ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లాలోని అభివృద్ధి పనులు ఆగడానికి వీల్లేదని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను, గుత్తేదార్లను ఉద్దేశించి అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతా పనులను గుర్తించి ముందుగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ప్రారంభంకాని పనులకు వచ్చే నెల 7వ తేదీలోగా శంకుస్థాపనలు చేయాలని నిర్దేశించారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల సహకారంతో పనులను ప్రారంభించాలని, నిర్ణీత కాలంలోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు, గుత్తేదార్లకు సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు ప్రారంభంకాని, అసంపూర్తిగా నిలిచిపోయిన పనులపై సమీక్షించే నిమిత్తం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు, విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు చెందిన గుత్తేదార్లతో మంగళవారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
జిల్లాలో ప్రభుత్వ అనుమతులు వచ్చి వివిధ కారణాలతో నిలిచిపోయిన పనుల తాజా పరిస్థితిపై ఆయన అధికారులను ఆరా తీశారు. పనులు ప్రారంభం కాకపోవడానికి గల కారణాలను అటు అధికారులను, ఇటు గుత్తేదార్లను అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక ప్రక్రియలను పూర్తి చేసి వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజా వినియోగంలోకి తీసుకొచ్చేందుకు గుత్తేదార్లు సహకరించాలని ఈ సందర్భంగా జడ్పీ ఛైర్మన్ విజ్ఞప్తి చేశారు. గుత్తేదార్లు నిర్ణీత కాలంలో పనులు పూర్తి చేస్తే.. సంబంధిత బిల్లుల చెల్లింపు ప్రక్రియ వేగవంతంగా జరిగేలా తాను బాధ్యత వహిస్తానని ఛైర్మన్ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో వివిధ ప్యాకేజీలలో చేపట్టిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
ప్రజా అవసరాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వండి
ప్రజా అవసరాలను తీర్చే క్రమంలో ప్రభుత్వం గుర్తించిన పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా జడ్పీ ఛైర్మన్ స్పష్టం చేశారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు, వెల్ నెస్ సెంటర్ల నిర్మాణాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రోడ్లు, వంతెనలకు సంబంధించిన పనులను త్వరితగతిన ప్రారంభించి నిర్ణీత కాలంలో అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. స్థలానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయని పలువురు గుత్తేదార్లు జడ్పీ ఛైర్మన్ దృష్టికి తీసుకురాగా సంబంధిత సాంకేతిక ప్రక్రియలను తక్షణమే పరిష్కరించాలని పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అధికారులు అన్నివిధాలా గుత్తేదార్లకు సహాయ, సహకారాలు అందించాలని సూచించారు. ఒకే గుత్తేదారుకు అన్ని పనులు కాకుండా విభజించి పలువురికి అప్పగించాలని, నిర్ణీత కాలంలోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పనులు ప్రారంభం కాకపోవడానికి గల కారణమేంటి
సమీక్షలో భాగంగా ఒక్కో నియోజకవర్గంలో వివిధ ప్రభుత్వ ప్రాధాన్యతా పనులు తాజా పరిస్థితిని జడ్పీ ఛైర్మన్ తెలుసుకున్నారు. పలుచోట్ల ఇంకా పనులు ప్రారంభం కాకపోవడానికి గల కారణాలను అధికారులను, గుత్తేదార్లను అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల పంచాయతీ రాజ్ ఇంజనీర్లను, ఎంపీడీవోలను, గుత్తేదార్లను పిలిపించి నియోజవర్గం వారీగా సమీక్షించారు.
సమావేశంలో పంచాయతీ రాజ్ ఎస్.ఈ. ఆర్.ఎస్. గుప్తా, ఈఈ కేజీజీ నాయుడు, జడ్పీ సీఈవో అశోక్ కుమార్, పంచాయతీ రాజ్ విభాగానికి చెందిన డీఈలు, ఏఈలు, జేఈలు, ఉమ్మడి జిల్లాకు చెందిన గుత్తేదార్లు పాల్లొన్నారు.