బాలల హక్కుల పరిరక్షణ దిశగానే వారికి కౌన్సిలింగు గదులు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి అన్నారు. నగరంలోని ధర్మపురి ప్రాంతంలోని బాలల న్యాయ మండలి, బాలల సంక్షేమ సమితి(జువెనైల్ కోర్టు) ప్రాంగణంలో శనివారం కౌన్సిలింగు గదులను ప్రారంభించి, ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీజీ విగ్రహాన్నిజిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆవిష్కరించారు. బాల నేరస్థుల సంక్షేమ, పరివర్తన శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి మాట్లాడుతూ చట్టంతో విభేదించిన పిల్లలు, రక్షణ, సంరక్షణ అవసరం ఉన్న పిల్లలను వారిని శిక్షించడం ద్వారా మాత్రమే కాకుండా కౌన్సిలింగు ద్వారా వారి నేరప్రవృత్తిని మార్చి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. పిల్లల పరివర్తనే ధ్యేయంగా బాలల సంక్షేమ సమితి, బాలల న్యాయమండలి పనిచేయాలని సూచించారు. చైల్డ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సహకారంతో కౌన్సిలింగు గదుల నిర్మాణానికి సహకరించిన స్థానిక హెల్పింగ్ హేండ్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధి రాజవర్మను అభినందించారు. బాలల సంక్షేమం కోసం స్వచ్ఛందసంస్థలు ముందుకు రావాలని కోరారు. జువెనైల్ వెల్ఫేర్ కరెక్షనల్ సర్వీసెస్ శాఖకు చెందిన జిల్లా ప్రొబేషన్ ఆఫీసర్ పి.బాలప్రభాకర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వి.లక్ష్మీరాజ్యం, బాలల న్యాయమండలి ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ బి.శిరీష, బాలల సంక్షేమ సమితి ఛైర్మన్ వి.లక్ష్మణరావు, బాలల న్యాయమండలి సభ్యులు కరణం జనార్దన్, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మాజీ సభ్యులు కేశలి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
నిరంతరం నైపుణ్యాలను పెంచుకుంటూ, నిత్య విద్యార్థి గా వున్నవారు వారి రంగాలలో రాణిస్తారని రాష్ట్ర సమాచార మరియు రవాణా శాఖా మాత్యులు పేర్ని వెంకటరామయ్య తెలిపారు. శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ జర్నలిస్టులకు నిర్వహించిన ఆన్ లైన్ శిక్షణా కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంత ఎదిగినా ఇంకా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ప్రెస్ అకాడమీ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టు మిత్రులను, శిక్షణ ఇస్తున్న సీనియర్ పాత్రికేయలు జి.వల్లీశ్వర్, ఉమామహేశ్వరరావులను అభినందించారు. ప్రభుత్వ సలహాదారులు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ ప్రెస్ అకాడమీ ఏర్పాటు, గ్రామీణ విలేఖరులకు శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, రాజకీయాలు – మీడియా సంబంధాలు తదితర విషయాలను వివరించారు. పాఠకులకు అవసరమైన సమాచారాన్ని క్లుప్తంగా అందించడం, విలేఖరులు అలవాటు చేసుకోవాలన్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నేర్చుకొని పనిచేయాలన్నారు. జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు, జర్నలిస్టులు వారధి లాంటి వారని, వారికి వృత్తిపరంగా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం అత్యంత ఆవశ్యకమని తెలిపారు. జర్నలిస్టులు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్కిల్స్ అప్ గ్రేడ్ చేసుకోవాలన్నారు జర్నలిస్టుల శిక్షణా కార్యక్రమంలో అన్నిఅంశాల పైన క్షుణ్ణంగా శిక్షణ ఇవ్వాలని తెలిపారు. సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తాయని వాటిలో కొన్ని అవాస్తవాలు వుంటున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చొరవ తీసుకొని ఆన్ లైన్ లో శిక్షణా కార్యక్రమాన్ని విశాఖపట్నం ద్వారా ప్రారంభించినందుకు సంతోషం వ్యక్తం చేసారు.
ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ మాట్లాడుతూ జర్నలిజంలోని మెళుకువలు నేర్చుకోవాలని, మరింత పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, ఆసక్తి ఉన్న జర్నలిస్టులకు జర్నలిజం రంగంపై శిక్షణను అందించేందుకు, ప్రెస్ అకాడమీ చొరవ చూపుతున్నదని తెలిపారు. శిక్షణ శాస్త్రీయంగా వుండాలనే ధ్యేయంతో ఈరంగంలో నిష్ణాతులైన జర్నలిస్టులు, ప్రముఖులు ఆయా అంశాలపై బోధిస్తారన్నారు. అనంతరం వార్తలు సేకరించడంలో మెళుకువులు, వార్తల్ని పసిగట్టడం ఎలా అనే అంశంపై జి.వల్లీశ్వరి, వార్తల రచనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉమామహేశ్వరరావు శిక్షణ అందించారు. ఈ కార్యక్రమాన్ని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వీకే సమన్వయం చేశారు.
విజయనగరం జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ భవనాల నిర్మాణం పురోగతిని తెలుసుకొనే నిమిత్తం జాయింట్ కలెక్టర్(ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు శనివారం మెరకముడిదాం మండలంలో డ్వామా పి.డి. నాగేశ్వరరావుతో కలసి పర్యటించారు. చినబంటుపల్లిలో నిర్మాణంలో వున్న గ్రామ సచివాలయం భవనాన్ని పరిశీలించారు. సోమలింగాపురంలో గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్ర భవనాల నిర్మాణాలను పరిశీలించారు. ఉత్తరావల్లిలోనూ గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రాలను పరిశీలించి పంచాయతీరాజ్ ఇంజనీర్లతో వాటిని ఎప్పుడు పూర్తిచేసేది అడిగి తెలుసుకున్నారు. మార్చి నెలాఖరులోగా జిల్లాలో చేపట్టిన భవనాలన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లో పూర్తిచేయాల్సి వుందని, ఎటువంటి జాప్యానికి తావులేకుండా త్వరగా నిర్మాణం పూర్తిచేయాలని సూచించారు.
విజయనగరం జిల్లా, రామభద్రాపురం, సాలూరు మండలాల పరిధిలోని కొట్టక్కి, దుగ్గిసాగరం గ్రామాల వద్ద గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు కోసం ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు శనివారం స్థల పరిశీలన జరిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, హైయర్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ ప్రత్యేక ప్రిన్సిపాల్ సెక్రెటరీ సతీష్ చంద్ర, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. హరి జవహర్ లాల్, సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి శాసన సభ్యులు పీడిక రాజన్న దొర, అలజంగి జోగారావు, సంబంగి వెంకట చినప్పలనాయుడు, సెంట్రల్ యూనివర్సిటీ ప్రోఫెసర్ సర్రాజు, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ టి.వి.కట్టమణి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్, ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మనాథ్, పార్వతీపురం సబ్ కలెక్టర్ విధెహ ఖరె, ఎస్డీసి సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయానికి ప్రతిపాదించిన సుమారు 354 ఎకరాల స్థలాన్ని దాదాపు రెండు గంటలపాటు పరిశీలించారు. మోసూరు వైపు నుంచి కూడా స్థలాన్ని సందర్శించారు. స్థలం సరిహద్దులను, భౌగోళిక పరిస్థితి, నేల స్వభావం, మ్యాపులను పరిశీలించారు. ఈ ప్రాంతంలో గిరిజన విద్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయడం వల్ల గిరిజనులకు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. ఇక్కడే ట్రైబల్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేసి, తమ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని ఉప ముఖ్యమంత్రి తో పాటు, ఎమ్మెల్యేలు కోరారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ సతీష్ చంద్ర మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంలో విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయడం వల్ల గిరిజనులకు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో తో పాటుగా ఒడిషా, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల గిరిజనులకు కూడా ఈ ప్రాంతం అందుబాటులో ఉంటుందన్నారు. చుట్టు కొండలు, గిరిజన ప్రాంతాలు ఉండటం వల్ల ఇది ఒక గిరిజన ప్రయోగశాలగా రూపొందుతుందని అన్నారు. గిరిజనుల కోసం ప్రత్యేకంగా సర్టిఫికెట్, డిప్లొమో కోర్సులను నిర్వహించే అవకాశం కూడ కలుగుతుందని చెప్పారు. గిరిజనులకు కానుకగా, ట్రైబల్ యూనివర్సిటీ ని ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కి రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. అందుకే పాడేరులో వైద్య కళాశాల, కురుపాం లో ఇంజనీరింగ్ కళాశాల, సాలూరులో కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ మాట్లాడుతూ, ప్రతిపాదిత స్థలానికి మూడు అప్రోచ్ రోడ్లు ప్రతిపాదించామని చెప్పారు. జాతీయ రహదారికి కేవలం 2.5 కిలోమీటర్ల దూరం మాత్రమేనని అన్నారు. యూనివర్సిటీకి అవసరమైతే మరింత స్థలాన్ని సేకరించి ఇస్తామని చెప్పారు. ఈ పర్యటనలో పలువురు తాసిల్దార్లు, డిటి లు సర్వేయర్లు, రెవిన్యూ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
కష్టంలో వున్నవారిని ఆదుకోవడం దేవునికి సేవ చేయడంతో సమానమని జిల్లా జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) నంబూరి తేజ్ భరత్ చెప్పారు. స్దానికి కోటిదిబ్బలోని విభిన్న ప్రతిభావంతుల ప్రభుత్వబాలికల వసతిగృహం ఆవరణలో శనివారం ఏర్పాటుచేసిన విభిన్నప్రతిభావంతులకు వివిధ ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో జెసి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 264 మంది విభిన్నప్రతిభావంతులైన లబ్దిదారులు 45.54 లక్షలు విలువచేసే ఉపకరణాలు అందచేశారు. బ్యాటరీతో నడిచే ట్రైసెకిళ్లు, హియరింగ్ ఎయిడ్స్, వాకింగ్ స్టిక్స్, బ్రెయిలీ కిట్స్, స్క్రీన్ రీడింగ్ తో కూడిన స్మార్ట్ ఫోన్ లు వంటి వివిధ రకాల 479 ఉపకరణాలను జాయింట్ కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం చాలా ప్రాముఖ్యతసంతరించుకున్న కార్యక్రమమన్నారు. ఎవరైతే వారి తప్పులేకుండా విభిన్నప్రతిభావంతులుగా జన్మించారో వారిని అన్ని విధాలా ఆదుకోవడం, వారికి సహాయం చేయడం అనేది దేవునికి సేవచేయడమేనని అన్నారు. అలింకో సం స్థ తరపున ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో విభిన్న ప్రతిభావంతులకు వారికి అవసరమైన ఉపకరణాలు అందించడం చాలా అభినందనీయమన్నారు. విభిన్నప్రతిభావంతులు ఒక ప్రదేశం నుండి వేరొకచోటుకి వెళ్లడానికి, వారిదైనందిన కార్యక్రమాలు, పనులు నిర్వహించుకునేందుకు ఉపకరణాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఉసకరణాలు పొందిన లబ్దిదారులు వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకుని ప్రయోజనం పొందాలని సూచించారు. కోవిడ్ సమయంలో వివిధ ప్రాంతాల నుండి తగుజాగ్రత్తలతో ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా వుందన్నారు. ప్రతిఒక్కరూ కోవిడ్ పట్ల అప్రమత్తతగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా మూడు విషయాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, శానిటైజర్ తోగాని సబ్బుతోకాని ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని, అలాగే బహిరంగ ప్రదేశాలకు, మార్కెట్‌లకు, షాపులకు వెళ్లేటప్పుడు భౌతిక దూరం పాటించాలన్నారు. ఇవి పాటిస్తే కోవిడ్ బారినపడకుండా మనం రక్షణ పొందవచ్చునని నంబూరి తేజ్ భరత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఆర్ డిఒ కుమారి పనబాక రచన, ఎపి,తెలంగాణా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఎస్ .ఎస్ ప్రసాద్, అలింకో మేనేజర్ రాజేష్, బధితుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్ది, విభిన్నప్రతిభావంతుల సంక్షేమశాఖ రిటైర్ద్ సహాయ సంచాలకులు ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
విశాఖ జిల్లాలో ఉన్న వివిధ పరిశ్రమలపై సర్వే నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర పరిశ్రమ సర్వే-2020 పై శనివారం జి.వి.ఎం.సి. సమావేశ మందిరంలో పరిశ్రమల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని సుమారు 11 వేల పరిశ్రమలపై సర్వే నిర్వహిం చనున్నట్లు తెలిపారు. వీటిలో దాదాపు 7 వేలు తయారీ పరిశ్రమలు ఉన్నాయని, 144 భారీ పరిశ్రమలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, పట్టణ ప్రాంతాల్లో వార్డు అమెనిటీ సెక్రటరీలతో ఈ సర్వేను చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు జిల్లాలో 30 మంది లీడ్ ఆఫీసర్స్ ఎంపిక చేసి, ఈ నెల 28వ తేదీ నుండి శిక్షణా తరగతలు నిర్వహించి సర్వే ప్రారంభిస్తారన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఎంపిడిఓలు, పట్టణ ప్రాంతంలో మున్సపల్ కమీషనర్లకు ఈ బాధ్యతలు అప్పగింపబడుతుందని, పరిశ్రమల ఎస్టేట్ లలో ఎపిఐఐసి అధికారులు, జిల్లాలోని ఇతర ప్రాంతాలలో పరిశ్రమల శాఖాధికారులు పర్యవేక్షణాధికారులుగా నియమించినట్లు చెప్పారు. జిల్లా మొత్తంగా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్, స్కిల్ డెవలప్ మెంట్ అధికారులుఈ సర్వేను పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. సర్వే కోసం వచ్చిన అధికారులకు కావలసిన పూర్తి సహాయ, సహకారాలను అందించి సహకరించవలసినదిగా పరిశ్రమల యజమాన్యాలకు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ విజ్ఞప్తి చేశారు. ఈ సర్వే ద్వారా పరిశ్రమల నుండి సేకరించిన సమాచారమును గోప్యంగా ఉంచబడుతుందని పేర్కొన్నారు. ఈ సర్వేను అక్టోబరు 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో జివియంసి కమీషనర్ జి. సృజన, జిల్లా జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్-(ఆసరా) గోవిందరావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ఎ.రామలింగేశ్వరరాజు, తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 28వ తేదీ నుండి జరగవలసిన డైట్ పరీక్షలు వాయిదాపడినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ శనివారం తెలిపారు. ఈ సంద ర్భంగా డిఈఓ మీడియాతో మాట్లాడుతూ, 2018-20 సంవత్సరం వారికి గతంలో పరీక్ష వ్రాసి ఫెయిల్ అయిన విద్యార్ధులకు ప్రధమ సంవత్సరం పరీక్షలు ఈ నెల 28 నుండి అక్టోబర్ 5 వరకు జరగవలసి ఉందన్నారు. కరోనా నేపధ్యంలో పరీక్షలు వాయిదా వేయడం జరిగిందని వివరించారు. పరీక్షలు మళ్ళీ ఎప్పుడు జరిగేది తెలియజేయడం జరుగుతుందని చెప్పిన ఆమె ఈ విషయాన్నిఅభ్యర్ధులు గమనించాలన్నారు. ఈలోగా అభ్యర్ధులు పరీక్షలకు మరింతగా సన్నద్ధం అయ్యేలా తయారు కావాలని ఆమె కోరారు.
శ్రీకాకుళం జిల్లాలోని రైతులకు ఉపయోగపడే పరిశోధనలను శాస్త్రవేత్తలు చేపట్టాలని వ్యవసాయ శాఖ కమీషనర్ హెచ్.అరుణ్ కుమార్ శాస్త్రవేత్తలకు పిలుపు నిచ్చారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన శనివారం ఉదయం రాగోలులోని వ్యవసాయ పరిశోధన క్షేత్రంతో పాటు పలు మండలాల్లోని పంటల స్థితిగతులను సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ భూములకు అనువైన వరి పంటలను రైతులకు సూచించాలని అన్నారు. వర్షాభావ పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడులను ఇచ్చే పంటలపై దృష్టిని సారించాలని చెప్పారు. చీడపీడలను తట్టుకునే వరి వంగడాలను రైతులు వేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. రైతులు మరియు మిల్లర్లస్థాయిలో ఆమోద యోగ్యమైన వరి రకాలు రైతులు పండించుకునేలా చూడాలని సూచించారు. అనంతరం ఉల్లికోడు, సుడిదోమపై పరిశోధన క్షేత్రాలను స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్, వ్యవసాయ పరిశోధన అధికారి పి.వి.సత్యనారాయణ, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్, డా. యస్.వి.యస్.నేతాజీ, శాస్త్రవేత్తల బృందం, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సచివాలయానికి వచ్చిన ప్రజలకు సకాలంలో మెరుగైన సేవలు అందించాలని, ఆ దిశగా సిబ్బంది కృషిచేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ వార్డు సచివాలయ సిబ్బందికి సూచించారు. శనివారం స్థానిక 33వ వార్డులోని గూనపాలెం సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గూనపాలెం వార్డు సచివాలయం నుండి అందుతున్న సేవలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పోస్టర్లు, ఇతర సమాచారం, లబ్ధిదారుల జాబితాలు ప్రజలకు అందుబాటులో ఉంచినదీ, లేనిది పరిశీలించారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది కోవిడ్ సందర్భంగా చేపట్టిన ఇంటింటి సర్వే చేసిన పరిస్థితిని తనిఖీ చేశారు. సర్వేలో ఏ ఒక్కరిని విడిచి పెట్టలేదని తద్వారా కోవిడ్ లేకుండా నిర్మూలించవచ్చని జిల్లా కలెక్టర్ అన్నారు. వైరస్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలని సూచిస్తూ అనారోగ్యం బారిన ఉన్నవారు ఏ ఒక్కరూ ఇంటివద్ద ఉండరాదని అన్నారు. కొంతమంది కరోనా పరీక్షలకు ముందుకు రావడం లేదని వాలంటీర్లు, సిబ్బంది జిల్లా కలెక్టర్ కు తెలియజేయగా అటువంటి వారి వద్ద నుండి ప్రభుత్వం నుండి ఎటువంటి సేవలు అవసరం లేదని వ్రాతపూర్వకంగా తీసుకోవాలని సూచించారు. తీవ్ర అస్వస్థతకు గురైన సమయంలో ఎటువంటి సహాయం అందే పరిస్థితి ఉండదని స్పష్టంగా వారికి తెలియజేయాలని అన్నారు. వాలంటీర్ల, సిబ్బంది మంచి సేవలు అందిస్తున్నారని కలెక్టర్ ప్రశంసించారు. వృత్తిలో సచివాలయంలో మంచి సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని, తద్వారా విధుల నిర్వహణలో సంతృప్తి కలుగుతుందని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు, బియ్యం కార్డు, పింఛను, ఆరోగ్యశ్రీ కార్డు తదితర సేవలు అందించడంలో ఎటువంటి జాప్యం జరగరాదని ఆయన ఆదేశించారు. ఈ నాలుగు అవసరాలకు సంబందించే ఎక్కువ మంది సచివాలయానికి వచ్చే అవకాశమున్నందున, వారికి మెరుగైన సేవలు ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో అందించాలని పేర్కొన్నారు. ప్రతి పథకానికి ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన వారిని గుర్తించాలని అటువంటి జాబితాను సచివాలయం వద్ద ప్రదర్శించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆయన స్పష్టం చేశారు. పథకాల అమలులో పారదర్శకత స్పష్టంగా ఉండాలని అదే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ వివరించారు. సచివాలయాల ఏర్పాటుతో ప్రజలకు అవసరమైన సేవలు వారి వద్దకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తున్న సంగతిని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. సచివాలయాల్లోని పనిచేసే యువత అద్భుతమైన పనితీరును కనబరచి జిల్లాకు మంచిపేరును తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమీషనర్ పి.నల్లనయ్య, ఆరోగ్య అధికారి డాక్టర్ వెంకట రావు , నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం లో ఆదివారం పాలిసెట్ పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా పట్టణంలో లాక్ డౌన్ పాక్షికంగా సడలింపు ఇచ్చారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ జె నివాస్ శనివారం మీడియాకి తెలియజేశారు. శ్రీకాకుళం పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆదివారం రోజున కూడా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం పోటీ పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా అధిక సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. అభ్యర్థులకు ఆహార పానీయాలు, పరీక్షలకు సంబంధించిన పరికరాలు అవసరమయ్యే అవకాశం ఉందని, వాటికి ఇబ్బందులు తలెత్తకుండా లాక్ డౌన్ కు సడలింపు ఇచ్చామన్నారు. అభ్యర్థులు దేనికి ఇబ్బందులకు గురి కారాదని ప్రశాంతంగా పరీక్షలు రాసి సంతోషంగా వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. పాక్షికంగా సడలింపు ఇచ్చినప్పటికీ చేపలు, మాంసాహారానికి సంబంధించిన దుకాణాలు, మార్కెట్లకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. హోటళ్లు, ఇతర దుకాణాలు అనుమతించటం జరుగుతుందని కలెక్టర్ వివరించారు.
విశాఖజిల్లా రెవెన్యూ, ఫారెస్టు శాఖలు గ్రామాలకు సంబంధించి డాక్యుమెంటేషన్ రికార్డులను భద్రపరచాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. జి.వి.ఎం.సి. సమావేశ మందిరంలో ఆర్.ఓ.ఎఫ్.ఆర్. జిల్లా స్థాయి సమావేశంను ఆయన నిర్వహించారు. గ్రామాల్లో ఎవరు భూములు ఇచ్చారో వారి పాస్ బుక్ లు, టైటిల్ డీడ్స్, వారి ఫోటోలు రికార్డులలో భద్రపరచి ఉంచుకోవాలన్నారు. ప్రొసీజర్ ప్రకారం అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. డాక్యుమెంటేషన్ ను రెవెన్యూ, ఫారెస్ట్ శాఖలు భద్రపరచాలని సూచించారు. గ్రామ సచివాలయం, తహసిల్థార్, ఆర్.డి.ఓ., సంబంధిత కార్యాలయాల్లో డాక్యుమెంటేషన్ నఖలు, ఫోటోలు పక్కాగ ఉండాలని ఆదేశించారు. ఏజెన్సీ పరిధిలోని ఆయా మండలాల్లో ఆర్.ఓ.ఎఫ్.ఆర్.కు సంబంధించి మండలాల వారీగ ఎంతెంత భూములు ఉన్నాయో ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి ఎస్. వెంకటేశ్వర్ కలెక్టర్ కు వివరించారు. అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో దేవరాపల్లి, వి. మాడుగుల, చీడికాడ మండలాల్లో ఓ.ఆర్.ఎఫ్.(ఔట్ సైడ్ రిజర్వ్ ఫారెస్ట్) రిజర్వ్ ఫారెస్ట్ భూములు గూర్చి అనకాపల్లి ఆర్డిఓ సీతారామారావు వివరించారు. నర్సీపట్నం డివిజన్ లో ఆయా మండలాల్లోని ఓ.ఆర్.ఎఫ్.(ఔట్ సైడ్ రిజర్వ్ ఫారెస్ట్), రిజర్వ్ ఫారెస్ట్ భూములు గూర్చి సబ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య తెలియజేశారు. ఈ సమావేశములో జిల్లా జాయింట్ కలెక్టర్ వి. వేణుగోపాల్ రెడ్డి, ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి ఎస్. వెంకటేశ్వర్, నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, పాడేరు సబ్ కలెక్టర్ శివజ్యోతి, డి.ఎఫ్.ఓ.లు అనంత శంకర్, వినోద్ కుమార్, విజయనగరం డి.ఎఫ్.ఓ. సచిన్, అనకాపల్లి ఆర్.డి.ఓ. సీతారామారావు, సంబంధిత తహసిల్థార్లు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కరోనా సమయంలో సేవలు అందించడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని జెసి సిరి అన్నారు. శనివారం హిందూపూర్ లోని సర్వజన ఆసుపత్రిని జెసి సందర్శించి అక్కడ అందుతున్న వైద్యసేవలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలకు, వైద్యులకు సేవలు అందించే ఈ ఆసుపత్రికి డా.సాయిప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆసుపత్రికి వివిధ వైద్య సామాగ్రిని అందించడం హర్షనీయమన్నారు. దాతలు స్వచ్చందంగా ముందుకి వచ్చి ఆపదలో ఉన్నవారికి తమవంతు సహకారం అందించాలని ఆమె సూచించారు. ఇప్పటికే చాలా మంది దాతలు ప్రభుత్వ ఆసుపత్రులకు స్వచ్ఛందంగా దానాలు చేస్తూ వస్తున్నారని అన్నారు. కరోనా నియంత్రణ అయ్యేంత వరకూ ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, ఖచ్చితంగా మాస్కులు ధరించాలని జెసి సూచించారు. కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.
ప్రజలకు సేవలందించడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జెసి సిరి అధికారులను హెచ్చరించారు. శనివారం హిందూపూర్ రూరల్ లోని కేరి కేరి సచివాలయంలో అందుతున్న సేవలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో ప్రజలకు ఇంటి ముంగిటే సేవలు అందించాలనే ఉద్దేశ్యంలో సచివాలయాలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్నిశాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజలకు సేవలు అందించాలని ఆదేశించారు. ప్రతీరోజూ గ్రామవాలంటీర్లు పది ఇళ్లను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలన్నారు. అంతేకాకుండా సమావేశాల నెపంతో సచివాలయంలోనే గంటల తరబడి వేచివుండకూడదన్నారు. అనంతరం సచివాలయంలో అందుతున్న సేవల పై ఆరా తీశారు. ఈ కార్యక్రమం లో హిందూపూర్ తహసీల్దార్, ఎంపీడిఓ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ నిర్వహించే శిక్షణా తరగతులు జర్నలిస్టులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అన్నారు. శనివారం జూమ్ ద్వారా నిర్వహించిన శిక్షణా తరగతుల్లో పాల్గొని శిక్షణా కార్యక్రమాలపై తన అభిప్రాయాలను ప్రెస్ అకాడమీకి చైర్మన్ కి తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ, ఇలాంటి తరగతులు మరెన్నో నిర్వహించడం ద్వారా చాలా మంది జర్నలిస్టులకు ఉపయోగకరంగా వుంటాయన్న ఆయన ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ముఖ్యంగా విశాఖజిల్లా జర్నలిస్టుల కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 180 మంది జర్నలిస్టులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ఈ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. అదేవిధంగా మరిన్ని అంశాలపై కూలంకుశంగా శిక్షణ ఇవ్వడం ద్వారా జర్నలిస్టులు రాబోయే రోజుల్లో పరిణితి చెందడానికి అవకాశం వుంటుందని పేర్కొన్నారు. ఈయనతోపాటు విశాఖనుంచి పలువురు జర్నలిస్టులు ఈ జూమ్ ఒక్కరోజు శిక్షణా తరగతిలో పాల్గొన్నారు.