవిడ్‌ను 48 రోజులపాటు నిలువరించి గ్రీన్‌జోన్‌లో నిలిచిన జిల్లాగా మన జిల్లాకు ప్రత్యేక స్థానం వున్నదని, రెండో వేవ్‌లో కూడా కేసులు లేకుండా, ఒక్క మరణం కూడా సంభవించకుండా నిరోదించడమే లక్ష్యంగా ప్రజల్లో అవగాహన కలిగించాలన్నారు. అన్ని శాఖల అధికారులు తమ శాఖల సిబ్బందిలో కోవిడ్ సోకకుండా చేపట్టాల్సిన పదిహేను అంశాలపై కనీస స్థాయి పరిజ్ఞానం వుండేలా చర్యలు చేపట్టాలని, ప్రతి ఒక్క ఉద్యోగి కరోనా వారియర్‌లా సిద్ధం చేయాలన్నారు. వ్యక్తుల నుండి ఆరడుగుల భౌతికదూరం వుండేలా చూడటం, మాస్కు తప్పనిసరిగా ధరించడం, రోజంతా పలుమార్లు చేతులను సబ్బు లేదా శానిటైజర్‌లతో శుభ్రం చేసుకోవడం వంటి కనీస జాగ్రత్తలు పాటించేలా అన్ని వర్గాల ప్రజానీకంలో అవగాహన కలిగించాల్సి వుందన్నారు.
జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) డా.ఆర్.మహేష్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సినేషన్ చేపడుతున్న కారణంగా సాధారణంగా వేసే వ్యాధినిరోధక టీకాలకు ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయాల్సి వుందన్నారు. వ్యాక్సిన్ కోసం పలువర్గాల నుండి వైద్య ఆరోగ్య సిబ్బందిపై ఒత్తిడి అధికంగా వుంటుందని, అందువల్ల ఈ విషయంలో జాగ్రత్తలు చేపట్టాల్సి వుందని పేర్కొన్నారు. వ్యాక్సిన్ పంపిణీ, అవసరమైన వారికి అందించడానికి పకడ్బందీ వ్యూహం ఏర్పరచుకోవలసి వుందన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యు.హెచ్.ఓ.) ప్రతినిధి డా.భవాని మాట్లాడుతూ ఈనెల 22న వ్యాక్సిన్ మేనేజ్‌మెంట్ పై జిల్లా స్థాయి రిసోర్సు పర్సన్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. యునిసెఫ్ ప్రతినిధి శివ కిషోర్ మాట్లాడుతూ కోవిడ్‌పై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు తమ సంస్థ ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.
జిల్లాలో ప్రస్తుతం వున్న శీతలీకరణ వ్యవస్థ ఏర్పాట్లు, నిల్వ సదుపాయాలు, వ్యాక్సిన్ సరఫరాకు అందుబాటులో వున్నవాహనాలు తదితర అంశాలపై జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్.వి.రమణకుమారి వివరించారు. జిల్లాలో 90 కోల్డ్ చెయిన్ పాయింట్లు, 231 నిల్వ పరికరాలు, 3909 మంది వ్యాక్సినేషన్ చేపట్టే ఎ.ఎన్.ఎం.లు ప్రస్తుతం అందుబాటులో వున్నట్టు వెల్లడించారు. వ్యాక్సిన్ రవాణాకు మరో రెండు ప్రత్యేక వాహనాలకోసం, మరికొన్ని అదనపు నిల్వ పరికరాల సరఫరాకోసం ప్రభుత్వానికి నివేదించామన్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలసి మొత్తం 15వేల ఆరోగ్య కార్యకర్తలు అందుబాటులో వున్నప్పటికీ వ్యాక్సినేషన్‌లో శిక్షణ పొందిన కార్యకర్తలు 3,909 మంది మాత్రమే వున్నట్టు వివరించారు.
జిల్లాలో వివిద ప్రభుత్వ శాఖల ద్వారా వ్యాక్సినేషన్‌ను ఏ రకమైన సహాయ సహకారాలు అవసరమో గుర్తించి తెలియజేస్తే ఆ మేరకు ఆయా శాఖల సిబ్బందిని ఈ కార్యక్రమానికి వినియోగించే ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్(రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మనాథ్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, డి.సి.హెచ్.ఎస్. డా.నాగభూషణరావు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సీతారామరాజు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.బాలమురళీకృష్ణ, జిల్లా అదనపు వైద్యాధికారి డా.రవికుమార్, జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. టి.వెంకటేశ్వరరావు, పలు ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సేవాభావం తో చేసే కార్యక్రమాలు పది కాలాలపాటు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. శనివారం మంత్రి అమలాపురం లో వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లో నూతనంగా నిర్మించిన రెండు ఏ.సి సూట్ రూమ్ లను,ఒక వాటర్ టాంక్ ను మంత్రి ప్రారంభించారు. అతిథి గృహాల లో ఒకటి స్థానిక ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్, సాయితేజ కన్స్ట్రక్షన్స్ అధినేత మండేల నాగ వెంకట ప్రసాద్(బాబి) తన తల్లిదండ్రులు కీ.శే. మండేల తాతారావు,శ్రీమతి లలిత జ్ఞాపకార్థం నిర్మించినది కాగా కీ.శే. అరిగెల శ్రీరామమూర్తి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు భద్రకాళి గ్రూప్స్ అధినేత ఏ.వి.వి.ఎస్. నాయుడు(బుజ్జి) నిర్మించారు . అలాగే వాటర్ టాంక్ ను విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి గోకరకొండ గోపి నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తులకు అందించే సేవాకార్యక్రమాలు లో భాగంగా తల్లిదండ్రుల పేరున చిరస్థాయిగా నిలిచిపోయే లా అతిధి గృహాలను నిర్మించిన బుజ్జి, బాబి లతో పాటు గోపిని మంత్రి విశ్వరూప్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్మా కర్రి రాఘవ మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, బోనం కనకయ్య, యాళ్ల దొరబాబు, టిడిపి ఆర్గనైసింగ్మె సెక్రటరీ మెట్ల రమణ బాబు, మాజీ చైర్మన్ చిక్కాల గణేష్, చెల్లుబోయిన శ్రీనివాస్, మట్టపర్తి నాగేంద్ర, వాసంశెట్టి సత్యం,కల్వకొలను తాతాజీ , నిమ్మకాయల జగ్గయ్య నాయుడు, వంటెద్దు వెంకన్నయుడు, మామిడిపల్లి శ్రీను,డాక్టర్ ధనవంతరి నాయుడు, డాక్టర్ గంధం విశ్వనాధ్, బండిగుప్తపు పాండు రంగ, కొత్తూరి శ్రీను, దేవస్థానం చైర్మన్ల కల్వకొలను బాబి, సంగినేడి బాబులు, కాళే వెంకటేశ్వర్లు, ఏడిద శ్రీను, సుంకర సుధ మాజీ చైర్మన్ కర్రి దత్తుడు, ఈ.ఓ బొక్కా వెంకటేశ్వరావు, అశెట్టి అదిబాబు నల్లా పవన్, మోకా వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష ఉండడంతో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశామని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు అన్నారు. ఈ సంధర్బంగా శనివారం కళాశాలల యాజమాన్యం, పరీక్షలు నిర్వహించే కళాశాల ప్రిన్సిపాల్స్, పోలీసు అధికారులతో ఎస్పీ కార్యాలయం సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ, పరీక్ష కేంద్రాల వద్ద ఏలాంటి సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సంబంధిత పోలీసు అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు.. పరీక్ష కేంద్రాల వద్ద సిసి టివిల కెమెరాల నిఘా పకడ్బందీగా ఉండాలన్నారు. సిసి టివిల విడియో స్టోరేజి కూడా ఉండాలన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న లాడ్జీలు, అపార్ట్ మెంట్ లలో తనిఖీలు నిర్వహించాలన్నారు. ఆదివారం పరీక్ష సమయం ఉదయం 11 నుండి 1 గంట వరకు ఉంటుందన్నారు. కర్నూలుతో పాటు తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ లలో కూడా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు.
రాయలసీమ జోన్ లో కర్నూలు, తిరుపతి లలో మొత్తం 4 సెంటర్లు, కర్నూలులో 2 సెంటర్లలో పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు , ఇంటర్నెట్ సెంటర్లను, హోటల్స్ , ఇతర షాపులను మూసి వేయించాలన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్దుల హాజరును బయోమెట్రిక్ ద్వారా నమోదు చేయాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి వెళ్ళే ప్రతి అభ్యర్దికి కోవిడ్ థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే పరీక్ష కేంద్రానికి అనుమతించాలన్నారు.
పరీక్ష రోజున ఒక గంట ముందే కేవలం హాల్ టికెట్ తో పరీక్ష కేంద్రానికి అభ్యర్దులు చేరుకోవాలన్నారు. కోవిడ్ నేపథ్యంలో పరీక్ష రాసే అభ్యర్ధులు ఫేస్ మాస్కులు ఖచ్చితంగా కలిగి ఉండాలన్నారు. పరీక్ష కేంద్రానికి పెన్నులు, సెల్ ఫోన్ లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష హాల్లోకి అనుమతి ఉండదన్నారు. పెన్నులను ప్రతి ఒక్కరికి పరీక్ష కేంద్రంలోనే ఇస్తారన్నారు.
పరీక్ష రాసే అభ్యర్దులకు బయోమెట్రిక్, మ్యానువల్ ఫింగర్ ప్రింట్ సేకరణ ఉంటుందన్నారు. హాల్ టికెట్ తో పాటు ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పుల్లారెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్( కో ఆర్డినేటర్) శ్రీనివాసరెడ్డి, పుల్లయ్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు, డిఎస్పీలు వెంకటాద్రి, యుగంధర్ బాబు కె.వి మహేష్ , రామాంజి నాయక్, సిఐలు ఓబులేషు, శ్రీనాథ్ రెడ్డి , శివశంకరయ్య, ఈ కాప్స్ ఇంచార్జ్ రాఘవరెడ్డి ఉన్నారు.
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలను పారదర్శకంగా చేయాలని ఆదేశించారని రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తెలిపారు. రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు శుక్రవారం వరకు 5 రోజులు పాటు పాల్గొని శనివారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొన్నారు. తొలుత బందరు మండలంలో ఒక గ్రామానికి చెందిన 30 మంది మహిళలు మంత్రిని కలిసి తమ సమస్యను చెప్పుకొన్నారు. తమ గ్రామంలో గత 8 ఏళ్లుగా ఒక ఉపాధ్యాయురాలు ఎంతో ఆదర్శవంతంగా విధులు నిర్వహిస్తూ బాల బాలికలకు ఉత్తమ విద్యా ప్రమాణాలు అందిస్తూ, గ్రామాన్ని ఎంతో చైతన్యపరుస్తున్నారని ఆమెను తమ గ్రామంలోనే తిరిగి ఉద్యోగం చేసేలా ఆ బదిలీను మీరే నిలిపివేయాలని కోరారు.
ఈ విషయమై స్పందించిన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, బదిలీలు , ఉద్యోగ విరమణలు ప్రభుత్వ ఉద్యోగులకు తప్పని అంశమని ఆయన తెలియచేస్తూ, ఈ ఏడాది ఫిబ్రవరి 20 వ తేదీ 2020 నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు అర్హులని, వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ బదిలీలు కార్యక్రమం జరుగుతుందన్నారు. టీచర్లకు స్కూళ్ల ఎంపిక ఆప్షన్ల నమోదు నుంచి బదిలీ ఉత్తర్వులు జారీ వరకు పూర్తి ప్రక్రియలను ఆన్‌లైన్లోనే విద్యాశాఖ నిర్వహించనుందని క్షేత్రస్థాయిలో పలు అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ బదిలీ నిర్ణయాలను అధికారులు తీసుకొంటారని ఈ తతంగమంతా అత్యంత పారదర్శకంగా జరుగుతుందని గ్రామస్తులకు మంత్రి పేర్ని నాని నచ్చచెప్పారు. కూనపరెడ్డి ఈశ్వరరావు అనే వృద్ధుడు మంత్రిని కలిశారు. జగ్గయ్యపేట ఎన్జీవో కాలనీ లో తనకు ఇంటి స్థలం గతంలో ప్రభుత్వం ఇచ్చిందని , ఆ నివేశన స్థలాన్ని ఒక వ్యక్తి ఆక్రమించుకున్నారని తెలిపారు. తనకు న్యాయం చేయమని కోరారు.
మచిలీపట్నంలోని దేశాయిపేటకు చెందిన ఒక మహిళ తన కష్టాన్ని మంత్రికి తెలిపింది. తన భర్త మడమల నాగరాజు అరటిపండ్ల దుకాణంలో చాలా కాలం పనిచేసారని.. అకస్మాత్తుగా ఆయనకు పక్షవాతం రావడంతో ఆరోగ్యం క్షీణించి పనులకు వెళ్లలేకపోవడంతో ప్రస్తుతం అనేక ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్నామని తమకు ఏదైనా పింఛన్ వచ్చేలా సహాయం చేయమని అభ్యర్ధించింది. ఆమె పరిస్థితికి జాలి పడిన మంత్రి పేర్ని నాని జవాబిస్తూ , అమ్మా , మీకు ప్రభుత్వ పింఛన్ మంజూరు అయ్యేవరకు నేనే వ్యక్తిగతంగా నెలకు 2 వేల రూపాయలను ఇస్తానని ఇప్పటి నుండి ప్రతి నెల తన కార్యాలయంకు వచ్చి తన కార్యదర్శి తేజ నుంచి ఆ మొత్తాన్ని తీసుకువెళ్లవచ్చని ఆ మహిళకు చెప్పారు.
విజయవాడకు చెందిన ఒక టీవీ ఛానల్ ఉద్యోగులు కొంతమంది మంత్రి పేర్ని నానికు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ యాజమాన్యం గత కొంతకాలంగా వేతనాలు ఇవ్వడం లేదని దీంతో పలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు తెలిపారు.
భారతదేశంలోని సాయుధ దళాల పతాక నిధికి విరాళాలు అందించాలని జిల్లాసైనిక సంక్షేమ అధికారి జి.సత్యానందం కోరారు. ఈ మేరకు శనివారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఈ నెల 7వ తేదీన నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.. సాహసోపేత వీర జవానులకు వందనం సమర్పించేందుకు, వారి కుటుంబాలకు చేయూతను అందించుటకు సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. భారత సైనిక దళాలు, మొక్కవోని దీక్షతో చూపిన దేశభక్తి, సాహసం, త్యాగాల పట్ల దేశం గర్విస్తోందని అన్నారు. పాకిస్తాన్, చైనాల యుద్ధ సమయంలోనూ, కార్గిల్ పోరాటంలోను, ముంబాయి తాజ్ మహల్ దురాక్రమణ సమయంలోను, ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ సైనికుల ధైర్య సహాసాలకు, తెగువకు మరో పేరుగా నిలుస్తుందని ఆయన వివరించారు. ఎంతో మంది సైనికులు దేశ రక్షణకు ప్రాణాలు అర్పంచారని ఆయన అన్నారు. ఆయా కుటుంబాలను ఆదుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యంగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు. పతాక దినోత్సవం సందర్బంగా పౌరులు, వ్యాపార వేత్తలు, పారిశ్రామిక వేత్తలు, సంస్ధలు ఉదారంగా విరాళాలను అందించాలని విజ్ఞప్తి చేసారు. విరాళాలను డైరక్టర్ , సైనిక వెల్ఫేర్, విజయవాడ పేరున చెక్కు లేదా డ్రాప్టు రూపంలో అందించవచ్చని ఆయన వివరించారు. ఆయా చెక్కులను శ్రీకాకుళం పెదరెల్లి వీధిలోగల జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో అందించవచ్చని ఆయన తెలిపారు. ఎన్.సి.సి విద్యార్ధులు మేము సైతం అంటూ విరాళాలు సేకరించడం జరుగుతుందని, వారికి సహకరించి సైనికుల సంక్షేమానికి తోడ్పడాలని ఆయన కోరారు. పతాక నిధికి అందించే విరాళాలకు ఆదాయపు పన్ను రాయితీ లభిస్తుందని సత్యానందం పేర్కొన్నారు.
ప్రముఖ సైకాలజిస్ట్, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ పరిపాలనాధికారి డా.ఎన్.వి.ఎస్. సూర్యనారాయణ మరొక ప్రపంచ రికార్డును కైవసం చేసుకున్నారు. భారత దేశం అంతటా లొక్డౌన్ లో ఉన్న కాలంలో విద్యార్థులను ఉత్తేజపరిచి వారి సామర్ధ్యాలను బలోపేతం చేసే ఉద్దేశ్యంతో అత్యధిక ఆన్లైన్ క్విజ్ పోటీలను నిర్వహించి దేశవ్యాప్తంగా అనేకమంది పాల్గొనే టట్లు చేసి రికార్డు స్రుష్టించారు. దీనితో "వండర్ బుక్ అఫ్ రికార్డు", "జీనియస్ బుక్ అఫ్ రికార్డు" సంస్థలు పరిశీలించి రెండు ప్రపంచ రికార్డులను ప్రధానం చేశాయి. ఈ సందర్భంగా శనివారం విజయనగరంలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీలో విసి ఆచార్య టివి కట్టిమని మాట్లాడుతూ, ఒక మంచి విద్యా కార్యక్రమం ద్వారా ప్రపంచ రికార్డులు కైవసం చేసుకోవడం అభినందనీయమన్నారు. ప్రతి వ్యక్తి తమకు వచ్చిన సమస్యలను అవకాశాలుగా మలచుకోవాలని తద్వారా వాటిని అధిగమించి ఇతరులకు స్ఫూర్తిదాయకం గా నిలవాలని సూచించారు. ప్రపంచ రికార్డు గ్రహీత డా.సూర్యనారాయణ మాట్లాడుతూ “అతి తక్కువ రోజులలో (27 రోజులు) వివిధ సమకాలీన అంశాలలో అతి ఎక్కువ (405 క్విజ్) ఆన్లైన్ క్విజ్ లను 18,802 మందికి నిర్వహించినందుకు గాను తనకు రెండు ప్రపంచ రికార్డులు వచ్చాయన్నారు. ఇటువంటి అంశాలలో ప్రపంచ రికార్డు కోసం ఎవరూ చెయ్యలేదని తానే మొదటి వ్యక్తినని చెప్పారు. అంతముందు విసి టివి కట్టమని ఈయనను అభినందించారు.
కడపజిల్లాలో గుట్కాస్థావరాలపై పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. శనివారం రాజంపేట సబ్ డివిజన్ లోని రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్కా కేంద్రాలపై దాడులు చేసి రూ.40వేల విలువైన 1125 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు సిఐ ఆనందరావు తెలిపారు. ఎస్ఐలు రెడ్డిసురేష్, పెద్ద ఓబన్నల బ్రుందం ఈ గుట్కా స్థావరాలపై దాడులు చేసి ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు వివరించారు. గత కొద్ది రోజులుగా జిల్లాలోనూ, డివిజన్ లో గుట్కా వ్యాపారం గట్టిగా సాగుతుందనే సమాచారంతో దాడులు చేస్తున్నామని, ముందుగా అందిన సమాచారం మేరకు సదరు స్థావరాలపై నా దాడులు చేసినట్టు ఆయన వివరించారు. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో గుట్కాను సీజ్ చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అన్బురాజన్ అభినందించినట్టు సిఐ వివరించారు.
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడం ద్వారా ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి అన్నారు. శనివారం కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సహకారంతో కాకినాడలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్)లో ఏర్పాటు చేసిన డిజిటల్ రేడియోగ్రఫీ కేంద్రాన్నిఆమె ప్రారంభించారు. ఈ డిజిటల్ రేడియోగ్రఫీ కేంద్రం ద్వారా రోగులకు చాలా సులువుగా త్వరితగతిన ఎక్స్ రే సేవలు అందించవచ్చని జేసీ తెలిపారు. తక్కువ ఖర్చుతో డిజిటల్ ప్రక్రియ ఆధారంగా రోగ నిర్ధారణకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుకు దాదాపు రూ.17 లక్షలు ఖర్చయినట్లు కోరమాండల్ యూనిట్ హెడ్ ఎస్.రవికిరణ్ తెలిపారు. గతంలో కూడా రోగులకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి సహకారం అందించామని, భవిష్యత్తులోనూ సహకారం కొనసాగుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఎం.రాఘవేంద్రరావు, ఆర్ఎంవో గిరిధర్, కోరమాండల్ జీఎం పి.పద్మనాభం, ప్రతినిధులు వేణు, వంశీ, నాగేశ్వరరావు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక వాణిజ్యం (నమోదు, సౌకర్యం) మార్గదర్శకాలు 2020 ప్రకారం జిల్లాలో ఉన్న టూరిజం సర్వీస్ ప్రొవైడర్లు ఖచ్చితంగా టూరిజం శాఖ వద్ద నమోదు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా పర్యాటక మండలి చైర్మన్ గంధం చంద్రుడు చెప్పారు. శనివారం ఆయన అనంతపురం లో మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలోని హో టళ్ళు, రిసార్ట్లు, రెస్టౌరంట్లు, గెస్ట్ హౌసులు, సర్వీస్ అపార్టుమెంట్లు, ఫంక్షన్ హాళ్లు, టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, బోట్ఆపరేటర్లు, వాటర్ స్పోర్ట్స్ ఆపరేటర్లు , ఏదైనా పర్యాటక సంబంధిత ఆపరేటర్లు ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలకు, పథకాలకు, ప్రొత్సాహకాలు, రాయితీలకు టూరిజం శాఖ వారి వద్ద తప్పనిసరి నమోదు చేసుకోవాల్సి వుందన్నారు. ఇలా నమోదు చేసుకున్న వాటికి మాత్రమే టూరిజం గుర్తింపు వుంటుందని కలెక్టర్ తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్నివివరాలకు దగ్గర్లోని టూరిజం కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అన్ని పథకాలు అర్హులకు అందేలా బాధ్యతను తీసుకోవాలని బీసీ కార్పొరేషన్ చైర్పర్సన్ లకు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. శనివారం ఆత్మకూరు గ్రామ పరిధిలో జాతీయ రహదారి పక్కనున్న సీకే కన్వెన్షన్లో వైఎస్సార్ సీపీ బీసీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. అనంతరం ఆయన మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బొత్స సత్య నారాయణ, శంకరనారాయణ, ఎంపీలు మోపిదేవి వెంకట రమణారావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గోరంట్ల మాధవ్, టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తదితరులతో కలసి మాట్లాడుతూ పదవులు తీసుకున్న నాయకులు బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వైఎస్సార్ సీపీని బలోపేతం చేయాలని సూచించారు.
తద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీలను ప్రభుత్వంలో భాగస్వాములు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదని అన్నారు. బీసీలంటే భారతదేశ సంస్కృతి అని చాటి చెప్పిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అని, ఆయనకు రాష్ట్రంలోని బీసీలంతా అండగా నిలవాలని కోరారు రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ప్రభుత్వం అంది స్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే బాధ్యత బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లదని పేర్కొన్నారు. తొలుత మహాత్మ జ్యోతిరావు పూలే, అంబేడ్కర్, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. వారి సేవలను కొనియాడారు.
బీసీల ఆత్మీయ సమ్మేళం నిర్వహణకు కృషి చేసిన ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్ రావు నారాయణమూర్తి, లేళ్ల అప్పిరెడ్డిని మంత్రులు, ఎంపీలు అభినందించారు. ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, జోగి రమేష్, మధుసూదనయాదవ్, ఆదీప్ రాజ్, విడదల రజిని కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి పలు బీసీ కార్పొరేషన్ల ఛైర్పర్సన్ లు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, పేరాడ తిలక్, పంగ కృష్ణవేణి నాయుడు, చీపురు రాణీ కృష్ణ, రాజాపు హైమావతి అప్పన్న, దుక్క లోకేశ్వర్ రెడ్డిలను సత్కరించారు.
విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి గెజిటెడ్ అధికారులకు ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కారానికి తమ యూనియన్ ముందుంటుందని కేజీహెచ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అండ్ మెడికల్, హెల్త్ సర్వీసెస్ అర్బన్ ఏరియా కమిటీ అధ్యక్షులు సూరిబాబు అన్నారు. శనివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర కోర్ కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఏ. అప్పారావు ఆధ్వర్యంలో విశాఖపట్నం అర్బన్ ఏరియా కమిటీ కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు వివరించారు. అధ్యక్షునిగా డి. సూరిబాబు, ప్రధాన కార్యదర్శిగా యూనస్ అలీ, అసోసియేటెడ్ ప్రెసిడెంట్ సీ.హెచ్ జోగి రాజు, వైస్ ప్రెసిడెంట్ గా హెచ్. వీ. రమణ మూర్తి లను ఎన్నికయ్యారన్నారు. గౌరవ సలహాదారులుగా డాక్టర్ మైథిలి, ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పీ. వీ సుధాకర్, విశాఖ డీఎమ్&హెచ్ఓ డాక్టర్ పీ. సూర్యనారాయణలు వ్యవహరిస్తారన్నారు. తమ సభ్యులకు ఇంటి స్థలాలు, బిల్డింగ్ సొసైటీ కి ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. పీఆర్సీ స్కేల్ హెచ్చు తగ్గుదలపై కూడా పోరాడతామని సూరిబాబు తెలిపారు. రాష్ట్ర కమిటీ సహకారంతో గెజిటెడ్ అధికారులకు అర్బన్ ఏరియా కమిటీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యుల పాల్గొన్నారు.
విశాఖజిల్లాలో పెరుగుతున్న కరోనా కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని విశాఖజిల్లా బిసి సంఘం జిల్లా యువజన మహిళా విభాగం కార్యదర్శి దనుకోటి రమ కోరారు. శనివారం విశాఖలో ఆమె మీడియాలో మాట్లాడుతూ, కరోనా రెండో దశలో పాజిటివ్ కేసులు అధికంగా పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రస్తుతం చలికాలం కావడంతో వైరస్ వేగంగా విస్తరించే ప్రమాదం ఉన్నందున ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించడంతోపాటు, ఆరు అడుగులు సామాజిక దూరం పాటించాలన్నారు. నాణ్యమైన శానిటైజర్లు ప్రయాణ సమయంలో దగ్గరుంచుకోవాలని చెప్పారు. శానిటైజర్లు లేనివారు 30 సెకెండ్ల పాటు సబ్బుతో చేతులను పరిశుబ్రంగా కడుక్కోవాలన్నారు. ముఖ్యంగా మహిళలు చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వైరస్ ను మన దగ్గరకి రానీయకుండా చూసుకోవడానికి వీలుపడుతుందని చెప్పారు. కరోనా వైరస్ నియంత్రణలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని, కార్తీక మాసములో చెరువులలోనూ, సముద్రాల్లోనూ సామూహిక స్నానాల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. అదే సమయంలో దేవాలయాల్లో కూడా సామాజిక దూరం పాటించాలన్నారు. సాధ్యమైనంత వరకూ అవసరం అయితే తప్పా మిగిలిన సమయాల్లో బయటకు రాకుండా ఉంటేనే మంచిదని ధనుకోటి రమ సూచిస్తున్నారు.
విశాఖజిల్లాలో డిసెంబరు7వ తేది నుంచి 21వరకూ మనమూ-మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా వ్యర్ధాలపై వ్యతిరేక పోరాటాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్టు జిల్లా పంచాయతీ అధికారిణి క్రిష్ణకుమారి తెలియజేశారు. శనివారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని గ్రామసచివాలయాల్లో ఈ కార్యక్రమాన్ని కార్యదర్శిలు, ఇతర సిబ్బందితో కలిసి 15 రోజుల పాటు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్చంద సంస్థలు, డ్వాక్రాసంఘాలు ఇతర ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యంతో చేపట్టాలన్నారు. మనమూ-మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా వ్యర్ధాలపై వ్యతిరేక పోరాటంపై రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలున్నందున ప్రతీ గ్రామసచివాలయంలో దీనిని ఖచ్చితంగా నిర్వహించాలన్నారు. అదే సమయంలో ప్రజలను చైతన్య పరుస్తూ వ్యర్ధాలను నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలను గ్రామవాలంటీర్ల ద్వారా వారికి కేటాయించిన కుటుంబాలకు వివరించాలన్నారు. ఇప్పటికే ఈ సమాచారాన్ని జిల్లాలోని గ్రామ సచివాలయాలకు పంపినట్టు ఆమె వివరించారు. ఇప్పటికే తడి, పొడి చెత్తను వేరు చేసి ప్రతీ ఇంటి నుంచి కలెక్షన్ చేపడుతున్న విధానాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత వుందన్నారు. వ్యర్ధాలపై పోరాటాన్ని నిరంతరం చేయడం ద్వారా మన ఇంటిని, పరిశరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి వీలుపడుతుందని ఆమె వివరించారు.
విజయనగరం జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ కు జాతీయ స్థాయి లో మరో గుర్తింపు లభించింది. యునిసెఫ్, జాతీయ గ్రామీణాభివృద్ధి సంయుక్తంగా నిర్వహించిన 7వ వాటర్, సానిటేషన్, అండ్ హైజీన్ (వాష్) సదస్సులో మంగళవారం వర్చ్యువల్ విధానం లో జిల్లాలో చేపట్టిన ఉత్తమ అభ్యాసాల పై కలెక్టర్ ప్రసంగించారు. ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన కొద్దిమంది ఐ.ఏ.ఎస్. అధికారులకు ఈ అవకాశం రాగా మన రాష్ట్రం నుండి పశ్చిమ గోదావరి కలెక్టర్ రేవు ముత్యాల రాజు, ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్, విజయనగరం కలెక్టర్ డా. హరి జవహర్ లాల్ కు మాత్రమే అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమం లో ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కీలకోపన్యాసం చేసిన జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ అల్కా ఉపాధ్యాయ మన జిల్లా కలెక్టర్కు స్వాగతం పలుకుతూ పీపుల్స్ కలెక్టర్ అండ్ డైనమిక్ కలెక్టర్ డా. హరి జవహర్ లాల్ అంటూ సంబోదించడం విశేషం. అనంతరం కలెక్టర్ విజయనగరం జిల్లాలో నీటి నిర్వహణ, పారిశుధ్య కార్యక్రమాలలో చేపట్టిన ఉత్తమ అభ్యాసాల పై వివరించారు.
సేవ్ బ్లూ , స్ప్రెడ్ గ్రీన్ నినాదంతో ప్రణాళికలు:
వర్చ్యువల్ కాన్ఫరెన్స్ లో జిల్లా అభివృద్ధికి చేపట్టిన ఉత్తమ అభ్యాసాల పై జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ మాట్లాడుతూ జల సంరక్షణకు, పచ్చదనాన్ని పెంపొందించడానికి సేవ్ బ్లూ, స్ప్రెడ్ గ్రీన్ నినాదం తో పనిచేస్తున్నామని కలెక్టర్ వివరించారు. జల జీవన్ మిషన్ క్రింద ఇంటింటికి కుళాయి పధకం క్రింద జిల్లాలో 1871 పనులు రూ. 289.69 తో మంజురైనాయని, ఈ పనులు ప్రస్తుతం గ్రౌన్దింగ్ అయ్యాయని, మార్చ్ 2022 నాటికీ 3 లక్షల 14 వేల గృహాలకు తాగు నీరందించడం జరుగుతుందన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టాప్ కనెక్షన్ ఇవ్వడం కోసం వంద రోజుల కాంపెయిన్ నిర్వహించామని తెలిపారు. సేవ్ బ్లూ క్రింద చెరువుల అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందని, ఇంకుడు గుంతలు, మేజిక్ పిట్స్ నిర్మించడం జరిగిన్నారు. చెరువు గట్ల సుందరీకరణ, వాకింగ్ ట్రాక్స్, సీటింగ్ ఏర్పాటు, భూగర్భ జలాలను పెంచడానికి మొక్కలు నాటడం ద్వారా కృషి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో ప్రజలు స్వచ్చందంగా భాగస్వామ్యులయ్యేలా చేశామన్నారు. స్వచ్చభారత్ మిషన్ క్రింద ఇంటింటికి టాయిలెట్ అర్యక్రమం ల లక్ష్యానికి చేరువుగా ఉన్నామని వివరించారు. బహింరంగ మల విసర్జన లేని గ్రామాలను అదేవిధంగా కొనసాగించడానికి ప్రజలలో అవగాహన పెంచే ఐ.ఈ.సి కార్యక్రమాలను నిర్వహిస్తూ, ఘన వ్యర్ధాల నిర్వహణ పై కూడా అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. సంక్రమిత వ్యాధులు సోకకుండా ఉండేలా చేతులు కడుక్కోవడం పై శిక్షణ నిచ్చిన కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. అదే విధంగా కోవిడ్-19 రెండవ సారి చెందకుండా ఉండేలా 50 రోజుల అవగాహనా కార్యక్రమానికి ప్రణాళిక రుపొందించామని, జిల్లాను గ్రీన్ జోన్ లో ఉంచడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
స్ప్రెడ్ గ్రీన్ నినాదంలో భాగంగా హరిత విజయనగరం పేరుతో ఖాళీ గా ఉన్న స్థలాల్లోను, రహదారుల కిరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతున్నదని వివరించారు. గ్రామాల ప్రవేశం వద్ద బహిరంగ మల విసర్జన ను నివారించడానికి మొక్కల్ని నాటి, వాటి నిర్వహణ బాధ్యతను ఆయా గ్రామాలకే అప్పగించడం జరిగిందన్నారు. జిల్లా అంతట పచ్చదనం పెంచడం తో జిల్లాలో కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించగలిగామని పేర్కొన్నారు.