ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమం అక్టోబరు నాటికి శతశాతం జరగాలని, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక కమిషనర్ డాక్టర్ శాంతి ప్రియ పాండే ఆదేశించారు. దీనికోసం ఇప్పటినుంచే అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఎంపిడిఓలు, ఈఓపిఆర్‌డిలు, గ్రామ కార్యదర్శులకు స్థానిక జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో గురువారం వర్క్‌షాప్ నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పలు అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శాంతి ప్రియ పాండే మాట్లాడుతూ, జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా చేపట్టిన క్లాప్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి కి ఎంతో ప్రియమైనదని పేర్కొన్నారు. ఇది సంపూర్ణంగా విజయవంతం కావాలంటే, ప్రజల దృక్ఫథంలో మార్పు తేవాలని, అందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం సుమారు 60 శాతం ఇళ్ల నుంచి మాత్రమే చెత్త సేకరణ జరుగుతోందని, అక్టోబరు నాటికి శతశాతం జరగాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రతీ ఇంటికీ రెండు చెత్త బుట్టలను పంపిణీ చేయడం జరిగిందని, వాటిని సక్రమంగా వినియోగించేలా చైతన్య పరచాలన్నారు. ప్రతీ ఇంటినుంచి చెత్తను సేకరించడంతోపాటు, వాటిని తడిచెత్త, పొడిచెత్తగా విభజించి, తడిచెత్తనుంచి సేంద్రీయ ఎరువును తయారు చేయాలన్నారు. గ్రామాల్లో ఉన్న ఎస్‌డబ్ల్యూపిసి కేంద్రాలను పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాలని, అవి లేనిచోట తాత్కాలిక ఏర్పాట్లు ద్వారానైనా ఎరువును ఉత్పత్తి చేయాలని స్పష్టం చేశారు. సేకరించిన ప్లాస్టిక్‌ను నిర్ధేశిత కేంద్రాలకు తరలించాలని, ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా రూపొందించాలని సూచించారు.
సిరా (సర్వైలెన్స్ ఇన్‌ఫర్‌మేషన్ రెస్పాన్స్ అనాలసిస్) ప్రాధాన్యతను కమిషనర్ వివరించారు. పారిశుద్య కార్యక్రమాలను నిర్వహించడం ఎంత ముఖ్యమో, వాటిని జెఎస్ఎస్ యాప్‌లో అప్‌లోడ్ చేయడం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో చోటుచేసుకున్న లోపాలను తొలగించడానికి పలు సూచనలు చేశారు. పారిశుధ్యం అన్నది ఒక అత్యవసర కార్యక్రమని, ఇది సాంకేతిక పద్దతుల్లో చేయాలే తప్ప, సొంత పద్దతులను అవలంబించవద్దని సూచించారు. ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయడం, వీడియో కాల్ ద్వారా పర్యవేక్షించడం, సిటిజన్ యాప్ ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించడం చేయాలన్నారు. తరచూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని, పారిశుధ్య కార్యక్రమాలను మరింత మెరుగుపర్చుకోవాలని సూచించారు. అధికారులు గ్రామాలను దత్తత తీసుకొని పారిశుధ్యాన్ని పర్యవేక్షించాలన్నారు. ఎంపిడిఓలు కనీసం రెండు నుంచి మూడు గ్రామాలను, ఈఓపిఆర్డీలు, డిఎల్‌పిఓలు ఐదు గ్రామాలను, డిపిఓ, జెడ్‌పి సిఇఓలు రెండు గ్రామాలు చొప్పున దత్తత తీసుకోవాలని కోరారు. గ్రామ కార్యదర్శలు తాము పనిచేస్తున్న గ్రామాలను దత్తత గ్రామాలుగా భావించి, అంకితభావంతో పారిశుద్య కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.
ఈ వర్క్‌షాపులో జిల్లా పంచాయితీ అధికారి ఎస్.ఇందిరా రమణ, జెడ్‌పి డిప్యుటీ సిఇఓ కె.రాజ్‌కుమార్, శ్రీకాకుళం జిల్లా జెడ్‌పి సిఇఓ రావాడ రామన్, పంచాయితీ అధికారి వి.రవికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.