తిరుమలలో కర్ణాటక సత్రాల ప్రాంతంలో రూ.200 కోట్లతో నూతనంగా నిర్మించనున్న వసతి సముదాయాలకు గురువారం ఉదయం ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ముఖ్య మంత్రులు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, బి.ఎస్.యడ్యూరప్పలు కలిసి భూమిపూజ చేశారు. తిరుమలలోని కర్ణాటక చారిటీస్‌కు 7.05 ఎకరాల భూమిని 50 సంవత్సరాల కాల పరిమితికి 2008లో టిటిడి లీజుకు ఇచ్చింది. ఈ స్థలంలో టిటిడి నిబంధనల మేరకు రూ.200 కోట్లతో నూతన వసతి సముదాయాల నిర్మాణం చేపట్టడానికి జూలైలో కర్ణాటక ప్రభుత్వం, టిటిడి మధ్య అంగీకారం కుదిరింది. అంతకుముందు కర్ణాటక రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ రోహిణి సింధూరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నూతనంగా నిర్మించే వసతి సమూదాయాల వివరాలు తెలియజేశారు. ఇందులో 242 యాత్రికుల వసతి గదులు, 32 సూట్ రూములు, 12 డార్మెటరీలు, కల్యాణమండపం, డైనింగ్ హాల్ నిర్మాణంతోపాటు ప్రస్తుతం ఉన్న పుష్కరిణిని పునరుద్ధరిస్తారు. టిటిడి ఈ నిర్మాణాలు పూర్తి చేసి కర్ణాటక ప్రభుత్వానికి అప్పగిస్తుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు నారాయణస్వామి, ఆళ్ల నాని, టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, రాష్ట్ర మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కర్ణాటక రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీనివాస పూజారి, ఎంపిలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మిథున్ రెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, పలువురు యం.ఎల్.ఏలు, ధర్మకర్తల మండలి సభ్యులు డి.పి.అనంత, అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, సివిఎస్వో గోపినాథ్‌జెట్టి, అర్బన్ ఎస్పీ ఎ.రమేష్‌రెడ్డి, సిఇ రమేష్‌రెడ్డి, ఎస్ ఇ - 2 నాగేశ్వరరావులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా విజయపరంపర కొనసాగుతోంది. జగనన్న పచ్చతోరణం కార్యక్రమం అమల్లో కూడా జిల్లాకు రాష్ట్రంలోనే మొదటి స్థానం లభించింది. హరిత విజయనగరం సాధనే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ చూపిస్తున్న వ్యక్తిగత శ్రద్ద, ప్రజాప్రతినిధుల తోడ్పాటుతో రాష్ట్రంలోనే జిల్లాకు ఈ ప్రత్యేక గుర్తింపు లభించింది. హరితాంధ్ర సాధనే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన జగనన్న పచ్చతోరణం కార్యక్రమం అమల్లో విజయనగరం జిల్లా గణనీమైన విజయాలను సాధించింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించకముందునుంచి కూడా జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్‌లాల్ జిల్లాలో పచ్చదనాన్ని పెంపొందించడం పైనే ప్రధానంగా దృష్టి సారించారు. పరిశుభ్రత, పచ్చదనం, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ, పలు ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేశారు. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే ప్రారంభమయ్యే హరిత విజయనగరం కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా పాల్గొని, తన చేతులతోనే వేలాదిగా మొక్కలను నాటారు. ప్రకృతి వనరుల పరిరక్షణకు, పరిసరాల పరిశుభ్రతకు మన ఊరు-మన చెరువు పేరుతో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వందలాది చెరువులను బాగుచేసి, వాటి గట్లపై మొక్కలను నాటారు. పదుల సంఖ్యలో పార్కులకు పునర్‌జ్జీవం పోశారు. ఆక్సీజన్ పార్కుల పేరిట మినీ వనాలను రూపొందించారు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన స్ఫూర్తితో జిల్లా అంతటా పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలు రెండేళ్లనుంచీ ఒక ఉద్యమంలా సాగుతున్నాయి. ప్రతీ ప్రభుత్వ కార్యక్రమంలో మొక్కలు నాటే పనిని తప్పనిసరి చేశారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న పచ్చతోరణం కార్యక్రమం, జిల్లాలో హరిత ఉద్యమానికి మరింత ఊపునిచ్చింది. అటవీశాఖతోపాటు, డ్వామా, ఉద్యానశాఖ, వ్యవసాయశాఖ తదితర ప్రభుత్వ శాఖలు బాధ్యత తీసుకున్నాయి. జిల్లాలో సంతృప్త స్థాయిలో, ఖాళీ ప్రదేశమన్నది లేకుండా అవకాశం ఉన్న ప్రతిచోటా మొక్కలను నాటాలన్న లక్ష్యంతో, కలెక్టర్ ఈ ఏడాది కూడా భారీ ఎత్తున ప్రణాళికలను రూపొందించి అమలు చేశారు. దీంతో జగనన్న పచ్చతోరణం కార్యక్రమం అమల్లో విజయనగరం జిల్లాకు రాష్ట్రంలోనే మొదటి స్థానం లభించింది. ఈ ఏడాది జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా కోటి, 24లక్షల, 14వేల, 595 మొక్కలను నాటాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటివరకు 84.64 శాతం లక్ష్యాన్ని సాధించి, కోటి, 5లక్షల, 7వేల, 989 మొక్కలను ఇప్పటివరకు నాటారు. సరిగ్గా 20 రోజుల క్రితం 64శాతం లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచిన మన జిల్లా, కేవలం మూడు వారాల్లోనే సుమారు 30లక్షల మొక్కలను నాటడం ద్వారా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలు మన తరువాత స్థానాల్లో నిలిచాయి.
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి.. డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్, జిల్లా కలెక్టర్.
మొక్కలు నాటడం ద్వారా అహ్లాదకరమైన పరిసరాలతో పాటు మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఉష్ణోగ్రత తగ్గుతుంది. సకాలంలో వర్షాలు పడతాయి. అందుకే హరిత ఉద్యమంలో పాల్గొని, ప్రతీఒక్కరూ మొక్కలను నాటాలి. ప్రభుత్వ శాఖలకు ఇచ్చిన లక్ష్యాన్ని శతశాతం పూర్తి చేయాలి. పార్కులు, పాఠశాలలు, ప్రయివేటు సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, చెరువు గట్లు, ఖాళీ ప్రదేశాలతోపాటు, ప్రయివేటు వ్యక్తులు కూడా తమ ఇళ్లవద్ద మొక్కలను నాటేలా చైతన్య పరుస్తున్నాం. అవకాశం ఉన్న ప్రతిచోటా మొక్కలను నాటించడం ద్వారా పచ్చదనాన్ని సంతృప్త స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నాం.
గ్రామసచివాలయంలో ఉద్యోగం వచ్చి ఇంకా ఏడాది పూర్తికాలేదు..అపుడే లంచావతారం..విసిగి వేశారిన బాధితులు ఎలాగైనా ఏసీబి పట్టించాలని పక్కాగా ప్లాన్ వేసి మరీ ఆ లంచావతారాన్ని రెడ్ హేండెడ్ గా దొరికేలా చేశారు. వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా, గురుగుబిల్లి మండలం నాగూరు వీఆర్వో నాగేశ్వర్రావు పట్టాదారు పాసు పుస్తకాలకు 5వేలు లంచం డిమాండ్ చేశాడు. 80 సెంట్ల భూమికి పాసు పుస్తకాలు సబ్ డివిజన్ చేసి ఇవ్వాలంటే తక్షణమే ఐదువేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో విషయాన్ని నేరుగా రైతు ఏసిబికి తెలియజేశాడు. రైతు ఐదువేలు ఇవ్వగానే ఏసిబి అధికారులు వీఆర్వోని పట్టుకున్నారు. కేసు నమోదు చేసినట్టు అధికారులు ప్రకటించారు. గతంలో కూడా ఇద్దరు ముగ్గురి దగ్గర లంచాలు వసూలు చేసిన చరిత్ర ఉండటంతో, లంచాల ఇబ్బందులు భరించలేక ఏసిబిని ఆశ్రయించారు.
విజయనగరం జిల్లాలో ఆదర్శవంతమైన సచివాలయ వ్యవస్థ రూపొందించేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డా. హరిజవహర్లాల్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం కొత్తపేటలో ఉన్న వార్డు సచివాలయం ను సందర్శించారు. ఈ సందర్భంగా వార్డు కార్యద ర్శులు,వాలంటీ ర్లును ఉద్దేశించి మాట్లాడారు. 50 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున విధులు కేటాయించిడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు శతశాతం అందాల్సిందేనని అన్నారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సులభతరం అయినప్పటికీ పేర్లు నమోదు, తొలగింపు లో ఎందుకు జాప్యం కలుగుతుందని ప్రశ్నించారు. అర్హులైన ప్రతి లబ్దిదారునికి అమ్మ ఒడి పథకం అందే విధంగా చూడాలన్నారు. వైయస్సార్ బీమా పథకం వల్ల నిరుపేదలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్న విషయం గ్రహించాలని, మానవతా దృక్పథంతో సేవ చేస్తున్నామన్న భావనతో ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం కల్పించే బాధ్యత కార్యదర్శుల దేనని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ ,సహాయ కమిషనర్ ప్రసాదరావు, వార్డు కార్యదర్శులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో వార్డు, గ్రామ సచివాలయాలకు వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ సచివా లయ కార్యదర్శులను ఆదేశించారు. సచివాలయ ఇ-సేవ దరఖాస్తుల పరిష్కరించి సేవలు అందించడంలో జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, దీనిని నిలిపేవిధంగా అన్ని సచివాలయాల్లో కార్యదర్శులు పనిచేయాలన్నారు. యువత అధికంగా సచివాలయ ఉద్యోగులుగా వున్నారని, అందరూ పనివిధానం తెలుసుకొని వాటిని త్వరితగతిన పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. కలెక్టర్ బుధవారం మధ్యాహ్నం నెల్లిమర్ల నగర పంచాయతీలోని ఇందిరా నగర్‌లో వున్న నాలుగో నెంబరు వార్డు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో కార్యదర్శులు నిర్వహిస్తున్న విధులను గురించి తెలుసుకున్నారు. ఇ-సేవ దరఖాస్తుల పరిష్కారంపై ఆరా తీశారు. ఇక్కడ 94 శాతం మాత్రమే పరిష్కారం కనిపిస్తోందని, జిల్లాలో చాలాచోట్ల 98 నుండి 99 శాతం వరకు దరఖాస్తులు పరిష్కారం జరిగాయన్నారు. ఇక్కడి సిబ్బంది పనితీరు మెరుగుపరచుకోవాలన్నారు. బియ్యం కార్డు గల కుటుంబాలను వై.ఎస్.ఆర్.బీమా పథకంలో నమోదు చేయడంలో సాధించిన ప్రగతిపై తెలుసుకున్నారు. కొన్ని పేర్లకు సంబంధించి స్థానికంగా నివాసం లేనట్లు తేలిందని సచివాలయ కార్యదర్శులు పేర్కొనగా, ఆయా కుటుంబాల పేరుతో వున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయించి వారు ఎక్కడ నివాసం వుంటున్నదీ తెలుసుకున్నారు. నగర పంచాయతీ పరిధిలో జరజాపుపేట వార్డు సచివాలయం దరఖాస్తుల పరిష్కారంలో వెనుకబడి వున్నట్టు తెలుస్తోందని, ఇక్కడ ప్రగతి కనిపించేలా చర్యలు చేపట్టాలని మునిసిపల్ కమిషనర్ అప్పలనాయుడును ఆదేశించారు. కార్యాలయంలో వున్న ఫర్నిచర్, కంప్యూటర్లు తదితర మౌలిక వసతులపై కలెక్టర్ ఆరా తీశారు. సచివాలయ కార్యదర్శులు కష్టపడి పనిచేసి ఈ వ్యవస్థకు మంచిపేరు తీసుకురావాలన్నారు. నగర పంచాయతీలో మెయిన్ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని కమిషనర్ కు కలెక్టర్ ఆదేశించారు. అక్కడే వున్న వలంటీర్లతో మాట్లాడి వారి పరిధిలో ఎన్ని కుటుంబాలున్నాయి, ఎన్ని ఫించన్లు వున్నాయి, రైస్ కార్డుల సర్వే గురించి ఆరా తీశారు. నెల్లిమర్ల తహశీల్దార్ రాము కూడా పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం ద్వారా త్వరితగతిన, మెరుగైన సేవలు ప్రజలకు అందించాలనే ఒక మంచి సంకల్పంతో సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిందని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఆర్. మహేష్ కుమార్ పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ తన పర్యటనలో భాగంగా బుధవారం పార్వతీపురం మండలం నర్శిపురం గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. ముందుగా సచివాలయంలో ప్రజలకు అందజేస్తున్న సేవలకు సంబంధించిన వివరాలు రికార్డులు పరిశీలించారు, గ్రామంలో ప్రజలు వారు కోరే సమాచారం నిర్దేశించిన సమయంలోనే అందజేయాలన్నారు. అలాగే రికార్డులు సకాలంలో నిర్వహించాలన్నారు. గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది బయోమెట్రిక్ తప్పక వినియోగించాలని మండల అభివృద్ధి అధికారికి ఆదేశించారు. ప్రభుత్వము అమలు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు సత్వరం లబ్ధి దారులకు అందేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. సచివాలయం సిబ్బందికి అభివృధి కార్యక్రమాలు గురించి సూచనలు సలహాలు అందించారు. ప్రతిరోజూ కార్యాలయంలో చేపడుతున్న పనుల వివరాలకు సంబందించిన సమాచారాన్ని తదితర సమాచారాన్ని అందరికి అందుబాటులో ఉండే విధంగా నోటీసు బోర్డులో డిస్ప్లే చేశారా అన్న వివరాలు పరిశీలించారు. ఈ పర్యటన కార్యక్రమంలో పార్వతీపురం ఎం.పి.డి. ఓ కృష్ణా రావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం ఏజెన్సీలోని అక్టోబర్ 02 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భూమి లేని గిరిజన రైతులను గుర్తించి పట్టాలు అందించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని పార్వతీపురం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు. అందులో భాగంగా 23వ తేదీ బుధవారం ఉదయం 10.30 గంటల నుండి 1.00 వరకు ఐ.టి.డి.ఎ పరిధిలో వున్న సబ్ ప్లాన్ మండ లాల్లో ఆర్. ఓ.ఎఫ్.ఆర్ పట్టాల నిమిత్తం ఏటువంటి సందేహాలు ఉన్నా ఫోన్ చేసి తెలియజేస్తే పరిష్కారానికి చర్యలు తీసుకోవడానికి ఈ టెలి స్పందన ఏర్పాటు చేసినట్టు వివరించారు. అలాగే సెప్టెంబర్ 24వ తేదీ నుండి సబ్ ప్లాన్ మండల తహశీల్దార్ కార్యాలయాలో, ప్రతి గ్రామ సచివాలయాలో ప్రతి రోజూ ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు వినతులు స్వీకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ టెలి స్పందన వినతుల స్వీకరణ కార్యక్రమానికి ఎ.పి. ఓ సురేష్ కుమార్, ఆర్. ఓ.ఎఫ్.ఆర్ తహశీల్దార్ దేవదానం పాల్గొన్నారు.
జి.వి.ఎం.సి. పరిధిలో ఉన్న వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అవసరమైన సేవలు సత్వరమే అందించాలని జి.వి.ఎం.సి. కమిషనర్ డా. జి. సృజన ఆదేశిం చారు. బుధవారం జి.వి.ఎం.సి. ప్రధాన కార్యాలయంలో జోనల్ కమిషనర్లు, వార్డు స్థాయి, జోనల్ స్థాయి ప్రత్యేక అధికారులు, వార్డు కార్యదర్శులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. వార్డు కార్యదర్శులు నిరంతరం సచివాలయాలలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. జోనల్ కమిషనర్లు ప్రతీరోజూ ఒక సచివాలయాన్ని సందర్శించి తనిఖీ చేసి నివేదికను పంపాలన్నారు. ప్రతీ సచివాలయములలో కార్యదర్శులు, వాలంటీర్ల హాజరు పట్టికను, రోజువారి కార్యకలాపాలను తెలిపిన డైరీను పరిశీలించి తెలుసుకోవాలన్నారు. వీరితో పాటు ప్రత్యేక అధికారులు కూడా సచివాలయాలు సందర్శించి తనిఖీ చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పధకాలైన ప్రధానమంత్రి స్వానిధి, వై.ఎస్.ఆర్. ఆసరా, జగనన్న తోడు, వై.ఎస్.ఆర్. చేయూత, విద్యా దీవన వంటి కార్యక్రమాల అమలు తీరును తెలుసుకోవాలన్నారు. ఇప్పటివరకు, జి.వి.ఎం.సి. ప్రధాన కార్యాలయాల్లో, జోనల్ స్థాయిలో ప్రజల నుండి విజ్ఞప్తులు, ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని, ఇకపై వాటిని ఆయా సచివాలయాల పరిధిలోనే తీసుకోవాలన్నారు. ప్రజల విన్నపాలు, సేవలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ పోర్టల్ లో అప్లోడ్ చేయాలన్నారు. ఈ అంశంపై వార్డు స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడానికి జోనల్ కమిషనర్లు, జోనల్ స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటి పురోగతిపై ఎప్పటికప్పుడు కమిషనర్ కు నివేదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమీషనర్లు, జి.వి.ఎం.సి. విభాగాధిపతులు, జోనల్ స్థాయి ప్రత్యేకాధికారులు తదితరులు పాల్గొన్నారు.
విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ను నియోజవర్గం పరిధిలోని అన్ని వార్డుల నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సంద ర్భంగా పార్టీ కార్యకర్తలతో వాసుపల్లి ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. పార్టీ అభివ్రుద్ధికి ప్రతీఒక్కరూ సైనికుల్లా క్రుషిచేయాలని కేడర్ కు సూచించారు. తన నియోజ కవర్గంలోనే కాకుండా నగరంలోని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా తక్షణ మే కలవొచ్చునన్న ఎమ్మెల్యే రాబోయే జివిఎంసి ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని గెలిచి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి బహుమతిగా అందించాలని సూచించారు. ఆ మేరకు ప్రజలను చైతన్యవంతం చేయడంతోపాటు, అన్నివర్గాల ప్రజలను స్వయంగా కలిసి ప్రభుత్వ పథకాలను, రాబోయే మంచి రోజులపై అవగాహన కల్పించా లన్నారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగనన్న సైన్యం బలం ఏమిటో నిరూపించుకోవాల్సిన సమయాన్ని పూర్తిస్థాయిలో ప్రదర్శించాలని వాసుపల్లి పిలుపునిచ్చారు..
విశాఖ జిల్లాలో సచివాలయాల్లో నియామకాలకు బుధవారం రాత పరీక్షలకు 74 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. ఈరోజు పరీక్షలకు 5883 మంది హాజరు కావలసి వుండగా 3477 మంది హాజరుకాగా, 1304 మంది హాజరు కాలేదు. ఉదయం పరీక్షలకు 1186 మందికి 936 మంది (79 శాతం) హాజరవగా 250 మంది హాజరు కాలేదు. మధ్యాహ్నం పరీక్షలకు 3697 మందికి 2541 మంది (69శాతం) హాజరవగా 1,154 మంది హాజరు కాలేదు. పరీక్షకు హాజరైన అభ్యర్ధులలో కోవిడ్ వచ్చిన వారు ఎవరు లేరు. స్ర్కైబ్ లో ఉదయం ముగ్గురు, మధ్యాహ్నం ఇద్దరు పరీక్షలు వ్రాసారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల్లో అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ వివరించారు. పరీక్షా కేంద్రం వద్ద మందులు, మంచినీరు, ఆరోగ్యసిబ్బంది, వికాలంగులకు ప్రత్యేక వీల్ చైర్స్ ఇలా అన్ని సదుపాయాలు కల్పించినట్టు చెప్పారు. ప్రతీఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించిన తరువాత అభ్యర్ధులను లోనికి అనుమతిస్తున్నట్టు కలెక్టర్ వివరించారు.
విశాఖ జిల్లాలో ఉపాధి హామీ పథకం లో చేపట్టిన భవన నిర్మాణాలు రాబోయే మార్చి నెలలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. బుధవా రం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం అమలుపై ఎస్ ఇ లు , ఇ ఇ లతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తు న్నఈ పనులను ఎలాంటి జాప్యం లేకుండా చేయాలని తెలిపారు. మెటీరియల్ కాంపోనెంట్ ఖర్చు చేయడం, భవనాల నిర్మాణం పూర్తి చేయడం లక్ష్యాలకు అనుగుణంగా జరగాలని తెలిపారు. అంగన్ వాడీలు, రైతు భరోసా కేంద్రాలు , సచివాలయాలు , విలేజ్ హెల్త్ క్లినిక్ లు , కాంపాండ్ వాల్స్ నిర్మాణాల పనులన్నీ తప్పని సరిగా శనివారం లోగా ప్రారంభించాలని తెలిపారు. ఇంజనీర్లు వారికి కేటాయించిన హెడ్ క్వార్టరు లో నివాసం ఉండి పనులను పర్యవేక్షించాలని తెలిపారు. కొంత మంది ఇంజనీర్లు లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమౌతున్నారని , వారి పని తీరు మెరుగుపర్చుకోకపోతే పరిపాలనా చర్యలు తీసుకోవలసి వస్తుందని తెలిపారు. ఇప్పటి నుంచి ప్రతిరోజు టెలి కాన్పరెన్స్ ద్వారా సమీక్షిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు, పంచాయితీ రాజ్ ఎస్ ఇ సుధాకర రెడ్డి, ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ ఇ రవికుమార్, ఎస్ ఎస్ ఎ పిడి మల్లికార్జునరెడ్డి, హౌసింగ్ పిడి జయరామ్ చారీ, డ్వామా పిడి సంధీప్, గిరిజన సంక్షేమ ఇ ఇ లు , ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసేందుకు సిమెంట్ సకాలంలో అందించడమే కీలకమని జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, సిమెంట్ కంపెనీ ప్రతినిధులతో ఈ విషయమై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు కుదుట పడ్డాయని, రవాణా కు ఎటువంటి ఆటంకాలు లేనందున సిమెంటును సకాలంలో అందజేయాలన్నారు. సిమెంట్ కంపెనీలు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆయా కార్యక్రమాలకు, ప్రాజెక్టులకు అవసరమైన ఇసుకను నిర్మాణం జరిగే చోటికి చేరవేయ వలసిన బాధ్యత కంపెనీలకు ఉండదని స్పష్టం చేశారు. సిమెంట్ సరఫరా లేనట్లయితే పనులు సాగక నిర్మాణ కార్మికులకు, ప్రభుత్వ అధికారులకు ఎంతో సమయం వృధా అవుతుందన్నారు. ఆయా కంపెనీలతో చెల్లించవలసిన మొత్తాలను ఇప్పటికే చెల్లిస్తూ ఉన్నామని వీలైనంత వేగంగా పూర్తి చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన అంగన్వాడీ కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు, గృహ నిర్మాణం, నీటి పారుదల పథకాలు, రోడ్ల నిర్మాణం మొదలైన వాటిని అన్నింటికీ పెద్ద ఎత్తున సిమెంటు అవసరం అవుతుందన్నారు. సిమెంట్ కంపెనీలు తమ బాధ్యతగా తమకు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం సరఫరా చేసి అభివృద్ధి పథకాలకు పూర్తి సహకారం అందించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ పర్యవేక్షక ఇంజినీర్ సుధాకర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ రవికుమార్ గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు జయ రామాచారి, నీటిపారుదల శాఖ తదితర శాఖల ఇంజనీరింగ్ అధికారులు వివిధ సిమెంట్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
కిసాన్ రైల్ ద్వారా అనంతపురం నుంచి ఢిల్లీ మార్కెట్ కు చేరవేసే అనంత ఉద్యాన ఉత్పత్తుల రవాణా ఛార్జీలను 50 శాతం తగ్గించాల్సిందిగా గుంతకల్లు డివిజినల్ రైల్వే మేనేజర్ అలోక్ తివారికి మంగళవారం లేఖ ద్వారా అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు విజ్ఞప్తి చేశారు. గుంతకల్లు డి ఆర్ ఎంకు పంపిన లేఖ నందు కిసాన్ రైల్ ప్రవేశపెట్టడంతో పాటు ఈనెల 9వ తేదీన మరియు 19వ తేదీన అనంత ఉద్యాన ఉత్పత్తులను న్యూఢిల్లీలోని అజాద్పూర్ మండికి తరలించడంలో రైల్వే శాఖ ద్వారా అందించిన సహాయ సహాకారాలకు జిల్లాలోని రైతులు మరియు జిల్లా యంత్రాంగం తరఫున జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో కిసాన్ రైల్ ద్వారా ఒక టన్ను ఉద్యాన ఉత్పత్తులు ఢిల్లీకి చేరవేసేందుకు 5136/- రూపాయల రవాణా చార్జీలు చెల్లించడంతో పాటు వాటికి అదనంగా ఉద్యాన ఉత్పత్తుల లోడింగ్ మరియు అన్ లోడింగ్ ఖర్చులు రైతులకు భారంగా అయ్యాయన్నారు. కిసాన్ రైల్ ద్వారా ఒక టన్నుకు రూ. 5136 / - లు చొప్పున 23 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 15 వ్యాగన్స్ ద్వారా 345 మెట్రిక్ టన్నులను నెలలో నాలుగు పర్యాయాలు కిసాన్ రైల్ ద్వారా పంపేందుకు ప్రతిపాదించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ నుండి మే 2021 వరకు 32 సార్లు కిసాన్ రైల్ నడిపే విధంగా ప్రతిపాదించారన్నారు. టన్నుకు రూ 5136/- ల చొప్పున 345 మెట్రిక్ టన్నులకు రూ.17.71 లక్షల రవాణా చార్జీలను రైతులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. 32 సార్లు కిసాన్ రైల్ ద్వారా 11,040 మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులను ఢిల్లీ మార్కెట్ కి చేరవేసేందుకు 567 లక్షల రూపాయలు ఖర్చవుతుందన్నారు. ఇందులో 50 శాతం రవాణా చార్జీలు అనగా రూ.283.50 లక్షలు రైల్వే శాఖ ద్వారా భరిస్తే, మిగిలిన రూ.283.50 లక్షలను రైతులు భరిస్తారన్నారు . రైల్వే శాఖ ద్వారా భరించే రవాణా ఛార్జీల మొత్తాలను కేంద్ర ఆహార తయారీ మంత్రిత్వశాఖ ప్రకటించిన 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం' నుండి గానీ లేదా ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాలకు చెందిన వనరులు నుండి కానీ చెల్లించేందుకు చర్యలు తీసుకుని రైతులకు సహాయం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ గుంతకల్లు డివిజినల్ రైల్వే మేనేజర్ కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.