వ్యవసాయ, ఆక్వా రంగాలలో సమస్యలపై శాశ్వత పరిష్కారానికి ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశం మందిరంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జిల్లా అధ్యక్షుడు కైగాల శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఉపాధ్యక్షులు శ్రీమతి పి ప్రశాంతి మాట్లాడుతూ గ్రామ, మండల వ్యవసాయ సలహా మండలి సమావేశాల్లో సూచనలు, సలహాలను పరిగణలోనికి తీసుకుని జిల్లా స్థాయిలో చర్చించి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం ఖరీఫ్, రభీ పంటకాలాల్లో తప్పనిసరిగా ఈ క్రాప్ ద్వారా రైతులు తమ పంటలను నమోదు చేసుకోవాలన్నారు. పకృతి వైపరీత్యాలు, దాన్యం కొనుగోలు, రాయతీపై విత్తనాలు, సున్నా వడ్డీ పంటల రుణాలు, పంటల బీమా, ఎరువులు, పురుగు మందుల సబ్సిడీ ఈ క్రాప్ డేటా ద్వారానే రైతులు పొందగలరన్నారు. ఇదే విధానం ఆక్వా, ఉద్యానవన పంటలకు కూడా అమలు జరుగుతుందన్నారు. ఈ క్రాపు నమోదులో వ్యవసాయ అధికారులతో పాటు రైతులు కూడా అంతే బాధ్యత ఉండాలన్నారు. ఈ కాప్ నమోదుకు సెప్టెంబర్ 5ను చివరి తేదీగా ప్రకటించడం జరిగిందన్నారు.
ఎలుకల నివారణకు రైతులు భాగస్వామ్యంతో చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ధాన్యం కొనుగోలు నిమిత్తం రైతులకు చెల్లించాల్సిన మొత్తంలో ఇప్పటివరకు 92 శాతం నగదు జమచేయడం జరిగిందని, ఒక వారం లోపుగా మిగిలిన రూ.80 కోట్లను రైతులు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. డ్రైయిన్ లలో పూడికతీత పనులు చేపట్టడం జరిగిందన్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ చీఫ్ విప్ సహకారంతో డ్రెయిన్లుపై అక్రమణలను తొలగించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆక్వాజోన్ ప్రకారం సర్వే నంబర్లు రీకన్సిలేషన్ చేయడం జరుగుతుందన్నారు. ఆక్వా జోన్ పరిధిలో లేని చెరువుల గుర్తింపుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని, నిబంధనలకు అనునుగుణంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు కైగాల శ్రీనివాసరావు మాట్లాడుతూ 2922 జూలై నెలలో కురిసిన అధిక వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు 80% సబ్సిడీపై 1,518 క్వింటాళ్ల వరి విత్తనాలను అందజేయడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలు నిమిత్తం 68,604 మంది రైతులకు రూ.1,212 కోట్లును వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం ఆగస్టు 27న (నేడు) చేపట్టడం జరిగిందని రైతులందరూ సహకారాన్ని అందించాలని ఆయన కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ వరద ముంపు నివారణకు అత్యవసరంగా స్లూయిజ్, డ్రైన్స్ రిపేర్లు చేయించాల్సి ఉందన్నారు. ఎక్కడెక్కడ ఏయే పనులు చేపట్టాలో గుర్తించి ప్రస్తుతం తాత్కాలిక పనులను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరారు. ఇంకా డ్రైన్ల పై ఆక్రమణలను గుర్తించి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి సూచించారు. కాళీపట్నంలో అన్ సెటిల్డ్ భూములు, దర్భరేవులోని ప్రభుత్వ భూములలో పదివేల ఎకరాల్లో చెరువుల సాగుఅవుతున్నాయని, ఆక్వా జోన్ పరిధిలో లేనందున కరెంటు సబ్సిడీ కోల్పోతున్నారని తెలిపారు. వీటిని క్రమబద్ధీకరించినందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ కోరారు.
పలువురు వ్యవసాయ సలహా మండలి సభ్యులు మాట్లాడుతూ చిన్న చిన్న రైతులు అందరూ కలిసి ఒకే చెరువుగా సాగు చేయడం వలన విద్యుత్ సబ్సిడీని కోల్పోతున్నరని, రైతు ఎన్ టైటిల్మెంట్ చూసి విద్యుత్ అధికారులు నమోదు చేస్తే ఇబ్బంది తొలగుతుందని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, సంబంధిత రైతు ఎన్ టైటిల్మెంట్ ప్రకారం నమోదు చేయాలని విద్యుత్ అధికారులకు కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యవసాయ సలహా మండల సమావేశంలో సభ్యులు సంఘాని వడ్డికాసులు, కొట్టి కుటుంబరావు, పి.డి ప్రసాద్ రాజు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి కె.ఎస్.వి నాగలింగాచార్యులు, జిల్లా వాటర్ రిసోర్స్ అధికారి పి.నాగార్జున రావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మురళీకృష్ణ, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ టి. శివరామ ప్రసాద్, డీఎస్ఓ ఎం. సరోజ, భీమవరం డిటిసి జి. రామలింగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.