మన్యం జిల్లా అభివద్ధికి అంకితభావంతో పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా రివ్యూ కమిటీ సమావేశం గిరి మిత్ర సమావేశ మందిరంలో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ అధ్యక్షతన గురు వారం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి ప్రాదాన్యత క్రమంలో ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. తాగు నీటి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. సాలూరులో గృహ నిర్మాణంపై దృష్టి సారించి పనులు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. సాలూరులో 10,850 గృహాలు మంజూరు అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఉపాధి హామీ పక్కాగా అమలు జరిగి వేతనదారులకు మంచి వేతనం లభించుటకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అటవీ ప్రాంత రహదారుల గూర్చి మాట్లాడుతూ పనులు వేగవంతం చేయాలని అన్నారు. బొరబంద ఆర్.బి.కె నుండి తూర్పు గోదావరి జిల్లాకు ధాన్యం పంపించారని, అయితే సక్రమంగా నమోదు చేయలేదని చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఏనుగులు వలన నష్టం జరిగిన వివరాలు, వచ్చిన నిధులు, వినియోగంపై నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు.
జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ముఖ్య మంత్రి విప్లవాత్మక నిర్ణయాలలో భాగంగా జిల్లాల విభజన జరిగిందన్నారు. పరిపాలన చేరువ కావడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్రలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి జరుగుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు పక్కాగా అమలు చేయాలని ఆయన సూచించారు. పథకాలు ప్రపంచ స్థాయిలో ప్రశంసలు పొందుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో రూ.1.44 లక్షల కోట్లు నగదు బదిలీ పథకం క్రింద ప్రజలకు అందుతుందని మంత్రి పేర్కొన్నారు. నీటి ఎద్దడిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు వద్దకు సమస్యలు వస్తాయని వాటిని అధికారులు వెంటనే పరిష్కరించాలని అన్నారు. ముఖ్య మంత్రి మానస పుత్రిక గ్రామ సచివాలయం, ఆర్.బి. కె, వెల్ నెస్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. అత్యధిక సంఖ్యలో రాష్ట్రానికి గృహాలు మంజూరు అయ్యాయని వాటిని నిర్మించుకోవాలని అన్నారు. నవరత్నాలు అమలు పక్కాగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని తద్వారా జీవితాలు మారుతాయని, బయటి ప్రపంచంతో సంబంధాలు మెరుగు అవుతుందని ఆయన పేర్కొన్నారు. అటవీ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మన్యం జిల్లాను ఆదర్శంగా నిలుపుటకు కృషి చేద్దాం అని, ముఖ్య మంత్రి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని మంత్రి అన్నారు.
జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు మాట్లాడుతూ తాగు నీటి సమస్య ఉంటే జిల్లా పరిషత్ నుండి సహకారం అందిస్తామని ఆయన చెప్పారు. జల జీవన్ మిషన్ లో మన్యం జిల్లాలో నీటి సమస్య లేకుండా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అన్నారు. సమగ్ర తాగు నీటి ప్రాజెక్టులు ఏర్పాటుకు ప్రత్యేక డిపిఆర్ లు తయారు చేయాలని ఆయన ఆదేశించారు. పాలకొండ నియోజక వర్గంలో తాగు నీటి కొరకు రూ.20 లక్షలు మంజూరు చేస్తామని అందులో మొదటిగా రూ.15 లక్షలు విడుదల చేస్తామని అన్నారు. సాలూరు మండలం పెదపాడు గ్రామ సచివాలయంను త్వరగా నిర్మించాలని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యులు గొడ్డేటి మాధవి మాట్లాడుతూ సోలార్ వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేసిన పథకాల మరమ్మతులకు చర్యలు చేపట్టాలని అన్నారు. శాసన సభ్యులు విశ్వసరాయి కళావతి మాట్లాడుతూ గతంలో చేపట్టిన తాగు నీటి పనులను కూడా పర్యవేక్షణ చేసి పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే నీటి సమస్య తలెత్తిందని అన్నారు. దాదాపు 6 వందల గిరిజన గ్రామాలకు తాగు నీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం పక్కాగా ప్రణాళికలు తయారు చేయాలని పేర్కొన్నారు. వీరఘట్టం మండలంలో 60 గ్రామాలకు మొదటి విడత క్రింద ఉందని, దానిపై చర్యలు చేపట్టాలని కోరారు. సీతంపేట, భామిని మండలాలలో అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేయాలని ఆమె కోరారు. హిల్ టాప్ గ్రామాలలో ఆర్.బి.కెలు, సచివాలయాల నిర్మాణానికి ఇసుక కొరత ఉందని అన్నారు. సిబ్బంది లేక రికార్డింగ్ జరగక బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ఆమె తెలిపారు. సీతంపేట ప్రాంతంలో కూడా ఏనుగుల సమస్య ఉందని ఆమె అన్నారు. ఏనుగుల వలన జరిగే నష్టపరిహారం కూడా అందటం లేదని ఆమె అన్నారు. హిల్ టాప్ లో బియ్యం సరఫరాకు సామర్థ్యం ఎక్కువ ఉన్న వాహనాలు అవసరమని తద్వారా సరఫరా చక్కగా సాగుతుందని అన్నారు. శాసన సభ్యులు అలజంగి జోగారావు మాట్లాడుతూ సీతానగరం మండలంలో 16 గ్రామాలు తాగు నీటి సమస్య ఎదుర్కొంటున్నాయని అన్నారు. నర్సిపురంలో 540 మందికి ఇళ్ళ స్థలాల పంపిణి చేయాలని ఆయన తెలిపారు.పట్టణంలో 13 వందలు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని ఆయన చెప్పారు. బెలగాంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని మంజూరుకు పరిశీలించాలని కోరారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ మన్యం జిల్లా గిరిజనులకు నిలయమని చెప్పారు. జిల్లాలో విద్యా, వైద్యం, పేదల ఆదాయం పెంపొందించుటపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. పౌష్ఠికాహారంపై ప్రత్యేక చర్యలు చేపట్టి ఆరోగ్యం మెరుగు కృషి చేయాల్సి ఉందన్నారు. నీతి అయోగ్ సూచనల మేరకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తాగు నీటిపై ప్రతి రోజూ పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. విద్యుత్ కనెక్షన్లు పెండింగులో ఉన్న అంశాలపై ఆర్. డబ్ల్యూ.ఎస్, ఇపిడిసిఎల్ సంయుక్తంగా నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. మునిసిపాలిటీ పరిధిలో ని జగనన్న కాలనీల్లో మౌళిక సదుపాయాలు కల్పించుటకు మునిసిపల్ నిధులు సమకూర్చడం జరుగుతుందన్నారు. పెద్ద లే అవుట్లకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నామని ఆయన చెప్పారు. గృహ నిర్మాణం, ఇతర భవనాల నిర్మాణ సామగ్రి కొరకు జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రతి రోజూ పర్యవేక్షణ చేస్తామని ఆయన తెలిపారు. అటవీ ప్రాంతంలో రహదారుల నిర్మాణంపై అటవీ అధికారులు ఒకేసారి తనిఖీలు నిర్వహించి నివేదికలు త్వరితగిన సమర్పించాలని ఆయన స్పష్టం చేశారు. మార్చిలో జరిగిన జీడి మామిడి నష్టంపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కోరిన మేరకు బృందాన్ని నియమించారని ఆయన చెప్పారు. నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించామన్నారు.
గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజినీరింగ్ అధికారి ప్రభాకర రావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.కూర్మి నాయుడు, ఉపాధి హామీ ఏపిడి శ్రీనివాస రావు, తదితరులు తమ శాఖల ప్రగతి వివరించారు. పాలకొండ నియోజక వర్గంలోని మండలాలను పట్టణాభివృద్ధి అథారిటీ క్రింద తీసుకువచ్చుటకు ప్రతిపాదనలు సమర్పించాలని డి.ఆర్.సిలో తీర్మానించారు. ఈ మేరకు అన్ని మండలాలు తీర్మానాలు ఆమోదించి సమర్పించాలని, తద్వారా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని సభ ఆమోదించింది. మార్చిలో జరిగిన జీడి పంట నష్టంకు నష్ట పరిహారం అందించాలని సభ తీర్మానించింది. ఈ సమావేశంలో శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ , రాష్ట్ర టి చైర్మన్ జె. ప్రసన్న కుమార్, డిసిఎంఎస్ చైర్ పర్సన్ అవనాపు భావన, పోలీసు సూపరింటెండెంట్ వి. విద్యా సాగర్ నాయుడు, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారులు బి.నవ్య, ఆర్.కూర్మనాథ్, సబ్ కలెక్టర్ భావన, ఆర్.డి.ఓ కె.హేమలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి వాగ్దేవి, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి కిరణ్ కుమార్, జిల్లా పశుసంవర్ధక అధికారి ఏ. ఈశ్వర రావు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై. సత్యం నాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్, పంచాయతి రాజ్ ఇంజినీరింగ్ అధికారి విజయ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.