ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు స్థలాల ఎంపిక, పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించే అధికారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని జె సి నిశాంత్ కుమార్ హెచ్చరించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, భవన నిర్మాణాలకు కావలసిన స్థలాల ఎంపిక పక్రియలో నిర్లక్ష్యం వహించే అధికారులు లక్ష్యాలు నిర్ధేశించుకొని విధులు నిర్వహించాలన్నారు. గ్రామ , మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణలో టీములు ఏర్పాటు చేయాలన్నారు. ఆ టీములు జరుగుతున్న పనులను పరిశీలించి, శనివారం మధ్యాహ్నం లోపు నివేదికను అందించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వం మార్చిలోపుగా అన్ని గ్రామసచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్ లుకు స్థలాలు ఎంపిక చేయాలన్నారు. ఈ కార్య మంలో జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ, పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ మహేశ్వరయ్య, Dmho కామేశ్వర ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండింగ్ ఇంజనీర్ హరేరాం నాయక్. జడ్పీ సీఈవో శోభ స్వరూపరాణి. పంచాయతీరాజ్ శాఖ, ఆర్డబ్ల్యూఎస్, సంబంధిత శాఖ ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఈ నెల ఏడో తేదీ మధ్యాహ్నం లోపు రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడి కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్లు, గ్రామ , వార్డు, సచివాలయాల భవనాలకు చెందిన స్థలాల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి , నిర్మాణాలను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్ నందు జాయింట్ కలెక్టర్(ఆర్ బి కె అండ్ ఆర్) నిశాంత్ కుమార్ , జేసీ (సంక్షేమం మరియు ఆసరా)గంగాధర్ గౌడ్ వ్యవసాయశాఖ జెడి ,ఆర్ డబ్ల్యు ఎస్,పంచాయత్ రాజ్ , ఎస్ ఈలు ,జెడ్పీ సి ఈ ఓ లతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడి కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్లు, గ్రామ , వార్డు, సచివాలయాల భవనాల నిర్మాణాలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, వ్యవసాయ అధికారులు, వైద్యాధికారులు, ఐసిడిఎస్ అధికారులు, తహసీల్దార్లు, సమన్వయంతో పని చేయాలన్నారు. అన్నింటికీ స్థలాలను గుర్తించి, శనివారం లోపు నిర్మాణాల పనులను ప్రారంభించాలన్నారు. ఇందుకోసం గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో సంబంధిత శాఖల అధికారులందరూ ఈ నిర్మాణాల పనులు ప్రారంభించేలా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికే గ్రౌండింగ్ పూర్తయిన పనుల్లో పురోగతి చూపడంతో పాటు, కాని పనులు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్థలాల ఎంపికకు సంబంధించి ఆర్డీవోలు, తహశీల్దార్లు అవసరమైన చోట భవనాల నిర్మాణాలకు స్థలాలను వెంటనే స్వాధీనం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు..స్థలాల ఎంపిక ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకుని వస్తే దానిని పరిశీలించి తగు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.. ఇసుక సమస్య కూడా లేకుండా చూడాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో గ్రౌండింగ్ చేసిన పనులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత పనుల నిర్వహణ ఫోటోలు అప్లోడ్ చేసి క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని నివేదించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలోజరిగే పనులపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
గ్రామ సచివాలయ భవనాల ఎంపిక ప్రక్రియలో, జడ్పీ సీఈఓ, ఎంపీడీవో, తహసీల్దార్లు, ఇంజనీర్లు, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్. ఇంజనీర్లు, ఆర్ డి వో లు, చురుకైన పాత్ర పోషించాలన్నారు. వార్డు సచివాలయ భవనాలకు చెందిన స్థలాల ఎంపిక ప్రక్రియలో మున్సిపల్ శాఖ కమిషనర్లు, రైతు భరోసా కేంద్రాల స్థలాల భవనాల ఎంపిక ప్రక్రియలో వ్యవసాయ శాఖ అధికారులు, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, తహశిల్దార్లు చురుకైన పాత్ర పోషించాలన్నారు. వైయస్సార్ హెల్త్ క్లినిక్ కేంద్రాల స్థలాల ఎంపిక ప్రక్రియలో డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో, అంగన్వాడీ కేంద్రాల భవనం పనులు స్థలాలకు సంబంధించిన పనులను ఐసిడిఎస్ పీడీ ఆధ్వర్యంలో నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ప్రతీ నెల మెదటి శుక్రవారం డయల్ యువర్ యూనివర్సిటీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నెల 6వ తేదీ ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు వర్సిటీ అధికారులు విద్యార్థుల సందేహాలకు ఫోన్‌లో సమాధానమిస్తారు. విద్యార్థులు 0891 2844455 నంబరుకు ఫోన్ చేసి తన సందేహాలకు అధికారుల దృష్టికి తీసుకువెళ్లవచ్చు. ప్రతీ నెల మొదటి శుక్రవారం డయల్ యువర్ యూనివర్సిటీని నిర్వహించడం జరుగుతుదని పరిపాలనా విభాగం డిఆర్ ఎం.వి.ఎస్.ఎస్ ప్రకాష్ తెలిపారు. యూనివర్శిటీలో అడ్మిషన్లు, కాన్వోకేషన్, ప్రొవిజినల్ సమస్యలతోపాటు, విద్యార్ధులకు వసతి గ్రుహాలు తదితర అంశాల్లో విద్యార్ధులకున్న అనుమానాలను కూడా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు. విద్యార్ధుల సమస్యలను తీర్చడానికే ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించి, ఇందు విద్యార్ధుల నుంచి వచ్చిన సమస్యలపు తక్షణమే పరిష్కరించనున్నట్టు ఆయన వివరించారు...
అనకాపల్లి పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దుదామని ప్రజల సహకారంతో అభివృద్ధి పనులు చేపడతామని జివిఎంసి కమిషనర్ డా జి. సృజన అన్నారు. బుదవారం ఆమె క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా అనకాపల్లి జోన్ లోని పలు ప్రాంతాలలో పర్యటించారు. సంతబయిల్ లో నాలుగు కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 1000కిలోలీటర్ల మంచి నీటి రిజర్వాయర్ ప్రతిపాదనలను సిద్ధంచేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం, అనకాపల్లి నూకాలమ్మ తల్లిని దర్శించుకొని నూకాంబిక ఆర్చ్ నుంచి పూడిమడక రోడ్ల విస్తరణ, డ్రైన్ల నిర్మాణం, ఫుట్ పాత్ లకు సంబందించిన ప్రతిపాదనలను పంపాలన్నారు. రాజీవ్ గాంధి ఇండోర్ స్టేడియం రిపేరు పనులునకు ప్రతిపాదనలను పరిశీలించి, ఫ్లోరింగ్ మొదలైన పనులకు లైఫ్ పీరియడ్ ఉన్నందున సంబందిత కాంట్రాక్టరు చేత పనులు చేయించాలని అంతవరకు వారి ఇ.ఎం.డి.లను ఆపాలన్నారు. పరశురాం పేటలోని శ్మశాన వాటిక చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని, గ్యాస్ ఆధారిత దహన వాటికను ఏర్పాటు చేయాలని వాటికీ అవసరమైన ఎలెక్ట్రికల్ రింగ్ పోల్స్ ఏర్పాటుకు పరిశీలించాలని కోరారు. అనకాపల్లి రోడ్లు చాలావరకు రోడ్లు మరియు భవనముల శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నందున, వాటి నిర్వహణ నిమిత్తం జివిఎంసికి ఇవ్వాలని లేఖ వ్రాసామని, అవి వచ్చిన వెంటనే పనులు ప్రారంబిస్తామన్నారు. పెరుగు బజారు సచివాలయాన్ని సందర్శించి వార్డు కార్యదర్శుల జూబ్ చార్టును పరిశీలించి, వారి విధుల గురుంచి అడిగి తెలుసుకున్నారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యదర్శుల హాజరు, మూమెంట్ రిజిస్టర్, డైరీ మొదలైనవి పరిశీలించారు. అనంతరం, శంకరంలోని ఎఫ్.ఎస్.టి.పి. ప్లాంటును పరిశీలించి, చుట్టూ ప్రహరీ గోడ వెంటనే నిర్మించాలని, ప్లాంటును వినియోగంలోనికి తేవాలని పర్యవేక్షక ఇంజినీరు వేణుగోపాల్ ను ఆదేశించారు. అనంతరం, అనకాపల్లి లోని నూతన జోనల్ కార్యాలయాన్ని నిర్మించడానికి ప్రతిపాదనలను సిద్దం చేయాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జోనల్ కమిషనర్ శ్రీరామ్మూర్తి, పర్యవేక్షక ఇంజినీర్లు రాజా రావు, వేణుగోపాల్, కార్యనిర్వాహక ఇంజినీరులు మత్స్యరాజు, వెంకటరావు, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం నగర శివారు ప్రాంతంలోని ప్రజ్ఞ క్యాన్సర్ ఆసుపత్రిలో జాయింట్ కలెక్టర్ ఏ.సిరి ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలో 20 మంది రోగుల నుండి డబ్బు వసూలు చేసినట్లు అక్కడ ఉన్న రోగులు చెప్పడంతో హాస్పిటల్ యాజమాన్యం నుండి రూ..42000 లను రోగులకు తిరిగి ఇప్పించారు.. రోగులకు ఆరోగ్యశ్రీ వర్తిస్తున్నా.. రోగుల దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ ఫీజులు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే విషయంపై గతంలో జిల్లాలోని నెట్వర్క్ ఆసుపత్రుల అధిపతులతో సమావేశం నిర్వహించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. నెట్వర్క్ ఆసుపత్రులలో ఆరోగ్య మిత్రలు వైద్యం కోసం వచ్చే వారికి అండగా ఉండాలని కోరారు. ఆసుపత్రుల యాజమాన్యాలు పేదలపై అన్యాయంగా బిల్లుల భారం మోపకుండా చూడాలన్నారు. ఆరోగ్యశ్రీ కింద డబ్బు కట్టాల్సిన అవసరం లేదని రోగులకు అవగాహన కల్పించాలన్నారు. తనిఖీలో జాయింట్ కలెక్టర్ తో పాటూ డీఎంహెచ్ఓ కామేశ్వర ప్రసాద్, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ శివకుమార్ పాల్గొన్నారు.
మహానగర విశాఖపాలక సంస్థ పరిధిలో అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచేందకు ప్రతీ ఒక్కూ సహకరించాలని అదనపు కమిషనర్ డాక్టరు వి. సన్యాసి రావు పిలుపునిచ్చారు. బుధవారం జివిఎంసి మూడవ జోన్ పరిధిలో 19వ వార్డులోని పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మూడవ జోనల్ కమిషనర్ బి. సన్యాసినాయుడుతో కలసి 19వ వార్డులోని పలు ప్రాంతాలను పర్యటించారు. కాలువలను, రోడ్లను పరిశీలించి కాలువలలో చెత్త వేయకుండా ప్రజలను చైతన్యవంతం చేయాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. కాలువలలోని చెత్త ఎప్పటికప్పుడు తీసి, రోడ్లను శుభ్రంగా ఉంచాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. తడి-పొడి చెత్త సేకరిస్తున్నదీ లేనిదీ శానిటరీ కార్మీకులను అడిగితెలుసుకున్నారు. స్థానిక ప్రజలతో మాట్లాడుతూ ఇంటి పరిసరాల పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలని నీటి నిల్వలు లేకుండా చూడాలని కోరారు.
వార్డు కార్యదర్శుల జాబ్ చార్టును అడిగి తెలుసుకొంటూ, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ప్రతీ ఇంటిని తనిఖీ చేసి దోమల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బాకాయిలో ఉన్న ట్రేడ్ లైసెన్సుల ఫీజులను శతశాతం వసూలు చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్ నకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ బి. సన్యాసి నాయుడు, ఇంచార్జ్ శానిటరీ సూపర్వైజర్ రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస రావు, వార్డు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లలోని ఇవిఎంలను భద్రపరిచిన గొడౌన్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ బుధవారం ప్రత్యేకంగా తనిఖీ చేశారు. గొడౌన్లను వేసిన సీళ్లను, అక్కడి భద్రతా ఏర్పాట్లను, రికార్డులను పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గోడౌన్లను పర్యవేక్షించే సిబ్బంది ఎప్పటికప్పుడు ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తక్షణమే సమాచారాన్ని తనకు చేరవేయాలన్నారు. అదే సమయంలో వీటి నిర్వహణను రెవిన్యూ అధికారులు పర్యవేక్షించాలని కూడా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, మండల తాశీల్దార్ గొట్టాపు రాము, ఎంపిడిఓ కె.రాజ్‌కుమార్, ఇతర రెవెన్యూ అధికారులు, సిపిఐ నాయకులు తాలాడ సన్నిబాబు, బిఎస్‌పి నాయకులు పాండ్రంకి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి తన పాదయాత్రలో బిసిగర్జన సభలో ఇచ్చిన మాట మేరకు గత ఎన్నో సంవత్సరాలుగా మోసపోయిన బిసి లకు నేనున్నానని, ఏ రాష్ట్రంలో జరగని విధంగా నేడు వెనుకబడిన కులాలకు 56 మందికి అద్యక్ష పదవులు 675 మందికి మెంబర్లు/ డైరెక్టర్లు గా పదవులిచ్చి ఆత్మస్థైర్యాన్ని నింపిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిదేనని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖా మంత్రి శ్రీ పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఉదయం స్థానిక పి.ఎల్. ఆర్. గ్రాండ్ హోటల్ లో చైర్మన్లు, డైరెక్టర్లు రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు, అభినందనలు తెలిపే కార్యక్రమంలో రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ అభినందన సభకు చిత్తూరు శాసన సభ్యులు అధ్యక్షత వహించి దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఇవ్వనన్ని బిసి పదవులు మన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి 56 మందికి అధ్యక్ష పదవులు, 675 మందికి డైరెక్టర్ పదవులు ఇచ్చి చరిత్రలో నిలిచిపోయారని అందుకే వారి కోరిక మేరకు థాంక్యూ సి.ఎం.జగన్ మోహన్ రెడ్డి సార్ అనే నినాదాలతో కృతజ్ణతలు తెలుపనున్నామని అన్నారు. రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి మాట్లాడుతూ గతంలో వెనుకబడిన కులాలను ఓటు బ్యాంకుకు వాడుకునేసి వదిలేసేవారని, మన ముఖ్యమంత్రి బిసి గర్జన సభలో ఇచ్చిన మాట మేరకు ఒక శాసన మండలి సభ్యత్వం ఖాళీ అయితే అది కూడా బిసి లకు కేటాయించారని అన్నారు. ముఖ్యమంత్రి తన 14 నెలల తన పాలనలో 29 సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. మొట్ట మొదటి శాసన సభ సమావేశాలలో 50 శాతం రిజర్వేషన్ల చట్టం చేసిన ఘనత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి దేనని అన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని నమ్మించి ఏమి లేకుండా చేశారని, నేడు మన ముఖ్యమంత్రి యువతకు 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వార్డు, గ్రామ సచివాలయాలలో కల్పిస్తే అందులో 1,26,000 మంది వెనుకబడిన తరగతులకు కేటాయించారని అన్నారు. ముఖ్యమంత్రి ఆశయాల మేరకు నేడు పదవులు చేపట్టిన ఛైర్మన్లు, డైరెక్టర్లు అర్హత గల ప్రతి వారికి సంక్షేమ ఫలాలు అందేలా దృష్టి పెట్టాలని అన్నారు.
ఉపముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి వీడియో సందేశం ద్వారా సభలో ప్రసంగిస్తూ నేడు పదవులు చేపట్టిన బిసి ల నాయకులు పూర్తి విశ్వాసంతో జగనన్నకు అండగా నిలవాలని , స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అన్ని కులాలకు బిసి, ఎస్సీ, ఎస్టీ కులాలకు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా న్యాయం జరుగుతున్నదని , రాష్ట్ర అభివృద్ధిపై అందరూ దృష్టి పెట్టాలని అన్నారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాకు నలుగురికి అద్యక్ష పదవులు, 53 మందికి డైరెక్టర్ పదవులు రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖా మంత్రి గారి చొరవతో అందాయని, నేడు ఇది బిసి లకు శుభదినమని అన్నారు. పదవులు చేపట్టిన మీరు ప్రతి నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని మన ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, కృతజ్ఞతగా మనం కలిసి పనిచేయాలని అన్నారు.
ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు వచ్చినా వెనుకబడిన వర్గాలలో ఇంకెంతకాలం ఈ కట్టుబాట్లు , ఇంకెతకాలంలో మన అభివృద్ధి జరిగేది అని భాద పడే రోజుల్లో నేనున్నానని మన ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టి సామాజిక కట్టుబాట్లలో మార్పు తెచ్చి ఆర్థికంగా ఎదుగుదల కావాలని దేశ చరిత్రలోనే ఎక్కడా జరగని విధంగా బీసీలకు ఇన్ని పదవులు కట్టబెట్టారని అన్నారు. రాజకీయనాయకులు బిసి లను వాడుకుని వదిలేస్తే, నేడు బిసి లే వెన్నుముఖ అని గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి ఇన్ని పదవులు ఇచ్చారని, మీరు ఆయన ఆశయం మేరకు సైనికుల్లా పనిచేయాలని అన్నారు.
ఎ పి ఐ ఐ సి ఛైర్మన్ రోజా మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా మోసపోతున్న బిసి లను గుర్తించి మన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని 139 బి సి కులాలకు 56 మంది ఛైర్మన్ పదవులు కట్టబెట్టారని గతంలో బిసి లను వెన్నుపోటు పొడిస్తే , నేడు బిసి లంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ అని గుర్తించిన వ్యక్తి మన జగనన్న అని అన్నారు. ఇచ్చిన మాట మేరకు 50 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని అన్నారు. బిసి లకు గౌరవం ఇచ్చి 2,70,000 మందికి రూ.33 వేల కోట్లు సంక్షేమ పథకాలు అందించి అంబేద్కర్ ఆశయాన్ని నిలబెట్టారని అన్నారు.
చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడెప్ప మాట్లాడుతూ మట్టిలో మాణిక్యం లాంటి వ్యక్తి మన మంత్రి పెద్దిరెడ్డి రామచ్మ్ద్రా రెడ్డి అని వారిపై ప్రతిపక్షాలు అబద్దాలు చెప్పినా నమ్మే వారు లేరని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 70 సంవత్సారాల కాలంలో బిసి లను గుర్తించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారేనని అన్నారు. జిల్లా అధినేతగా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తనకు చిత్తూరు ఎం పి గా పోటీచేసే అవకాశం కల్పించారని అన్నారు. గత ప్రభుత్వాలు బిసి లకు చేసిందేమి లేదని, న్యాయం చేసిన వ్యక్తులను గుర్తించుకొని వారి అడుగు జాడల్లో నిలవాలని కోరుతున్నాని అన్నారు.
తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ బిసి లు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాలలో కూడా ఇన్ని బిసి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇవ్వలేదని దేశ చరిత్రలోనే ఇది మొదటిదని అన్నారు. క్రింది స్థాయిలో ఉన్న బిసి కులాలను, పై స్థాయికి తీసుకుని వచ్చి వారిని ఆర్థికంగా ఆదుకొని, వారికి స్వావలంబన కల్పిస్తున్నారని అన్నారు. 30 , 40 వేలు ఉన్న బిసి లకు కూడా న్యాయం జరగాలని ఛైర్మన్, డైరెక్టర్ పదవులు ఇచ్చారని ముఖ్యమంత్రి ఆశయం మేరకు పదవులు అందుకున్న మీరు పని చేయాలని కోరారు.
పూతలపట్టు శాసనసభ్యులు మాట్లాడుతూ బిసిలకు ఇన్ని పదవులు అందడం సంతోషకరమని ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించి చైర్మన్లు, డైరెక్టర్లు మన్ననలు పొందాలని అన్నారు.
తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో కూడా ముఖ్యమంత్రి బిసీలకు న్యాయం చేయాలనే ఆలోచన నేడు ఒక పండగ దినంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి సంక్షేమం వైపు శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. ప్రతిపక్షాలు మా కుటుంబంపై ఆరోపణలు చేస్తూ విలువలు దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. మానుండి ఎవరికీ చెడు జరగదనే విషయం తెలిసి బిసిలు, ఎస్సీ లు, ఎస్టీ లు మాకు అండగా నిలిచే వ్యక్తులే కానీ ఆరోపణలు చేసే వ్యక్తులు కారని అన్నారు.
శ్రీకాళహస్తి శాసనసభ్యులు మధుసూధన రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలో స్వయంకృషితో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని , చరిత్రలో లేని విధంగా నేడు బిసి లకు 56 ఛైర్మన్ పదవులు కట్టబెట్టారని అన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 62 శాతం మంది బి సి కాంట్రాక్టర్లకే ముఖ్యమంత్రి ఆశయం మేరకు పనులు అప్పజెప్పామని , కరోనా కష్ట కాలంలో మన ముఖ్యమంత్రి అన్ని విధాలా, అందరినీ ఆదుకుంటున్నారని అన్నారు .
మొదలియార్ సంఘం- బుల్లెట్ సురేష్, పాలఏకిరి సంఘం -మురళీధర్, వన్నెకుల సంఘం -వనితా, ఈడిగ సంఘం - శాంతి ఈ నలుగురు అద్యక్ష పదవులు పొందిన జిల్లా వాసులు థాంక్యూ యు సిఎం జగన్ సార్ అని నినాదాలు చేసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ అభినంధన సభ పండగ వాతావరణంలో దివంగత ముఖ్యమంత్రి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించగా, ఛైర్మన్ పదవులు పొందిన వారు ప్రముఖుల నుండి సన్మానాలు అందుకున్నారు. అధ్యక్ష, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులను సన్మానించి కృతజ్ఞతలు చాటుకోగా, సంఘాల నాయకులు, ప్రజలు పెద్దఎత్తున హాజరయ్యారు.
డా.వై.యస్.ఆర్.హెల్త్ స్కీమ్ కు సంబంధించిన సమగ్ర సమాచారాన్నితెలిపే ఆరోగ్యమిత్ర బుక్ లెట్ ను సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు బుధవారం ఆయన బంగ్లాలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ డా. వై.యస్.ఆర్ ఆరోగ్యశ్రీ, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్, వర్కింగ్ జర్నలిస్టుల హెల్క్ స్కీమ్, ఆరోగ్య రక్ష, అమృత హెల్త్ స్కీమ్, 104 సేవా కేంద్రం, వై.యస్.ఆర్. టెలీమెడిసిన్ లకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇందులో పొందుపరచబడిందని చెప్పారు. వీటితో పాటు జిల్లాలో హెల్త్ స్కీమ్ నకు సంబంధించి ఆమోదించబడిన ఆసుపత్రుల వివరాలు, క్షేత్ర స్థాయి సిబ్బంది విధులకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా అందుబాటులో ఉందని ఆయన స్పష్టం చేసారు. ఇది ప్రతీ ఒక్కరికీ అవసరమైన బుక్ లెట్ అని, దీనిలో గల సమగ్ర సమాచారం వలన జిల్లాలో అందే వైద్య సేవలపై ప్రతీ ఒక్కరికీ పూర్తి అవగాహన కలుగుతుందని జె.సి వివరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ సిహెచ్.రవికిశోర్, టీమ్ లీడర్ వెంకటరమణ, ఆరోగ్యశ్రీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు అందించే సేవలను నిర్దేశించిన గడువు లోపే పరిష్కరించాలని, గడువు ముగిసిన తర్వాత , ఏ ఒక్క సర్వీసు పెండింగ్ ఉండడానికి వీలులేదని, ఎప్పటికప్పుడు సర్వీసులకు పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పెండింగ్ లో ఉన్న సర్వీసులకు సంబంధించి జాయింట్ కలెక్టర్ ( గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి)ఏ.సిరి, సబ్ కలెక్టర్ నిషా0తి, జిల్లా పరిషత్ సీఈఓ, డిపివో, ఆర్డీఓ లు, తహశీల్దార్ లు, ఎంపీడీవోలు, సచివాలయ ఉద్యోగులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల్లో సర్వీసులను పరిష్కరించడంలో ఇప్పటివరకు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సచివాలయ ఉద్యోగులు బాగా పని చేశారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సచివాలయాలకు వచ్చిన 15 లక్షలకు పైగా సర్వీసులలో 95 శాతంపైగా సర్వీసులో రెవెన్యూ శాఖ నుండి వచ్చాయని, వాటిని పరిష్కరించడంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, సబ్ కలెక్టర్, ఆర్డిఓలు, తహశీల్దార్ లు, ఇతర అధికారులు మంచిగా పని చేశారన్నారు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాలకు రెవెన్యూ శాఖకు సంబంధించిన సర్వీస్ రిక్వెస్ట్ లు మాత్రమే వస్తున్నాయని వాటిని వెంటనే పరిష్కరిస్తున్నారన్నారు. అయితే ఆయా సర్వీసులను పరిష్కరించే క్రమంలో నిర్దేశించిన సమయం లోపు వాటిని పరిష్కరించడం లేదని, ఎస్ ఎల్ ఏ ( సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్) లోపు ఆయా సర్వీసులను పరిష్కరించడం చాలా ముఖ్యమన్నారు. నిర్దేశించిన సమయం పూర్తయిన తర్వాత ఆయా సర్వీసులను పరిష్కరిస్తున్నారని, వచ్చిన మొత్తం సర్వీసులలో 14 - 15 శాతం సర్వీసులను వాటికి ఇచ్చిన గడువు పూర్తయిన తర్వాత పరిష్కారం చేస్తున్నారని, అలా జరగడానికి వీలు లేదన్నారు.
జిల్లాలోని ఒక్కో సచివాలయానికి ఒక రోజులో 4-5 సర్వీసులు వస్తున్నాయని, ఆయా సర్వీసులను నిర్దేశిత సమయంలోపు పరిష్కరించకుండా పెండింగ్ పెడుతున్నారని, జిల్లాలో ఇప్పటివరకు 1000 వరకూ సర్వీసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. అయితే సమయం పూర్తయిన తర్వాత ఒక సర్వీసు కూడా పెండింగులో ఉండడానికి వీలు లేదని, ఇందుకు సంబంధించి సచివాలయాలలోని సర్వీసులకు పరిష్కారం చూపించాలని ఆదేశించినా పూర్తిగా సర్వీసులకు పరిష్కారం చూపించలేని జిల్లాలోని 10 సచివాలయాలకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం అనంతపురం రూరల్ మండలంలో 43 సర్వీసులు పెండింగులో ఉన్నాయని, ముదిగుబ్బ మండలం లో 45, ఎన్ పి కుంట మండలం లో 40, కళ్యాణదుర్గం మండలం లో 40, ఇంకా అమరాపురం తదితర మండలాల్లో ఇలాగే గడువు దాటిన సర్వీస్లు పెండింగ్ లో ఉన్నాయని, మంగళవారం అర్ధరాత్రి లోపు జిల్లాలోని ఏ మండలంలో కూడా గడువు ముగిసిన ఒక్క సర్వీస్ కూడా పెండింగ్లో ఉండడానికి వీలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గడువు ముగిసిన సర్వీసులకు 100 శాతం పూర్తిగా పరిష్కారం చూపించాలన్నారు. బుధవారం నుంచి గడువు ముగిసిన ఒక సర్వీసు కూడా పెండింగ్లో ఉంటే సంబంధిత పంచాయతీ సెక్రెటరీల పై చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు సంబంధించి మునిసిపల్ శాఖ రీజనల్ డైరెక్టర్, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పెండింగ్లో ఉన్న గడువు ముగిసిన సర్వీసులకు పరిష్కారం చూపించాలన్నారు. బుధవారం నుంచి ఏ సమయంలో ఆన్లైన్లో చెక్ చేసుకున్నా గడువు ముగిసిన సర్వీసులు పెండింగ్లో ఉండకూడదన్నారు. ఇది జీరో ఉండాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న గడువు ముగిసిన సర్వీసులను తక్షణం పరిష్కరించడం పై పర్యవేక్షించాలని జాయింట్ కలెక్టర్ ( గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) ని కలెక్టర్ ఆదేశించారు.
అనంతపురం జిల్లాలో మూడు శాఖలకు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రైతు భరోసా కేంద్రాలు, పేదలందరికీ ఇళ్ళు పథకాలకు సంబంధించి వాస్తవ నివేదికలు ఇవ్వడంలో విఫలమయ్యారని పంచాయతీ రాజ్ ,వ్యవసాయ, హౌసింగ్ శాఖల జిల్లా ఉన్నతాధికారులకు కలెక్టర్ సోమవారం నాడు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే, నవంబర్ 2 వ తేదీన నిర్వహించిన వ్యవసాయం , రైతు భరోసా కేంద్రాల నిర్మాణంపై సమీక్షలో భాగంగా కొంతమంది ప్రజా ప్రతినిధులు చాలా చోట్ల పనులు ప్రారంభించలేదని తెలిపారు. అయితే పంచాయతీ రాజ్ శాఖ అధికారులు 800 ఆర్బికెలు పురోగతిలో ఉన్నాయని , అన్ని ప్రదేశాలలో పనులు ప్రారంభమయ్యాయని ఆన్లైన్ లో అప్‌లోడ్ చేసి , ఆ నివేదికలను జిల్లా కలెక్టర్ కు సమర్పించారు. భౌతిక పురోగతికి, ఆన్‌లైన్‌లో చూపిన పురోగతికి పొంతన లేకుండా ఉండడంతో పాటు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం , అందునా ముఖ్యమంత్రి స్వయంగా స్పందన వీడియో సమావేశాలలో సమీక్షిస్తున్న అంశం అయినప్పటికీ , ఆ సమావేశాలకు కూడా వాస్తవ నివేదికలను ఇవ్వలేదని, క్షేత్ర స్థాయి అధికారులతో సరైన విధంగా సమీక్షించకుండా ఆర్బికెల కోసం సైట్ లభ్యత, ఆర్బికెల నిర్మాణ పనుల పురోగతికి సంబంధించి వాస్తవ సమాచారాన్ని సేకరించడంలో విఫలమయ్యారని, అటు ముఖ్యమంత్రి తో పాటు కలెక్టర్ ను తప్పు దారి పట్టించే విధంగా నివేదికలు ఇచ్చి స్థూల ఉల్లంఘనకు పాల్పడ్డారని కలెక్టర్ పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ మహేశ్వరయ్యకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అదే విధంగా 800 రైతు భరోసా కేంద్రాలకు సైట్లు అప్పగించారని నివేదికలిచ్చి, డిఆర్ సీ సమావేశంలో మాత్రం సైట్లు అప్పగించలేదని తెల్పడంపై వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ రామకృష్ణయ్యకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. క్షేత్ర స్థాయిలో వాస్తవ విషయాలు తెలుసుకోవడం లో విఫలం కావడంతో పాటు ఉన్నతాధికారులకు సరైన సమాచారం అందించలేదని నోటీసులో వివరణ కోరారు. అలాగే నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ళు పథకం కింద మునిసిపల్ కమిషనర్లతో సమన్వయం చేసుకుని పేదలకు అందించాల్సిన ఇళ్ల స్థలాల లెవెలింగ్ బిల్లుల సమాచారం తెప్పించుకోవాలని ఆదేశించినప్పటికీ, సమాచారాన్ని తెప్పించుకోలేదని హౌసింగ్ పీడీ కె.బాల వెంకటేశ్వర రెడ్డి లకు కలెక్టర్ షోకాజ్ నోటీసులిచ్చారు. ఈ ముగ్గురు అధికారులు మూడు రోజుల్లోపు తమ వివరణను సమర్పించాల్సిందిగా కలెక్టర్ షోకాజ్ నోటీసుల్లో ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందిని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు.మంగళవారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లడుతూ, దేశంలో ఇటు వంటి వ్యవస్థ ఎక్కడ లేదని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా సచివాలయ వ్యవస్థను అభినందించారని ఆయన గుర్తుచేశారు. కరోనా కేసులు పెరుగుతున్న సమంలో సచివాలయ ఉద్యోగులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తూనే, కరోనాభారిన పడుతున్నారని అన్నారు. త్వరలోనే ఉద్యోగులు అందరూ అమరావతి నుంచి వైజాగ్ వస్తున్నారని, వారంతా వైజాగ్‌ను పరిపాలన రాజధానిగా స్వాగతిస్తున్నారన్నారు. కరోనా నేపథ్యంలో నిలిపివేసిన జీతాలను ఈ నెల నుంచి ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారన్నఆయన మూడు డీఏలు ఇవ్వడంపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎన్నికల కమిషన్ పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనా పేరు చెప్తేనే అందరూ భయపడే పరిస్థితి ఉన్న సందర్భంలో ఎన్నికలు కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టలేమని.. ఎన్నికల నిర్వహణలో ఉద్యోగుల ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. కరోనా తగ్గిన తరువాత ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కరోనా తగ్గిన సమయంలో ఎప్పుడు ఎన్నికలు పెడతామన్నా మా ఉద్యోగులం అంతా సంసిద్దంగా వుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశాఖజిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు, జవహర్ తదితరులు పాల్గొన్నారు..
పరిశ్రమల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన నియమావళిని అమలుపరచడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని జేసీ జె.వెంకటరావు పేర్కొన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన డీఐపీసీ (డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల నిర్వహణలో పాటిస్తున్న నియమావళి, నిబంధనలు భద్రతా పరమైన తదితర అంశాలపై సమీక్షించారు. కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల, అగ్నిమాపక, బాయిలర్స్, విద్యుత్తు శాఖల అధికారులతో వివిధ అంశాలపై మాట్లాడారు. జిల్లాలో ఉన్న 65 ప్రమాదకర పరిశ్రమలకు గాను 44 పరిశ్రమలను తనిఖీ చేశామని, వాటిలో కొన్నింటికి నోటీసులు జారీ చేశామని డీఐసీ (డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్) జెనరల్ మేనేజేర్ కె.ప్రసాదరావు వివరాలు వెల్లడించగా జేసీ పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు. శాఖల వారీగా అధికారులతో మాట్లాడి సలహాలు, సూచనలు అందజేశారు. ప్రభుత్వం జీవో నెం.156లో పేర్కొన్న ప్రతి అంశాన్నీ ఇటు అధికారులు, అటు పరిశ్రమల నిర్వహకులు తప్పకుండా పాటించాలని ఆదేశించారు. జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ సభ్యులు తరచూ కంపెనీలను తనిఖీ చేయాలని, నిబంధనలు అతిక్రమించిన పరిశ్రమలకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. భద్రతాపరమైన చర్యలు చేపట్టని వారికి హెచ్చరిక నోటీసులు జారీ చేసి పరిస్థితిని చక్కదిద్దాలని చెప్పారు. ఎప్పటికప్పుడు పరిశ్రమలను తనిఖీ చేస్తూ సంబంధిత నివేదికలను ఆయా విభాగాధిపతులకు సమర్పించాలని సూచించారు. ఇప్పటివరకు పలు శాఖల జారీ చేసిన నోటీసులకు సంబంధించి పురోగతి ఎలా ఉందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ శాఖ నుంచి అధిక సంఖ్యలో 33, కాలుష్య నియంత్రణ మండలి నుంచి 16, పరిశ్రమల శాఖ 26, బాయిలర్స్ విభాగం రెండు నోటీసులు జారీ చేసినట్లు ఆయా విభాగాల అధికారులు వెల్లడించారు. కంపెనీలు అందజేసిన నివేదికలను పూర్తిగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జేసీ సూచన చేశారు. పరిశ్రమల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో అగ్నిమాపక, పరిశ్రమల, కాలుష్య నియంత్రణ మండలి, విద్యుత్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్రంలో పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయిస్తూ కొత్త జిల్లాల ఏర్పాటుకోసం త్వరగా ప్రయత్నాలు మొదలు పెట్టాలని ఆదేశించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఈ దిశగా ఏర్పాట్లు ప్రారంభించింది. జిల్లాల పునర్విభజనకు అవసరమైన సమాచారాన్ని రాష్ట్ర స్థాయి కమిటీలకు అందించడం, కొత్తగా ఏర్పడే జిల్లాలకు అవసరమైన భవనాలు, సిబ్బంది, మౌలిక సదుపాయాలు సమకూర్చడం, కొత్త జిల్లాల సరిహద్దులు నిర్ణయం, వివిధ ప్రభుత్వ శాఖల ఆస్తుల మదింపు వంటి అంశాలపై జిల్లా స్థాయిలో నాలుగు సబ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ మంగళవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి పునర్విభజన కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అధ్యక్షత కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ బి.రాజకుమారి, జాయింట్ కలెక్టర్‌లు డా.జి.సి.కిషోర్ కుమార్, డా.ఆర్.మహేష్‌కుమార్, జె.వెంకటరావు, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మనాథ్, పార్వతీపురం సబ్ కలెక్టర్ విధే ఖరే, జిల్లా రెవిన్యూ అధికారి గణపతిరావు, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. సబ్‌కమిటీల్లో పార్వతీపురం అధికారులను కూడా భాగస్వాములను చేస్తూ అక్కడ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన వసతి సౌకర్యాలు చూసే బాధ్యతలను వారికి అప్పగించనున్నారు. మూడు సబ్ కమిటీలకు జాయింట్ కలెక్టర్లను, ఒక సబ్ కమిటీకి జిల్లా రెవిన్యూ అధికారిని ఛైర్మన్‌గా నియమిస్తూ నిర్ణయించారు. జిల్లా సరిహద్దుల నిర్ణయం, రెగ్యులేటరీ, న్యాయసంబంధ అంశాలు పర్యవేక్షించే కమిటీకి జాయింట్ కలెక్టర్(రెవిన్యూ, రైతుభరోసా) డా.జి.సి.కిషోర్ కుమార్, ప్రభుత్వ సిబ్బంది పునర్విభజన, స్ట్రక్చరల్ రీ ఆర్గనైజేషన్ కు సంబంధించిన అంశాలపై ఏర్పాటు చేసిన కమిటీకి జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) డా.ఆర్.మహేష్ కుమార్ అధ్యక్షత వహిస్తారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆస్తుల గుర్తింపు, మౌలిక సదుపాయాల కల్పన కమిటీకి జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు నేతృత్వం వహిస్తారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్లు, తదితర టెక్నాలజీకి సంబంధించిన మౌలిక వసతుల కల్పన కమిటీకి జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు నేతృత్వం వహించనున్నారు.
ఈ కమిటీల్లో పోలీసు శాఖ తరపున అదనపు ఎస్.పి.(పరిపాలన), జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ., రోడ్లు భవనాల శాఖ, జలవనరుల శాఖ ఎస్.ఇ.లు, విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్.ఇ., జిల్లా విద్యాశాఖ అధికారులు, డి.ఆర్.డి.ఏ., డ్వామా తదితరల సంస్థల అధికారులను సభ్యులుగా నియమిస్తూ కలెక్టర్ నిర్ణయించారు. సబ్‌కమిటీల సమావేశాలు ఈనెల 5 నుండి 7వ తేదీ వరకు నిర్వహించి ఆయా కమిటీలకు అప్పగించిన పని తక్షణం ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. పార్వతీపురంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, జిల్లా కోర్టు ఏర్పాటులో భాగంగా తాత్కాలిక వసతి(ట్రాన్సిట్) కోసం తగిన భవనాలు గుర్తించాలని ఐటిడిఏ పి.ఓ., సబ్ కలెక్టర్‌లకు సూచించారు. కలెక్టరేట్ కాంప్లెక్స్ ఏర్పాటుకోసం ఐదు ఎకరాల స్థలాన్ని గుర్తించాలని కూడా కలెక్టర్ ఆదేశించారు. దీనికోసం పార్వతీపురంలో ఖాళీగా వున్న ప్రభుత్వ భవనాలు గుర్తించే పని చేపట్టాలన్నారు. అవసరమైతే ప్రైవేటు వసతి కూడా ఏర్పాటు చేయాల్సి వుంటుందని పేర్కొన్నారు.
సమావేశంలో జిల్లా పరిషత్ సి.ఇ.ఓ. టి.వెంకటేశ్వరరావు, డి.ఎం.హెచ్.ఓ. డా.రమణకుమారి, జిల్లా అదనపు ఎస్.పి. సత్యనారాయణ రావు, జిల్లావిద్యాశాఖ అధికారి నాగమణి, జిల్లా ముఖ్యప్రణాళిక అధికారి విజయలక్ష్మీ, ఖజనా శాఖ ఉపసంచాలకులు, జిల్లా సామాజిక అటవీ అధికారి జానకిరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ప్రభుత్వ శాఖల భూములను, భవనాలను గుర్తించాలని జిల్లా కలెక్టరు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈప్రక్రియను 6వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. ప్రతి శాఖకు సంబంధించిన భూములు, ఆస్తులు, భవనాలు మొదలైన వాటి వివరాలను ప్రభుత్వ ప్రత్యేక పోర్టల్ లో నమోదు చేయాలన్నారు. జిల్లాలో గల విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు డివిజన్ లకు సంబంధించిన వివరాలను ముఖ్యంగా ప్రధాన కేంద్రాలైన అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు లతోపాటు పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన అరుకులోయకు సంబంధించి ఈ వివరాలను పొందుపరచాలన్నారు. ప్రభుత్వ శాఖకు సంబంధించి ఖాళీగా ఉన్న స్థలం వివరాలు విస్తీర్ణం లతో సహా భవనాల వివరాలను తెలియజేయాలన్నారు. ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత రెవెన్యూ డివిజన్ అధికారులు ఈ వివరాలను పంపించవలసి ఉంటుందన్నారు. రెవిన్యూ డివిజినల్ అధికార్లు వాటిని దృవీకరించాల్సి ఉంటుందన్నారు. ప్రతి అధికారి చిన్న సమస్యలను సైతం క్షుణ్ణంగా పరిశీలించి వివరాలతో అప్లోడ్ చేయాలన్నారు. వివాదాలు ఏమైనా ఉన్నట్లయితే వాటి వివరాలను కూడా క్షుణ్ణంగా తెలియజేయాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ లు వారి పరిధిలో ఉన్న వివిధ శాఖల తాలూకు వివరాలను పర్యవేక్షించాలని చెప్పారు. కొత్త జిల్లాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీసు అధికారి కార్యాలయం, జిల్లా న్యాయస్థానాలకు అవసరమైన భూములను గుర్తించాలన్నారు. విద్యాసంస్థలు వివిధ శాఖలకు సంబంధించి ఖాళీగా ఉన్న స్థలాలను పరిశీలించి వాటి వివరాలను కూడా పొందుపరచాలని ఆదేశించారు. తదుపరి ప్రభుత్వ వెబ్ సైట్ నందు అప్లోడు చేయుటను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ కృష్ణారావు, జాయింట్ కలెక్టర్లు ఎమ్. వేణుగోపాల్ రెడ్డి, పి అరుణ్ బాబు, ఆర్. గోవిందరావు, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఎస్. వెంకటేశ్వర్, నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్. మౌర్య, వివిధ శాఖల జిల్లా అధికారులు వి. విశ్వేశ్వరరావు, రాజారత్నం, రమణమూర్తి, నాగార్జునసాగర్, సూర్యనారాయణ, లీలావతి, లింగేశ్వరరెడ్డి, సుధాకర్ రెడ్డి, జయరామ ఆచారి తదితరులు పాల్గొన్నారు.