ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఘనంగా ఆదివారం నిర్వహించారు. వర్సిటీ పరిపాలనా భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి పాల్గొని, పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు త్యాగాన్ని నేటితరం గుర్తుచేసుకోవాలన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికిన మహనీయులు పొట్టి శ్రీరాములు అని, తెలుగు వారి కోసం రాష్ట్ర ఏర్పాటుకు తన ప్రాణాలను సైతం త్రుణప్రాయంగా వదిలిన పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఆయనను ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
అవినీతిని అంతమొందిస్తూ.. దాపరికంలేని సమజాన్ని నిర్మించడానికి సమాచార హక్కు దరఖాస్తు దారుల సంఖ్య పెరుగుదలకు యునేటెడ్ ఫోరం ఫర్ ఆర్.టి.ఐ క్యాంపెయిన్ కార్యకర్తలు కృషి చేస్తుందని యూ.ఎఫ్.ఆర్.టి.ఐ రాష్ట్ర కో కన్వీనర్ బుద్ధ చక్రధర్ స్పష్టం చేశారు. ఆదివారం సి.పి.ఎం కార్యాలయంలో యూ.ఎఫ్.ఆర్.టి.ఐ అద్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు వజ్రాయుధం గా ఉండాల్సిన ఆర్.టి.ఐ ను అధికారులు నిర్వీర్యం చేస్తున్నారన్నారు. దీనిపై సమాచార హక్కు చట్టం కార్యకర్తలు పోరాటం చేస్తున్నారని తెలిపారు. అలాగే స.హ కార్యకర్తలు సేకరించిన సమాచారాన్ని ఉద్యమ కారులతో కలిసి సమస్య పరిస్కారం దిశగా ప్రయత్నం చేయాలన్నారు. అడిగిన సమాచారం ప్రజా ప్రయోజనార్థం అయి ఉంటే దానికోసం అప్పీలు,ఆ పై కమిషన్ కు వెళ్ళేవరకు ఆ దరఖాస్తు ను ముందుకు తీసుకు వెళ్లాలని సూచించారు. దీనితో పాటు కాపులు తూర్పు, కొండ అని బి.సి డి గా కుల ధ్రువీకరణ పత్రాలు పుట్టించి సర్టిఫికెట్ లు తీసుకొంటున్నారని దానిపై స.హా కార్యకర్తలు దృష్టి సారించాలని కోరారు. అనంతరం మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన యూ.ఎఫ్.ఆర్.టి.ఐ విశాఖ జిల్లా ప్రధాన సలహాదారు దండు గణపతి రాజు మాట్లాడుతూ యూ ఎఫ్.ఆర్.టి.ఐ రాష్ట్ర కమిటీ తరపున సమాచార హక్కు చట్టం బలోపేతానికి నా వంతు కృషి చేస్తానన్నారు. సమాచార హక్కు కమీషన్ ను ఏర్పాటుచేయడంలో ఎన్. సి.పి.ఆర్.ఐ కీలక పాత్ర పోషించిందన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్.టి.ఐ ని నిర్వీర్యం చేసే విధంగా ప్రయత్నం జరుగుతుందన్నారు. ఆర్.టి.ఐ ని బతికించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.ఈ చట్టం ప్రజల కోసం పనిచేసే చట్టం అని గుర్తు చేశారు.అనంతరం జిల్లా కమిటీ సభ్యులకు అధికారుల నుండి సమాచారం సేకరించడంలో తీసుకోవలసిన పలు జాగ్రత్తలు, సలహాలు ,సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూ.ఎఫ్.ఆర్.టి.ఐ జిల్లా కన్వీనర్ రాజాన బుజ్జిబాబు,కో కన్వీనర్ లు బి.వి.వి సత్య నారాయణ,కాండ్రేగుల రాము స.హా చట్టం కార్యకర్తలు నరసింహ,రమేష్,కొల్లి చిన అప్పారావు,పిట్ట అప్పారావు,సోమిరెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు.
మంచికి మారుపేరుగా నిలిచి ది అడవివరం కోఆపరేటివ్ సొసైటీ ప్రహ్లాదపురం బ్రాంచ్ మేనేజర్ గా ఉద్యోగ విరమణ పొందిన నక్కాన శంకర్రావు శేష జీవితం ఆనందంగా గడపాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు ఆకాంక్షించారు. ఆదివారం అడవివరంలో సొసైటీ చైర్మన్ కర్రి అప్పల స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన శంకర్రావు ఉద్యోగవిరమణ కార్యక్రమంలో గంట్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సొసైటీలో అంచలంచెలుగా ఎదిగి బ్యాంక్ మేనేజరుగా రిటైర్అయ్యారన్నారు. సొసైటీ ద్వారా ఎన్నోసేవలు అందించిన ఘనగ శంకర్రావుకి దక్కుతుందని అన్నారు. ఈయనలేని లోటు సొసైటీలో పూరించలేదని అన్నారు. అనంతరం శంకర్రావుని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అజయ్,టిడిపి వార్డు అధ్యక్షడు బి.నరసింహం, వైఎస్సార్సీపీ 98వార్డు నాయకులు కె.ఈశ్వరరావు, సొసైటీ డైరెక్టర్లు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జెఎన్‌టియుకె ప్రాంగణంలో ఆదివారం డిజిటల్ మోనిటరింగ్ సెల్ (డిఎంసి) లో ఘనంగా నిర్వహఇంచారు. కోవిడ్-19 నిబంధనలను అనుసరిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య ఎం.రామలింగరాజు ముఖ్యఅతిథిగా విచ్చేసి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికిన మహనీయులు పొట్టి శ్రీరాములు అని, తెలుగు వారి కోసం రాష్ట్ర ఏర్పాటుకు తన ప్రాణాలను సైతం అర్పించిన పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రిజిస్ట్రార్ ఆచార్య సిహెచ్.సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఓఎస్‌డి ఆచార్య వి.రవీంద్రనాధ్, డిఏపి ప్రొ.ఆర్.శ్రీనివాసరావు, డిఏఏ ప్రొ.వి.రవీంద్ర, డైరెక్టర్ అడ్మిషన్స్ ప్రొ.కెవి.రమణ, ఎఫ్‌డిసి డైరెక్టర్ ప్రొ.వి.శ్రీనివాసులు, ఐఐఐపిటి డైరెక్టర్ ప్రొ.ఎన్.మోహన్‌రావు, ఐక్యూఏసి సెల్ డైరెక్టర్ ప్రొ.ఎన్.బాలాజీ, డా.బి.ఆర్.అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ లైబ్రేరియన్ డా.బి.ఆర్.దొరస్వామినాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్ర రాష్ట్రం కోసం అసువులు బాసిన త్యాగధనుల ఫలితాలను నేడు మనం అనుభవిస్తున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపులు శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా స్థానిక బాపూజీ కళామందిర్ లో అవతరణ దినోత్సవ వేడుకలు రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్, రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్, రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజులతో కలిసి పాల్గొన్నారు. ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల ఫలితాలను మనందరం అనుభవిస్తున్నామని చెప్పారు. పొట్టి శ్రీరాములు ఫ్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కోసం పోరాటం చేసి అసువులు బాసారని, ఆ మహానీయుని త్యాగానికి ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. వారి త్యాగం అందరికీ ఆదర్శమని, ప్రతీ ఒక్కరూ వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంతో పాలన అందించాలని , ఆ దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ జనరంజక పాలనను అందిస్తున్న సంగతిని ఉపముఖ్యమంత్రి గుర్తుచేసారు. వై.యస్.రాజశేఖర రెడ్డి నాడు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించారని తెలిపారు. నేడు ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి వై.యస్.ఆర్. ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తున్నారని కితాబు ఇచ్చారు. వై.యస్.ఆర్ జలయజ్ఞం చేపట్టి వ్యవసాయ రంగానికి గొప్ప ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. మన ముఖ్యమంత్రి మంచి ఆశయం గల వ్యక్తి అని, అందులో భాగంగానే అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా మూడో స్థానంలో ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి అందిస్తున్న పథకాలు ఇతరులను ఆలోచింపజేసే దిశగా పాలన అందిస్తున్నారని చెప్పారు. అందులో ఒకటైన దిశ చట్టం చారిత్రాత్మకమని ఉద్భోదించారు. స్థానికులకు పరిశ్రమలలో 75 శాతం రిజర్వేషన్లు, చట్టసభలలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు, నవరత్నాలు వంటి అనేక వినూత్న పథకాలు ముఖ్యమంత్రి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలని ఉపముఖ్యమంత్రి కితాబు ఇచ్చారు.
రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం అజరామరం అని అన్నారు. ఆయన గొప్ప త్యాగ పురుషుడని, ఆ త్యాగంతో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. ఉమ్మడి రాజధానిలో అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమైందని, తద్వారా ప్రాంతీయ ఉద్యమాలు నెలకొన్నాయని స్పష్టం చేసారు. అందువలనే ఆంధ్ర రాష్ట్రం నుండి తెలంగాణ విడిపోవలసి వచ్చిందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారని చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విశాఖపట్నం పాలనా రాజధానిగా, శాసన రాజధానిగా అమరావతి, కర్నూలు న్యాయ రాజధానిగా కొనసాగడం తధ్యమని చెప్పారు. మరో ఉద్యమం రాకూడదనే ఉద్దేశ్యంతో మూడు రాజధానులు కోసం జగన్ మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్లు సభాపతి వివరించారు. అభివృద్ధి మూల మూలలకు అందాలని, అందుకే వార్డు, గ్రామ సచివాలయాలు వెలిసాయని చెప్పారు. కరోనా సమయంలో వాలంటీర్లు అందించిన సేవలు అనిర్వచనీయమని అన్నారు. అందరికీ పాలన అందుబాటులో ఉండాలని, తద్వారా ప్రతి ఒక్కరిలో సంతృప్తి వస్తుందని పేర్కొన్నారు. పాలన అందుబాటులో ఉంటే వేర్పాటువాదన రాదని తేల్చిచెప్పారు. అసమానతలు లేని సమాజ నిర్మాణానికి ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారని తెలిపారు.
రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖా మంత్రి డా.సీదిరి అప్పల రాజు మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం మంచి విషయం అని అన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి వికేంద్రీకరణ అవసరమని ముఖ్యమంత్రి విశ్వసించి, మూడు రాజధానులు ఏర్పాటుకు ఆలోచించారని వివరించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్ప సంఘ సంస్కర్త అని, అందులో భాగంగానే నాడు నేడు కార్యక్రమం క్రింద 45 వేల పాఠశాలల రూపురేఖలు మార్చుతున్నారని తెలిపారు. ప్రభుత్వ వైద్యాలయాల్లో చికిత్సను ప్రజలు గొప్పగా భావిస్తున్నారని, అత్యంత ముఖ్యమైన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సూచిస్తున్నట్లు రాజ్యాంగ బద్ధ కమిటీ తెలిపిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సాహసోపేత నిర్ణయాలను ముఖ్యమంత్రి తీసుకుంటున్నారని కితాబు ఇచ్చారు.
తొలుత రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ తెలుగు భాష గొప్పదని, త్వరలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతూ అభివృద్ధి దిశగా పయనిస్తోందని అన్నారు. జిల్లాకు గొప్ప ఘన చరిత్ర ఉందని, దానిని ఇంకా అధ్యయనం చేసి గ్రంథ రూపంలో తీసుకు రావాలని ఆకాంక్షించారు. శ్రీకాకుళం జిల్లాతో మహాత్మా గాంధీ కి అత్యంత సాన్నిహిత్యం ఉందని గుర్తుచేసారు.
తిరుమల శ్రీవారికి ఆదివారం ఐదు బ్యాటరీ ఆటోలు విరాళంగా అందాయి. ఆదివారం వేలూరుకు చెందిన ప్రముఖ బ్యాటరీ ఆటోల తయారీ సంస్థ వి.ఎస్.ఎల్. ఇండస్ట్రీస్, ఆకెళ్ళ రాఘవేంద్ర ఫౌండేషన్ లు కలిసి ఈ మేరకు దాదాపు రూ.15 లక్షల విలువైన ఐదు బ్యాటరీ ఆటోలను టిటిడి అధికారులకు అందజేశారు. శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో దాతలు వి.ఎస్.ఎల్. ఇండస్ట్రీస్ ఎం.డి. జి.ఏ. హరికృష్ణ, ఆకెళ్ళ రాఘవేంద్ర ఈ మేరకు ఆటో తాళాలను శ్రీవారి ఆలయ ఇంచార్జ్ డెప్యూటీ ఈవో వెంకటయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల రవాణా విభాగం డి.ఐ. మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో మూడు ఆటోలను కోవిడ్ -19 శానిటేషన్ కోసము, రెండు ఆటోలు తిరుమలలో వ్యర్ధాలను తరలించడానికి ప్రత్యేకంగా రూపొందించారు. తిరుతమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం ఎలాంటి కరోనా వైరస్ దరచేరకుండా ఈ ఆటోల ద్వారా పిచికారి చేయనున్నారు.
నేషనల్ హైవే రోడ్ సేఫ్టీ దృష్ట్యా బైపాస్ మార్గాలలో ప్రయాణించే ద్విచక్ర వాహన దారులు తప్పని సరిగా ఇకపై హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని తిరుపతి అర్భన్ జిల్లా ఎస్పీ ఏ.రమేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా, పోలీస్ సిబ్బందికి అన్నమయ్య సర్కిల్ వద్ద హెల్మెట్లను ప్రదానం చేసారు. ఈ సందర్బంగా జిల్లా యస్.పి మాట్లాడుతూ జిల్లాలోని పోలీస్ స్టేషన్ల సరిహద్దులతో సంబందం లేకుండా ప్రమాదాలు, ఇతరాత్ర నేరాలు జరిగిన వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ సిబ్బంది తక్షణమే స్పందించాలన్నారు. హైవే రోడ్డులో ప్రమాదాలు జరుగు ప్రాంతాలను గుర్తించి అక్కడ డిజిటల్ సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రాణం విలువైనది, ప్రజలు యొక్క ప్రాణం కాపాడటం మన యొక్క విధిగా భావించి ప్రజలతో మనం, మనతో ప్రజలు అనే స్నేహభావం పెంపొందించుకోవాలన్నారు. ఈ సందర్బంగా జిల్లా పోలీస్ అధికారుల సమావేశంలో అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేసారు. ఈ కార్యక్రమాలలో అడ్మిన్ అడిషనల్ యస్.పి తి సుప్రజ , డి.యస్.పి లు యస్.బి గంగయ్య, వెస్ట్ నరసప్ప, ఈస్ట్ మురళీకృష్ణ, ట్రాఫిక్ మల్లికార్జున, దిశా పి.యస్ రామరాజు, ఏ.ఆర్ నంద కిశోర్, సి.ఐ లు, ఆర్.ఐ లు, యస్.ఐ లు, ఆర్.యస్.ఐ లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
విశాఖజిల్లా గాజువాకలో హత్యకు గురైన వరలక్ష్మి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి చూస్తున్నాయి.. పోలీసులు తెలిపిన వివరాలు.. వరలక్ష్మి హత్య పథకం ప్రకారమే జరిగిందని.. యువతి హత్యకు ఆమె మరొకరితో సన్నిహితంగా ఉండటమే కారణమని స్పష్టమైంది..వరలక్ష్మిపైన అనుమానం రావడంతోనే అఖిల్ ఆమెను సాయిబాబా గుడి వద్దకు పిలిచి దారుణంగా హతమార్చినట్లు పోలీసుల విచారణలో రూఢీ అయింది.. వివరాలు తెలుసుకుంటే సుందరయ్య కాలనీలో ఉంటున్న వరలక్ష్మితో, చిట్టిబాబు కాలనీకి చెందిన అఖిల్ ప్రేమ పేరిట వెంట పడ్డాడు. అదే సమయంలో రాము అనే యువకుడు వరలక్ష్మితో సన్నిహితంగా ఉండటంతో భరించలేక పథకం ప్రకారం వరలక్ష్మి ఎవరికీ దక్కకూడదనే ఉద్దేశ్యంతోనే హత్య చేశాడని పోలీసులు చెబుతున్నారు. మరో వైపు ఊహించని ఈ పరిణామాలతో వరలక్ష్మి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అమానుషంగా తమ కుమార్తె ప్రాణం తీసిన అఖిల్‌ను కఠినంగా శిక్షించాలని వరలక్ష్మి తల్లి కోరుకుంటోంది. తాజా ఘటనపై స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటన ఏ కుటుంబానికి ఎదురు కారాదని స్థానికులు బాధిత యువతి కుటుంబానికి అండగానిలుస్తున్నారు. వరలక్ష్మిని కిరాతకంగా హతమార్చిన సంఘటనతో విద్యార్ధినిలు అప్రమత్తంగా ఉండాలని అటు పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. అపరిచిత వ్యక్తులతో పరిచియాలు మంచిది కాదని సూచిస్తున్నారు. ఏదైనా తేడా ఉన్నట్టు అనిపిస్తే తక్షణా దిశ యాప్ ద్వారా పోలీసులకు సందేశం పంపాలని కూడా కోరుతున్నారు. కాగా విశాఖజిల్లాలో ప్రేమోన్మాది ఘటనపై హోంమంత్రి సుచరిత తీవ్రంగా మండిపడ్డారు. దారుణానికి ఒడిగట్టిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే అంతకు ముందు డీజీపీ, ఇతర ఉన్నాతాధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్న హోంమంత్రి.. బాధితురాలి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా పురస్కరించుకొని ఈ రోజు ఉదయం కర్నూలు కలెక్టరేట్ ఆవరణలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు జీవితాన్ని ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఆయనకిచ్చే ఘనమైన నివాలళి అన్నారు. అంతకు ముందు చిల్డ్రెన్స్ పార్క్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాష్ట్ర బుగ్గన రాజేంద్రనాథ్ పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్, ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, కంగాటి శ్రీదేవి, డా. జె. సుధాకర్, నగర పాలక సంస్థ కమీషనర్ డి.కె. బాలాజీ, జేసీలు రామ సుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజామోహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సునయన ఆడిటోరియంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయతను తెలిపే కార్యక్రమాలు అందరినీ ఆకట్టు కున్నాయి...
ఓర్వకల్ ఎయిర్పోర్ట్ ప్యాసింజర్ లాంజ్ లో పెండింగ్ పనులను సత్వరమే పూర్తిచేయాలని పై ఎయిర్పోర్ట్ అధికారులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆదేశించారు. ఆదివారం ఎయిర్ పోర్టులోని ప్యాసింజర్ లాంజ్ జరుగుతున్న పనులను ఆయన జిల్లా కలెక్టర్ జి.వీరపాండియాన్, పాణ్యం శాసన సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎయిరపోర్టులు పూర్తయిన ప్రాంతాల నుంచి ఎయిర్ కనెక్టివిటీని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఎయిర్ పోర్టులను అభివ్రుద్ధి చేయడంతోపాటు, కొత్త ఎయిర్ పోర్టులకు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ క్రమంలోనే మూడు రాజధాన్లుల్లో జ్యూడిషియల్ కేపిట్ కాబోతున్న ఈ జిల్లాలో ఎయిర్ పోర్టును సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఎయిర్ పోర్టు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్ డి ఓ వెంకటేష్, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కైలాష్ మండల్, డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు, పంచాయతీ రాజ్ శాఖ ఎస్ ఈ సుబ్రమణ్యం, వివిధ శాఖల ఇంజనీరింగ్ ఎస్ ఈ లు, జిల్లా అధికారులు, ఎయిర్ పోర్ట్ అధికారులు పాల్గొన్నారు.
తిరుపతి నడిబొడ్డులో ఉన్న సుబ్బలక్మి కూడలిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని నగరపాలకసంస్థ కమిషనర్ గిరీషా అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం నగరపాలకసంస్థ అధికారులు, ఆయా ప్రోజెక్టుల ప్రతినిధులతో కలసి గరుడ వారధి, రామాపురం వద్ద గల బయో మైనింగ్ ప్లాంట్, బాలాజీ కాలనిలో గల శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ పరిశీలించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద జరుగుతున్న గరుడవారధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సుబ్బలక్ష్మి కూడలికి నాలుగు పక్కల నుండి వాహనాలు వస్తాయని, వాహనాలు సులభంగా తిరిగేందుకు వీలుగా ప్లాన్ ప్రకారం విశాలంగా ఏర్పాటు చేయాలన్నారు. అలాగే నాలుగు పక్కల పచ్చటి గడ్డితో లాన్ తీర్చిదిద్దాలని సూచించారు. బస్టాండ్ లోపలకు వెళ్లే డౌన్ ర్యాంపు పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం రామాపురం వద్ద ఉన్న బయో మైనింగ్ ప్లాంట్ ను పరిశీలించారు. నగరపాలక సంస్థ నగరంలో సేకరించిన చెత్త వేరు చెసే పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. చెత్త వలన వచ్చే సేంద్రియ ఎరువును రైతులకు, ఉద్యాన వనాలకు ఇవ్వాలన్నారు. ఒక్కో రోజు ఎంత చెత్త వేరు చేస్తున్నారు, ఒక్కో వాహనంలో ఎంత చెత్త, ఎరువు తరలిస్తున్నారని, సి.సి. కెమెరా ల పనితీరు, లాగ్ బుక్ స్వయంగా పరిశీలించారు. రెండు వాహనాలకు చెత్త నింపి ఒక్కో వాహనాల్లో ఎంత చెత్త తరలిస్తున్నారని పరిశీలించారు. ప్లాంట్ లో ఎక్కువ సి.సి.కెమెరాలు ఏర్పాటు చెయాలని, చెత్త, ఎరువు తరలించే వాహనాల రాక పోకలు ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. వీలైనంత త్వరగా చెత్త నిర్వహణ పూర్తి చేయాలన్నారు. ప్లాంట్ చుట్టూ పచ్చని చెట్లు నాటాలన్నారు. అనంతరం బాలాజీ కాలనీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్లాన్ ప్రకారం కాకుండా తక్కువ స్థలంలో కోర్ట్ ఏర్పాటు చేస్తుండడంతో కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణం, ఉత్తరం వైపు కోర్ట్ వెడల్పు పెంచి విశాలంగా కోర్ట్ ఏర్పాటు చేయాలన్నారు. బేస్ బాల్, వాలీబాల్, కబడ్డీ వంటి క్రీడలు ఒకే కోర్టులో ఆడుకునేలా ఏర్పాటు చేయాలన్నారు. కోర్టులో క్రీడాకారులు కింద పడ్డా గాయాలు కాకుండా సింథటిక్ ఫ్లోర్ ఏర్పాటు చేయాలన్నారు. అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. కమిషనర్ వెంట స్మార్ట్ సిటీ జి.ఎం (అడ్మిన్) చంద్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్ చంద్రశేఖర్, డిప్యూటీ సిటీ ప్లానెర్ దేవికుమారి, డి.ఈ.లు విజయకుమార్ రెడ్డి, దేవిక, కరుణాకర్, సర్వేయర్లు ప్రసాద్, దేవానంద్, ఏఈకామ్ రాజేందర్, అప్కాన్స్, జిగ్మా, సంస్థల ప్రతినిధులు ఉన్నారు.
గ్రామ /వార్డు సచివాలయాల్లో పౌర సేవలను విస్తృతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) వి. వీరబ్రహ్మం ఆదేశించారు. శనివారం మద్యాహ్నం చంద్రగిరి లోని 1, 2 వ వార్డు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జెసి సచివాలయంలో కార్యదర్శుల వారీగా సచివాలయంలో అమలు చేసిన పౌర సేవల రిజిస్టర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యదర్శులను ఉద్దేశించి జె సి మాట్లాడుతూ పౌర సేవలను మరింత విస్తృతంగా అమలు చేయాలన్నారు. ప్రజల నుంచి అందిన దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలన్నారు. సచివాలయం ద్వారా వీలైనన్ని ఎక్కువ సర్వీసులను సకాలంలో అందించాలన్నారు. సచివాలయంలో అందుతున్న సర్వీసులను సద్వినియోగం చేసుకునేలా స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యదర్శుల రోజువారీ విధుల నిర్వహణపై సమీక్షించారు. అడ్మిన్, విఆర్వో, పారిశుధ్య పర్యావరణ కార్యదర్శుల రోజువారీ విధుల నిర్వహణ ఎలా చేస్తున్నారంటూ సంబంధిత కార్యదర్శులతో మాట్లాడారు. గృహాల నుంచి తడి, పొడి చెత్త విధానంలో సేకరించాలన్నారు. పౌర సేవల సంఖ్యను పెంచడానికి నిత్యం అడ్మిన్ కార్యదర్శులతో సమీక్ష నిర్వహిస్తున్నామని మున్ముందు మరింత వేగంగా సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
నవంబర్ 4న రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరు పర్యటనను విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం, వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఏలూరులో నూర్బాష దూదేకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎంఆర్ పెదబాబు, జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలు రాజు, ఎస్పీ నారాయణ నాయక్, ఎమ్మెల్యే కొఠారి ఆబ్బయ్య చౌదరితో సమీక్షనిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్ పెళ్లి శుభకార్యానికి వస్తున్నారన్నారు. ఏలూరు తంగెళ్లమూడి వంతెన ఉన్న సూర్య కల్యాణ మండపాన్ని పరిశీలించి, పెదబాబు ఇంటిని సందర్శించారు. సీఎం పర్యటన విజయవంతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఎస్పీని ఆదేశించారు. ఈ కార్యక్రమములో ఏలూరు డీస్పీ, ఆర్డీఓ ఏలూరు నగర వైస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గర్భిణీలు, బాలింతలు, తల్లులు, చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించి రక్తహీనత, అనారో గ్యాల నుంచి పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉన్నదని జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎస్ వెంకటేశ్వర్ తో కలిసి వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్+ మరియు వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం జిల్లా మరియూ ఐ టి డి ఎ స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ , వైద్య ఆరోగ్యం, పౌరసరఫరాలు, డైరీ డెవలప్మెంట్, జి సీ సీ తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అన్ని అంగన్వాడీ కేంద్రాలకు నిర్దేశించిన కాలంలో నాణ్యమైన పాల సరఫరా చేయాలని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత మండలాల్లో మారు మూల ప్రాంతాలకు అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. గుడ్లు పంపిణీలో భాగంగా చిన్న సైజ్ గుడ్లను పంపిణీ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆ విధంగా చేస్తున్న కాంట్రాక్టర్ల పై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
అదేవిధంగా న్యూట్రిషన్ కిట్స్ లో నాణ్యతలేని డ్రైఫ్రూట్స్, బెల్లం పంపిణీ చేస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకొని వారి కాంట్రాక్టును రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.అన్ని అంగన్వాడీ కేంద్రాలకు బాలామృతం సరఫరా పై ఆరా తీశారు. గర్భిణీలకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లను సరఫరా చేయాలన్నారు. బాలింత లు,చిన్నారుల రక్త హీనత రాకుండా వారికీ ఐరన్ టాబ్లెట్స్ సరఫరా చేయడం,ఎప్పటికప్పుడు చిన్నారుల బరువును చూడాలన్నారు. మాతాశిశు మరణాల శాతం తగ్గే విధంగా చూడాలన్నారు. తక్కువ బరువు గల అడాలసెంట్ పిల్లలను, గుర్తించి నివేదికను అందజేయాలన్నారు. వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ , మరియు వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు అన్ని అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ , వార్డ్ సెక్రటేరియట్ లలో డిస్ప్లే చేయాలన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎస్ వెంకటేశ్వర్, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ అధికారి సీతా మహాలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సూర్యనారాయణ, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ భాస్కర్, పౌర సరఫరాల శాఖ అధికారులు నిర్మలా బాయ్ , శివప్రసాద్, జి సి సీ, డైరీ డెవలప్మెంట్ శాఖల అధికారులు, సి డి పి వో లు తదితరులు హాజరయ్యారు.
ప్రభుత్వ సంక్షేమ ఫలాలను లబ్ధిదారులకు సకాలంలో అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ బ్యాంకు అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో డి.యల్.ఆర్.సి సమావేశం లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని జగనన్న తోడు, వై.యస్.ఆర్.బీమా, వై.యస్.ఆర్.చేయూత వంటి పలు అంశాలపై చర్చించారు. ముందుగా జగనన్న తోడు గురించి కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రకటించిందని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పథకాన్ని పక్కాగా అమలుచేస్తూ, శతశాతం పూర్తిచేసేలా బ్యాంకు అధికారులు కృషిచేయాలని చెప్పారు. ఇందుకు సంబంధిత శాఖలను సమన్వయం చేసుకోవాలని, లబ్ధిదారులకు సకాలంలో పథకాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వై.యస్.ఆర్.బీమా పథకం అమలులో జిల్లా ముందంజలో ఉండేవిధంగా బ్యాంకు అధికారులు, సంబంధిత శాఖలు కృషిచేయాలని అన్నారు. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుదారుల ధృవీకరణ పత్రాలను సంబంధిత శాఖలు బ్యాంకులకు అందజేస్తాయని, వాటిపై బ్యాంకర్లు తక్షణమే స్పందించి బీమా డబ్బులు అందేలా చూడాలని ఆదేశించారు. బీమా చెల్లింపుల్లో పనిచేయని ఖాతాలు ఉంటే వాటిని వెంటనే సవరించి ఖాతాలు పునరుద్ధరణ అయ్యేటట్లు చూడాలని కలెక్టర్ బ్యాంకర్లను కోరారు. ఎస్.ఎల్.బి.సి మార్గదర్శకాలకు అణుగుణంగా వై.యస్.ఆర్ చేయుత కార్యక్రమం అమలవుతుందని కలెక్టర్ గుర్తుచేసారు. ఈ పథకం లక్ష్యాలను శతశాతం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అన్నారు. వై.యస్.ఆర్.చేయూత రిటైల్ వాణిజ్య కార్యకలాపాలను స్థాపించేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు కోసం ఉద్దేశించబడిందని స్పష్టం చేసారు. ప్రభుత్వం ఇప్పటికే వారి వ్యక్తిగత ఖాతాల్లో రూ.18750/ - జమ చేయడం జరిగిందని, మహిళలు మరింత ఆర్ధిక పురోగతిని సాధించేందుకు బ్యాంకులు కృషిచేయాలని సూచించారు. యస్.హెచ్.జిలు వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించేందుకు అవసరమైన ఆర్ధిక సహాయాన్ని బ్యాంకులు సకాలంలో అందజేయాలని సూచించారు. రైతులకు, స్వయం సహాయక బృందాల మహిళలకు రుణాల చెల్లింపుల్లో జాప్యం చేయరాదని, బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా చూసుకోవాలని వివరించారు.
డిస్ట్రిక్ట్ లీడ్ బ్యాంక్ మేనేజర్ జి.వి.వి.డి.హరిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న తోడు మరియు వై.యస్.ఆర్.బీమా చెల్లింపులకు నవంబర్ 5 ఆఖరు తేదీగా ప్రకటించిందని, కావున బ్యాంకు అధికారులు సకాలంలో చెల్లింపులు చేసేలా సహకరించాలని కోరారు. అవసరమైతే బ్యాంకులకు సంబంధించిన ఇతర కార్యకలాపాలను వాయిదా వేసుకొని సకాలంలో చెల్లింపులు చేయాలన్నారు. అలాగే ఖరీఫ్ రుణాలు మంజూరుకోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, దీనిలో భాగంగా పంట రుణాలు త్వరితగతిన మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందులో కొత్త రుణాలతో పాటు పాత రుణాలు రెన్యూవల్ చేయవచ్చని స్పష్టం చేసారు. జిల్లాలో ఇప్పటివరకు 105 స్వయం సహాయక సంఘాలలోని సభ్యులకు వాణిజ్య కార్యకలాపాల కోసం రుణాలు మంజూరుచేయడం జరిగిందన్నారు. మిగిలిన సంఘాలకు కూడా రుణాలు మంజూరుచేయాల్సి ఉందని, వాటిని త్వరితగతిన పూర్తిచేయాలని బ్యాంకు అధికారులను కోరారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్లు డా.కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములు నాయుడు, యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ మేనేజర్ పి.కృష్ణయ్య, నాబార్డ్ డి.డి.ఎం మిళింద్ చౌషాల్కర్, డి.ఆర్.డి.ఏ పథక సంచాలకులు బి.నగేష్, మెప్మా పథక సంచాలకులు యం.కిరణ్ కుమార్, బ్యాంకు మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.