1
భారత స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలోనూ మెండుగా ఉండాలని.. అదే స్ఫూర్తితో భావి భారత పౌరులకు స్వాతంత్ర ఉద్యమ చరిత్రను చాటి చెప్పాలనే లక్ష్యంతో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం ద్వారా మహనీయుల త్యాగాలను గురుతు చేసుకుంటున్నామని మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలాకుమారి తెలియజేశారు. శనివారం విజయనగరంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 75సంవత్సరాల స్వాతంత్ర్య సంబురాల జాతర ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మువ్వన్నెల జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ గురజాడ అప్పారావు విగ్రహం(సత్య కాలేజ్) నుంచి కోట, మూడు లాంతర్లు, గంట స్థంబం, మహా రాజ కళాశాల మీదుగా తిరిగి గురజాడ అప్పారావు విగ్రహం(సత్య కాలేజ్) వరకు కొసాగింది. ఈ ర్యాలీ మొత్తం “భారత్ మాత కి జై”, “వందేమాతరం” అనే నినాదాలతో పట్టణ వీధులు మారుమ్రోగాయి. ఈ సందర్భంగా మత్స్యశాఖ ఉపసంచాలకులు ఎన్. నిర్మల కుమారి మాట్లాడుతూ, జిల్లా కలక్టర్ ఆదేశాల మేరకు ప్రజలలో దేశభక్తిని పెంపొందించి, స్పూర్తిని కలిగించామన్నారు. భారతద్శానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి కారణమైన మహానుభావులను తలచుకుంటూ ర్యాలీ నిర్వహించామని తెలియజేశారు. ఎందరో మహనీయుల త్యాగాల తో సిద్ధించిన స్వాతంత్ర ఫలాలను నేడు మనం అనుభవిస్తున్నామని పేర్కొన్నారు. 75సంవత్సరాల జెండా పండుగ కార్యక్రమంలో మత్స్యశాఖ ద్వారా తాము పాల్గొనడం కూడా ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. మది నిండా స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో సాగిన మువ్వన్నెల జెండా పండుగ ర్యాలీలో ఎఫ్డీఓ యు. చాందిని, మత్స్య శాఖ సహాయ తనిఖిదారులు సి.హెచ్. సంతోష్ కుమారి, జి. వెంకటేష్, సి.హెచ్.వి.వి. ప్రసాద్ రావు, గ్రామ మత్స్య సహాయకులు, మత్స్య శాఖ సిబ్బంది, మత్స్యకారులు, పుర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.